మహేశ్ బ్యాంక్‌లో సైబర్ దోపిడీ: 3 బ్యాంకులనూ కొల్లగొట్టింది ఒక్కడే- ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో సైబర్ దాడికి పాల్పడిన నిందితుడు.. అంతకుముందు తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్, ఓ విదేశీబ్యాంక్‌లో సర్వర్ హ్యాక్ చేసి నగదు కొల్లగొట్టిన నేరస్థుడు ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.
''మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన సర్వర్‌ను హ్యాక్ చేసిన నిందితుడు రూ.12.9 కోట్లు కొల్లగొట్టాడు. ముందుగా ఈ మూడు బ్యాంకుల సిబ్బందిలో ఒకరికి ఈమెయిల్ వచ్చిందని, దాన్నుంచి నిందితుడు సర్వర్‌లోకి ప్రవేశించినట్లు తేలింది.
వ్యక్తిగత వివరాలు తెలియకపోయినా ఐపీ చిరునామా ప్రకారం కూడా ఈ మూడు బ్యాంకుల్లోనూ ఒకే నిందితుడు నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రధాన సర్వర్లలోకి ప్రవేశించేముందు హైదరాబాద్‌లోని సదరు బ్యాంకు శాఖలకు వెళ్లి పరిస్థితులను గమనించాడనీ భావిస్తున్నారు.
ఈ బ్యాంకులకు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని (సాఫ్ట్‌వేర్‌ను) సమకూర్చింది ఒకే బహుళజాతి సంస్థ. దాని నుంచే రక్షణ వ్యవస్థను మూడు బ్యాంకులు కొనుగోలు చేశాయి.
దీనిపైనా, బ్యాంకుల లోటుపాట్లపైనా క్షుణ్నంగా తెలుసుకున్నాకే నిందితుడు ఈ సైబర్ దోపిడీకి పథకం వేసి, అమలు చేశాడని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.
మహేశ్ బ్యాంక్‌లోంచి నగదు కాజేందుకు వీలుగా సైబర్ నేరస్థుడు కూకట్‌పల్లి శాఖలో గతేడాది డిసెంబరులో ఫార్మాహౌస్ పేరుతో ఓ ఖాతా ప్రారంభించాడు.
ప్రధాన సర్వర్‌ను హ్యాక్ చేసి ఈ నెల 23న రూ.50 లక్షలు ఆ ఖాతాలోకి బదిలీచేశాడు. అందులోంచే ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్వేరు ఖాతాలకు పంపించాడు.
ఫార్మాహౌస్ ఖాతాను ప్రారంభించినప్పుడు ప్రతినిధిగా ఎవరు వచ్చారు? తొలుత ఎంత నగదు జమచేశాడు? ఇప్పటివరకు ఎన్ని లావాదేవీలు జరిగాయన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చాడని మహేశ్‌బ్యాంక్ అధికారులు చెప్పగా వివరాలను, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కొన్ని గంటల వ్యవధిలోనే ఏపీ మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో రూ.12.9 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాడు రాష్ట్రంలో మరికొన్ని బ్యాంకులపైనా కన్నేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకులో సొమ్ము కాజేయడానికి కారణమైన ఐపీ చిరునామాను బ్లాక్ చేయాలని ఆర్బీఐ అదే ఏడాది జులై, ఆగస్టు నెలల్లో దేశంలోని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది.
కానీ కొన్ని బ్యాంకులు దీన్ని పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆ బ్యాంకులన్నీ ఇప్పుడు సైబర్ నేరగాడి బారిన పడుతున్నాయని తెలుస్తున్నట్లు’’ ఈనాడు రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, AP GOVT
కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు
ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను ఫిబ్రవరిలో చెల్లించాలని, అందుకు అనుగుణంగానే వీటికి సంబంధించిన బిల్లులను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మరోసారి స్పష్టం చేసినట్లు 'సాక్షి' పేర్కొంది.
''వాస్తవానికి జనవరి నెల నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుందన్న కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు జారీచేసింది. నిర్దేశించిన సమయంలోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఈ మేరకు సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో జారీ చేసింది.
జీవోలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది.
ప్రభుత్వశాఖలు, విభాగాలు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఫుల్ టైమ్, ఎన్‌ఎంఆర్, రోజువారీ వేతనాలు, కన్సాలిడేటెడ్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలు చెల్లించాలని తెలిపింది.
ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలపై జారీ చేసిన జీవో ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని పేర్కొన్నట్లు'' సాక్షి కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
సుపారీ గ్యాంగ్‌తో ప్రియుడిని కిడ్నాప్ చేయించిన వివాహిత.. ఆ తరువాత ఏం చేసిందంటే..
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వివాహిత... సుపారీ గ్యాంగ్‌తో ప్రియుడిని కిడ్నాప్ చేయించి బలవంతంగా దండలు మార్పించి పెళ్లి చేసుకున్నట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక వార్తలో తెలిపింది.
''పోలీసులు కథనం ప్రకారం.. నర్సంపేట శివారులోని కమలాపురానికి చెందిన ముత్యం శ్రీను నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు రోజువారీ వసూలు కింద కొంత అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇది తెలిసి ఆ మహిళ భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అయితే.. శ్రీను వల్లే తన కాపురం దెబ్బతిన్నదంటూ ప్రియుడిని ఆమె నిలదీసింది.
2 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. శ్రీను కూడా వివాహితుడు. అతనికి పిల్లలు కూడా ఉన్నారు. నష్టపరిహారంగా గతంలో ఇచ్చిన అప్పును మాఫీ చేసి మహిళకు శ్రీను అదనంగా రూ.1.5 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేశారు.
అనంతరం ఆ వివాహిత ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసింది.
శ్రీను కిడ్నాప్‌కు ఓ సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకుంది. బుధవారం పట్టణ శివారులో గ్యాంగ్ సభ్యులతో కలిసి శ్రీనును బలవంతంగా కారులో ఎక్కించుకొని పాకాల వైపు వెళ్లింది.
స్థానికులు శ్రీను కుటుంబ సభ్యులకు తెలపడంతో బాధితుడి కుమారుడు భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమను పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన సుపారీ గ్యాంగ్ శ్రీనును, మహిళను గంజేడు అడవిలోకి తీసుకెళ్లి దండలు మార్పించి ఫొటోలు తీశారు.
కొంత ఆస్తిని రాసివ్వాలన్నారు. పెద్ద మనుషుల వద్ద మాట్లాడుకుందామని అతడు చెప్పడంతో నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా మహిళ ఇంట్లో అతడిని వదిలేసి పరారయ్యారు. ప్రస్తుతం శ్రీనును పోలీసులు విచారిస్తున్నారని'' ఆంధ్రజ్యోతి వార్తలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రికార్డు స్థాయిలో వానాకాలం ధాన్యం సేకరణ: 70 లక్షల టన్నుల కొనుగోళ్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా, రికార్డు స్థాయిలో ప్రభుత్వం సుమారు 70 లక్షల టన్నుల వానాకాలం సీజన్ ధాన్యాన్ని కొనుగోలు చేసిందని 'నమస్తే తెలంగాణ' కథనం పేర్కొంది.
''ఈ సీజన్‌లో 12.75 లక్షల మంది రైతుల నుంచి రూ.13,631 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 90 శాతం రైతులకు ధాన్యం డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కోసం 6,818 కేంద్రాలు ఏర్పాటుచేయగా మంగళవారం వరకు 6,650 కేంద్రాలను మూసివేశారు.
వానకాలం ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా ముగిసినట్టేనని అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇవి మరో నాలుగు రోజుల్లో పూర్తి కావొచ్చని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లా నుంచి 6.86 లక్షల టన్నులు, 4.83 లక్షల టన్నులతో కామారెడ్డి, 4.43 లక్షల టన్నులతో నల్లగొండ, 3.99 లక్షల టన్నులతో సిద్దిపేట, 3.91 లక్షల టన్నుల తో కరీంనగర్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత వానకాలంలో 48.85 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు'' నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- బాల్ ఠాక్రే ప్రాణ భయమే శివసేనను మహారాష్ట్రకు పరిమితం చేసిందా
- ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మెరుగవుతుందా? తెలంగాణలో ఏం జరిగింది?
- RRB NTPC: రైలుకు నిప్పుపెట్టిన అభ్యర్థులు, వారి ఆగ్రహానికి కారణమేంటి?
- పంజాబ్ ఎన్నికలు: సీఎం రేసులో ఉన్న ఈ ఆరుగురి బలాలు, బలహీనతలు ఏంటి
- కరోనా ఉందని కాన్పు చేయలేదు.. ఆసుపత్రి గేటు వద్ద చెంచు మహిళ ప్రసవం
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












