రష్యన్ బిలియనీర్లకు లండన్ ఎలా స్వర్గధామంగా మారింది, ఆస్తులు లాక్కుంటే ఓలిగార్క్‌లు ఏం చేస్తున్నారు?

లండన్‌లో ఓ ఖరీదైన భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్‌లో ఓ ఖరీదైన భవనం

సెంట్రల్ లండన్‌లోని బెల్గ్రేవియా ప్రాంతాన్ని కొంతమంది ''రెడ్ స్క్వేర్'' అని కూడా పిలుస్తారు. అలాగే ఈటన్ స్క్వేర్‌లో ఐదు అంతస్తుల భవనం ఉంది. ఇందులో టెన్నిస్ కోర్టులతోపాటు ప్రైవేట్ గార్డెన్‌లు ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో రష్యన్ ప్రజలు నివసిస్తున్నారు.

ఒక దశాబ్దానికి పైగా రష్యన్లు ఈటన్ స్క్వేర్‌తో సహా అనేక ఖరీదైన ప్రాంతాలలో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు. బ్రిటన్‌లో రష్యన్లు ఆస్తులు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ లండన్‌లోని బెల్గ్రావియాలో ఆందోళన నిర్వహించిన కొందరు నిరసనకారులు, బెల్గ్రేవ్ స్క్వేర్‌ లోని నంబర్ 5 మేన్షన్‌ను ఆక్రమించారు.

వేల కోట్ల రూపాయల విలువైన ఈ భవనం, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడైన ఒలేగ్ డెరిపాస్కా అనే ఓలిగార్క్‌‌ ది. ఆయన ఈ ఆస్తి కొనడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రష్యా దాడి కారణంగా అనేకమంది యుక్రెయిన్‌ను విడిచి వెళ్లాల్సి వస్తోందని, ఆ శరణార్ధులకు సహాయం చేసేందుకే ఈ బిల్డింగ్‌ను ఆక్రమించినట్లు ఓ ఆందోళనకారుడు వెల్లడించారు.

''ఈ భవనాలు చాలా విలాసవంతమైనవి. సినిమా హాళ్ల నుంచి ఆర్ట్ గ్యాలరీల వరకు దాదాపు 200 గదులు ఉన్నాయి. ఇవన్నీ సాధారణ ప్రజలకు అవసరం లేనివి'' అని ఆ ఆందోళనకారుడు వ్యాఖ్యానించారు.

ఓలిగార్క్‌కు చెందిన ఓ బిల్డింగ్‌ను ఆక్రమించిన ఆందోళనకారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓలిగార్క్‌కు చెందిన ఓ బిల్డింగ్‌ను ఆక్రమించిన ఆందోళనకారులు

'బ్రిటన్ చట్టాలే అసలు దోషులా'

బ్రిటన్‌లోని ఆస్తులలో కనీసం లక్షాయాభై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రష్యన్లకు చెందినవి, ఈ ఆస్తులు ఎలా వచ్చాయన్న వివరాలు మాత్రం అందుబాటులో లేవని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది.

రష్యన్ బిలియనీర్లు లండన్‌లో ఇళ్లను, ఆస్తులు మాత్రమే కాకుండా, చెల్సియా ఎఫ్‌సీ వంటి ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ క్లబ్‌లు, స్కాట్లాండ్‌లోని పెద్ద ఎస్టేట్‌లు, లండన్ ఈవెనింగ్ స్టాండర్డ్ వంటి మీడియా సంస్థలను కూడా కొనుగోలు చేశారు.

ఇదంతా 1990ల చివరలో ప్రారంభమైందని '' లండన్‌ గ్రాడ్: ఫ్రమ్ రష్యా విత్ క్యాష్; ది ఇన్‌సైడ్ స్టోరీ ఆఫ్ ది ఒలిగార్క్స్" అనే పుస్తక రచయిత మార్క్ హోలింగ్స్‌వర్త్ చెప్పారు.

''ప్రైవేటీకరణతో చాలా డబ్బు సంపాదించిన తరువాత, మిఖాయిల్ ఖోడోర్కోవ్‌స్కీ వంటి కొంతమంది ఒలిగార్క్‌లు దాడులకు భయపడి రష్యా నుండి తమ డబ్బును బైటికి తీసుకురావాలని కోరుకున్నారు" అని హోలింగ్స్‌వర్త్ అన్నారు.

''తమ డబ్బును విదేశీ కంపెనీలకు, ట్రస్టులకు బదిలీ చేయడం ప్రారంభించారు. చివరకు అది లండన్‌ చేరింది. వీటితో వారు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేశారు. పెట్టుబడులు పెట్టారు'' అని ఆయన వివరించారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రష్యన్ ఒలిగార్క్‌ల రాక రెండుసార్లు భారీ ఎత్తున జరిగింది. మొదటిది 1990లో. బోరిస్‌ ఎల్సిన్ ప్రభుత్వ హయాంలో లాభాలు సాధించడానికి ప్రభుత్వానికి చెందిన పెద్దపెద్ద కంపెనీలను తక్కువ ధరకు అమ్మేశారు. రెండవసారి వ్లాదిమిర్ పుతిన్ వారి నుంచి పెట్టుబడులను ప్రోత్సహించారు.

2000ల ప్రారంభంలో, చాలామంది ఒలిగార్క్‌లు పుతిన్ ప్రభుత్వ దాడులకు భయపడేవారు.. ఖోడోర్కోవ్‌స్కీ వంటివారు కొందరు. ఖోడోర్కోవ్‌స్కీ రష్యాలోనే అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు.

Presentational grey line

ఓలిగార్క్‌లు అంటే ఎవరు?

ఓలిగార్క్‌ అనే మాటకు చాలా చరిత్ర ఉంది. దానికో ప్రత్యేకమైన అర్ధం కూడా. ఓలిగార్క్‌ అనే పిలిపించుకునే వ్యక్తి ‘ఓలిగార్క్‌’ అనే వ్యవస్థకు బలమైన మద్ధతుదారుగా ఉంటారు. 'ఓలిగార్క్స్' అంటే పరిపాలనను నిర్వహించే కొందరు వ్యక్తుల సమూహం.

అయితే, ఇప్పుడు ఈ మాటకు అర్ధం మారిపోయింది. 1991లో సోవియట్ యూనియన్ పతనమయ్యాక, ఆర్ధికంగా ఎదిగిన కొందరు బడా వ్యాపారుల వర్గాన్ని ఓలిగార్క్‌లుగా పిలుస్తున్నారు.

గ్రీక్ భాషలో 'ఓలిగోయి' అనే మాటకు 'కొందరు' అని అర్ధం. 'ఆర్ఖీన్' అనే మాటకు పాలించడం అనే అర్ధం ఉంది. అయితే, ఇది 'మోనార్కీ'(మోనోస్-ఒకే పాలకుడు) లేదా 'డెమొక్రసీ'(డెమోస్-ప్రజలు ఎన్నుకున్న పాలకుడు) అనే మాటలకు పూర్తిగా భిన్నమైంది.

పుతిన్‌ కు ఓలిగార్క్‌లకు సంబంధమేంటి? యుద్ధం వస్తే ఓలిగార్క్‌ల మీద ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు?

Presentational grey line
వీడియో క్యాప్షన్, పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?

కానీ, 1990 లలో పన్ను మోసం కేసులో ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయన పేరు ప్రతిష్ఠలు తగ్గిపోయాయి. దాదాపు ఒక దశాబ్దం జైలు జీవితం గడిపిన తరువాత, ఖోడోర్కోవ్‌స్కీ ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు. ‘‘నా రాజకీయ ఆశయాలకు భయపడి, నా వ్యాపారాలను కంట్రోల్ చేయాలనుకునే పుతిన్‌, ఆయన కింద పనిచేసే అవినీతి అధికారుల చేతిలో నేను బలయ్యాను’’ అని ఖోడోర్కోవ్‌స్కీ అన్నారు.

రాజకీయ వేధింపుల నుండి తప్పించుకోవడానికి, ఒలిగార్క్‌లు లండన్‌ను తమ కేంద్రంగా మార్చుకున్నారని, డబ్బు దాచుకోవడానికి ఈ నగరాన్ని సురక్షిత ప్రాంతంగా భావించారని మార్క్ హోలింగ్స్‌వర్త్ అన్నారు. వీరిలో ఎవరినైనా అప్పగించాలని రష్యా కోరినా, బ్రిటన్ వారిని అప్పగించేది కాదని ఆయన వెల్లడించారు.

అప్పట్లో లండన్‌లో చాలామంది న్యాయవాదులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్యాంకర్లు, కన్సల్టెంట్‌లు, అకౌంటెంట్లు ఓలిగార్క్‌లకు సహాయం చేశారు. వారు తమ డబ్బును లండన్ రప్పించుకునేందుకు సహకరించారు.

2003లో రోమన్ అబ్రమోవిచ్ అనే ఓలిగార్క్ చెల్సియా ఎఫ్‌సీ ఫుట్‌బాల్ జట్టును కొనుగోలు చేశారు. ఇది బ్రిటన్‌లో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి అసలు ఈ ఒలిగార్క్‌లు ఎవరు, వారికి డబ్బు ఎక్కడ నుండి వచ్చింది అని ప్రజలు ఆలోచించడం ప్రారంభించారు

ఈ ఏడాది జనవరిలో కోజో కోరమ్ అనే ప్రొఫెసర్ "అన్‌కామన్ వెల్త్: బ్రిటన్ అండ్ ది ఆఫ్టర్‌మాత్ ఆఫ్ ఎంపైర్" అనే పుస్తకాన్ని ప్రచురించారు. దీనిలో బ్రిటన్ రాజరిక వారసత్వం దాని న్యాయ, ఆర్థిక వ్యవస్థలను ఎలా ప్రభావితం చేసిందో ఆయన వివరించారు.

''లండన్ రష్యన్‌లకు మాత్రమే కాకుండా సౌదీ అరేబియా, నైజీరియన్ ఒలిగార్క్‌లు, చైనీస్ బిలియనీర్‌లకు కూడా తలుపులు తెరిచింది. వారందరూ పెట్టుబడుల కోసం లండన్‌ను విదేశీ గమ్యస్థానంగా ఉపయోగిస్తున్నారు'' అని కోజో కోరమ్ అన్నారు.

పుతిన్ తో ఓలిగార్క్ డెరిపాస్కా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుతిన్ తో ఓలిగార్క్ డెరిపాస్కా

వివాదాస్పద 'గోల్డ్ వీసా' పథకం

'గోల్డెన్‌ వీసా' అనే వీసా స్కీమ్ అనేకమంది ఓలిగార్క్‌లు బ్రిటన్ చేరుకోవడం సులభతరం చేసింది. ఈ వ్యవస్థ పైనా, బ్రిటిష్ ప్రభుత్వంపైనా దేశీయంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను నిలిపేసింది.

2008లో బ్రిటీష్ ప్రభుత్వం టైర్ 1 వీసా స్కీమ్‌తో ముందుకు వచ్చింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది బిలియనీర్‌లకు అధికారికంగా బ్రిటన్ తలుపులు తెరిచింది. ఒక మిలియన్ పౌండ్లు (సుమారు రూ.10 కోట్లు) పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలకు ఈ వీసా ఇస్తారు. 2014లో ఈ మొత్తాన్ని రూ.200 కోట్లకు పెంచారు.

ఈ వీసా హోల్డర్‌లు యూకేలో వారి కుటుంబాలతో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టే మొత్తాన్నిబట్టి మీకు వీసా లభిస్తుంది.

స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్ వంటి ఇతర యూరోపియన్ దేశాలు కూడా తక్కువ పెట్టుబడితో ఇలాంటి ప్లాన్‌లను అందిస్తున్నాయి. కానీ యుక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్‌లు రష్యన్‌లకు గోల్డెన్ వీసాల జారీని నిలిపివేసాయి.

యూకే హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం, ఈ వీసా ప్రోగ్రాం ప్రారంభమైనప్పటి నుంచి 2,581 మంది రష్యన్లకు ఈ పెట్టుబడి వీసాలు మంజూరు చేశారు.

ఈటన్ స్క్వేర్ ప్రాంతం

ఫొటో సోర్స్, NORBERTO PAREDES / BBC WORLD

ఫొటో క్యాప్షన్, ఈటన్ స్క్వేర్ ప్రాంతం

దేశంలో రష్యా జోక్యంపై రెండేళ్ల విచారణ తర్వాత, బ్రిటిష్ పార్లమెంట్ ఇంటెలిజెన్స్ కమిటీ 2020లో ఒక నివేదికను ప్రచురించింది. బ్రిటన్‌లో రష్యా ప్రభావం ఇప్పుడు 'చాలా సాధారణం'గా మారిందని ఇందులో పేర్కొన్నారు.

బ్రిటన్‌ ప్రభుత్వాలు రష్యన్ ఒలిగార్క్‌లను, వారి డబ్బును ముక్త కంఠంతో స్వాగతించాయని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 'లండన్‌గ్రాడ్'లో వ్యాపారం, రాజకీయాలు, సామాజిక జీవితంలో బాగా కలిసిపోయిన అనేకమంది రష్యన్లు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే.

రెండేళ్ల కిందట బ్రిటిష్ పార్లమెంట్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ప్రచురించిన రెండో నివేదిక ప్రకారం రష్యా ద్వారా వచ్చే డబ్బుతో మనీలాండరింగ్ జరుగుతోంది. కానీ బ్రిటీష్ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు.

బ్రిటన్‌కు దీర్ఘకాలంలో ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయని భావించినందున, ప్రభుత్వం చాలా కాలం ఇలాంటి వ్యవహారాలను విస్మరించిందని లండన్ విశ్వవిద్యాలయం కోరం అభిప్రాయపడింది.

రష్యన్ వ్యాపారుల విలాసాలు

ఫొటో సోర్స్, Getty Images

'లండన్‌గ్రాడ్' ముగుస్తుందా?

బ్రిటన్‌కు చెందిన వెయ్యిమంది రష్యన్లు, వారి కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థలపై ఆంక్షలు విధించారు. వీరిలో 50 మందికి పైగా ఒలిగార్క్‌లు, వారి కుటుంబాలు ఉన్నాయి. వారి మొత్తం ఆస్తులు 100 బిలియన్ పౌండ్లు( సుమారు రూ. 10 లక్షల కోట్లు) ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా లండన్‌గ్రాడ్ ఇక క్లోజ్ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

''చాలామంది ఒలిగార్క్‌లు లండన్‌లో నివసించరు. కానీ వారి ఆస్తులు, డబ్బు ఇక్కడ ఉన్నాయి''అని హోలింగ్స్‌వర్త్ చెప్పారు.

ప్రభుత్వం తీసుకుంటున్న అణచివేత చర్యల మీద రష్యన్ వ్యాపారవేత్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు తమ పెట్టుబడులను వేరే దేశాలకు మళ్లించే ప్రయత్నించే ఉన్నారని హోలింగ్స్‌వర్త్ అన్నారు.

''మార్పు వాస్తవంగా ఉండాలి. కేవలం చట్టపరమైన మార్పులు సహాయం చేయవు. విదేశీ ధనాన్ని ఆహ్వానించే రాజకీయ వైఖరిలో కూడా మార్పు రావాలి'' అని కోజో కోరమ్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకమో చెప్పే మూడు కారణాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)