అవాన్‌గార్డ్’ హైపర్‌సోనిక్ క్షిపణిని అమెరికా కంటే ముందే రష్యా తయారు చేసిందా..

ఫొటో సోర్స్, Getty Images
అవాన్‌గార్డ్ హైపర్‌సోనిక్ క్షిపణులు సైన్యానికి అందుబాటులోకి వచ్చినట్లు రష్యా ప్రకటించింది.
అణు సామర్థ్యమున్న ఈ క్షిపణులు ధ్వని కన్నా 20 రెట్లకు పైగా వేగంతో దూసుకెళ్లగలవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
అయితే, వీటిని ఎక్కడ మోహరించారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. యూరాల్ పర్వతాల్లో వీటిని మోహరించే అవకాశాలున్నట్లు ఇదివరకు రష్యా అధికారులు సంకేతాలు ఇచ్చారు.
ఏ రక్షణ వ్యవస్థనైనా ఛేదించేలా అవాన్‌గార్డ్ క్షిపణుల్లో ‘గ్లైడ్’ వ్యవస్థ ఉందని రష్యా చెబుతోంది.
మాస్కో కాలమానం ప్రకారం డిసెంబర్ 27, ఉదయం 10 గంటలకు అవాన్‌గార్డ్ హైపర్‌సోనిక్ క్షిపణులు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయని రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగు ధ్రువీకరించారు.
ప్రస్తుతం ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థలతోపాటు భవిష్యతులో రాబోయే వాటిని కూడా అవాన్‌గర్డ్ ఛేదించగలుగుతుందని పుతిన్ అన్నారు.
‘‘ఖండాంతర శ్రేణి హైపర్‌సోనిక్ ఆయుధాలు కాదు.. అసలు హైపర్ సోనిక్ ఆయుధాలే ఏ దేశం దగ్గరా లేవు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మిగతా దేశాలన్నీ తమతో పోటీలో వెనుకంజలోనే ఉన్నాయని అన్నారు.
2018 మార్చిలో స్టేట్ ఆఫ్ ద నేషన్ ప్రసంగం సందర్భంగా పుతిన్ అవాన్‌గార్డ్, ఇతర ఆయుధ వ్యవస్థల గురించి ప్రకటన చేశారు.
2018 డిసెంబర్‌లో యూరాల్ పర్వత ప్రాంతాల్లోని డోంబరోవస్కీలోని క్షిపణి స్థావరంలో అవాన్‌గార్డ్ ప్రయోగాత్మక పరీక్షలు జరిగాయి. 6వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఆ క్షిపణి ఛేదించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిపై అమర్చితే, అవాన్‌గార్డ్ రెండు మెగా టన్నుల బరువుండే అణ్వాయుధాన్ని కూడా మోసుకువెళ్లగలదు. రష్యా రక్షణ శాఖ అవాన్‌గార్డ్ వ్యవస్థకు సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది.
అయితే, అవాన్‌గార్డ్ సామర్థ్యాలపై రక్షణ రంగ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రష్యా ప్రకటించినట్లుగా అవాన్‌గార్డ్‌కు ఆ సామర్థ్యాలున్నాయని తాము ‘పరిగణించడం లేద’ని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.
హైపర్‌సోనిక్ క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాన్ని అమెరికా కూడా చేపట్టింది. చైనా కూడా 2014లో ఇలాంటి ఆయుధాలపై పరీక్షలు జరిపినట్లు తెలిపింది.
వ్యూహాత్మక న్యూక్లియర్ లాంచర్ల సంఖ్యను తగ్గించుకునేందుకు అమెరికా, రష్యాల మధ్య 2010-న్యూ స్టార్ట్ అనే ఒప్పందం ఉంది. దీని కింద అవాన్‌గార్డ్‌ను పరిశీలిచేందుకు అమెరికా నిపుణులను గత నవంబర్ 26న రష్యా అనుమతించింది.
ఈ ఒప్పందం కాలపరిమితి 2021 ఫిబ్రవరితో ముగుస్తుంది. రష్యా, అమెరికాల మధ్య ఉన్న ప్రధానమైన అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాల్లో ఇదే ఆఖరిది.
రష్యా, చైనాలతో కొత్త అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇదివరకు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అవాన్‌గార్డ్ నిజంగానే అందుబాటులోకి వచ్చిందా అన్నది నిర్ధరించడం చాలా కష్టమని బీబీసీ డిఫెన్స్ కరెస్పాండెంట్ జొనాథన్ మార్కస్ అన్నారు.
‘‘పుతిన్ గొప్పులు పోతున్నా.. అందులో కొంతవరకూ వాస్తవమూ ఉండొచ్చు. హైపర్ సోనిక్ క్షిపణుల విషయంలో రష్యా చాలా ముందుంది. చైనా కూడా అలాంటి వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. అమెరికా మాత్రం వెనుకబడినట్లు కనిపిస్తోంది’’ అని చెప్పారు.
‘‘అవాన్‌గార్డ్‌కు బూస్ట్ గ్లైడ్ వ్యవస్థ ఉందని రష్యా అంటోంది. అదే నిజమైతే, ఇప్పుడున్న క్షిపణి రక్షణ వ్యవస్థలకు ఇది పెద్ద ప్రమాదం. అవాన్‌గార్డ్ గురించి రష్యా చేస్తున్న ప్రకటనలు నిజమే అయితే, ఆ క్షిపణిని ఎదుర్కోవడం అసాధ్యం’’ అని అన్నారు.
అవాన్‌గార్డ్ గురించి రష్యా చేసిన ప్రకటనతో అణ్వాయుధ రేసులో ఓ భయంకరమైన కొత్త అధ్యాయం మొదలైందని జొనాథన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- నాటో అంటే ఏమిటి.. దానికి ఇంకా ప్రాధాన్యం ఉందా
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- చైనా రైతులు సరిహద్దు దాటి రష్యాలోకి ఎందుకు అడుగుపెడుతున్నారు?
- శాండా బల్లి: మనుషుల 'మగతనం' కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఎడారి జీవి
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- విశాఖను రాజధాని చేస్తే తాగునీటి సమస్యను ఎలా ఎదుర్కోవాలి?
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- అమెరికా గూఢచర్యం: ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పావురాలు సీక్రెట్ ఏజెంట్స్‌గా ఎలా పని చేశాయి... గుట్టు విప్పిన సిఐఏ
- ఆ 19 లక్షల మందిని దేశం నుంచి ఎలా తరలిస్తారు.. రైళ్లలోనా, విమానాల్లోనా?: చిదంబరం - #బీబీసీ ఇంటర్వ్యూ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








