ఫిట్‌నెస్: ఎక్సర్‌సైజుకు ముందు డ్రై ప్రొటీన్ పౌడర్‌లు తీసుకోవడం ప్రమాదకరమా

డ్రై ప్రొటీన్ పౌడర్లను సాధారణంగా నీటిలో కలిపి తీసుకుంటారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రై ప్రొటీన్ పౌడర్లను సాధారణంగా నీటిలో కలిపి తీసుకుంటారు

సోషల్ మీడియాలో డ్రై ప్రొటీన్ పౌడర్‌ తీసుకోవడం గురించి ఒక ప్రమాదకరమైన ప్రచారం సాగుతోంది. జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజ్‌ చేసే ముందు ఈ డ్రై ప్రొటీన్ పౌడర్‌ను నీళ్లలో కలుపుకోకుండా నేరుగా తీసుకోవాలని ఈ ప్రచారంలో చెబుతుంటారు.

దీనిని నీళ్లలో కలుపుకునే తీసుకోవాలని ఆ పౌడర్ తయారీదారులు లేబుల్ మీద సూచించారు.

నీళ్లు కలుపుకోకుండా డ్రై ప్రొటీన్ పౌడర్లను నేరుగా తినడాన్ని డ్రై స్కూపింగ్ అంటారు. దీనిపై సాగుతున్న ప్రచారంపై అమెరికాకు చెందిన ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘టిక్‌టాక్’ లాంటి సోషల్ మీడియాలలో ప్రచారమవుతున్న ఈ వీడియోలకు ‘లైక్‌’లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.

ఈ ప్రమాదకరమైన ధోరణిని కాపీ చేయడానికి ప్రయత్నించినవారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

ఎక్సర్‌సైజుకు ముందు ఎనర్జీ స్టిమ్యులెంట్స్ తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్సర్‌సైజుకు ముందు ఎనర్జీ స్టిమ్యులెంట్స్ తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

నిపుణులు ఏం చెబుతున్నారు?

ఎక్సర్‌సైజ్‌కు ముందు తీసుకునే పౌడర్లలో అనేక అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కెఫిన్ వంటి పదార్థాలు ఉంటాయి.

శరీరంలో శక్తి కోసం వ్యాయామానికి ముందు ఇలాంటి బూస్టింగ్ పౌడర్‌లు తీసుకోవాలని చాలామంది నమ్ముతారు. కానీ దీనిని సమర్ధించే శాస్త్రీయమైన డేటా ఎక్కడా లేదు.

ఇలాంటి పౌడర్‌లు తీసుకోవడం వల్ల శక్తి వస్తుందో లేదో తెలియకున్నా, ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం మాత్రం ఉంది.

ఉదాహరణకు కెఫిన్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల గుండె దడ లాంటి హృదయ సంబంధ దుష్ప్రభావాలు ఎదురవుతాయి.

ఎక్సర్‌సైజ్‌కు ముందు అధిక మొత్తంలో శక్తి ఉత్ప్రేరకాలు (ఎనర్జీ స్టిమ్యులెంట్స్) తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని తేలింది.

ఒక టేబుల్ స్పూన్ ప్రొటీన్ పౌడర్‌లో అయిదు కప్పుల కాఫీలో ఉండేంత కెఫిన్ ఉంటుందని న్యూయార్క్‌లోని కోహెన్ చిల్డ్రన్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు.

ఈ డ్రై పౌడర్‌లు తీసుకోవడం వల్ల ''రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది గుండె లయకు ఆటంకం కలిగిస్తుంది'' అని వారు వెల్లడించారు.

పొరపాటున ఈ పౌడర్‌ను పీల్చడం వల్ల అది ఊపిరితిత్తులలోకి చేరి ఊపిరాడకుండా చేస్తుంది. దీనివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్ లేదా న్యుమోనియా కూడా రావచ్చని పరిశోధకులు వెల్లడించారు.

బ్రిటన్‌లో ఈ పదార్ధాలను ఔషధాలుగా కాకుండా, ఆహార పదార్ధాల కేటగిరీలో చేర్చి వీటి అమ్మడంపై అనేక నిబంధనలు పెట్టారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన వ్యక్తులకు మాత్రమే వీటిని దుకాణాలలో అమ్మాలని సూచించారు.

ఆన్‌లైన్‌లో విక్రయించే కొన్ని పౌడర్‌లు పేరున్న తయారీదార్లవి కాకపోవచ్చు. ఒక్కోసారి ప్యాకేజీలో చూపిన పదార్థాలు లోపల ఉండకపోవచ్చు.

డీఎంఏఏ అనే సింథటిక్ యాంఫేటమిన్ సైనెఫ్రిన్ అనే ఉత్ప్రేరకం లాంటి పదార్ధాలు చేరుతున్నట్లు గుర్తించడంతో ఇలాంటి డ్రై ప్రొటీన్ పౌడర్లలో చాలా వాటిని నిషేధించారు.

ఇలాంటి పౌడర్లపై పెరుగుతున్న వ్యామోహం, తద్వారా ఎదురవుతున్న ప్రమాదాలకు సంబంధించిన అనేక కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.

బ్రయాట్నీ పోర్టిల్లో అనే 20 ఏళ్ల అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ పౌడర్‌ తీసుకున్న తర్వాత గుండెపోటుకు గురయ్యారని ఒక కథనం ప్రచురితమైంది.

ప్రొటీన్ పౌడర్లలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రొటీన్ పౌడర్లలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది

ప్రజాదరణ

టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన 100 వీడియోలను పరిశోధకులు విశ్లేషించారు. వారు ఈ పరిశోధన కోసం 'ప్రీ-ట్రైనింగ్' అనే ట్యాగ్‌ని ఉపయోగించారు.

వాటిలో కేవలం 8మంది మాత్రమే పౌడర్‌ను సరైన పద్ధతిలో వినియోగించుకోవడం గురించి వివరించారు. 30 మందికి పైగా తాము పొడిని తినడాన్ని వీడియోలలో చూపించారు. ఒక టేబుల్ స్ఫూన్ పరిమాణంలో పొడిని నోట్లో వేసుకుంటూ కనిపించారు. తరువాత కొద్దిగా నీరు తాగారు.

ఇలా ఎక్సర్‌సైజుకు ముందు ప్రొటీన్ పౌడర్‌లు తీసుకోవడం ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సదస్సు సందర్భంగా పరిశోధకులు హెచ్చరించారు.

డ్రై ప్రొటీన్ పౌడర్లు అధికంగా తీసుకోవడం గుండె సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రై ప్రొటీన్ పౌడర్లు అధికంగా తీసుకోవడం గుండె సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కెఫిన్

''ప్రీ-వర్కవుట్ పౌడర్‌లలో కెఫిన్‌తోపాటు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, క్రీటైన్ వంటి పదార్ధాలు ఉంటాయి'' అని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్‌కు చెందిన న్యూట్రిషన్ సైంటిస్ట్ బ్రిడ్జేట్ బెనెలమ్ వెల్లడించారు.

"కొన్ని సందర్భాల్లో కెఫిన్ మనిషిలోని శక్తిని పెంచుతుందనడానికి కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఈ ఉత్పత్తుల ప్రయోజనాలపై పెద్దగా పరిశోధనలు జరగలేదు'' అని ఆయన వివరించారు.

''ఈ పరిశోధన సాధారణంగా అథ్లెట్ల విషయంలో జరుగుతుంది. మామూలు వ్యక్తులకు ఇది ఎంత వరకు ఉపయుక్తం అని స్పష్టంగా చెప్పలేము'' అని బెనెలమ్ వెల్లడించారు.

''తయారీదారులు సరైన ప్రమాణాల ప్రకారం తయారు చేస్తే, ఈ ఉత్పత్తులలో కెఫిన్ లెవెల్స్ ఒకటి నుండి మూడు కప్పుల ఫిల్టర్ కాఫీలో ఉండే కెఫిన్‌కు సమానంగా ఉంటాయి'' అన్నారాయన.

కాబట్టి, ఎక్సర్‌సైజుకు ముందు ఇలాంటి పౌడర్‌లు తీసుకునే అలవాటు ప్రమాదానికి దారి తీయవచ్చని ఆయన చెప్పారు.

''ఈ పౌడర్‌ను రోజులో ఒకటి కంటే ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల కెఫిన్ శరీరంలోకి అధికంగా వెళ్లే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరం'' అన్నారు బెనెలమ్.

ఎక్సర్‌సైజ్‌కు ముందు ఇలాంటి పౌడర్లను తీసుకోకపోవడంతోపాటు, అధికంగా నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ఈ కింది సూచనలు చేసింది.

  • వాతావరణం పొడిగా ఉందా, వర్షం కురిసిందా అన్నదానితో నిమిత్తం లేకుండా రోజుకు 6-8 గ్లాసుల నీటిని తాగాలి.
  • అలసిపోయినా, విపరీతంగా చెమటపట్టినా నీరు ఎక్కువగా తాగండి.
  • అయితే అతిగా నీళ్లు తాగొద్దు.
  • కెఫిన్ శరీరంలోకి ఎక్కువ చేరకుండా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)