మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక్క ఆయుధాన్ని కూడా కొనలేదా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత? - బీబీసీ ఫ్యాక్ట్ చెక్

ఫొటో సోర్స్, @nsitharamanoffc
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ డిస్‌ఇన్ఫర్మేషన్ యూనిట్
భారతదేశ రక్షణశాఖ చరిత్రలో 2014 సంవత్సరానికి ముందు పదేళ్ల కాలంలో సాయుధ దళాల కోసం ఒక్క ఆయుధాన్ని కూడా కొనలేదని, తద్వారా భారత సైన్యాన్ని అప్పటి ప్రభుత్వం నిస్సహాయంగా మార్చిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా, మార్చి 21, 2022న మంత్రి ఈ ప్రకటన చేశారు. ఆర్ధిక మంత్రి కాక ముందు నిర్మలా సీతారామన్ రక్షణమంత్రిగా పని చేశారు. 47 నిమిషాలపాటు మంత్రి చేసిన ఈ ప్రసంగం సంసద్ టీవీలో ప్రసారమైంది. మంత్రి కార్యాలయం ఆ వీడియోను ట్వీట్ ద్వారా షేర్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆయుధాల కొనుగోలు వ్యవహారం ఆమె మాటల్లోనే:
''పదేళ్ల భారత రక్షణ రంగ చరిత్రలో ఒక్క ఆయుధాన్ని కూడా కొనలేదు. పదేళ్లు అలా ఒక్క ఆయుధం కూడా కొనకుండా గడిచి పోయాయి. అందుకే, 2014 తర్వాత పిన్నుల నుంచి విమానాల వరకు చాలా కొనుగోళ్లు వేగంగా చేయాల్సి వచ్చింది. మన సైన్యాన్ని ఎలా బలహీన పరిచారో చెప్పే ఆధారాలను మళ్లీ మళ్లీ చదువుతాను. ఏదీ రాత్రికి రాత్రే మారిపోదు. పాత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మేం సరిచేస్తున్నాం. (మరో ప్రశ్నకు సమాధానమిస్తూ) పదేళ్ల పాటు ఏమీ కొనకుండా ఉండటం చిన్న విషయం కాదు. దాన్ని అంగీకరించాలి. పదేళ్లలో కొనాల్సిన వాటిని ఏడేళ్లలో కొనాల్సి వచ్చింది. దీనికి మీరు మమ్మల్ని అభినందించాలి'' అన్నారు నిర్మలా సీతారామన్.
దివంగత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ ఆడిట్ నివేదికల ఆధారంగా తాను ఈ విషయాలు చెబుతున్నాని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. ఆ పదేళ్ల కాలంలో ఎలాంటి కొనుగోళ్లు లేకపోవడం వల్ల సైన్యం నిస్సహాయంగా మారిందని మంత్రి అన్నారు.

ఫొటో సోర్స్, INDIAN AIR FORCE
ఈ వాదనలో వాస్తవమెంత?
అయితే, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సంపాదించిన పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే, మంత్రి వాదనకు భిన్నంగా కొన్ని రక్షణ కొనుగోళ్లు జరిగినట్లు తేలింది. ఇందులో షిప్‌లు, సబ్‌మెరైన్‌లు, మిస్సైళ్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా ఉన్నట్లు స్పష్టమైంది.
రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు అందించిన నివేదికలు, వార్షిక రిపోర్టు (మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి)లను బీబీసీ పరిశీలించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ నివేదికల ప్రకారం కొన్ని కొనుగోళ్లు జరిగినట్లు తేలింది. అవి:
- 2005-అక్టోబర్ 2005లో 'ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ (ToT) కింద ముంబైలోని మజ్‌గాం డాక్ లిమిటెడ్ (ఎండీఎల్ ) వద్ద ఆరు ఫ్రెంచ్ స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్ లను స్వదేశంలో తయారు చేసేందుకు ఒప్పందాలు జరిగాయి. ఈ ఆరు జలాంతర్గాములలో ఐదవది ప్రస్తుతం సీ ట్రయల్స్ ను ప్రారంభించింది. త్వరలోనే అది భారత నౌకాదళం లో చేరే అవకాశం ఉంది.
- 2006- హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య 2006 మార్చిలో రూ.2701.7 కోట్ల విలువైన ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 20 లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజాస్ విమానాలను భారత వాయు సేనకు అందిస్తుంది.
- 2007- అలాగే 30 సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
- 2008- సి130జె హెర్క్యూల్స్ ఎయిర్ క్రాఫ్ట్‌లను కొనేందుకు అమెరికా ప్రభుత్వం నుంచి ఆఫర్ లెటర్‌ను, ఆమోదాన్ని సంపాదించింది. ఈ ఒప్పందం విలువ రూ. 3,835.38 కోట్లు.
- 2009-బోయింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఎనిమిది పి-81 లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్‌లను కొనేందుకు 2009 జనవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి నౌకాదళం కోసం ఉద్దేశించినవి. దీని విలువ సుమారు రూ.16 వేల కోట్లు. ఈ విషయం 2009లో భారత రక్షణశాఖ ప్రకటించింది.
- 2009- రక్షణ శాఖ వార్షిక నివేదికలో 2009-10 సంవత్సరానికి గాను బ్రహ్మోస్ క్షిపణులకు కొనుగోలు కాంట్రాక్టు ప్రస్తావన ఉంది.
- 2009- ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 వీ5 హెలీకాప్టర్ల కోసం రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు 2009-10 నాటి రక్షణ మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
- రక్షణ ఆయుధాల దేశీయ తయారీ గురించి ప్రస్తావిస్తూ, భారత్ ఎలాక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్ ) రెండు స్క్వాడ్రన్‌ల ఆకాశ్ క్షిపణుల సరఫరా కోసం ఆర్డర్ పొందిందని అదే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని విలువ సుమారు రూ.1222 కోట్లు. ఈ తరహా రక్షణ ఆయుధాలలో దేశీయ ఉత్పత్తి కోసం జరిగిన తొలి ఒప్పందం ఇది.
ఫిబ్రవరి 2014లో, అంటే యూపీఏ ప్రభుత్వపు చివరి నెలల్లో తాము రక్షణ రంగ ఆయుధాల కోసం చేసిన ఖర్చును ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. 2010-11లో రూ. 62,056 కోట్లు ఖర్చు చేయగా, 2012-13 నాటికి ఆ వ్యయం రూ.70,499.12 కోట్లకు చేరుకుందని వెల్లడించింది.
దీనిని బట్టి యూపీఏ పాలన పదేళ్లలో ఎలాంటి ఆయుధ కొనుగోళ్లు జరగలేదంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి పార్లమెంటులో పదేపదే చెప్పింది నిజం కాదని తేలింది.

ఇవి కూడా చదవండి:
- ఇకపై సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్, తెలుగు విద్యార్థులకు లాభమా నష్టమా?
- పాకిస్తాన్‌లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
- ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు పెట్టొచ్చా.. ఎవరి అనుమతి తీసుకోవాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
- లక్ష్య సేన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓడిన భారత షట్లర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













