మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్‌ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జూలియా గ్రాంచి
- హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్
మెన్స్ట్రువల్ కప్ నమూనా తొలిసారి 1930లలో కనిపించింది. అమెరికన్ నటి లియోనా చామర్స్ 1937లో మెన్స్ట్రువల్ కప్ పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు.
అయితే, ఇటీవలి కాలంలో ఈ మెన్స్ట్రువల్ కప్ మరిన్ని రూపాలు సంతరించుకుని ఆధునికంగా తయారయింది.
సిలికాన్, రబ్బర్, లేటెక్స్ తో తయారు చేసే ఈ చిన్న కప్ నెమ్మదిగా శానిటరీ ప్యాడ్స్ స్థానాన్ని ఆక్రమిస్తోంది.
శానిటరీ ప్యాడ్ అయితే ఒక్కసారి మాత్రమే వాడగలరు. మెన్స్ట్రువల్ కప్‌ను మాత్రం అనేక పర్యాయాలు వాడొచ్చు.
ఈ కప్‌ను సాగే గుణం ఉన్న పదార్ధాలతో తయారు చేస్తారు. దీంతో, జననాంగం లోపల అమర్చిన తర్వాత మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగదు.
మెన్స్ట్రువల్ కప్ గురించి మరింత సమాచారాన్ని సావ్ పాలో కు చెందిన గైనకాలజిస్ట్ అలెగ్జాన్డరే పూపో వివరించారు.
"మెన్స్ట్రువల్ కప్ వాడే మహిళలు బికినీ, లెగ్గింగ్స్ నుంచి ఇది బయటకు కనిపించదని చెబుతారు. టాంపూన్ల తరహాలో ఉండదు" అని పూపో చెప్పారు.
ఈ కప్స్ రకరకాల సైజుల్లో లభిస్తాయి. ఇది 4 నుంచి 6 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. చుట్టుకొలత 3 నుంచి 5 సెంటీమీటర్ల ఉంటుంది. ఎక్కువ రక్తస్రావం అయ్యే వారికి పెద్ద సైజు కప్స్ అవసరముంటుంది.
ఈ మెన్స్ట్రువల్ కప్ వాడకం పూర్తిగా సురక్షితం మాత్రమే కాకుండా ఒక కప్ 10 సంవత్సరాల పాటు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
మెన్స్ట్రువల్ కప్‌కు సంబంధించిన ఐదు ప్రశ్నలు, సమాధానాలు ఇక్కడ అందిస్తున్నాం.

1. మెన్స్ట్రువల్ కప్‌ను యోనిలో ఎలా పెట్టాలి?
మెన్స్ట్రువల్ కప్ ను యోనిలో పెట్టుకోవడానికి ముందు దానిని రెండు లేదా మూడు భాగాలుగా మడతపెట్టాలి. అప్పుడు దానిని యోనిలోకి ప్రవేశపెట్టేందుకు వీలవుతుంది. ఈ కప్‌ను ఎలా అయినా మడతపెట్టుకోవచ్చు.
"టాయిలెట్ బెడ్ పై కూర్చుని కాళ్ళు వెడల్పుగా పెట్టి, మోకాళ్ళను కాస్త వంచి మెన్స్ట్రువల్ కప్‌ను యోనిలోకి పెట్టుకోవచ్చు. యోని పొడిబారి ఉన్నవారికి దీనిని పెట్టడం కాస్త కష్టం కావచ్చు. కానీ, లూబ్రికంట్లను వాడి మెన్స్ట్రువల్ కప్‌ను పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మొదటిసారి వాడేటప్పుడు వీటి అవసరం రావచ్చు" అని గాబ్రియెల్లా గిల్లినా అనే గైనకాలజిస్ట్ చెప్పారు.
"ఆ తర్వాత నెమ్మదిగా బయటకు తీయవచ్చు. జననాంగాన్ని రిలీజ్ చేసి కప్ బయటకు తీయవచ్చు."
"దీనిని వేళ్ళ సహాయంతో యోని లోపలకు పెట్టవచ్చు. ఇది టాంపూన్ల మాదిరిగా ఉండదు. ఇది రక్తాన్ని సేకరిస్తుంది".
"ఒకసారి యోనిలో కప్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇది యోని గోడలకు అతుక్కుని ఉండిపోతుంది. దానిని తెరిచి ఉంచేందుకు కప్ పక్కన ఉండే ఎలాస్టిక్ బ్యాండును కాస్త బిగించవచ్చు. ఇది లోపల వ్యాకోచించి గోడలకు అతుక్కుంటుంది" అని పూపో వివరించారు.
ఒక సారి కప్ పెట్టుకున్న తర్వాత 12 గంటల వరకు ఉంచుకోవచ్చు. అయితే, అధిక రక్తస్రావం అయ్యే వారు మాత్రం ప్రతి 4 - 6 గంటలకొకసారి చూసుకోవల్సి ఉంటుంది.
చిన్న సైజులో ఉండే కప్ వల్ల యోని లోపల దానిని కనిపెట్టడం సులభంగా ఉంటుంది. అయితే, దీని వల్ల కూడా కొన్ని సమస్యలున్నాయి.
ఒక రాడ్‌తో దీనిని తొలగించాలంటే చాలా ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది. అందుకే వేలిని వాడటమే ఉత్తమం అని చెబుతారు.
స్నానం చేస్తున్నప్పుడు దీనిని తొలగించడం సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్ పై కూర్చుని కూడా దీనిని తొలగించడం సురక్షితమే.
"దీనిని మొదటిసారి వాడుతున్నప్పుడు కాస్త అసౌకర్యంగా ఉంటుంది" అని గలీనా చెప్పారు.
దీనిని అలవాటు పడేందుకు ఒక రెండు మూడు సార్లు పడుతుందని ఆమె అన్నారు. దీనిని పరీక్షించేందుకు నెలసరి లేనప్పుడు ప్రయోగించి చూడాలని ఆమె సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
2. మెన్స్ట్రువల్ కప్ శుభ్రం చేయడం ఎలా?
మొదటి సారి మెన్స్ట్రువల్ కప్‌ను వాడే ముందు కప్‌ను వేడి నీటిలో ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. దీంతో ఇది వాడేందుకు సురక్షితంగా తయారవుతుంది. దీని కోసం కొన్ని బ్రాండులు ప్రత్యేక పాత్రలను కూడా అమ్ముతున్నారు.
దీనిని నెలసరి సమయంలో మాత్రం తరచుగా నీరు, సబ్బు వాడి శుభ్రం చేస్తూ ఉండాలి.
నెలసరి ముగిసిన తర్వాత వేడి నీటిలో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవచ్చు.
దీనిని వాడటం లేనప్పుడు ఒక సంచిలో పెట్టి భద్రపరుచుకోవచ్చు. తిరిగి నెలసరి మొదలైనప్పుడు వేడినీటిలో ఒక సారి శుభ్రం చేసి వాడుకోవాలి.

ఫొటో సోర్స్, Esebene / Getty Images
3. దీని వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందా?
మెన్స్ట్రువల్ కప్స్‌ను శానిటైజ్ చేస్తే వాడేందుకు సురక్షితంగా మారతాయి. కానీ, వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది.
జననాంగంలోకి సూక్ష్మజీవులు చేరితే అది ప్రమాదకరంగా మారొచ్చు. దీని వల్ల కాండీడైయాసిస్, వాజినోసిస్ అనే సమస్య వచ్చే అవకాశముంది. కండోమ్స్ అంటే పడని మహిళలు లేటెక్స్ రహిత కప్‌లను వాడుకోవచ్చు.
4. ఏమి చేయవచ్చు? ఏమి చేయకూడదు?
మెన్స్ట్రువల్ కప్ ఉన్నప్పుడు కూడా మూత్రవిసర్జనకు వెళ్ళవచ్చు. కానీ, దీని వల్ల ఒత్తిడి కలిగిందంటే, ఈ కప్ యోనిలో మరింత లోపలకు పెట్టాల్సి ఉంటుందని అర్ధం.
గర్భనిరోధక సాధనాలు వాడే మహిళలు కూడా మెన్స్ట్రువల్ కప్ ను వాడవచ్చు.
ఈ రెండిటి స్థానాలు వేర్వేరు. గర్భనిరోధక సాధనాన్ని గర్భసంచి లోపల పెడితే, మెన్స్ట్రువల్ కప్‌ను జననాంగాల్లో పెడతారు.
సెక్స్ జరిగే సమయంలో మాత్రం దీనిని జననాంగం నుంచి తొలగించాలి.
సెక్స్‌లో ఎన్నడూ పాల్గొనని మహిళలకు మృదువుగా ఉండే కప్ ఉంటుంది.
దీని గురించి ఎక్కువగా చర్చించకపోవడం వల్ల చాలా మందికి దీని గురించి తెలియదని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
5. లాభాలు, నష్టాలు ఏంటి?
డాక్టర్లు మెన్స్ట్రువల్ కప్‌ను ఒక శాశ్వతత్వం ఉన్న వస్తువుగా చూస్తారు.
ఒక మహిళ జీవితంలో సగటున 450 సార్లు నెలసరి వస్తుంది.
అంటే, ఒక మహిళ తన జీవితకాలంలోసుమారు 7200 శానిటరీ ప్యాడ్స్‌ను వాడాల్సి ఉంటుంది. అయితే, మెన్స్ట్రువల్ కప్ 3-10 సంవత్సరాల పాటు ఉంటుంది.
ఇందులో ఉండే వ్యాక్యూమ్ వల్ల రక్తస్రావం బయటకు రాకుండా ఉంటుంది. దీని వల్ల లోదుస్తులు వాసన రాకుండా ఉంటాయి.
దీనిని వాడే మహిళలందరికీ ప్రయోజనాలే ఉంటాయని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. దీని వల్ల కొన్ని నష్టాలను కూడా ఎదుర్కోవలసి రావచ్చని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- గవర్నర్‌కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏంటి? ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఏంటి?
- రిషి సునక్: భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని అవుతారా? భారత్‌లో పన్నులు చెల్లించే భార్య కారణంగా మంత్రి పదవి కూడా పోగొట్టుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















