యుక్రెయిన్: భారీ రష్యా సైన్యాన్ని ఓ చిన్న పట్టణం ఎలా ఓడించి వెనక్కు తరిమింది?

వోజ్నెసెన్స్క్ సైనికులు
    • రచయిత, ఆండ్రూ హార్డింగ్
    • హోదా, బీబీసీ న్యూస్, వోజ్నెసెన్స్క్

ఈ యుద్ధంలో ఇప్పటివరకూ అత్యంత నిర్ణయాత్మక పోరాటాలుగా నిలిచిన వాటిల్లో వోజ్నెసెన్స్క్ పోరాటం ఒకటి. ఈ వ్యవసాయ పట్టణం మీద, ఈ పట్టణంలోని వ్యూహాత్మక వంతెన మీద పట్టు కోసం రెండు రోజుల పాటు భీకర పోరాటం సాగింది.

ఈ పోరాటంలో రష్యా గెలిచినట్లయితే.. వారి సైనిక బలగాలు పశ్చిమ దిశగా నల్ల సముద్ర తీరం వెంట ఒడెసా రేవు నగరం దిశగా దూసుకెళ్లకలిగేవి. ఒడెసా రేవు యుక్రెయిన్‌లో అతి పెద్ద రేవు. అక్కడ ఒక భారీ అణువిద్యుత్ ప్లాంటు కూడా ఉంది.

కానీ.. యుక్రెయిన్ సైనికులు, స్థానిక వలంటీర్ల సేన మద్దతుతో రష్యా ప్రణాళికలను తుత్తునియలు చేశారు. మొదట వ్యూహాత్మక వంతెనను పేల్చేశారు. ఆపైన దండెత్తి వచ్చిన రష్యా సైన్యాన్ని 100 కిలోమీటర్లు వెనక్కు తరిమారు.

''మేం అదెలా చేశామనేది వివరించటం కష్టం. స్థానిక ప్రజలు, యుక్రెయిన్ సైన్యం పోరాట స్ఫూర్తి ఈ విజయానికి కారణం'' అని చెప్పారు మేయర్ యెవ్హెనీ వెలిచ్కో.

ఆయన వయసు 32 సంవత్సరాలు. సైనిక దుస్తులు ధరించి, టౌన్ హాల్ వెలుపల తన బాడీగార్డులతో కలిసి నిలుచుని ఉన్నారాయన.

వోజ్నెసెన్స్క్ వంతెన
ఫొటో క్యాప్షన్, రష్యా సైన్యం నది దాటకుండా అడ్డుకోవటానికి వోజ్నెసెన్స్క్‌లోని వ్యూహాత్మక వంతెనను కూల్చివేశారు

ఈ పోరాటం జరిగి దాదాపు మూడు వారాలైంది. కానీ ప్రమాదం తొలగిపోలేదని ఆయన హెచ్చరిస్తున్నారు. రష్యా బలగాలు మరోసారి దాడిచేస్తాయని.. వారిని రెండోసారి నిలువరించటానికి పట్టణంలోని సైనికులు, వలంటీర్ల వద్ద తగినన్ని ఆయుధాలు లేవని చెప్తున్నారు.

''ఇది చాలా వ్యూహాత్మక ప్రాంతం. మేం ఈ పట్టణాన్ని మాత్రమే కాదు.. దీని వెనుక ఉన్న భూభాగాన్నంతటినీ రక్షిస్తున్నాం. మా శత్రువు దగ్గరున్నటువంటి భారీ ఆయుధాలు మాకు లేవు'' అని మేయర్ పేర్కొన్నారు.

యుక్రెయిన్‌లో చాలా పోరాట రంగాల్లో లాగానే వోజ్నెసెన్స్క్‌లో కూడా.. రష్యా ఆయుధ బలాన్ని తిప్పికొట్టటంలో బ్రిటన్ సరఫరా చేసిన యాంటీ-ట్యాంక్ మిస్సైళ్లు కీలక పాత్ర పోషించాయి. దాదాపు 30 ట్యాంకులు, సైనిక వాహనాల శిథిలాలతో పాటు ఒక హెలికాప్టర్ కూడా ఈ పట్టణంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

''ఈ ఆయుధాల సాయంతోనే మేమిక్కడ మా శత్రువును ఓడించగలిగాం. మాకు మద్దతిచ్చినందుకు మా మిత్రులకు మేం కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ మాకు మరిన్ని ఆయుధాలు కావాలి. శత్రు సైన్యాలు వస్తూనే ఉంటాయి'' అన్నారు వెలిచ్కో.

దక్షిణ యుక్రెయిన్ మ్యాప్

రష్యా బలగాలు దక్షిణాన సదరన్ బూ నది మీద ఉన్న మరో పెద్ద వంతెనను చేజిక్కించుకోవటంలోనూ విఫలమయ్యాక.. వోజ్నెసెన్స్క్‌ వ్యూహాత్మక ప్రాధాన్యత ఎంత అన్నది స్పష్టమైంది.

ఇప్పుడు వోజ్నెసెన్స్క్‌లో గగనతల దాడుల సైరన్లు పెద్దగా మోగటం లేదు. ఆ భయాందోళనలూ పెద్దగా లేవు. కానీ ఇటీవల కొన్ని వారాల్లో వేలాది మంది రైలు, రోడ్డు మార్గాల్లో పట్టణం విడిచి వెళ్లారు.

ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్న వారిలో చాలా మంది తమ అద్భుత విజయం గురించి ఆసక్తిగా చెప్తున్నారు.

వోజ్నెసెన్స్క్ మేయర్
ఫొటో క్యాప్షన్, వోజ్నెసెన్స్క్ మేయర్ యెవ్హెనీ వెలిచ్కో ఊరంతా కలిసి పట్టణాన్ని రక్షించుకుందని బీబీసీ ప్రతినిధితో చెప్పారు

''ఊరి వారంతా ఉమ్మడిగా పని చేశారు'' అని స్థానిక దుకాణదారు అలెగ్జాండర్ చెప్పారు. యుద్ధ రంగంలో ఒక ఏకే47 తుపాకీతో ఫొటో తీసుకున్నారాయన. మరొక వలంటీర్ రష్యా సైన్యం ఉన్న ప్రాంతాల మీదకు రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రెనేడ్‌ను పేల్చారు.

''ఏవైపు చూడాలి, ఎక్కడి నుంచి దాడి జరుగుతోంది అనేది రష్యన్లకు తెలీలేదు. మా ఊరి జనం ఈ రకంగా కలిసికట్టుగా పనిచేయటం ఇంతకుముందు నేనెప్పుడూ చూడలేదు'' అని తెలిపారు అలెగ్జాండర్.

రష్యా సైన్యం తొలి దాడి చేసిన కొన్ని గంటల్లోనే యుక్రెయిన్ బలగాలు కూల్చివేసిన వంతెన దగ్గర ఆయన నిలుచుని పోరాటం తీరుతెన్నులను వివరించారు.

''మేం వేటకు వాడే రైఫిళ్లను ఉపయోగించాం. జనం ఇటుకలు, జార్లు విసిరారు. వృద్ధ మహిళలు భారీ ఇసుక సంచులను నింపారు'' అని చెప్పారు.

వోజ్నెసెన్స్క్‌ మ్యాప్

వోజ్నెసెన్స్క్‌ దక్షిణ శివార్లలోని రాకోవి గ్రామంలో నివసిస్తున్నారు 59 ఏళ్ల స్వెత్లానా నికోలాయేవ్నా. ఆమె తోటలో రష్యా ట్యాంకు నడిచిన గుర్తులు ఇంకా అలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా భీకర పోరాటం జరిగింది.

రక్తసిక్తమైన బ్యాండేజీలు, రష్యా ఆహార పొట్లాలు అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి.

స్వెత్లానా తన భర్త పనిముట్ల షెడ్డును చూపారు. రష్యా సైనికులు బంధించిన ఇద్దరు యుక్రెయిన్ సైనికులను ఆ షెడ్డులో నిర్బంధించారని.. తమ వాళ్లు ఉధృతంగా పోరాడి ఆ ఇద్దరు సైనికులను రష్యా సైన్యం చంపకుండా కాపాడారని వివరించారు.

ఆమె కాటేజీ పూర్తిగా దెబ్బతిన్నది.

''మా ఇంటి తలుపు మీద రక్తపు మరకలు చూడండి'' అని పిలిచారామె. ఆమె, ఆమె కుటుంబం సమీపంలోని సెల్లార్‌లో తలదాచుకోగా.. ఆమె ఇంటిని రష్యా సైన్యం తాత్కాలిక ఆస్పత్రిగా ఉపయోగించుకుంది.

స్వెత్లానా నికోలాయేవ్నా
ఫొటో క్యాప్షన్, రష్యా సైనికులు హడావుడిగా అన్నీ వదిలేసి పారిపోయారని స్వెత్లానా నికోలాయేవ్నా చెప్పారు

''రెండో రోజు కొన్ని దుస్తులు తెచ్చుకుందామని నేను వెనక్కి వచ్చాను. ఇక్కడ మొత్తం తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న జనం ఉన్నారు. పది మంది ఉంటారనుకుంటా. ఇక్కడి రక్తపు మరకలు చాలావరకూ నేను శుభ్రం చేశాను'' అని చెప్పారు.

''ఓ రోజు రాత్రి వాళ్లు హడావుడిగా వెళ్లిపోయారు. బూట్లు, సాక్సులు, శరీర రక్షణ కవచాలు, హెల్మెట్లు అన్నీ వదిలేసి వెళ్లారు. చనిపోయిన వారిని, గాయపడ్డ వారిని వాహనాల్లో ఎక్కించుకుని పారిపోయారు'' అని వివరించారు.

స్థానిక అంత్యక్రియల విభాగం డైరెక్టర్ మైఖేలో సొకురెన్కో.. పొలాలన్నీ గాలించి, మరింత మంది రష్యా సైనికుల మృతదేహాలను వెదికి తెచ్చి ఒక రైలు పెట్టెలోకి ఎక్కించారు.

''వాళ్లను నేను మనుషులుగా భావించటం లేదు. కానీ వాళ్లని అలా పొలంలో వదిలేస్తే.. వాళ్లు చనిపోయాక కూడా జనాన్ని భయపెడతారు'' అన్నారాయన.

''ఈ రష్యన్లకు మతి చెడింది. కాబట్టి మేం కాపలా కాస్తూ ఉండాలి. మేం గెలుస్తాం. రష్యన్లను మా నేల నుంచి తరిమికొడతాం'' అని ధీమా వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)