శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం: కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మానవ సంక్షోభంగా మారుతోంది. నిత్యావసరాల కొరత తీవ్రమవుతుండటం, ధరలు ఆకాశాన్నంటేలా పెరిగిపోతుండటంతో.. ఇక్కడి జనం కుటుంబాలతో సహా సముద్రమార్గంలో అక్రమంగా భారతదేశానికి శరణార్థులుగా పారిపోతున్నారు.
మంగళవారం నుంచి 16 మంది శ్రీలంక పౌరులు పడవల్లో భారత తీరానికి చేరుకున్నారు.
తమిళనాడు మెరైన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీలంక శరణార్థుల మొదటి బృందం తమిళనాడులోని ధనుష్కోటి తీరానికి మంగళవారం తెల్లవారుజామున చేరుకుంది. జాఫ్నా, మన్నార్‌ల నుంచి వచ్చిన ఈ బృందంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు పెద్దవాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
వారిలో ఒకరు గజేంద్రన్ (27).. తాను జాఫ్నాలో పెయింటర్‌గా పనిచేస్తుండేవాడినని, శ్రీలంక అంతర్యుద్ధం చివరి దశలో కూడా తాను శరణార్థిగా భారతదేశం వచ్చానని, అప్పుడు తమిళనాడులోని శ్రీలంక శరణార్థి శిబిరంలో ఉన్నానని వెల్లడించారు.
''యుద్ధం ముగిశాక మేం ఇంటికి తిరిగివెళ్లాం. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వల్ల నాకు పని దొరకటం లేదు. నా భార్యను, నాలుగు నెలల వయసున్న నా బిడ్డను పోషించుకోవటానికి నాకు ఏ దారీ కనిపించలేదు. కాబట్టి మళ్లీ భారతదేశానికి రావాల్సి వచ్చింది'' అని వివరించారు.
వీరు వచ్చిన తర్వాత.. మంగళవారం రాత్రి 10 మంది సభ్యులున్న మరో బృందం ధనుష్కోటి తీరానికి చేరుకుంది. వారిలో ఐదుగురు పెద్దవాళ్లు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. శ్రీలంకలోని వావునియా నుంచి తాము వచ్చినట్లు చెప్పారు.

నడిసముద్రంలో 37 గంటలు చిక్కుకుపోయి...
ఆ పది మంది బృందంలో శివరథినమ్ (35) ఒకరు. ఆయన మత్స్యకారుడు. తన భార్య, అక్క, బావ, వారి ముగ్గురు పిల్లలతో కలిసి తన సొంత చేపల పడవలో సోమవారం ఉదయమే బయలుదేరామని ఆయన చెప్పారు.
''మేం బయలుదేరి రెండు గంటలు గడిచాక నడి సముద్రంలో మా పడవ ఇంజన్ పాడయింది. 37 గంటల పాటు తిండి, నీళ్లు లేకుండా సముద్రంలో చిక్కుకుపోయాం'' అని తెలిపారు.
చాలా కష్టపడి ఇంజన్‌ను బాగుచేశామని, మంగళవారం రాత్రి పొద్దుపోయాక ధనుష్కోటికి చేరుకున్నామని చెప్పారు.
వారు తీరంలో అడుగుపెట్టాక.. తమిళనాడు మెరైన్ పోలీసు అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, అక్రమంగా దేశంలోకి ప్రవేశించటానికి సంబంధించిన కేసులు వారిపై నమోదు చేశారు.
ఈ శ్రీలంక జాతీయులను ప్రస్తుతం ధనుష్కోటిలోని మెరైన్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. వారిని రామేశ్వరం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారు.

కోస్ట్ గార్డ్ అప్రమత్తం
అక్రమంగా దేశంలోకి ప్రవేశించటాన్ని నిరోధించటానికి తాము గస్తీని బలోపేతం చేసినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు.
మరోవైపు.. శ్రీలంక పౌరులు శరణార్థులుగా భారతదేశానికి వెళ్లకుండా నిరోధించటానికి తాము ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు శ్రీలంక నేవీ అధికారులు చెప్తున్నారు.
''వీళ్లు శ్రీలంక నుంచి ఎలా బయటికి వెళ్లారు, శరణార్థులుగా భారతదేశానికి ఎలా చేరుకున్నారు అనే దానిపై మేం దర్యాప్తు ప్రారంభించాం'' అని శ్రీలంక నౌకాదళ అధికార ప్రతినిధి కెప్టెన్ ఇందిక డి సిలివా బీబీసీ తమిళ ప్రతినిధితో చెప్పారు.

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం
శ్రీలంకలో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనటంతో ఈ పరిస్థితి తలెత్తింది.
కోవిడ్ మహమ్మారి వల్ల 2020 మార్చిలో విధించిన లాక్‌డౌన్.. దేశంలోని ప్రధాన పారిశ్రామిక రంగాలైన తేయాకు, వస్త్ర, పర్యాటకాల మీద తీవ్ర ప్రభావం చూపింది.
దీంతో స్థిరమైన ఆదాయ వనరులు లేని శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారింది. ఆ దేశపు విదేశీ మారకద్రవ్యం కూడా తరిగిపోతూ వచ్చింది.
పరిస్థితి తీవ్రంగా విషమించటంతో.. నిత్యావసర వస్తువుల ధరలు చరిత్రలో కనీవినీ ఎరుగనంతగా పెరిగిపోయాయి. ప్రభుత్వ ప్రధాన గ్యాస్ సరఫరాదారుల వద్ద గ్యాస్ కొనటానికి డబ్బులు లేకపోవటంతో.. దేశంలో వంట గ్యాస్ సరఫరా లేక హోటళ్లు మూతపడ్డాయి.
నిత్యావసరాల కొనుగోలు చేయటానికి జనం దుకాణాల ముందు వరుసకట్టారు. కానీ అందరికీ సరిపడేంత నిల్వలు లేకపోవటంతో కొన్నిచోట్ల జనం మధ్య హింసాత్మక ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.
శ్రీ లంకలో నిత్యావసర వస్తువుల ధరలు (కేజీ/ లీటర్) శ్రీలంక కరెన్సీలో:

శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంతగా పెరిగాయో పై పట్టికలో చూడొచ్చు.
1970లలో సిరిమావో బండారునాయకే ప్రధానమంత్రిగా ఉన్నపుడు శ్రీలంకలో తీవ్ర కరవు చోటుచేసుకుందని చెప్తుంటారు. కానీ నాటికన్నా ప్రస్తుత పరిస్థితి మరింత ఘోరంగా ఉందని కొందరు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భగత్ సింగ్‌ను ఉరి తీశాక ఆయన ఉపయోగించిన పిస్టల్ ఏమైంది?
- రబ్బర్ పురుషాంగం: ఆశా వర్కర్లకు ఇచ్చే కిట్లలో మోడల్ పురుషాంగం.. వివాదం ఏంటి?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- యుక్రెయిన్ యుద్ధం: మరియుపూల్ నగరం రష్యాకు ఎందుకంత కీలకం? 4 ముఖ్య కారణాలు ఇవే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









