రష్యా ఆయుధాల కొనుగోళ్ళను భారత్ ఎందుకు తగ్గించుకోలేకపోతోంది?

వాజ్‌పేయి, క్లింటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాజ్‌పేయి, క్లింటన్
    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దాదాపు 22 సంవత్సరాల కిందట, భారతదేశం, అమెరికా మధ్య స్నేహంలో కొత్త శకం ప్రారంభమైంది. 2000 సంవత్సరం మార్చి నెలలో, ఏడు రోజుల పాటు జరిగిన తొలి రౌండ్ చర్చలకు బిల్ క్లింటన్ సాక్షిగా మారారు. భారత్‌కు వచ్చినప్పుడు క్లింటన్ ‌కు ఘన స్వాగతం లభించింది.

"1998లో భారతదేశపు రెండో అణుపరీక్ష తర్వాత అధ్యక్షుడు క్లింటన్ భారత పర్యటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తొలగించింది. అప్పట్లో క్లింటన్ భారత్, పాకిస్తాన్ దేశాలను సందర్శించారు. కార్గిల్ యుద్ధం విషయంలో జోక్యం చేసుకున్నారు. ఆ సమయంలో భారత్ వైపు ఆయన మొగ్గు స్పష్టంగా కనిపించింది'' అని మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు బ్రూస్ రీడెల్ అన్నారు.

కానీ, ఇదంతా అంత సులభంగా జరగలేదు. ఎందుకంటే అమెరికా, రష్యాలు రెండింటినీ మిత్రులుగా మేనేజ్ చేయడం భారత్‌కు చాలా కష్టమైన పని. దీనికి మూలాలు ప్రచ్ఛన్న యుద్ధం కాలం దాకా ఉన్నాయి.

అప్పట్లో ప్రపంచ దేశాలు తమ వైఖరిని స్పష్టం చేయడానికి ఒత్తిడికి లోనయ్యేవి. అంటే, అవి పూర్తిగా అమెరికాతోనో లేదా రష్యాతోనో ఏదో ఒక పక్షంలో ఉండాలి. ఈ విషయంలో భారత్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేది.

22 సంవత్సరాల కిందట భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడి ప్రయత్నం కూడా తన రక్షణ ఆయుధాలకు భారతదేశాన్ని పెద్ద కొనుగోలుదారుగా మార్చడమే. కానీ దశాబ్ధాలుగా రష్యాపై ఆధారపడిన భారతదేశానికి అది అంత సులభం కాదు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌కు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న దంపతులు

అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ దిల్లీ, ముంబై, జైపూర్, హైదరాబాద్‌లను సందర్శిస్తున్న సమయంలో, భారత వైమానిక దళ పైలట్ల బృందం ఒకటి మాస్కోలో ఉంది. యుద్ధ విమానాలు నడిపేందుకు, ఆ విమానాల్లో ఉపయోగించే కొత్త టెక్నాలజీలో శిక్షణ పొందేందుకు ఈ బృందం మాస్కో వెళ్లింది. అక్కడ వారు బస చేసిన హోటల్ లిఫ్ట్‌లో ఒక భారతీయ పైలట్‌ను మేం కలిశాం.

ఆ రోజుల్లో రష్యా రాజకీయ వాతావరణం కూడా వేడిగా ఉండేది. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశానికి సన్నిహితుడిగా తనను తాను అభివర్ణించుకున్న వ్లాదిమిర్ పుతిన్ బలమైన అభ్యర్థిగా ఎదిగారు. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మారు. అదే జరిగింది.

ఈ పైలట్లు మమ్మల్ని టీ తాగడానికి ఆహ్వానించారు. సంభాషణల్లో నేను క్లింటన్ పర్యటన గురించి వారితో ప్రస్తావించాను. ''అక్కడ క్లింటన్ ఆయుధాలు అమ్మడానికి వచ్చారు. మీరు ఇక్కడ ఆయుధాలు కొనడానికి వచ్చారు'' అన్నాను నేను నవ్వుతూ.

''భారత సాయుధ దళాలు రష్యా ఆయుధాలు, రక్షణ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నాయి'' అని ఆయన సమాధానం ఇచ్చారు. ''మనకు ఆయుధాలను విక్రయించడానికి, దాని టెక్నాలజీని బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఏకైక దేశం రష్యా. ఇది కాకుండా శిక్షణ, నిర్వహణ అనేవి ఆయుధ విక్రయాలలో ముఖ్యమైన భాగం" అని ఆ పైలట్ నాతో అన్నారు.

భారత యుద్ధ విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత యుద్ధ విమానం

ఇప్పటికీ రష్యా ఆయుధాలే

క్లింటన్ భారత్‌లో పర్యటించి, పుతిన్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడిగా ఎన్నికై 22 ఏళ్లు గడిచినా నేటికీ రష్యా ఆయుధాలపై భారత్ ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. అయితే, ఇందులో అసలు సత్యాన్ని అర్ధం చేసుకోవాలంటే, అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆయుధ విక్రయదారు రష్యా అన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.

రష్యా ఆయుధాలు, రక్షణ వ్యవస్థలకు ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారు. భారత వైమానిక దళం, నేవీ, ఆర్మీకి చెందిన ఆయుధాల్లో 85 శాతం రష్యాకు చెందినవే. భారతదేశపు రక్షణ రంగ వస్తువుల దిగుమతుల్లో 60 శాతం రష్యా నుండి వస్తున్నాయి.

భారత వైమానిక దళం Il-76, ఆంటోనోవ్ ఏఎన్-32 రవాణా విమానాలు, ఎంఐ-35, ఎంఐ-17V5 తో పాటు రష్యన్ సుఖోయ్ ఎస్‌యు-30ఎంకెఐ, మిగ్ -29, మిగ్-21 యుద్ధ విమానాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇటీవల కొనుగోలు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెలీకాప్టర్లు కూడా రష్యన్ తయారీనే.

భారత సైన్యం రష్యన్ టీ72, టీ90 యుద్ధ ట్యాంకులను ఉపయోగిస్తుంది. నేవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌక అడ్మిరల్ గోర్ష్‌కోవ్ కూడా రష్యాదే.

భారతదేశ నావికాదళం ఐఎల్-38 సముద్ర నిఘా విమానం, కమోవ్ కె-31 హెలికాప్టర్లను వినియోగిస్తుంది. రష్యా నుండి లీజుకు తీసుకున్న అణు జలాంతర్గామి కూడా భారతదేశం దగ్గర ఉంది. భారత్‌కు సొంత అణు జలాంతర్గామిని నిర్మించడంలో రష్యా సహాయం చేస్తోంది.

క్లింటన్ తర్వాత, అమెరికా అధ్యక్షులందరూ భారతదేశానికి ఆయుధాలను విక్రయించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, వారి సక్సెస్ అంతంత మాత్రమే.

యుద్ధట్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుద్ధట్యాంకు

భారత్ కఠిన వైఖరి

యుక్రెయిన్‌‌పై రష్యా దాడి చేసిన తర్వాత, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరోసారి భారత్ సహాయాన్ని అందించారు.

యుక్రెయిన్‌ పై దాడికి రష్యాను ఖండించాలని భారత్‌ను అమెరికా కోరింది. అయితే, భారత్ ఆ మేరకు వ్యవహరించక పోవడంతో అమెరికా ఒత్తిడికి గురవుతోంది. రష్యాకు వ్యతిరేకంగా తీర్మానానికి ఇండియా ఐదు పర్యాయాలు గైర్హాజరైంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం మరోసారి అమెరికా ఇచ్చిన పిలుపును భారత్ పట్టించుకోలేదు.

రష్యా-యుక్రెయిన్ వివాదం దీర్ఘకాలం కొనసాగితే, దౌత్య స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు భారత్ ఒత్తిడికి గురికావడమే కాకుండా, భద్రతా స్థాయిలో కూడా ఇబ్బందులు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

భారతదేశం మధ్యస్థంగా, దీర్ఘకాలికంగా రెండు ప్రధాన ఇబ్బందులను ఎదుర్కొంటుంది: మొదటిది, రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా భారతదేశానికి ఆయుధ ఆర్డర్‌లను అందించడం రష్యాకు కష్టమవుతుంది. ఆంక్షల కారణంగా రష్యాతో డాలర్లలో వ్యాపారం చేయడం ఎలా అనేది భారత్‌కు ఉన్న రెండో సమస్య.

రష్యా, యుక్రెయిన్ రెండింటి నుండి భారత రక్షణ కొనుగోళ్లు జరిగాయి. ''యుక్రెయిన్ నుంచి వచ్చిన భారత వైమానిక దళ ఏఎన్ విమానం చాలా కీలకమైంది'' అని డిఫెన్స్ జర్నలిస్ట్ అమృతా నాయక్ అన్నారు. ఇది కాకుండా, టీ-72, టీ-90 ట్యాంకుల భాగాలు కూడా యుక్రెయిన్ నుండి వస్తాయి. అయితే ఇప్పుడు వాటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది.

పుతిన్, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుతిన్, షీ జిన్‌పింగ్

రష్యా-చైనాల స్నేహం ఇబ్బందికరమా?

2018 అక్టోబర్‌లో అప్పటి ట్రంప్ ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వచ్చినప్పటికీ ఎస్-400కు సంబంధించి ఐదు యూనిట్లను కొనుగోలుకు రష్యా-భారత్‌ల మధ్య 5 బిలియన్ డాలర్ల ( రూ. 3,82,18,75,00,000 కోట్లు) ఒప్పందం కుదిరింది. దీని మొదటి ఆర్డరు డిసెంబర్‌లో భారత్‌కు చేరింది. ఇంకా నాలుగు రావాల్సి ఉన్నాయి. మరి ఇప్పుడవన్నీ ఏమవుతాయి?

దౌత్యపరంగా చూసినా రష్యా భారతదేశానికి విశ్వసనీయమైన భాగస్వామి అని అర్ధమవుతుంది. ''తనకు శత్రుదేశమైన చైనాకు రష్యా మిత్రుడన్న విషయాన్ని భారత్ విస్మరించదు'' వాషింగ్టన్‌కు చెందిన థింక్ ట్యాంక్ యునైటెడ్ స్టేట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌ తో అనుబంధం ఉన్న సతీశ్ పునియార్ అన్నారు.

రష్యా, యుక్రెయిన్, అమెరికాలతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయి. ఈ పాత్రను పోషించడానికి, మధ్యేమార్గంగా ఎవరి పక్షానికి మద్ధతివ్వకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు భారతదేశం వాదించవచ్చు.

యుక్రెయిన్‌ పై రష్యా దాడిని ఖండించాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇటు భారత్ మధ్యవర్తిత్వం వహించాలని యుక్రెయిన్ కోరుతోంది. మరోవైపు భారత్ తనను విమర్శించలేదని రష్యా సంతృప్తి చెందుతోంది. మొత్తానికి మూడు దేశాలతో స్నేహాన్ని కొనసాగించడం భారతదేశ విదేశాంగ విధానానికి ఒక కీలకమైన పరీక్ష.

తేజస్ విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తేజస్ విమానం

ఆత్మ నిర్భరత కీలకం

రష్యా నుంచి ఆయుధాల కొనుగోలును తగ్గించేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ రక్షణ రంగంలో స్వావలంబన మాత్రమే సరైన విధానమని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, దీనికి చాలా సమయం పడుతుంది, ప్రస్తుతానికి రష్యాపై ఆధారపడాల్సి ఉంది.

"మీరు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, డెస్క్‌టాప్‌లను వాడేవారైతే , ఆపిల్ మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు నచ్చవు. ఎందుకంటే అవి చాలా ఖరీదైనవిగా కనిపిస్తాయి. భారతదేశం రష్యాపై ఆధారపడటం కూడా అటువంటిదే'' అని సతీశ్ పునియార్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఇది బొమ్మ విమానం కాదు.. నిజమైన ఫ్లైట్‌నే రెస్టారెంట్‌గా మార్చేశారు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)