రబ్బర్ పురుషాంగం: ఆశా వర్కర్లకు ఇచ్చే కిట్లలో మోడల్ పురుషాంగం.. వివాదం ఏంటి?

లైంగిక ఆరోగ్యం

మనదేశంలో సెక్స్ లేదా లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడడం, బహిరంగంగా చర్చించడం చాలామందికి ఇబ్బంది కలిగించే విషయం. అయితే, దీనిపై అవగాహన కలిగించేందుకు వివిధ స్థాయిలలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కలిగించే దిశలో పనిచేస్తారు. ఇటీవల, ఈ ఆశా వర్కర్లకు ఇచ్చే కిట్లలో రబ్బరు పురుషాంగం ఉండడం వివాదానికి దారితీసింది.

అసలేం జరిగింది? ఇలా జరగడం ఇదే మొదటిసారా? ఆశ వర్కర్లకు అలాంటి కిట్లు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి?

మోడల్ పురుషాంగాన్ని కిట్లలో పెట్టడం ఇబ్బందికి గురిచేస్తోందా?

ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రభుత్వం, ఆశా వర్కర్లకు ఇచ్చిన కుటుంబ నియంత్రణ కౌన్సిలింగ్ కిట్లలో రబ్బరు పురుషాంగం ఉండడంతో వారు ఇబ్బందికి గురయ్యారు. దాంతో, వివాదం రాజుకుంది.

ఈ కిట్‌పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ చర్యతో మహిళలను అవమానిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఒకరు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

వీడియో క్యాప్షన్, సెక్స్‌లో మగాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, వాళ్లను హింసించే ఈమె మహిళలకు ఏం చెబుతున్నారంటే..

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఈ కిట్‌లను పంపిణీ చేస్తోందని మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అర్చన పాటిల్ బీబీసీకి తెలిపారు.

"బుల్దానాలో మాత్రమే దీనిపై అభ్యంతరాలు వచ్చాయి. ఈ కిట్‌లను కచ్చితంగా వాడాలన్న రూలేం లేదు. కానీ, హెల్త్ వర్కర్లే వీటిని వాడడానికి సంకోచిస్తే, గ్రామ ప్రజలకు ఎలా అవగాహన కలిగిస్తారు?" అని ఆమె అన్నారు.

ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు చాలామంది ఆశా వర్కర్లు సంకోచించారు. అయితే, కొందరు మాత్రం ఈ కిట్లను ఉపయోగించడం అసౌకర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో పురుషాంగం, యోని మోడల్స్ చేతిలో పెట్టుకుని వెళ్లడం ఇబ్బందిగా ఉందని మరికొందరు అన్నారు. పల్లెటూర్లలో లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారు. ఈ మోడల్స్ వాళ్ల ఇబ్బందిని మరింత పెంచుతున్నాయని చెప్పారు.

భారతదేశంలో లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తి సమస్యలు లేదా గర్భనిరోధకాల గురించి మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పటికీ చాలామంది దీనిని నిషిద్ధంగా భావిస్తారు. అందుకోసం వివిధ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గ్రామీణ ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు చాలావరకు ఆశావర్కర్లు మోస్తుంటారు. ఆరోగ్య సంక్షేమం విషయంలో ప్రభుత్వానికి, గ్రామీణ ప్రజలకు ప్రధాన మధ్యవర్తులు వీరు.

ఆశా వర్కర్లకు ఇచ్చే కిట్

కిట్లలో రబ్బరు పురుషాంగం ఎందుకు ఇస్తున్నారు?

గర్భనిరోధకాలు, లైంగిక వ్యాధుల గురించి ప్రజలకు తెలియజేయడం, గర్భధారణ సంబంధిత సమస్యల గురించి మహిళల్లో అవగాహన కల్పించడం ఆశా వర్కర్ల బాధ్యతల్లో ఒకటి. వీటన్నిటిపై అవగాహన కల్పించేందుకు ఆశా వర్కర్లకు ఒక కిట్ ఇస్తారు.

"జనాభా నియంత్రణ, లైంగిక వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ కిట్‌ను ఉపయోగించవచ్చు. హెపటైటిస్ బి, సిఫిలిస్, లైంగికంగా సంక్రమించే ఇతర వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి ఈ రకమైన శిక్షణ అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా అవగాహన కలిగించేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుంది" అని బుల్దానా జిల్లా వైద్యాధికారి డా. రాజేంద్ర సాంగ్లే చెప్పారు.

అయితే, కొంతమంది బీజేపీ నేతలు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై దాడికి దిగారు. ఇది ఆశా వర్కర్లకు అవమానం అంటూ, దీన్ని నేరం కింద నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ఈ కిట్‌లను వెనక్కు తీసుకోవాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందని బుల్దానా జిల్లా ఎమ్మెల్యే ఆకాష్ ఫండ్కర్ డిమాండ్ చేశారు.

రబ్బర్ పురుషాంగం ఉన్న కిట్ పట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఎలా తిరగగలరని కొందరు ప్రశ్నించారు.

పూణెకి చెందిన ఆశా వర్కర్ ఒకరు ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.

ఇలాంటి కిట్లను ఆశా వర్కర్లు గతంలో కూడా వాడేవారని ఆమె తెలిపారు.

"కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇలాంటి కిట్లను అందిస్తున్నారు. లైంగిక ఆరోగ్యం గురించి సులువుగా వివరించడానికి ఈ కిట్ ఉపయోగపడుతుంది. ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా వినియోగించాలో కూడా చెబుతారు. పూణె జిల్లాలో ఈ కిట్ గురించి ఎలాంటి ఫిర్యాదులూ లేవు" అని ఆమె అన్నారు.

లైంగిక శిక్షణ

నిపుణులు ఏమంటున్నారు?

"ఇదేం మొదటిసారి జరుగుతున్నది కాదు. కుటుంబ నియంత్రణపై అవగాహన కోసం ఈ కిట్లను ఎప్పటి నుంచో ఇస్తున్నాం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 25వేల కిట్లను పంపిణీ చేశాం. మరో 40వేల కిట్లను పంపిణీ చేయనున్నాం. లైంగిక ఆరోగ్యం గురించి గ్రామీణ ప్రజలకు చెప్పేటప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. అయితే, ఆశా వర్కర్లకు ఇది వాడడం ఇబ్బందిగా ఉంటే, బలవంతం ఏమీ లేదు" అని డాక్టర్ అర్చనా పాటిల్ చెప్పారు.

దీని గురించి సంకోచపడడానికేమీ లేదని, వైద్యరంగంలో పనిచేస్తున్నవారే ఇబ్బందికి గురైతే పనులెలా అవుతాయని ఆమె అన్నారు.

దీని చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదాలను పక్కకు పెడితే, వాస్తవంలో ఈ కిట్లు ఎంత ప్రయోజనకరం?

లైంగిక ఆరోగ్యం గురించి సులువుగా వివరించడానికి ఇలాంటి ఇలాంటి కిట్లు సహకరిస్తాయని సెక్సాలజిస్ట్ డా. సాగర్ ముండాడ అన్నారు.

"ఈ కిట్లు ఆశా వర్కర్లకు ఇచ్చేస్తే సరిపోదు. వాడిని ఎలా వాడాలో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. గ్రామీణ పాంత్రాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మోడల్స్ సహాయంతో వివరిస్తే వారికి సులువుగా అర్థమవుతుంది.

దీని గురించి ఓపెన్ మైండ్‌తో ఆలోచించాలి. దీనివల్ల అపోహలు పెరుగుతాయనడం సరికాదు. బహిరంగంగా చర్చిస్తేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. లైంగిక అంశాలపై చర్చే లేకపోతే, అప్పుడు అపోహలు పెరిగే అవకాశం ఉంటుంది" అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, పర్యావరణానికి హాని లేకుండా సెక్స్ చేయడం సాధ్యమేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)