థైరాయిడ్: మహిళల మూడ్స్ చిందరవందర చేసే హార్మోన్ ఇంబాలెన్స్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీషియా హెర్నాండెజ్
- హోదా, బీబీసీ న్యూస్
నా భర్తతో కలిసి నిద్రపోవాలని ఉంటుంది. కానీ, నాకు లైంగిక ఆసక్తి ఉండదు. నాకు పొద్దున్నే లేచి చాలా పనులు చేసుకోవాలని ఉంటుంది. కానీ, మెదడు మొద్దుబారడం వల్ల ఏ పనీ చేయాలనిపించదు. గతంలో ఇలా ఉండేదాన్ని కాదు. నాకు ప్రశాంతంగా ఉండాలని ఉంటుంది. కానీ, ఎదురుగా ఉన్న వారి పై అరవడమో, కాలితో తన్నడమో, కోపం చూపించడమో చేస్తూ ఉంటాను.
నాకు బరువు తగ్గాలని ఉంటుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. ఎంత ప్రయత్నించినా కుదరదు. నాకు సంతోషంగా ఉండాలని ఉంటుంది. కానీ, నా శక్తిని, సంతోషాన్ని ఎవరో లాగేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ రకరకాల భావోద్వేగాలు, లక్షణాల ఊగిసలాట నుంచి బయటపడాలని ఉంది.
చిలీ, స్పెయిన్, క్రోషియాకు చెందిన ముగ్గురు మహిళలు లారా, ఐరీన్, లోరెటా కొన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలివి. అయితే, సమస్య ఏంటో తెలుసుకోవడానికి వారికి చాలా రోజులు పట్టింది.
"నాకు 17 సంవత్సరాలున్నప్పుడు విచిత్రమైన లక్షణాలు కనపడటం మొదలయింది. తల తిరుగుతూ, చెవుల్లో ప్రతిధ్వని వినిపిస్తూ ఉండేది. చాలా చికాకుగా ఉండేది. మొదట్లో ఎపిలెప్సీ అనుకున్నాం. ఒక ఆరు నెలల తర్వాత నాకు థైరాయిడ్ ఉందని వైద్య పరీక్షల్లో తేలింది" అని లోరెటా చెప్పారు.
ఐరీన్‌కు 2009లో కడుపునొప్పితో సమస్య మొదలయింది. ఎండోస్కోపీ, గ్యాస్ట్రోస్కోపీ, కొలొనోస్కోపీలు చేసిన తర్వాత ఆమెకేమి జబ్బు లేదని డాక్టర్లు తేల్చారు. లేని జబ్బును నటిస్తున్నారని ఒక డాక్టర్ అన్నట్లు ఆమె చెప్పారు. ఆమెకు థైరాయిడ్ అని తెలియడానికి పదేళ్లు పట్టింది.
వెనిజ్వులా ప్రజలు మాంసం, వెన్న, చీజ్‌తో చేసే ఆరేపా అనే వంటకం ఎక్కువగా తినడం వల్ల లారా లావుగా ఉండటానికి కారణమని ఒక డాక్టర్ అన్నారు. ఆమె హార్మోన్ల సమస్య రాకుండా చికిత్స తీసుకోవడం కోసం 7- 8 మంది డాక్టర్లను సంప్రదించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంధి
థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారాన్ని పోలి ఉంటుంది. శరీరం శక్తిని వినియోగించుకునేందుకు, వెచ్చగా ఉండేందుకు, మెదడు, గుండె, కండరాలు, ఇతర అవయవాలు సక్రమంగా పని చేసేందుకు అవసరమైన హార్మోన్లను ఈ గ్రంధి ఉత్పత్తి చేస్తుంది.
"ఈ గ్రంధి శరీరానికి బ్యాటరీలా పని చేస్తుంది. ఈ గ్రంధి తక్కువగా, లేదా ఎక్కువగా పని చేయడం మొదలుపెడితే, థైరాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి" అని ఎండోక్రైనాలజిస్ట్ పలోమా గిల్ బీబీసీకి చెప్పారు.
థైరాయిడ్ గ్రంథి అవసరమైనంత మేర పని చేయకపోతే హైపోథైరాయిడ్ అంటారు. బ్యాటరీ అయిపోయిన బొమ్మ తరహాలో శరీరం పని చేస్తుంది. చాలా త్వరగా అలిసిపోతూ ఉంటారు. థైరాయిడ్ గ్రంథి అధికంగా పని చేయడం మొదలుపెడితే, హైపర్ థైరాయిడిజం వస్తుంది. వీరి పరిస్థితి కెఫీన్ అదనపు డోసు తీసుకున్నప్పటి మాదిరిగా ఉంటుంది.
హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెంటిలోనూ జుట్టు రాలిపోవడం, నీరసం, అకస్మాత్తుగా మూడ్ మారడం, బరువు తగ్గడం, లేదా పెరగడం, నెలసరిలో మార్పులు, చర్మ సమస్యలు, మతిమరుపు, మెంటల్ ఫాగ్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
"ఈ వ్యాధిలో ప్రత్యేకంగా అనారోగ్య లక్షణాలు వుండకపోవడమే సమస్య" అని స్పానిష్ సొసైటీ ఆఫ్ ఎండోక్రైనాలజీ డాక్టర్ ఫ్రాన్సిస్కో జేవియర్ శాంటామేరియా చెప్పారు. ఉదాహరణకు హైపోథైరాయిడిజంను తీవ్రమైన మానసిక ఒత్తిడి అని పొరపాటు పడే ప్రమాదం ఉంది.
జనాభాలో చాలా మందికి హైపో థైరాయిడిజం ఉంటుంది. చాలా మంది దీనికి చికిత్స తీసుకోవడం కూడా ఆలస్యమవుతుంది. జనాభాలో 10% మంది హైపో థైరాయిడిజంతో బాధపడుతుంటే, అందులో సగం మందికి వ్యాధి ఉన్నట్లే తెలియదు. ఇదెక్కువగా మహిళలకు వస్తూ ఉంటుంది. 80% మంది మహిళలు థైరాయిడ్‌తో బాధపడుతూ ఉంటారు" అని డాక్టర్ శాంటామేరియా అన్నారు.
థైరాయిడ్ చికిత్సకు సాధారణంగా లివోథైరాక్సిన్ ఇస్తారు.
"థైరాయిడ్ చికిత్స తీసుకున్న తర్వాత హార్మోన్లు సక్రమంగా పని చేయడం మొదలుపెడితే, సాధారణ జీవితం గడపొచ్చు" అని శాంటామేరియా అన్నారు. అయితే, లోరెటో, ఐరీన్, లారా విషయంలో చికిత్స తీసుకోగానే థైరాయిడ్ లక్షణాలు మాత్రం పూర్తిగా పోలేదు.
"కొన్ని సార్లు నేను బాగా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటాను. ప్రతీ చిన్న పనికి అలిసిపోతూ ఉంటాను. ప్రస్తుతం ఉన్న జీవన విధానానికి ఈ వ్యాధి కూడా తోడైతే బ్రతుకు చాలా కష్టంగా ఉంటుంది" అని లోరెటా అంటున్నారు.
"ఒక్కొక్కసారి మంచం మీద పడుకునే పని చేస్తూ ఉంటాను. ఒత్తిడి లేకుండా వీలైనంత మెరుగ్గా పని చేయాలని చూస్తాను. కానీ, ప్రతి సారి 100% తప్పులు లేకుండా పని చేయడం కుదరదు" అని ఐరీన్ అంటారు. .
లోరెటా ఆరోగ్య పరిస్థితి మాత్రం క్షీణిస్తోందని చెప్పారు. ఆమెకు నాడ్యూల్స్ ఉండటంతో, థైరాయిడ్ గ్రంథిని తొలగించాలేమో అని భావిస్తున్నారు.
"ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోవడం, ఒక సంభాషణను కొనసాగించలేకపోవడం లాంటివి థైరాయిడ్ వల్లే జరుగుతున్నాయని ఒక డాక్టర్ చెప్పారు. నేనిలా ఉండేదానిని కాదు. ఇది నేను కాదు. థైరాయిడ్ వల్లే ఇలా ఉంటున్నానని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను" అని అన్నారు.
"సాధారణంగా 80% నుంచి 90% మంది థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు చికిత్స తర్వాత తగ్గిపోతుంది. కానీ, కొంత మందికి మాత్రం పూర్తిగా తగ్గదు" అని డాక్టర్ శాంటామేరియా చెప్పారు.
"కొన్ని కేసులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. చాలా వరకు హైపో థైరాయిడిజంలో ఆటోఇమ్యూన్ తరహా ఉంటుంది. చికిత్స తీసుకుంటున్నా కూడా ఈ ఆటోఇమ్మ్యూనిటీ ఇతర అవయవాల పై ప్రభావం చూపిస్తుంది" అని ఆమె చెప్పారు.
"రోగ నిరోధక వ్యవస్థ పై ప్రభావం పడుతుంది" అని ఆమె చెప్పారు.
థైరాయిడ్ హార్మోన్ శరీరంలోని నాడీ వ్యవస్థతో సహా శరీరంలో అన్ని భాగాల పైనా ప్రభావం చూపిస్తుంది. "మానసిక ఒత్తిడి, చికాకు ఉంటాయి. థైరాయిడ్‌కు చికిత్స తీసుకున్నా కూడా లక్షణాలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి" అని అన్నారు.
అయితే, చాలా మందికి ఈ సమస్యకు సమాధానాలు దొరకవు.

ఫొటో సోర్స్, Getty Images
సొంత వైద్యం
థైరాయిడ్ సమస్యకు చికిత్స చేసేందుకు నిపుణులైన వైద్యులు, చికిత్స లేవని లారా, ఐరీన్, లొరేటా అంటారు.
"అనారోగ్య సమస్యలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే" అని ఐరీన్ అంటారు. వీరి సమస్యకు కావల్సిన సమాధానాలు పూర్తిగా దొరకటం లేదని ఆమె అన్నారు.
దీంతో, వీళ్ళు వీడియోలు, పుస్తకాలు, కోర్సులు చూస్తూ, వివిధ చికిత్సా విధానాలను స్వీయప్రయోగం చేయడం మొదలుపెట్టారు.
ఈ ముగ్గురూ ఒక ప్రైవేటు డాక్టర్‌ను సంప్రదించారు. తమ ఆరోగ్య సమస్యలన్నిటికీ కలిపి చికిత్స చేసేందుకు వీలుగా నిపుణులను కలిశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇసాబెల్ గార్సియా ఎండోక్రైనాలజీ, న్యూట్రిషన్ నిపుణులు. చాలా మంది డాక్టర్ల చుట్టూ తిరిగిన తర్వాత అలిసిపోయి ఆమె దగ్గరకు వస్తూ ఉంటారని ఆమె చెప్పారు. థైరాయిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా విశ్లేషించాలని ఆమె అంటారు.
"ప్రతీ రోగానికి ఒక కారణం, మూలకారణం ఉంటుంది. చాలా సార్లు అవి ఒక మాత్ర తీసుకోవడంతో తగ్గిపోవు. రోగిని పరిశీలించాల్సి ఉంటుంది" అని గార్సియా చెప్పారు.
వైద్య పరిశీలనలు చేస్తున్నప్పుడు "రోగి మానసిక పరిస్థితిని, ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడకపోవడం ఒక పెద్ద సమస్య" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నియమావళి
అయితే, వైద్య సలహా లేకుండా థైరాయిడ్‌కు సొంతంగా చికిత్స తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోని విషపూరిత పదార్ధాలను తొలగించమని డాక్టర్ గార్సియా చెబుతారు.
ఉదాహరణకు దంతాలు ఫిల్లింగ్ చేయించుకున్నప్పుడు ప్లాస్టిక్‌కు బదులు పాదరసంతో లేదా గ్లాస్‌తో చేసిన ఫిల్లర్లు పెట్టించుకోవచ్చు. ప్లాస్టిక్ తొడుగులను గ్లాస్ తో అమర్చవచ్చు. అయితే, జీవన శైలిలో మార్పులు చేసేందుకు అందరికీ తగిన ఆర్ధిక స్థోమత ఉండకపోవచ్చు.
"శరీరానికి హాని చేసే పంచదార, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం మానేయడం లాంటివి ఎవరైనా చేయవచ్చు. ఆవు పాలు, సూర్యరశ్మిలో గడపడంతో పాటు డి-విటమిన్ పిల్స్ తీసుకోవడం, వ్యాయామం లాంటివి చేయవచ్చు. వ్యాయామం కూడా ఒకేసారి తీవ్రంగా చేయకూడదు. అలా చేయడం వల్ల శరీరం అలిసిపోతుంది" అని చెప్పారు.
"మధ్య వయస్సులో ఉన్న మహిళలు చికిత్స కోసం ఆమె దగ్గరకు వస్తూ ఉంటారు. జీవితంలో చేయాలనుకున్న పనులు చాలా చేయలేకపోవడంతో మానసిక బరువుతో ఉంటారు" అని చెప్పారు.
అలాంటి వారికి ఆమె చిన్న చిన్న చిట్కాలు చెబుతూ ఉంటారు. గదిలో ఫోన్ లేకుండా పడుకోవడం, ఇంటర్‌నెట్ వాడకం తగ్గించడం, కొన్ని పనులను ఇతరులకు అప్పగించడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇష్టమైన పనులు చేస్తూ ఉండటం, ధ్యానం చేయడం, థెరపీకి వెళ్లడం, భావోద్వేగాలను నియంత్రించుకోగల్గడం, స్వీయ పరిశీలన పెంచుకోవడం లాంటివి చేయాలని సూచించారు.
"ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని, ఒత్తిడి తగ్గించుకోగల్గితే కలిగే మంచి మార్పులు కనిపిస్తాయి" అని డాక్టర్ గార్సియా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"మీ గురించి మీరు తెలుసుకోండి"
ఆత్మజ్ఞానం ఉండటం చాలా ముఖ్యం అని ఐరీన్, లోరెటా, లారా అంగీకరించారు. "నన్ను హార్మోన్లు ఇబ్బంది పెడుతున్న విషయం గురించి తెలుసుకోవడం అవసరం" అని లారా అన్నారు.
"మీ గురించి మీరు తెలుసుకోండి. మూడ్‌లో మార్పులు గమనించిన ప్రతి సారీ మీ భావాలకు అక్షర రూపం ఇవ్వండి. వ్యాధి గురించి తెలుసుకోండి. మీరు మీకు అర్ధమవ్వకపోతే, సమస్యను అర్ధం చేసుకోలేరు" అని అన్నారు.
ఇదే వ్యాధితో బాధపడుతున్న వారితో కూడిన సపోర్ట్ నెట్‌వర్క్స్ గురించి తెలుసుకోవడం అవసరం. ఆ గ్రూపుల్లో సమస్యలను చర్చించవచ్చు.
ఐరీన్ తన ఆహారపు అలవాట్లను, జీవన శైలిని మార్చుకున్నారు. శరీరంలో వీలైనన్ని విషపదార్ధాలను తొలగించారు. వాతం కలిగించే పదార్ధాలను ఆహారం నుంచి తొలగించారు.
అంతః పరిశీలన చేసుకునేందుకు హైపో థైరాయిడిజం పనికొచ్చిందని లారా అంటారు. "ఇదొక నిశ్శబ్ద వ్యాధి. కానీ, శరీరం మీకు చెబుతూనే ఉంటుంది. దాని మాట విని పరిస్థితిని అర్ధం చేసుకోవాలి. స్వీయ ప్రేమ ఉండటం అన్నిటి కంటే కీలకం" అని లారా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్: భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు ఈ ఆర్థికవేత్త ఆలోచనలే బాటలు వేశాయని మీకు తెలుసా?
- భారత్-పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్‌కు అవసరమా, అనవసరమా?
- దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?
- పసుపుతో క్యాన్సర్‌కు చికిత్స సాధ్యమేనా?
- భారతీయులు వైద్య విద్య కోసం రష్యా వెళ్లట్లేదు. ఎందుకంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













