యుక్రెయిన్ యుద్ధం: రష్యా తొలి హైపర్‌సోనిక్ మిసైల్ కింజాల్ 'గేమ్ చేంజర్’ కాదా?

ఫొటో సోర్స్, RUSSIAN DEFENCE MINISTRY
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా మిలిటరీ ఒక హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించి పశ్చిమ యుక్రెయిన్‌లోని పెద్ద భూగర్భ ఆయుధ డిపోను ద్వంసం చేసినట్లు మాస్కో వేదికగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఒకవేళ ధ్రువీకరణ అయితే ఈ యుద్ధంలో రష్యా వాడిన తొలి హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ఇదే అవుతుంది. కింజాల్ లేదా డాగర్ అనే బాలిస్టిక్ మిసైల్స్‌ను గగనతలం నుంచి ఎక్కువగా మిగ్-31 యుద్ధ విమానాల ద్వారా ప్రయోగిస్తారు.
హైపర్‌సోనిక్ మిసైల్స్ అంటే ఏమిటి?
హైపర్‌సోనిక్ మిసైల్స్‌పై రష్యా పెట్టుబడులను అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ పదే పదే హైలైట్ చేశారు. ఈ హైపర్‌సోనిక్ మిసైల్స్, ధ్వని కంటే అయిదు రెట్లు వేగంగా ప్రయాణించగలవు.
వీటి పనితీరు కూడా ప్రభావవంతంగా ఉంటుంది. రష్యా అధికారుల ప్రకారం, కింజాల్ మిసైల్ 2000 కి.మీ (1240 మైళ్లు) దూరం వరకు లక్ష్యాలను ఢీకొట్టగలదు. గంటకు 6000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు.
ఇలాంటి లక్షణాలున్న వీటిని మిగతా మిసైల్స్ కంటే ప్రమాదకరమైనవిగా భావించవచ్చా? ఇవి సృష్టించే విధ్వంసం, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందా?
''వీటిని అంత ముఖ్యమైనవిగా నేను చూడను. హైపర్‌సోనిక్ మిసైల్స్‌ను ప్రయోగించడం వల్ల రష్యాకు ఏమేరకు ప్రయోజనం కలుగుతుందో నాకు తెలియదు'' అని కర్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో న్యూక్లియర్ పాలసీ స్పెషలిస్టు జేమ్స్ ఆక్టన్ అన్నారు.
హైపర్‌సోనిక్ మిసైల్స్ పరంగా రష్యా, ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని డిసెంబర్‌లో పుతిన్ గొప్పగా చెప్పారు. ప్రయాణం మధ్యలోనే దిశను మార్చుకోగలవు కాబట్టి వీటిని ట్రాక్ చేయడం చాలా కష్టమని అన్నారు.
రొమేనియా సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న డెలియాటిన్ అనే గ్రామంలోని ఆయుధ డిపోపై మిసైల్ దాడికి సంబంధించిన వీడియోను రష్యా, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
''ఇది ఒక ప్రదర్శనకు సంకేతం. ఒకవేళ దీన్ని ఉపయోగించినప్పటికీ, రష్యా వద్ద పెద్ద సంఖ్యలో ఈ క్షిపణులు లేనందున మనం దీన్నొక ఏకాకి చర్యగా పరిగణించాలి'' అని జ్యూరిచ్‌లోని సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్‌కు చెందిన డొమినికా కునెర్టోవా అన్నారు.

'గేమ్ చేంజర్ కాదు’
అజేయమైన ఆయుధాల శ్రేణిలో ఒకటిగా కింజాల్ బాలిస్టిక్ మిసైల్‌ను నాలుగేళ్ల క్రితం పుతిన్ ఆవిష్కరించారు. శత్రువుల నుంచి ఇది తప్పించుకోగలదని ఆయన పేర్కొన్నారు.
ఇతర హైపర్‌సోనిక్ మిసైల్స్ అయిన జిర్కాన్, అవంగర్డ్‌లు మరింత వేగాన్ని కలిగి ఉంటాయి. వీటి పరిధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
సంప్రదాయబద్ధమైన కింజాల్ క్షిపణి న్యూక్లియర్ వార్‌హెడ్‌ను కూడా మోసుకెళ్లగలదు.
రష్యా పేర్కొన్న ఆయుధ డిపోపై ఎక్కడ నుంచి దాడి జరిగిందన్న సమాచారం లేదు.
''ఇది పశ్చిమ దేశాలకు ఒక సంకేతం. యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించే సాహసం చేస్తున్నాయని పశ్చిమ దేశాలపై పుతిన్ కోపంగా ఉన్నారు'' అని బీబీసీతో డొమినికా అన్నారు.
''ఇది చాలా కచ్చితత్వంతో ఉందని అంటున్నారు. కానీ అది సందేహాస్పదంగానే ఉంది. కాబట్టి ఇది ఎంతమాత్రం 'గేమ్ చేంజర్' కాదు'' అని డొమినికా అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''కింజాల్ క్షిపణి ఒక ఇస్కాండర్ మిసైల్ అయి ఉండొచ్చు. దాన్ని యుద్ధవిమానాలకు అనుగుణంగా మార్చారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే గ్రౌండ్ లాంచర్ల ద్వారా ఇస్కాండర్-ఎం క్షిపణులను రష్యా ప్రయోగిస్తోంది'' అని జేమ్స్ ఆక్టన్ అన్నారు.
గగనతలంలో ప్రయోగించే క్షిపణి కంటే ఇస్కాండర్ క్షిపణి చాలా తక్కువ పరిధిని కలిగి ఉన్నప్పటికీ, రష్యా యుద్ధం ప్రారంభమైన తొలి 20 రోజుల్లోనే తమ వద్ద ఉన్న దాదాపు అన్ని ఇస్కాండర్ మిసైల్స్‌ను ప్రయోగించిందని యుక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది.
ఫిబ్రవరి 24 నుంచి రష్యా బలగాలు 1080 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించాయని శుక్రవారం అమెరికా రక్షణ అధికారి ఒకరు అన్నారు.
''ఇది చాలా ఆశ్చర్యపరిచే సంఖ్య. రష్యా యుద్ధ సామగ్రి పట్టికలో చాలా గణనీయమైన భాగం. వారికి కచ్చితంగా ఆయుధాల కొరత ఏర్పడవచ్చు'' అని బీబీసీతో ఆక్టన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వ్లాదిమిర్ పుతిన్: ‘అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటును ఆయుధంగా ఎలా మార్చుకున్నారు?’
- తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
- ‘అమ్మవారు’ (చికెన్ పాక్స్) వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానంపై భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది
- తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్.. వందలాది స్పామ్ ట్వీట్లు
- Zero Debt: అప్పు చేయకపోవడం కూడా తప్పేనా? చేస్తే ఎంత చేయాలి, ఎలా చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















