బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం: నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, ugc
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆదివారం స్థానిక బీజేపీ, శివసేన కార్యకర్తలు శివాజీ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించగా.. అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.
దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పట్టణంలో సెక్షన్ 144 విధించారు. బీజేపీ బోధన్ బంద్ పాటించింది.
అసలు ఎవరికి నచ్చినట్టు వారు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చా.. విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే ఎవరి అనుమతి అవసరం? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
విగ్రహాలు... విమర్శలు
గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్ల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో ఆవిష్కరించారు. ఈ విగ్రహ నిర్మాణ వ్యయం రూ.3,000 కోట్లు. ఈ విగ్రహ స్థాపన కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు పట్ల అనేక విమర్శలు ఎదురయ్యాయి.
తెలంగాణాలోని హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల గ్రామంలో రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో రెండవ పొడవైన విగ్రహం, ప్రపంచంలోని పెద్ద వాటిలో 26వది అవుతుందని దాన్ని నిర్మించిన వారు చెబుతున్నారు.
మొత్తం ప్రాజెక్టుకు 1,000 కోట్ల ఖర్చు అవుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహ స్థాపన సమయంలో కూడా అనేక విమర్శలు వినిపించాయి.
''విగ్రహాలు మంచివే. సమాజంపై తమ ప్రభావం చూపిన సంస్కర్తలు, ఇతర గొప్ప పనులు చేసిన వారి జ్ఞాపకార్థం విగ్రహాలు పెట్టొచ్చు. కానీ మరీ భారీ విగ్రహం, దాని అనుబంధ అంశాల కోసం వెయ్యి కోట్లు పెట్టడం కంటే ఆయన పేరిట ఒక విశ్వవిద్యాలయం పెట్టడమో, లేదా ఏదైనా యూనివర్సిటీలో రామనుజం ఫండ్ లేదా రామానుజం రీసెర్చ్ సెంటర్ వంటివి పెడితే ఇంకా బావుండేది. ఈ వెయ్యి కోట్లనూ సమాజానికి ప్రత్యక్షంగా ఉపయోగపడేలా ఏదైనా చేస్తే బావుండేది" అని ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె శ్రీనివాసులు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, StatueOfEquality.org
విగ్రహ స్థాపన చేయాలంటే అనుమతులు అవసరమా?
విగ్రహ స్థాపన ప్రభుత్వంలోని వ్యక్తులు లేదా ప్రైవేటు వ్యక్తులు చేయాలన్నా కూడా అనుమతులు అవసరమే.
రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వ భూములను సమాజ సంక్షేమం కోసం ఉపయోగించే అధికారం ఉంటుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న అధికారాలు, విధులను రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ నిర్వచిస్తుంది. ఏడవ షెడ్యూల్‌లోని లిస్ట్ 18 ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను సూచిస్తుంది.
ఆయా రాష్ట్రాల శాసనసభలు విగ్రహ స్థాపన విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఈ జాబితా కల్పిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో విగ్రహ స్థాపన చేయవచ్చు.
పాటించాల్సిన విధానమేంటి?
బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ భూముల్లో విగ్రహ స్థాపన చేయాలని అనుకునేవారు అందుకు అనుమతులు కోరుతూ స్థానిక మునిసిపల్ లేదా పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆ దరఖాస్తును జిల్లా స్టాట్యూ కమిటీ పరిశీలిస్తుంది.
స్టాట్యూ కమిటీకి జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ఆర్&బి సూపరింటెండెంట్ ఇంజనీర్, స్థానిక మునిసిపల్ చైర్మన్, పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్, సంబంధిత ఆర్&బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు.

ఫొటో సోర్స్, RANA SANDEEP
అయితే, ఈ కమిటీ విగ్రహ స్థాపనకు అనుమతి ఇచ్చే ముందు స్వచ్చంధ సంఘాలకు చెందిన సభ్యుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది రాణా సందీప్ అన్నారు.
యూరోపియన్ యూనియన్ దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను స్థాపించేటప్పుడు నిర్ణయాలు తీసుకునే కమిటీలో, మానసిక శాస్త్రవేత్తలు, ఆంథ్రోపాలజిస్టులు కూడా ఉంటారని తెలిపారు.
"ఒక విగ్రహ స్థాపన ద్వారా ప్రజలపై కలిగే మానసిక ప్రభావం, విగ్రహ స్థాపన చేయాలనుకుంటున్న వ్యక్తుల చరిత్ర, వారు సమాజాన్ని ప్రభావితం చేసిన తీరు, భావితరాలకు దాని వల్ల కలిగే ప్రయోజనాల లాంటివి కూడా పరిశీలిస్తారు" అని రాణా అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇటువంటి నిబంధనలను పాటించడం లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ప్రైవేటు స్థలంలో ఎవరైనా విగ్రహాలను స్థాపించుకోవచ్చా?
రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ తమ సొంత స్థలంలో విగ్రహాలను ఏర్పాటు చేసుకునే హక్కును కల్పిస్తోంది.
అయితే, ఆ విగ్రహ స్థాపన రెండు వర్గాలు, మతాల మధ్య విబేధాలు సృష్టించేదిగా ఉండకూడదు.
అది ప్రజల మనోభావాలను గాయపరిచేదిగా ఉండకూడదని విగ్రహ స్థాపనకు సంబంధించిన నియమాలు చెబుతున్నాయి.
విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
"రోడ్ల పైన, పేవ్‌మెంట్ల పైన, రహదారులపైన, రోడ్డుకిరువైపులా, లేదా ప్రజలు సంచరించే ప్రదేశాల్లోనూ విగ్రహాల స్థాపన, మందిరాల నిర్మాణాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు 2013లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
మత సంస్థల పేరుతో సాగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించే అధికారం స్థానిక మునిసిపల్ సంస్థలకు, ప్రభుత్వ అధికారులకు కల్పించింది.
అప్పటికే అనుమతులు లేకుండా నిర్మించిన విగ్రహాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల కారణంగా కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని న్యాయవాది రాణా సందీప్ అన్నారు.

ఫొటో సోర్స్, GoVERNMENT OF TELANGANA
జీఓ 18 ఏం చెబుతోంది?
సుప్రీం కోర్టు ఆదేశాలననుసరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీఓ18ని విడుదల చేసింది. దీనిననుసరించి రోడ్లు, రహదారులు, లేదా ప్రజలు తిరిగే ప్రదేశాల్లో విగ్రహాలు లేదా ఏదైనా నిర్మాణాలను చేపట్టేందుకు అనుమతులు ఇవ్వడాన్ని నిషేధించింది. ఈ ఆదేశాలను జీవో18లో పొందుపరిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 08, 2003లో, ఫిబ్రవరి 18, 2013లో విడుదల చేసిన రెండు జీవోలు విగ్రహాల ఆవిష్కరణను నిషేధిస్తున్నాయి.
ఏప్రిల్ 08, 2003లో విడుదల చేసిన జీవో ఆర్ అండ్ బి రోడ్లపై కొత్త విగ్రహాలను స్థాపించడాన్ని నిషేధిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి వస్తే విగ్రహ కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని ఈ జీవో సూచిస్తోంది.
రోడ్లపై అనుమతులు లేకుండా స్థాపించిన విగ్రహాలు, కటౌట్లు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ఫ్లెక్సీలను తొలగించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు 2013లో జారీ చేసిన ఆదేశాలను సంబంధిత రాష్ట్రాల కార్యదర్సులు అమలు జరిగేలా చూడాలని కూడా పేర్కొంది.
"అయితే, అనుమతులు లేకుండా సాగిన నిర్మాణాలు, పెట్టిన విగ్రహాలను తొలగించారా?" అని లాయర్ రాణా ప్రశ్నిస్తున్నారు.
"ఆర్టికల్ 19 (1)ని అనుసరించి దేశంలో పౌరులందరికీ స్వేచ్ఛగా తిరిగే హక్కుందని, వారి స్వేచ్చాయుత కదలికలకు ఆటంకం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని పీఎన్ శ్రీనివాసన్ - తమిళనాడు కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఇదే తీర్పులో, "ప్రముఖ వ్యక్తులను గౌరవించేందుకు ప్రజల సౌకర్యాన్ని భంగపరచడానికి లేదని అంది. భూమి ప్రజలకు చెందింది. ప్రజల నుంచి సేకరించిన భూమిని ప్రజా సంక్షేమానికే వినియోగించాలి" అని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, ugc
విగ్రహ రాజకీయాలు
విగ్రహాలను ఒక రాజకీయ, సామాజిక వర్గం ఆధిపత్యం చూపించుకునేందుకు చేసినప్పుడే సమస్యలు ఎదురవుతాయని రాణా అంటారు.
ఈ ఏడాది జనవరిలో ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో స్థాపించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
2022 జనవరిలోనే, తమిళనాడులోని వేలూరులో సామాజిక సంస్కర్త పెరియార్ విగ్రహాన్ని కూడా కొంత మంది కూల్చేశారు. ఈ సంఘటన పట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి.
డిసెంబరు 2021లో అంబాలాలో ఉన్న చర్చి దగ్గర క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది క్రైస్తవ మతం, క్రైస్తవులపై జరుగుతున్న దాడి అని చాలామంది విమర్శించారు.
డిసెంబరు 2021లో కర్నాటకలోని బెల్‌గావిలో శివాజీ, సెంగోలి రాయన్న విగ్రహాలపై చేసిన దాడి అల్లర్లకు, అరెస్టులకు కూడా దారి తీసింది. భారీ నిరసనలు వెల్లువెత్తాయి.
హైదరాబాద్‌లో పంజాగుట్ట సెంటర్‌లో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించేందుకు మద్దతు సమకూర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని జూన్ 2021లో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంత రావు ప్రకటించారు. ఆ విగ్రహాన్ని 2019లో తొలగించారు.
కన్నదాసన్ కేసులో జస్టిస్ జగదీసన్ విగ్రహాల స్థాపన గురించి ఇలా వ్యాఖ్యానించారు.
"రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులను గౌరవప్రదంగా గుర్తు చేసుకునేందుకు చాలా మార్గాలున్నాయి. వారి జ్ఞాపకార్థం ఒక స్మారక భవనం కానీ, గ్రంధాలయం కానీ నిర్మించవచ్చు. ఇలాంటివి ఎవరికీ ఎటువంటి సమస్యలు సృష్టించవు. అవి ప్రజలందరికీ ఉపయోగపడతాయి"
విగ్రహాలెందుకు?
ప్రజాస్వామ్య దేశాల్లో నాయకులు, సమాజ సంక్షేమం కోసం పని చేసిన ఉద్యమకారులు, కళలకు సేవ చేసిన కళాకారులు, ప్రముఖ వ్యక్తుల సేవలను స్మరించుకునేందుకు విగ్రహాలను స్థాపిస్తారు. విగ్రహాలు స్థాపించడం ద్వారా సదరు వ్యక్తులపై తమకున్న గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.
ప్రతీ ఊరిలో జాతీయ, స్థానిక రాజకీయ నాయకులు, కళాకారులు, సామాజిక ప్రముఖుల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి.
ప్రముఖ వ్యక్తులు చేసిన సేవలు భావి తరాలకు తెలియచేసేందుకు, ప్రజల్లో జాతీయత, దేశభక్తి భావాలను పెంపొందించేందుకు విగ్రహాలు తోడ్పడతాయని సుప్రీం కోర్టు న్యాయవాది రాణా సందీప్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వ్లాదిమిర్ పుతిన్: ‘అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటును ఆయుధంగా ఎలా మార్చుకున్నారు?’
- తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
- ‘అమ్మవారు’ (చికెన్ పాక్స్) వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానంపై భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది
- తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్.. వందలాది స్పామ్ ట్వీట్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















