#RRRMovie - రాజమౌళి, త్రివిక్రమ్, వర్మ: సినిమా ప్రమోషన్‌లో ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో స్టైల్.. కంటెంట్ ఉంటే సరిపోదు, దాన్ని అమ్ముకోవడమూ తెలియాలి

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు చేశారు

ఫొటో సోర్స్, @ssrajamouli/twitter

ఫొటో క్యాప్షన్, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు చేశారు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ఫీవర్ నడుస్తోంది. దేశమంతా ఆ ఫీవర్ తెప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆ సినిమా బృందం. ఇంతకీ ఒక సినిమా చుట్టూ ఇంత సందడి లేదా బజ్ ఎలా వస్తుంది?

అభిమాన గణం లేదా ఫాన్ బేస్ దాదాపు అందరు హీరోలకూ ఉంటారు. బడ్జెట్ అన్ని సినిమాలకూ ఉంటుంది. కానీ కొన్ని సినిమాలే ఆ హీట్ పుట్టిస్తాయి. ఎవరి నోటి వెంట విన్నా ఆ మాట వినిపించేలా ఎలా చేయగలుగుతాయి? ఆ ఫీవర్ ఆటోమేటిగ్గా వస్తుందా? లేక పుట్టిస్తారా?

''నీలో ఎంత విషయం ఉందనేదానికంటే, ఆ విషయాన్ని నువ్వెంతలా అమ్ముకున్నావనేది ముఖ్యం''- కెరీర్‌లో ఎదగాలనుకునే వాళ్లు నేర్చుకునే మొదటి విషయం ఇదే. ఇదే సూత్రం సినిమాలకూ వర్తిస్తుంది. సినిమా ఎంత కష్టపడి తీస్తారో, సినిమాలో ఎంత విషయం ఉంటుందో, అంతకంటే బలంగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లి మార్కెట్ చేయాలి. దానికే ప్రమోషన్ అని పేరు. ఇదే ఇప్పుడు పెద్ద టాస్క్!

కొన్ని చిన్న సినిమాలైతే తమ సినిమా బడ్జెట్ కంటే ప్రమోషన్‌కి ఎక్కువ బడ్జెట్ పెట్టిన సందర్భాలున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు అదే భారీ స్థాయిలో అంటే కోట్లలో బడ్జెట్ ప్రమోషన్ కోసం వాడుతున్నాయి.

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్‌చరణ్, రామారావు, రాజమౌళిలు ఏకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని దేశమంతా తిరుగుతున్నారు. ఓ రకంగా వాళ్లు రెక్కలు కట్టుకుని తిరుగుతున్నారని చెప్పుకోవచ్చన్నమాట!

సినిమా ప్రమోషన్ విషయంలో ఒక్కో దర్శకుడిదీ ఒక్కో శైలి. తానే ఓ పబ్లిసిటీ టూల్‌గా మారిపోయే రాంగోపాల్ వర్మ నుంచి, పబ్లిసిటీ ఈవెంట్‌ను కూడా సినిమా అంత శ్రద్ధగా తీర్చిదిద్దే రాజమౌళి వరకూ…మ్యూజిక్‌నే ప్రమోషన్‌గా వాడుకునే వారు కొందరైతే, దర్శకులతో నటులను ఇంటర్వ్యూలు చేయించి విడుదల చేయడం మరో ట్రెండ్.

ఎటు చూసినా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ మాత్రమే కనిపిస్తున్న ఈ సందర్భంలో అసలు సినిమా ప్రమోషన్లు ఎలా సాగుతాయో తెలుసా?

పుష్ప షూటింగ్ స్పాట్ లో దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్

ఫొటో సోర్స్, @alluarjun/twitter

పీఆర్వో నుంచి డిజిటల్ ప్రమోషన్ హెడ్ వరకూ

ఒకప్పుడు సినిమాలకు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లేదా పీఆర్వో మాత్రమే ఉండేవారు. పబ్లిసిటీ డిజైనింగ్ బృందం ఉండేది. మనం చూసే పోస్టర్లు, వాటి డిజైన్లు, టైటిల్ డిజైనింగ్ వంటివి ఈ పబ్లిసిటీ డిజైనింగ్ విభాగం చూసేది. ఇక మీడియా వాళ్లను పిలచి ప్రెస్ మీట్లు పెట్టడం పీఆర్వో పని.

ఫలానా వారితో సినిమా తీస్తున్నామని ఒకసారి, సినిమా ప్రారంభం అయిందని ఒకసారి, షూటింగ్ జోరుగా సాగుతోందని ఒకసారి, షూటింగ్ పూర్తయిందని ఒకసారి, ఆడియో రిలీజ్ ఒకసారి, సినిమా రిలీజ్ తేదీ ఒకసారి… సినిమా బడ్జెట్‌ని బట్టి ప్రెస్ మీట్లు పెట్టడమో, మీడియాను పిలిచి విషయం చెప్పడమో చేసి, ఆ సినిమా గురించిన కవరేజ్ పత్రికలు, టీవీల్లో వచ్చేలా చూసుకునే వారు.

మధ్య మధ్యలో స్టిల్స్ పత్రికలకు వదిలే వారు. అప్పట్లో సినిమాకు అదే పెద్ద పబ్లిసిటీ. ఇదంతా పీఆర్వోల పని.

తమ బడ్జెట్‌ను బట్టి పత్రికలకు ఎప్పుడెప్పుడు యాడ్స్ ఇవ్వాలో నిర్ణయించుకునేవారు. ఇందులో నిర్మాత, పీఆర్వో ప్రధాన పాత్రధారులుగా ఉండేవారు. టీవీ చానెళ్లు పెరిగాక ఈ ట్రెండ్ కాస్త మారింది. టీవీల్లో చర్చలకు పిలవడం, ట్రైలర్‌లు టీవీల్లో వేయడం బాగా పెరిగింది.

''అప్పట్లో పత్రికల ప్రెస్ మీట్లు పెద్ద విషయం. తరువాత ఆడియో రిలీజ్ ఫంక్షన్ల టీవీ కవరేజ్. కుదిరితే ఇన్నోవేటివ్‌గా కొన్ని ఇంటర్వ్యూలు ఇప్పించేవారు. ఇవన్నీ అసిస్టెంట్లు, నిర్మాత, పీఆర్వో కలసి నిర్ణయిస్తారు. అయితే సినిమాల ప్రమోషన్లో భాగంగా భారీ ఈవెంట్లు చేయడం పూర్వమూ ఉంది కానీ అంత ఎక్కువ కాదు. ఉదాహరణకు శిరిడీసాయి సినిమా సందర్భంలో భక్తులను షిరిడీ తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో అభిమానులను పిలిపించి ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేసేవారు. అదే పెద్ద ప్రమోషన్‌లా ఉండేది'' అని ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బీబీసీతో అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

పత్రికల్లో ప్రకటనల తరువాత టీవీల జమానాలో ప్రచారం కాస్త కొత్తగా మారింది. జెమినీ టీవీలో బయోస్కోప్ వంటి కార్యక్రమంలో కొత్త సినిమాల విశేషాలు కనిపించేవి. అప్పట్లో ఈ కార్యక్రమాన్ని ఉచితంగా ప్రసారం చేసింది జెమినీ.

ఆ రోజుల్లో అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్‌గా ఉన్న జెమినీలో 24 ఫ్రేమ్స్ పేరుతో ఇంటర్వ్యూలు వచ్చేవి. వాటినే ప్రచారానికీ వాడుకునే వారు. రిలీజ్ సమయానికి ఆ ఇంటర్వ్యూలు వాడుకునేలా చూసేవారు.

''సినిమా కోసమే ఒక టీవీ ఈవెంట్ క్రియేట్ చేసి ప్రోగ్రాం చేయడం 2004లో అనుకుంటా, బొమ్మరిల్లు సినిమాకు జరిగింది. చాలామంది తల్లిదండ్రులను, వారి పిల్లలనూ కూర్చోబెట్టి, బొమ్మరిల్లు సబ్జెక్ట్ అయిన ''తండ్రితో అనుబంధం'' అనే టాపిక్ డిస్కషన్‌గా పెట్టారు. రాఖీ సినిమా విడుదల తరువాత విమెన్ ఎఛీవర్స్‌తో వి.వి.వినాయక్ ఇంటర్వ్యూ పెట్టారు. వీటిని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రమోషన్ అంటారు. అప్పట్లో అవి ఒక ట్రెండ్. ఇలాంటివి ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి'' అని ఆయన వెల్లడించారు.

వీటికి అదనంగా సినిమా ఈవెంట్లను లైవ్ ఇవ్వడం కూడా ప్రారంభం అయింది. మొదట్లో ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్లూ, తరువాత న్యూస్ చానెళ్లూ ఆ సినిమా ఈవెంట్ల లైవ్ హక్కుల కోసం పోటీ పడేవి.

పుష్ప సినిమాలో సమంతా

ఫొటో సోర్స్, @PushpaMovie/twitter

చిన్న సినిమాలకు వరం టీవీ ప్రోగ్రాములు

సొంతంగా భారీ ఖర్చుతో ప్రమోషన్ చేసుకోలేని చిన్న సినిమాలకు వివిధ చానెళ్లు నిర్వహించే కార్యక్రమాలు వరంగా మారేవి. జబర్దస్త్, క్యాష్ మొదలు బిగ్ బాస్ వరకూ అన్ని చానెళ్లలోనూ వివిధ ప్రోగ్రాములకు, ఇంటర్వ్యూలకూ సినిమా హీరో హీరోయిన్ ఇతర ముఖ్యులు గెస్టులుగా వెళ్లి తమ సినిమా గురించి మాట్లాడి ప్రమోషన్ చేసుకునేవారు.

ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు పెద్ద హీరో, హీరోయిన్లు ఇలా టీవీ స్టూడియోలకు ప్రమోషన్ల కోసం వచ్చిన సందర్భాలున్నాయి. అనుష్క ఈటీవీ క్యాష్‌లో పాల్గొనడం వంటివి ఇందులో భాగమే. దీనివల్ల టీవీ వాళ్లకూ లాభం, సినిమా వాళ్లకూ లాభంగా నడిచేది.

డిజిటల్ యుగం వచ్చాక ఈ వీడియోలలోని పార్టులను కట్ చేసి వాటినీ ప్రమోషనల్ కోసం వాడడం మొదలుపెట్టారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

డిజిటల్ యుగం

సోషల్ మీడియా, వెబ్ సైట్లు ఇవన్నీ వచ్చాక సినిమా ప్రమోషన్ రూపు రేఖలు మొత్తం మారిపోయాయి. ప్రేక్షకుల నాడి పట్టిచ్చే లెక్కలన్నీ ఎప్పటికప్పుడు కచ్చితంగా అందిస్తుంది డిజిటల్ మీడియా. అందుకే ప్రతీ సినిమాకు ఒక డిజిటల్ వ్యూహకర్తలను నియమించుకుంటున్నారు నిర్మాతలు.

దర్శకుడు, నిర్మాతతో టచ్‌లో ఉంటూ ఎప్పుడు టైటిల్ రిలీజ్ చేయాలన్న దాని దగ్గర్నుంచి ముహూర్తం ప్రకారం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం వరకూ అంతా వీరి కనుసన్నల్లో జరుగుతోంది.

ఒక రకంగా 2010 తరువాత నుంచి క్రమంగా సంప్రదాయ పీఆర్వో వ్యవస్థతో పాటూ ఆధునిక డిజిటల్ ప్రమోషన్ హెడ్ వైపు తెలుగు సినిమా టర్న్ తీసుకుంది. ఇప్పటికీ ప్రెస్ మీట్లు జరుగుతున్నా, వాటి సంఖ్య, జరిగే విధానం మొత్తం మారిపోయాయి.

టీజర్, టైటిల్ కార్డ్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, ట్రైలర్.. ఇవన్నీ ఎప్పుడు ఏ ప్లాట్ ఫామ్ మీద ఏ ఎక్కౌంట్ నుంచి వదలాలి అనేది ఈ డిజిటల్ మీడియా కన్సల్టెంట్లు డిసైడ్ చేస్తున్నారు. 2014-15 తరువాత ఈ ట్రెండ్ మరింతగా పెరిగింది.

ముఖ్యంగా తమ కంటెంట్ ప్రమోషన్ కోసం బయటి మీడియా సంస్థలపై పూర్తిగా ఆధారపడకుండా కొంత వరకూ తమ సోషల్ అకౌంట్ల నుంచే ప్రమోషన్ చేసుకునే అవకాశం వచ్చింది సినిమా వారికి. పూర్తిగా కాకపోయినా కొంత వరకూ మీడియా సంస్థలపై సినిమా వాళ్లు ఆధారపడే అవసరం సోషల్ మీడియా వల్ల తగ్గింది.

సాధారణంగా పెద్ద హీరోలు, పెద్ద దర్శకుల సినిమాపై ఒక ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తిని ఒక హాట్ టాపిక్ గా మలిచే ప్రయత్నం సాగుతుంది. ఇంటర్వ్యూలు అందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. క్రమంగా చానెళ్లు పెరిగే కొద్దీ అంతమందికి ఇంటర్వ్యూలు ఇవ్వలేక, తామే ఒక యాంకర్ ను పిలిపించి ఇంటర్వ్యూ చేసి ఆ ఫుటేజ్ అందరికీ ఇస్తున్నారు సినిమా వాళ్లు.

బాహుబలి టీమ్

ఫొటో సోర్స్, @ssrajamouli/twitter

బాహుబలి ప్రమోషన్ ఒక ట్రెండ్

బాహుబలి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దర్శకుడు రాజమౌళియే కాకుండా నిర్మాత శోభు యార్లగడ్డ గురించి కూడా చెప్పాలంటారు ఆ సినిమాకు దగ్గర నుంచి పనిచేసిన వారు.

నిజానికి ఆ సినిమా వచ్చే నాటికి రానా, ప్రభాస్, అనుష్క, రాజమౌళి - ఈ నలుగురిలో ఎవ్వరికీ హిందీ ప్రాంతంలో పెద్ద మార్కెట్ కానీ, పాపులరిటీగానీ లేవు. అయినా ఆ సినిమా హిందీలో బజ్ క్రియేట్ చేయగలగడానికి అతి పెద్ద కారణం శోభ యార్లగడ్డ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఆయన టీమ్ అనుసరించిన డిజిటల్ ప్రమోషన్ ప్లాన్ అనే చెబుతారు. కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూషన్ అదనపు బలం.

బాహుబలి క్యారెక్టర్ల పరిచయం, సినిమా అప్‌డేట్స్ వంటివి తెలుగుతో సమానంగా ఇతర భాషలు మాట్లాడే ప్రాంతంలో నిరంతరం వెళ్లాయి.

''బాహుబలికి సంబంధించిన ప్రతీ అప్డేట్ స్టాటిస్టిక్స్ తెప్పించుకునే వారు. ఫలానా ప్రాంతంలో పోస్టర్ తక్కువ మంది చూశారా? ఫలానా ప్రాంతంలో ఈ పోస్టుకు ఎక్కువ లైకులు వచ్చాయి, ఫలానా ప్రాంతంలో షేర్లు రాలేదు..ఇలా ఆయా ప్రాంతాల సెన్సిబిలిటీలు విశ్లేషించి, ఆ ప్రాంతం టార్గెట్ గా వర్క్ చేసేవారు. ఇందుకోసం చాలామంది పనిచేశారు'' అని సినిమా పరిశ్రమకు చెందిన ఒక పీఆర్వో బీబీసీతో అన్నారు.

''దేశమంతా, ప్రతీ మూలకూ బాహుబలి ప్రమోషన్ రీచ్ అయ్యే ప్రణాళిక వేశారు. నిత్యం బాహుబలి గురించిన చర్చ సోషల్ మీడియాలో ఉండేలా చూసుకున్నారు. అందుకే బాహుబలి సినిమాకు అంత క్రేజ్ ఏర్పడింది. దీని వెనుక నిర్మాత శోభు యార్లగడ్డ, ఆ సినిమా డిజిటల్ ప్రమోషన్ లో పనిచేసిన మహేశ్ కోనేరుల పాత్ర చాలా ముఖ్యం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆ తరువాత చాలా సినిమాలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తూ వచ్చాయి.

టైమ్ స్క్వేర్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ పోస్టర్

ఫొటో సోర్స్, @ssrajamouli/twitter

ఫొటో క్యాప్షన్, టైమ్ స్క్వేర్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ పోస్టర్

డైరెక్టర్ మార్క్

సాధారణంగా సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ మార్క్ ఒకప్పుడు తక్కువ ఉండేది. బాగా అభిరుచి ఉన్న వారు పోస్టర్ డిజైన్లు వంటి వాటిలో జోక్యం చేసుకునే వారు తప్ప మార్కెటింగ్ పై అంత శ్రద్ధ ఉండేది కాదు. పైగా చివరి నిమిషం వరకూ సినిమా చెక్కే పని పెట్టుకునే దర్శకులకు ఇదొక అదనపు భారంగా ఉండేది.

కానీ కాలంతో పాటూ దర్శకుల శైలీ మారింది. ప్రమోషన్ వ్యూహరచన చేసే దర్శకులూ, పూర్తిగా బాధ్యత తమ భుజాలపై వేసుకునే హీరోలు ఉన్నారు.

సినిమా ప్రమోషన్లలో చురుగ్గా కనిపించే దర్శకుడు రాజమౌళి ఆయన తన టీమ్ ప్లానింగ్ ప్రకారం వెళతారుగానీ, ఈవెంట్ల విషయంలో మాత్రం స్వయంగా శ్రద్ధ తీసుకుంటారు. తిరుపతిలో జరిగిన బాహుబలి ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

''ముంబైలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ ఈవెంట్ కోసం హీరో ఎంట్రీ షూట్ చేశాం. నేను బైక్ మీద, రాంచరణ్ గుర్రం మీద రావాలి. కానీ ముంబైలో చేసిన షూట్ అంతా అయిపోయాక రాజమౌళి సంతృప్తి చెందలేదు. ఆయనకు ఏదో ఒక లైటింగ్ నచ్చలేదు. మళ్లీ హైదరాబాద్ లో ఒక ఫ్యాక్టరీలో మొత్తం సెట్ వేసి అందర్నీ పిలిపించి రీషూట్ చేశారు'' అంటూ ఇటీవల ఆర్ఆర్ఆర్ గురించిన ఒక ఇంటర్య్వూలో ఎన్‌టీఆర్ వెల్లడించారు.

సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో రాజమౌళి ఎంత శ్రద్ధ పెడతారనేదానికి ఇదొక ఉదాహరణ.

మిగతా సినిమాలతో పోలిస్తే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో ఒక చిత్రమైన సమస్య ఎదురైంది. డిసెంబర్ చివర్లో ఆర్ఆర్ఆర్ కోసం విస్తృతంగా ప్రమోషన్ చేసేశారు. ఆ ఖర్చు కోట్లలో తేలింది. తెలుగు కంటే హిందీలో ఎక్కువ శ్రద్ధ పెట్టి మరీ చేశారు. తీరా ఒమిక్రాన్, ఆంధ్రలో థియేటర్ల గొడవతో విడుదల వాయిదా పడాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఆ సినిమాకు రెండోసారి ప్రమోషన్ చేయాల్సి వస్తోంది.

ఓ రకంగా ఆ సినిమా ప్రమోషన్ బహుశా ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ లేనంత సాగింది. ప్రత్యేక విమానంలో ఉత్తర భారతంలోని ప్రతీ నగరాన్ని రాంచరణ్, ఎన్‌టీఆర్, రాజమౌళి చుట్టేస్తున్నారు. కార్తికేయ ఈ ప్రమోషన్ మొత్తం తన చేతుల మీదుగా నడిపిస్తున్నారు.

సుమ లాంటి యాంకర్లే కాదు, సందీప్ రెడ్డి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు, రానా వంటి నటులతో ఈ ముగ్గురినీ ఇంటర్వ్యూ చేసి వదులుతున్నారు. బహుశా ఆర్ఆర్ఆర్ గురించి వచ్చిన ఇంటర్వ్యూలు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ రాలేదంటే అతిశయోక్తి కాదు.

వీడియో క్యాప్షన్, నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు ఏం జరిగింది? నిందితులు ఎవరు?

మొత్తానికి మళ్లీ రెండోసారి బజ్ క్రియేట్ చేయగలిగారు.హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్ రూ. పదివేలు పలుకుతోంది.

పబ్లిసిటీ విషయంలో మరో ప్రత్యేక దర్శకులు రాంగోపాల వర్మ. వర్మ సినిమా ప్రచారం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఎన్నుకునే సబ్జెక్టులే ఆయనకు ప్రచారం, చర్చ, రచ్చ..అన్నీ తెచ్చిపెడతాయి. ఓపిక చేసుకుని వాటి గురించి టీవీ చర్చల్లో పాల్గొని, ఇంటర్వ్యూలు ఇస్తారు. మిగతా పని అంతా మీడియా తనకు తానుగా చేసుకుపోతుంది.

చాలా తక్కువ బడ్జెట్లో సినిమా తీసే వర్మ, తన సినిమాలకు కేవలం పీఆర్వోలను మాత్రమే పెట్టుకుంటారు. డిజిటల్ ప్రమోషన్ అంటూ హడావుడి ఉండదు. ఆ బాధ్యత అంతా మీడియా చూసుకుంటుంది. వర్మ వద్దనుకున్నా మీడియా వదులుకోలేని సబ్జెక్టులే అందుకు కారణం.

వంగవీటి రంగా, పరిటాల రవి, కొండా మురళి, మియా మాల్కొవా, లెస్బియన్ లవ్ స్టోరీ..కాదేదీ వార్తకనర్హం..మీడియాలో సినిమా నానడానికి ఎంత అవసరమో అంత కంటెంట్ ఆయన విడుదల చేస్తూ పోతారు. అదే పెద్ద పబ్లిసిటీ వర్మకు.

కొన్ని సందర్భాల్లో అసలు దర్శకుడు ప్రమోషన్ కి రానివీ ఉంటాయి. పుష్ప సినిమా విడుదల తేదీ ప్రకటించే నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రమోషన్ ఈవెంట్లకు కూడా రాకుండా సినిమా చెక్కే పని పెట్టుకున్నారు సుకుమార్. మొత్తం ప్రమోషన్ అంతా అల్లు అర్జున్ చేతుల మీదుగానే సాగింది.

వివాదాస్పత సబ్జెక్టుతో వర్మ పబ్లిసిటీ సంపాదిస్తారు

ఫొటో సోర్స్, @RGVzoomin/twitter

సాంగ్స్ ప్రమోషన్

ఒకప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ సినిమాకు పెద్ద ప్రమోషన్ ఈవెంట్. ఇప్పుడు పాటలను యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో క్రమంగా వాటినే ప్రమోషన్ గా వాడుకునే ట్రెండ్ ప్రారంభమైంది.

ఈ విషయంలో అల్లు అర్జున్ సినిమాలు ఒక ట్రెండ్.. ఒకటి అల వైకుంఠపురం అయితే రెండోది పుష్ప..

''వాస్తవానికి ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో పోలిస్తే పుష్ప సినిమాకు చేసిన ప్రమోషన్ చాలా తక్కువ. కానీ ఆ సినిమా పాటలు బాగా బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా హిందీ పాటలను టీ సిరీస్‌కి ఇవ్వడం కలసి వచ్చింది. ఆ పాటలు హిందీల్యాండ్ లో చాలా హిట్ అయ్యాయి. ఏ భాష సింగర్ ఆ భాషలో చూపిస్తూ దేవిశ్రీ చేసిన వీడియో చాలా హెల్ప్ అయింది. తాను చేసిన అన్ని సినిమాల కంటే ఊ అంటావా పాటతో నార్త్ లో ఎక్కువ గుర్తింపు వచ్చిందని సమంత చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి'' అన్నారు మరొక సీనియర్ ఫిలిం జర్నలిస్ట్.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం టాలీవుడ్ హబ్‌గా మారుతుందా?

''అలవైకుంఠపురంలో సామజవరగమన పాటను మ్యూజిక్ డైరెక్టర్, సింగర్లు, తదితరులతో ప్రత్యేకంగా షూట్ చేసి, కేవలం యూట్యూబ్ విడుదల కోసమే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వదిలారు. ఆ పాట ఎంత హిట్ అయిందో చూశారు. ఆ సినిమా కోసం నెలకో పాట చొప్పున రిలీజ్ చేస్తూ వచ్చారు. అన్నీ హిట్ అయ్యాయి. అల కొన్ని నెలల పాటూ ఆ సినిమా బజ్ క్రియేట్ చేసింది. దానికి పోటీగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా అంత స్టడీ ప్రమోషన్ చేయలేదు'' అన్నారాయన.

అలవైకుంఠపురం సినిమా విడుదల ముందు ప్రత్యేకంగా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయించారు త్రివిక్రమ్. ఆయన ప్రమోషన్లలో పూర్తిగా జోక్యం చేసుకోకపోయినా తనదైన ముద్ర వేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్, తమన్, అల్లు అర్జున్

ఫొటో సోర్స్, @alluarjun/twitter

ఫొటో క్యాప్షన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, తమన్, అల్లు అర్జున్

ఇక వేర్వేరు మీమ్స్ పేజీలకు డబ్బులు ఇచ్చి సినిమా గురించి పోస్టులు పెట్టించే వారు ఉంటారు. ట్విటర్ లో కృత్రిమంగా ట్రెండ్ సృష్టించడం మామూలే. కాస్త చిన్న సినిమాలు అయితే ట్రైలర్ ను తమ యూట్యూబ్ చానెల్ తో పాటూ వివిధ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్స్ కి ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటాయి.

అందుకే ఇప్పడు సినిమా తారక మంత్రం ఏంటంటే, కంటెంట్ ఉంటే సరిపోదు, దాన్ని అమ్ముకోవడం తెలియాలి!

వీడియో క్యాప్షన్, కొత్త జేమ్స్ బాండ్ ఎవరు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)