అనానిమస్: రష్యాపై 'సైబర్ వార్‌' ప్రకటించి పుతిన్‌ను బలాన్ని సవాల్ చేస్తున్న హ్యాక్టివిస్ట్‌లు

స్క్వాడ్ 303 హ్యాకింగ్ బృందానికి చెందిన సభ్యుడు
ఫొటో క్యాప్షన్, స్క్వాడ్ 303 హ్యాకింగ్ బృందానికి చెందిన సభ్యుడు
    • రచయిత, జో టిడీ
    • హోదా, సైబర్ రిపోర్టర్

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ప్రతీకారంగా రష్యాపై 'సైబర్ వార్‌' జరుగుతోంది. ఈ యుద్ధాన్ని ప్రకటించిన 'అజ్ఞాత హ్యాకర్ల సమూహం' రష్యాపై సైబర్ అటాక్‌లతో విరుచుకుపడుతోంది. ఈ సమూహానికి చెందిన కొందరు బీబీసీతో వారి ప్రణాళికలు, వ్యూహాలు, ఉద్దేశాల గురించి మాట్లాడారు.

యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అన్ని సైబర్ దాడుల్లో, రష్యన్ టీవీ నెట్‌వర్క్‌పై జరిగిన హ్యాకింగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఆ హ్యాకింగ్‌ను ఒక చిన్న వీడియో క్లిప్ రూపంలో చిత్రించారు. యుక్రెయిన్‌లో పేలుతున్న బాంబుల ఫొటోలతో సాధారణ ప్రోగ్రామింగ్‌కు అంతరాయం కలగడం ఆ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో ఫిబ్రవరి 26 నుంచి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతోంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న అజ్ఞాత సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియో షేర్ అయింది. ''ఇప్పుడే రష్యా ప్రభుత్వ టీవీ చానెళ్లు హ్యాక్ అయ్యాయి'', ''యుక్రెయిన్‌లో జరుగుతోన్న నిజాన్ని చూడండి'', ''యుక్రెయిన్'' అనే హ్యాష్ టాగ్‌లతో ఈ వీడియోను ఖాతాదారులు పంచుకున్నారు.

ఈ వీడియోను కొద్ది సమయంలోనే లక్షలాది మంది చూశారు.

'అజ్ఞాత హ్యాకర్ల సమూహం' చేసినట్లు ధ్రువీకరించే అన్ని లక్షణాలు ఈ వీడియోకు ఉన్నాయి. మిగతా అన్ని సైబర్ దాడుల్లాగే దీన్ని కూడా ఎవరు చేశారో ధ్రువీకరించడం చాలా కష్టం.

కానీ ఈ అజ్ఞాత హ్యాకర్ల సమూహానికి చెందిన ఒక చిన్న బృందం దీనికి బాధ్యత వహించింది. టీవీ సర్వీసులను 12 నిమిషాల పాటు తమ నియంత్రణలోకి తీసుకున్నామని ఆ బృందం తెలిపింది.

వీడియో క్యాప్షన్, అమెరికా చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. చేసిందెవరు?

ఈ వీడియోను పోస్ట్ చేసిన మొదటి వ్యక్తి కూడా ఇది నిజమని ధ్రువీకరించారు. ఎలిజా అమెరికాలో ఉంటారు. కానీ ఆమె తండ్రి రష్యన్. టీవీ షోకు అంతరాయం కలిగినప్పుడు ఆయన, ఆమెకు ఫోన్ చేశారు.

''ఇది జరిగినప్పుడు మా నాన్న నాకు ఫోన్ చేశారు. 'దేవుడా, వారు నిజాన్ని అందరికీ చూపిస్తున్నారు' అని నాతో అన్నారు. దాన్ని రికార్డు చేయాలని మా నాన్నకు చెప్పాను. ఆ క్లిప్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాను. తన స్నేహితుడు కూడా దీన్ని చూశారని మా నాన్న చెప్పారు'' అని ఎలిజా వివరించారు.

హ్యాకింగ్ గురైన వారికి సేవలందించే రష్యా కంపెనీ రోస్టెల్‌కామ్‌ను ఈ ఘటన గురించి మాట్లాడాలని కోరగా వారు స్పందించలేదు.

అమాయక యుక్రెయిన్ ప్రజలు ఊచకోతకు గురవుతున్నారని పేర్కొన్న హ్యాకర్లు తమ చర్యను సమర్థించుకున్నారు.

''యుక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణ జరగని పక్షంలో, మేం క్రెమ్లిన్‌పై దాడుల్ని మరింత తీవ్రతరం చేస్తామని'' వారు అన్నారు.

రష్యన్ వెబ్‌సైట్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు ప్రభుత్వ డేటాను దొంగిలించామని హ్యాకర్లు తెలిపారు.

అయితే ఈ సైబర్ దాడుల్లో చాలావరకు 'ప్రాథమిక స్థాయిలోనివే' అని రెడ్ గోట్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ భాగస్వామి లీసా ఫోర్ట్ అన్నారు.

''హ్యకర్లు ఎక్కువగా డీడీఓఎస్ అటాక్‌లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల విజ్ఞప్తులతో సర్వర్లు నిండిపోతాయి. వీటిని చాలా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇవి కేవలం తాత్కాలికంగా మాత్రమే వెబ్‌సైట్లను ఆఫ్‌లైన్‌లోకి పంపుతాయి'' అని ఆమె వివరించారు.

''కానీ టీవీ నెట్‌వర్క్‌పై జరిగిన హ్యాకింగ్ మాత్రం చాలా సృజనాత్మకమైనది. దాన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టమే'' అని ఆమె చెప్పారు.

రష్యాలో ఉంటోన్న తన తండ్రి ద్వారా యూఎస్ మహిళ హ్యాకింగ్ వీడియోను అందుకున్నారు
ఫొటో క్యాప్షన్, రష్యాలో ఉంటోన్న తన తండ్రి ద్వారా యూఎస్ మహిళ హ్యాకింగ్ వీడియోను అందుకున్నారు

అజ్ఞాత హ్యాకర్లు ఎవరు?

  • అనానిమస్ హ్యాక్టివిస్ట్ కలెక్టివ్ (అజ్ఞాత హ్యాకర్ల సమూహం) మొదటగా 2003లో '4చాన్' అనే వెబ్‌సైట్ నుంచి ఉద్భవించింది
  • ఈ సమూహానికి ఎలాంటి నాయకత్వం ఉండదు. 'మేమంతా ఒక సైన్యం' అనేది వీరి ట్యాగ్ లైన్
  • ఎవరైనా ఈ సమూహంలో చేరవచ్చు. వారు కోరుకున్న ఏ కారణం చేతనైనా హ్యాక్ చేయవచ్చు. కానీ సాధారణంగా వారు అధికారాన్ని దుర్వినియోగం చేసే సంస్థలపైనే దాడులు చేస్తుంటారు
  • 'గై ఫాక్స్ మాస్క్'ను వారు చిహ్నంగా ఉపయోగిస్తారు. ఈ మాస్క్ అలాన్ మూర్ గ్రాఫిక్ నవల 'వి ఫర్ వెండెట్టా' ద్వారా ప్రసిద్ధి చెందింది
  • ఈ సమూహానికి అనేక సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. కేవలం ట్విట్టర్‌లోనే 15.5 మిలియన్ల మంది వీరిని అనుసరిస్తున్నారు.

''అజ్ఞాత హ్యాకర్ల సమూహం రష్యా వెబ్‌సైట్లను చెడగొట్టింది. వెబ్‌సైట్లలో కనిపించే కంటెంట్‌ను మార్చడానికి వాటిపై హ్యాకర్లు నియంత్రణ సాధిస్తారని'' లీసా చెప్పారు.

ఇప్పటివరకు ఈ సైబర్ దాడులు అంతరాయాన్ని, ఇబ్బందిని కలిగించాయి. కానీ యుక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి హ్యాక్టివిజం పెరిగిపోవడం పట్ల సైబర్ నిపుణులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు.

హ్యాకర్లు పొరపాటున ఏదైనా ఆసుపత్రికి చెందిన కంప్యూటర్ నెట్‌వర్క్‌పై దాడి చేయవచ్చని, లేదా క్లిష్టమైన కమ్యూనికేషన్ లింకులకు అంతరాయం కలిగించవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు.

''ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు'' అని సైబర్ పాలసీ జర్నల్‌కు చెందిన ఎమిలీ టేలర్ అన్నారు.

''ఈ దాడులతో ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎవరైనా పొరపాటున పౌరుల జీవితాల్లోని ముఖ్యమైన అంశాలకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది'' అని ఎమిలీ తెలిపారు.

ఈ హ్యాకర్ల సమూహం ఇన్నేళ్లలో ఇప్పుడున్నంత యాక్టివ్‌గా ఎప్పుడూ లేదు. రోమన్ అనే వ్యక్తి యుక్రెయిన్ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆయన 'స్టాండ్ ఫర్ యుక్రెయిన్' అనే హ్యాకింగ్ సమూహానికి నాయకత్వం వహిస్తున్నారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసేంతవరకు ఈ హ్యాకింగ్ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు.

కీయెవ్‌లో ఆరో అంతస్థులోని తన అపార్ట్‌మెంట్ నుంచి రోమన్ ఈ పని చేస్తారు. యక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తూ రష్యా లక్ష్యాలను హ్యాక్ చేసేందుకు వెబ్‌సైట్లు, ఆండ్రాయిడ్ యాప్‌లు, టెలిగ్రామ్ బాట్లు తయారుచేసే తమ టీమ్ సభ్యులతో ఆయన సమన్వయం చేసుకుంటారు.

రోమన్

ఫొటో సోర్స్, ROMAN

ఫొటో క్యాప్షన్, రోమన్

''యుక్రెయిన్ కోసం రైఫిల్ పట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఈ క్షణంలో నాకున్న నైపుణ్యాలు కంప్యూటర్‌పైనే బాగా ఉపయోగపడతాయి. అందుకే నా ఇంట్లోనే ఉంటూ రెండు ల్యాప్‌టాప్‌లతో ఐటీతో పోరాడుతున్నా'' అని రోమన్ చెప్పారు.

తమ బృందం, రష్యా ప్రాంతీయ రైలు టిక్కెట్ సర్వీసులను కొన్ని గంటల పాటు అదుపులోకి తీసుకున్నట్లు రోమన్ చెప్పారు. కానీ బీబీసీ దీన్ని ధ్రువీకరించలేకపోయింది.

''మీకు లేదా మీ బంధువులకు ముప్పు వాటిల్లనంతవరకే ఇలాంటి పనులు అక్రమం, అన్యాయం. మీరే ప్రమాదంలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పుడు పనులు కావు'' అని ఆయన తన చర్యను సమర్థించుకున్నారు.

'స్కాడ్ 303' అనే పోలాండ్ హ్యాకింగ్ బృందం కూడా ఈ సమూహంలో కలిసిపోయింది.

''అనానిమస్ సమూహంతో కలిసి మేం పని చేస్తున్నాం. ఈ ఉద్యమంలో నేను కూడా ఒక సభ్యునిగా భావించుకుంటా'' అని డబ్ల్యూడబ్ల్యూ2 పైలట్ జాన్ జాంబాచ్ అనే పేరును ఉపయోగిస్తోన్న 'స్వ్కాడ్ 303' సమూహంలోని ఒక వ్యక్తి చెప్పారు.

ఆయన తన ఫొటోను ప్రచురణ చేసేందుకు ఒప్పుకోలేదు. కానీ ఆయన బృందంలోని మరో వ్యక్తి తన ఫొటో ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. యుక్రెయిన్ చెందిన ఆ వ్యక్తి పగలంతా రైఫిల్ పట్టుకొని విధులు నిర్వహిస్తున్నానని, రాత్రివేళ అనానిమస్, స్క్వాడ్ గ్రూపులతో కలిసి హ్యాకింగ్ చేస్తున్నానని చెప్పారు. మాస్క్, హెల్మెట్ ధరించిన తన చిత్రాన్ని ప్రచురణ కోసం పంపించారు.

స్క్వాడ్ 303 బృందం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు, రష్యన్ ఫోన్ నంబర్లకు సందేశాలను పంపించవచ్చు. యుక్రెయిన్ యుద్ధం వెనకున్న నిజాలను వారికి చేరవేయవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటివరకు 20 మిలియన్ల ఎస్‌ఎంఎస్‌లను, వాట్సప్ సందేశాలను ప్రజలు పంపడంలో సహాయపడినట్లు వారు చెబుతున్నారు.

యుక్రెయిన్ కోసం హ్యాకింగ్ సమూహాలు చేసిన పనుల్లో ఇదే అత్యంత ప్రభావవంతమైనది అని నేను మాట్లాడిన రెండు హ్యాకింగ్ బృందాలు తెలిపాయి.

వీడియో క్యాప్షన్, ఈ యాప్స్ ఉంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే...

మీరు చేస్తోన్న ఈ అక్రమ పనులను ఎలా సమర్థించుకుంటారని అడగగా జాన్ జాంబాచ్ సమాధానమిచ్చారు.

''మేం ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించట్లేదు. వేరే వారితో పంచుకోవట్లేదు. కేవలం సమాచార యుద్ధంలో గెలవాలనే ఉద్దేశంతో రష్యన్లతో మాట్లాడేందుకు ఈ విధంగా ప్రయత్నిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

రాబోయే రోజుల్లో మరింత ప్రభావవంతమైన హ్యాక్ చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

రష్యాలోని విజిలెంట్ గ్రూపులు కూడా యుక్రెయిన్‌పై దాడులు చేస్తున్నాయి. కానీ ఇవి చాలా చిన్న స్థాయి దాడులకు పాల్పడుతున్నాయి.

జనవరి నుంచి ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా మూడు ప్రధాన డీడీఓఎస్ దాడులు జరిగాయి. అంతేకాకుండా తక్కువ సంఖ్యలో యుక్రెయిన్ కంప్యూటర్లలోని డేటాను తొలిగించే తీవ్రమైన మూడు వైపర్ దాడులు కూడా జరిగాయి.

బుధవారం యుక్రెయిన్ 24 టీవీ చానెల్ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురవడంతో అందులో యుక్రెయిన్ అధ్యక్షునికి సంబంధించిన మ్యానిపులేటెడ్ వీడియో ప్రసారం అయింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా సైబర్ దాడి వెనుక ఎవరున్నారో కచ్చితంగా తెలుసుకోవడం చాలా కష్టం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)