మల్లు స్వరాజ్యం: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కన్నుమూత

సీపీఎం ప్రముఖ నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణించారు.
ఆమె కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు.
శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆమె కన్నుమూశారు.
ఆమె భౌతికకాయం రేపు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఉంటుంది. అంత్యక్రియలు రేపు నల్లగొండలో జరుగుతాయి.
స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో అలనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పనిచేశారు. తదనంతరం సీపీఎం పార్టీలో కొనసాగారు.
ఆమె సోదరుడు భీమిరెడ్డి నరసింహా రెడ్డి కూడా సాయుధ పోరాట యోధుడే. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు.
'స్త్రీ జాతికి నిత్య స్ఫూర్తిగా నిలిచే మల్లు స్వరాజ్యం మరణం తీరని లోటు' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు సంజయ్ సహా పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

ఫొటో సోర్స్, TULIKA BOOKS
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరు
తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమాలు, అందులోనూ సాయుధ పోరాటాలలో పాల్గొన్న ప్రముఖ మహిళల్లో మల్లు స్వరాజ్యం అగ్రభాగంలో నిలుస్తారు. అటు దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంతోపాటు, ఇటు నిజాం నవాబు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారు మల్లు స్వరాజ్యం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మల్లు స్వరాజ్యంది కీలక పాత్ర.
13 ఏళ్ల చిరు ప్రాయంలోనే నిజాం, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంలోకి దిగిన మల్లు స్వరాజ్యం పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం, హక్కుల కోసం పోరాడారు. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే అయినా, అదే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరు సాగించారు.
"భూస్వాముల కుటుంబం నుంచే వచ్చాను. భూస్వాముల దౌర్జన్యం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రజల కోసం ఆయుధం పట్టడంలో, ప్రజల కోసం పనిచేయడంలో ఓ తృప్తి ఉంది" అని కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2020లో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు.
1931లో ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో మల్లు స్వరాజ్యం పుట్టారు. అప్పటికే దేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
నిజాం అరాచకాలను ఎదిరించారు
పదేళ్ల వయసులోనే మాక్సిం గోర్కి నవల 'అమ్మ'ను చదివి స్ఫూర్తి పొంది కమ్యూనిస్టు పార్టీలో చేరారు మల్లు స్వరాజ్యం. నిజాం కాలంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో పాల్గొన్నారు.
వ్యవసాయ భూములను తమ గుప్పిట్లో పెట్టుకుని నిజాం రాజు, ఆయనకు సహకరించే దేశముఖ్‌లు రైతుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతూ, వారి శ్రమను దోచుకుంటుంటే చూసి సహించలేక 13 ఏళ్ల వయసులోనే మల్లు స్వరాజ్యం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో సాయుధ పోరాటంలోకి దిగారు.
తెలంగాణలోని పల్లెపల్లెకు తిరిగి నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. నైజాం పోలీసులు, భూస్వాముల ప్రైవేటు సైన్యాలను హడలెత్తించేలా గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు. తుపాకులు చేతబట్టుకుని అజ్ఞాతంలో ఉంటూ పోరాటం సాగించిన మల్లు స్వరాజ్యం, తనలాంటి ఎందరో మహిళలకు ఈ పోరాటంలో శిక్షణ ఇచ్చారు. అప్పట్లో ఆమెను పట్టిస్తే రూ.10 వేల నజరానాను ప్రకటించింది నిజాం ప్రభుత్వం.
పాటలు కట్టి ప్రజలను చైతన్యవంతులను చేయడం, భూస్వాముల గడీలపై దాడులు చేయడం, ధాన్యాన్నిపేదలకు పంచడం, గ్రామాలను విముక్తం చేసి, భూములను రైతులకు పంచి ఇవ్వడంలాంటి కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. రైతులను, మహిళలను, గిరిజనులను ఏకం చేసి గెరిల్లా పోరాటం చేశారు. ఆమె బాణీ కట్టిన 'ఉయ్యాలో ఉయ్యాలా' పాట ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది.

ప్రజాప్రతినిధిగా..
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) తరఫున నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం నుంచి మల్లు స్వరాజ్యం రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన మల్లు స్వరాజ్యం, 1983లో మాత్రం ఒక ఏడాది మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగారు.
రజాకార్ల వ్యతిరేక ఉద్యమ సమయంలోనే తనతోపాటు పోరాటంలో పాల్గొన్న సహచరుడు మల్లు వెంకట నరసింహారెడ్డిని 1954లో స్వరాజ్యం వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం (ఇద్దరు కుమారులు- గౌతమ్, నాగార్జున, కుమార్తె- కరుణ)
తెలంగాణకు చెందిన మరో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, సాహితీవేత్త భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యానికి సోదరుడు.
క్రియాశీల రాజకీయాలలో లేకపోయినా, పేదలు, మహిళలు, అణగారిన వర్గాల సమస్యలపై మల్లు స్వరాజ్యం నిత్యం స్పందించేవారు.
ఇవి కూడా చదవండి:
- ‘రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదు’ - అమరావతి పిటిషన్లపై తుది తీర్పులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











