సెక్స్‌: ‘గర్భ నిరోధక సాధనాలు వాడేందుకు నా భాగస్వామి అంగీకరించరు’

గర్భ నిరోధక సాధనాల వాడకం విషయంలో చాలా మంది మహిళలునియంత్రణకు గురవుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలైస్ హార్ట్, రేచెల్ స్టోన్‌హౌస్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

గర్భ నిరోధక విధానాలు పాటించకుండా నియంత్రించడం కూడా హింసేనని చాలామంది గుర్తించరు. గర్భం రాకుండా ఉండేందుకు గర్భ నిరోధక సాధనాలు వాడతారు. అయితే, వీటిని వాడకుండా నిరోధించడం కూడా అవతలి వారిని నియంత్రించడమే.

ఇష్టంలేని గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేయడం, గర్భ నిరోధక సాధనాలను దాచిపెట్టడం లేదా కండోమ్స్ లాంటివి వాడొద్దని ఒత్తిడి చేయడం లాంటి వాటిని కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు.

గర్భ నిరోధక సాధనాల వాడకం విషయంలో భాగస్వామి చేసే నియంత్రణ ఎంత సాధారణమో తెలుసుకునేందుకు బీబీసీ 18 - 44 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 1000 మంది మహిళలతో యూకేలో సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 50శాతం మంది గర్భ నిరోధక సాధనాల వాడకం విషయంలో భాగస్వామి నుంచి నియంత్రణను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

తమపై ఒత్తిడి తెచ్చారని మూడొంతుల మంది మహిళలు చెప్పారు. గర్భ నిరోధక సాధనాలు వాడకుండా సెక్స్‌లో పాల్గొనాలనే ఒత్తిడికి గురైనట్లు అయిదు వంతుల మంది చెప్పారు.

ఈ రకమైన నియంత్రణ చాలా సాధారణమని ఈ సర్వే తేల్చింది.

కార్లీ

ఫొటో సోర్స్, Carly Chapman

ఫొటో క్యాప్షన్, గర్భ నిరోధక సాధనాల వాడకం విషయంలో చాలా మంది మహిళలునియంత్రణకు గురవుతున్నారు

"కండోమ్‌లు సరిపోవు"

భాగస్వామి గర్భ నిరోధక సాధనాలను దాచిపెట్టడం, వాడకుండా చేయడం, లేదా కండోమ్‌కు చిల్లు పెట్టి పనికిరాకుండా చేయడం వంటి సందర్భాలు తాము ఎదుర్కొన్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతీ 10 మందిలో ఒకరు చెప్పారు.

అంగీకారం లేకుండా కండోమ్ తొలగించిన సందర్భాలు ప్రతీ 10 మందిలో కనీసం ఒకరు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇలాంటి చర్యను "స్టీల్తింగ్" (దాపరికంతో కూడిన వ్యవహారం) అని పిలుస్తారు. యూకే చట్టాల ప్రకారం ఇలాంటి చర్యను అత్యాచారం కింద పరిగణిస్తారు. ఇది కూడా గర్భానికి సంబంధించిన విషయాల్లో నియంత్రణ కిందకే వస్తుంది.

ఇలాంటి పరిస్థితిని కార్లీ అనే మహిళ ఎదుర్కొన్నట్లు చెప్పారు.

"చాలాసార్లు నా భాగస్వామి నా అంగీకారం లేకుండా కండోమ్ తొలగించారు. కండోమ్స్ లేకుండా ఏం చేయవద్దని నేను పదే పదే చెప్పినప్పటికీ నా మాట వినలేదు" అని ఆమె న్యూస్ బీట్‌కు చెప్పారు.

"ఈ రకమైన నియంత్రణ చాలా సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది" అని కార్లీ అన్నారు.

'కండోమ్స్ సరిపోవటం లేద'ని సాకులు చెప్పే చాలామంది భాగస్వాముల గురించి తనకు తెలుసని ఆమె చెప్పారు.

"కొంతమంది మగవారు నాకు కండోమ్‌తో సెక్స్ ఇష్టముండదు. సాధారణ సెక్స్ వల్ల కలిగే ఆనందం కండోమ్ వల్ల కలగదు" లాంటి సాకులు చెబుతారు అని అన్నారు.

"కానీ, సెక్స్ విషయంలో భాగస్వామి అంగీకారానికి భిన్నంగా ప్రవర్తించడం గురించి చాలామంది మగవారు అర్థం చేసుకోరు" అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, కామసూత్ర: అరబ్ సెక్స్ సాహిత్యంలో ఏముంది?

"ఆ పరిస్థితిలో ఎవరూ తమను తాము బాధితులుగా భావించరు. ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు.

దీనిని చాలా సాధారణంగా చూస్తారు. ఎవరూ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించరు" అని అన్నారు.

కానీ, ఈ రకమైన నియంత్రణలో కొన్ని తీవ్రమైన సందర్భాలుంటాయి. గర్భిణులపై కూడా ఒక్కొక్కసారి ఒత్తిడి ఉంటుంది.

విన్నీ పోర్టర్

ఫొటో సోర్స్, Rowena Porter

ఫొటో క్యాప్షన్, విన్నీ పోర్టర్

"జీవితాంతం నన్ను అదుపు చేస్తూనే ఉన్నారు"

మీవ్ తన భాగస్వామిని టీనేజ్‌లో కలుసుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఆమె గర్భం దాల్చారు.

మొదట్లో ఆయన ప్రేమగానే ఉండేవారు. కానీ, కొన్ని రోజులకు ఆమెపై అధికారం చెలాయిస్తూ, ఆమెకు గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో లేకుండా చేశారు.

"నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆయన కారులో వెయిట్ చేస్తూ, తొందరగా పని పూర్తి చేసుకుని రమ్మని ఒత్తిడి చేసేవారు" అని మీవ్ చెప్పారు.

"నేను కారులోకి ఎక్కగానే, ఆయన గర్భ నిరోధక సాధనాలను దాచిపెట్టేవారు . దాంతో ఆమె ప్రతి సారి గర్భం దాలుస్తూ ఉండేవారు.

ఆమె భాగస్వామి ఆమె జీవితం మొత్తాన్ని తన చేతిలోకి తీసుకుని కంట్రోల్ చేసేవారు. ఆఖరికి ఆమె ఉద్యోగం సంపాదించే విషయంలో కూడా ఆయనదే పెత్తనం.

"నాకు ఉద్యోగంలో చేరాలనుందని ఎప్పుడు చెప్పినా, నన్ను గర్భ నిరోధక సాధనాలు వాడనిచ్చేవారు కాదు" అని ఆమె చెప్పారు.

ఆమె భాగస్వామి ఆమెను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించారు.

ఈ రకమైన వేధింపుల గురించి ఆరోగ్య నిపుణులు, అధికారులు దృష్టి పెట్టాలని ఆమె అంటారు.

గర్భ నిరోధక సాధనాలు వాడకుండా నియంత్రించడాన్ని నేరంగా పరిగణిస్తూ 2015లో యూకేలో చట్టాన్ని సవరించారు.

వీడియో క్యాప్షన్, ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం ఇదేనా?

"అలిసిపోయాను"

విన్నీ పోర్టర్ ఎంఎస్‌ఐ రీప్రొడక్టివ్ చాయ్‌సెస్ అబార్షన్ అండ్ సెక్సువల్ హెల్త్ క్లినిక్‌లో నర్సుగా పని చేస్తున్నారు. ఆమెకు 28 సంవత్సరాలు.

ఆమె క్లినిక్‌లో గర్భస్రావం చేయించుకోవాలని మహిళలను బలవంత పెట్టే సందర్భాలను ఆమె తరచుగా చూస్తుంటారు.

"గర్భస్రావాలు చేయించుకోమని, లేదా ఇష్టం లేని గర్భ నిరోధక సాధనాలు వాడమని మహిళలను ఇబ్బందిపెట్టే వారి గురించి వింటూ ఉంటాను" అని చెప్పారు.

"ఇష్టం లేకపోయినా గర్భస్రావం చేయించుకోమని బలవంతం పెట్టినట్లు 15 శాతం మంది మహిళలు చెప్పారు.

గర్భ నిరోధక సాధనాలకు సంబంధించిన నియంత్రణ గురించి ఆరోగ్య నిపుణులు, అధికారులు గుర్తించాల్సిన అవసరముందని విన్నీ అన్నారు.

"ఈ రకమైన వేధింపులు బయటకి కనిపించవు. దీనిని ఎవరూ గమనించరు. ఒక మహిళ జీవితంలో ఏం జరుగుతుందో తొంగి చూసినప్పుడే ఆమె జీవితంలో ఎటువంటి నియంత్రణలకు గురవుతుందో అర్థమవుతుంది" అని అన్నారు.

ఆమెను ఇంటర్వ్యూ చేస్తుండగా, ఆమె గది తలుపును ఎవరో కొట్టారు.

మేము ఇంటర్వ్యూ చేస్తుండగా మా పక్క గదిలో ఉన్న ఒక మహిళను గర్భస్రావం చేయించుకోమని ఆమె భాగస్వామి బలవంతం చేస్తున్నారు. విన్నీ బయటకు వెళ్లి వచ్చి పరిస్థితిని మాకు వివరించారు.

"ప్రస్తుతానికి ఆయనను ఇంటికి వెళ్ళమని చెప్పాం. కానీ, ఆయన తిరిగి వచ్చాక ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం"

"అయితే, మేము చేయాల్సిన పని గురించే నేను ఆలోచిస్తాను. ప్రస్తుతానికి ఆమె సురక్షితంగా ఉండటం కోసమే మేము ఆలోచిస్తాం" అని చెప్పారు.

ఇలాంటి కేసులు ఎన్ని వస్తాయి?

ప్రతి రోజూ పని ముగిసే సమయానికి ఇలాంటి కేసు ఒకటి వస్తుంది.

"ఇది చాలా విసుగ్గా ఉంటుంది. దీని గురించి మేం ఏం చేయగలం? మార్పును ఎప్పుడు చూస్తామో తెలియదు" అని ఆమె అన్నారు.

గర్భానికి సంబంధించిన విషయాల్లో జరుగుతున్న వేధింపులను ఎన్‌హెచ్‌ఎస్ కానీ, పోలీసులు కానీ కేసులు నమోదు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ కథనంలో మాట్లాడిన వారి కొందరి పేర్లను మార్చాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)