యుక్రెయిన్ యుద్ధం: మరియుపూల్ నగరం రష్యాకు ఎందుకంత కీలకం? 4 ముఖ్య కారణాలు ఇవే

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్-రష్యా యుద్ధంలో ఎక్కువ బాంబు దాడులకు గురైన నగరం మరియుపూల్. ఈ నగరంపై రష్యా అవిరామంగా దాడులు చేస్తూనే ఉంది. మాస్కో మిలటరీ ప్రచారానికి ఈ నగరం చాలా కీలకం. ఎందుకు?

ఈ రేవు పట్టణాన్ని చేజిక్కించుకోవడం రష్యాకు వ్యూహాత్మక విజయాన్ని అందిస్తుంది. దీన్ని కోల్పోవడం యుక్రెయిన్‌కు పెద్ద దెబ్బ.

దీనికి నాలుగు ముఖ్య కారణాలు ఇవే.

1. క్రైమియా, దోన్బస్ మధ్య భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం రష్యాకు కీలకం

భౌగోళికంగా మరియుపూల్ చిన్న ప్రాంతమే. కానీ, క్రైమియా నుంచి వచ్చే రష్యా దళాలకు అడ్డంకిగా నిలిచింది. 2014లో రష్యా, క్రైమియాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

క్రైమియాకు, దోన్బస్ ప్రాంతానికి మధ్యలో ఉంది మరియుపోల్. ఈశాన్యం వైపున దోన్బస్ ప్రాంతంలో యుక్రెయినియన్ వేర్పాటువాదుల ప్రాబల్యం ఉంది. వారికి రష్యా మద్దతు అందిస్తుంది. అందుకే, క్రైమియా నుంచి ఈశాన్యం వైపు కదులుతూ దోన్బస్‌లోని తమ మిత్రపక్షంతో జత కట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది రష్యా. ఇందుకు మరియుపూల్‌ను స్వాధీనం చేసుకోవడం ముఖ్యం.

మారియుపూల్‌ను స్వాధీనం చేసుకోవడం రష్యా యుద్ధ ప్రయత్నాలకు చాలా కీలకమని బ్రిటన్ జాయింట్ ఫోర్సెస్ కమాండ్ మాజీ కమాండర్ జనరల్ సర్ రిచర్డ్ బారన్స్ అన్నారు.

"యుద్ధాన్ని విజయవంతంగా ముగించామని రష్యా భావించే సమయానికి, రష్యా నుంచి క్రైమియాకు వాళ్లు ఒక ల్యాండ్ బ్రిడ్జిని నిర్మించి ఉంటారు. ఇది రష్యాకు వ్యూహాత్మక విజయం అవుతుంది" అని ఆయన అన్నారు.

మారియుపూల్‌ను స్వాధీనం చేసుకున్నట్లయితే, యుక్రెయిన్ నల్ల సముద్ర తీర ప్రాంతాన్ని 80 శాతం కంటే ఎక్కువగా చేజిక్కించుకున్నట్టే. దీనివల్ల, యుక్రెయిన్ సముద్ర వాణిజ్యం దెబ్బతింటుంది. ఆ దేశం, ప్రపంచానికి మరింత దూరం జరుగుతుంది.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

గత మూడు వారాలుగా మరియుపూల్‌ను ఆక్రమించుకునేందుకు పోరాడుతున్న రష్యా దళాలకు యుక్రెయిన సైన్యం గట్టిగానే సమాధానం చెప్పింది. ఈ వైఫల్యం రష్యా కమాండర్లకు కొరుకుడుపడలేదు. దాంతో, మధ్యయుగం నాటి వ్యూహాలను 21వ శతాబ్దానికి అప్‌గ్రేడ్ చేసి ప్రయోగిస్తున్నారు.

రాకెట్లు, ఫిరంగులు, క్షిపణులతో మరియుపూల్‌పై భీకరంగా దాడి చేస్తున్నారు. 90 శాతం నగరాన్ని ధ్వంసం చేశారు. కరంట్, మంచినీరు, ఆహారం, వైద్య సామాగ్రిని కూడా నిలిపివేసి మానవతా సంక్షోభాన్ని సృష్టించారు.

అయితే, దీనికి కారణం యుక్రెయినేనంటూ రష్యా నిందలు మోపుతోంది. సోమవారం తెల్లవారుజామున 5.00 గంటల లోపు మరియుపూల్‌ను అప్పగించమని రష్యా తుదిహెచ్చరిక జారీ చేసింది. అందుకు యుక్రెయిన్ నిరాకరించింది.

"మరియుపూల్‌ను ఆకలితో అలమటించేలా చేసి లొంగదీసుకోవాలని రష్యా ప్రయత్నిస్తోంది" అంటూ ఒక యుక్రెయిన్ ఎంపీ ఆరోపించారు.

కడవరకూ మరియుపూల్‌ను కాపాడుకుంటామని యుక్రెయిన్ దీక్షపూనింది. కానీ, రష్యా సైన్యం మెల్లమెల్లగా ముందుకు పురోగమిస్తోంది. ఇప్పటికే మరియుపూల్ నగరం నడిబొడ్డుకు రష్యా దళాలు చొచ్చుకువచ్చాయి.

మరియుపూల్

ఏ రకమైన శాంతి ఒప్పందాలు కుదరనప్పుడు, రష్యా బాంబు దాడులను తీవ్రతరం చేయవచ్చు. మరియుపూల్‌లో ఇంకా 2,00,000 మంది జనాభా ఉన్నారు.

ఒకవేళ రష్యా, మరియుపూల్‌ను స్వాధీనం చేసుకుంటే, అక్కడి నుంచి సుమారు 6,000 మంది సైనికులను ఇతర ప్రాంతాల్లో యుద్ధం చేయడానికి పంపిస్తుంది. మరియుపూల్‌లో బలమైన బెటాలియన్ సమూహాలను మోహరించింది రష్యా.

మరియుపూల్‌ తరువాత, రష్యా తమ సైనికులను వివిధ ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్ల సముద్రానికి సమీపంలో ఉన్న యుక్రెయిన్ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంది.

ఆ దిశలో, ఈశాన్యం వైపు దోన్బస్ ప్రాంతానికి పంపించి, ఇప్పటికే యుక్రెయిన్ సైన్యంతో పోరాడుతున్న వేర్పాటువాదులకు చేయూతనివ్వవచ్చు.

లేదా దక్షిణం వైపు ఒడెస్సాను ఆక్రమించుకోవడానికి పంపవచ్చు. యుక్రెయిన్‌కు, నల్ల సముద్రానికి చేరువలో ఉన్న చివరి కీలక పట్టణం ఇదే అవుతుంది.

లేదంటే వాయువ్య దిశలో ఉన్న నీప్రోకు పంపవచ్చు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో శాంతి కోసం ఈ చిన్నారి పాడిన పాట కన్నీరు పెట్టిస్తోంది

2. యుక్రెయిన్ ఆర్థికవ్యవస్థకు ఊపిరాడకుండా చేయడం

నల్ల సముద్రంలో భాగమైన అజోవ్ సముద్ర తీరంలో ఉన్న ముఖ్యమైన ఓడరేవు మరియుపూల్ నగరం. ఈ రేవు పట్టణం యుక్రెయిన్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకం.

అజోవ్ సముద్ర ప్రాంతంలో ఇది అతిపెద్ద ఓడరేవు. ఇనుము, ఉక్కు వస్తువులకు ప్రధాన కేంద్రం.

ఉక్కు, బొగ్గు, మొక్కజొన్నలను మధ్య ప్రాచ్యానికి, దానికి ఆవలి వైపున్న దేశాలకు ప్రధానంగా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తారు.

రష్యా, క్రైమియాను ఆక్రమించుకున్నప్పటినుంచి, గత ఎనిమిదేళ్లుగా క్రైమియాకు, దోన్బస్ ప్రాంతం (దోన్యస్క్, లుహాన్స్క్)లో యుక్రెయిన్ వేర్పాటువాదులకు మధ్య నలిగిపోతోంది ఈ నగరం.

మరియుపూల్‌ను కోల్పోవడం యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే అవుతుంది.

3. ప్రచారానికి మంచి అవకాశం

యుక్రెయినియన్ సైన్యానికి మద్దతుగా పనిచేసే పౌర సైన్యం అజోవ్ బ్రిగేడ్ మరియుపూల్‌లోనే ఉంది. అజోవ్ సముద్రం పేరు మీదుగా ఈ విభాగానికి ఆ పేరు పెట్టారు.

అజోవ్ బ్రిగేడ్‌లో నియో-నాజీలు సహా రైట్-వింగ్ అతివాదులున్నారు. యుక్రెయిన్ సైన్యంతో పోలిస్తే ఈ పౌర సైన్యం చాలా చిన్నదే అయినా, ఇది రష్యాకు కలిసొచ్చే విషయం. ఎందుకంటే, దీన్ని సాకుగా చూపించి, ఈ నియో నాజీలను అంతమొందించడానికే తమ దేశంలోని యువతను యుక్రెయిన్‌పై యుద్ధానికి పంపినట్టు స్వదేశంలో ప్రచారం చేసుకోవచ్చు.

అజోవ్ బ్రిగేడ్‌లో ఎక్కువమందిని రష్యా సజీవంగా పట్టుకోగలిగితే, రష్యా నియంత్రణలో ఉన్న మీడియాలో ఈ విషయం హోరెత్తిపోతుంది. ఇప్పటికే యుక్రెయిన్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు రష్యా సమాచార యుద్ధాన్ని ప్రారంభించింది.

రష్యా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

4. ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రధాన సాధనం

మరియుపూల్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటే, అది రెండు దేశాలపైనా మానసికంగా ప్రభావం చూపుతుంది.

మరియుపూల్ విజయాన్ని స్వదేశంలో ప్రజలకు చూపించి యుద్ధ లక్ష్యాలను సాధించడంలో పురోగమిస్తున్నట్టు రష్యా ప్రభుత్వం డప్పుకొట్టుకోవచ్చు.

రష్యా ప్రధాని పుతిన్‌కు ఇది చారిత్రకంగా ప్రాముఖ్యం. ఎందుకంటే, నల్ల సముద్ర తీర ప్రాంతాలు నోవోరసియా (న్యూ రష్యా)కు చెందినవని ఆయన అభిప్రాయం. నోవోరసియా అంటే 18వ శతాబ్దపు సామ్రాజ్యం నాటి రష్యన్ భూభాగం.

పుతిన్ ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

"రష్యన్లను కీయేవ్‌లోని పాశ్చాత్య అనుకూల ప్రభుత్వం నుంచి రక్షించాలని" ఆయన అంతకుముందు అన్నారు.

ఈ లక్ష్యాన్ని సాధించడానికి మరియుపూల్ అడ్డంకిగా నిలిచింది. అందుకే దీన్ని స్వాధీనం చేసుకోవడం రష్యాకు ముఖ్యం.

కానీ, ఈ నగరాన్ని కోల్పోవడం యుక్రెయినియన్లకు పెద్ద దెబ్బ. ఆర్థికపరంగా, సైన్యపరంగా మాత్రమే కాకుండా, రష్యాకు ఎదురునిలిచి యుద్ధం చేస్తున్న యుక్రెయినియన్ వాసులను ఇది మానసికంగా ప్రభావితం చేస్తుంది.

ఖేర్సాన్ తరువాత రష్యా చేతికి చిక్కిన ప్రధాన నగరం మరియుపూలే అవుతుంది. మరియుపూల్‌తో పోలిస్తే ఖేర్సాన్ వ్యూహాత్మకంగా తక్కువ ప్రాముఖ్యం కలిగిన నగరం.

మరియుపూల్‌లో రష్యా దాడులకు యుక్రెయిన్ గట్టిగా ప్రతిఘటించింది. కానీ, తీవ్ర నష్టం వాటిల్లింది. నగరం చాలావరకు ధ్వంసమైపోయింది. ఎక్కడా చూసినా శిథిలాలే.

గ్రోజ్‌నీ, అలెప్పో లాగ చివరికి ఈ నగరం కూడా చరిత్రలో కలిసిపోతుంది. పై రెండింటిపై రష్యా క్రమంగా బాంబు దాడులు చేస్తూ, వాటిని శిధిలావస్థకు ఈడ్చుకొచ్చింది.

ఇది యుక్రెయిన్‌లోని ఇతర నగరాలకు స్పష్టమైన సందేశం పంపినట్టు.. మరియుపూల్ లాగ ప్రతిఘటిస్తే, మీకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించినట్టవుతుంది.

"రష్యన్లు మరియుపూల్‌లోకి సులువుగా ప్రవేశించలేకపోయారు. అందుకని, ఆ నగరాన్ని శిథిలావస్థకు తీసుకొచ్చారు. వాళ్లకి ముఖ్యమైన ఏ ప్రాంతాన్నయినా వాళ్లు ఇలాగే చేస్తారని మనం ఊహించవచ్చు" అని జనరల్ సర్ రిచర్డ్ బారన్స్ అన్నారు.

వీడియో క్యాప్షన్, అణు నిరోధకం అంటే ఏంటి? 1 నిమిషం వీడియో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)