Turmeric: పసుపుతో క్యాన్సర్‌కు చికిత్స సాధ్యమేనా?

పసుపు

ఫొటో సోర్స్, iStock

భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లోని ప్రతీ వంటింటిలో పసుపు తప్పకుండా ఉంటుంది. కూరల్లో పసుపును కేవలం రుచి కోసమే వాడతారా? లేక ఇందులో మన ఆరోగ్యాన్ని కాపాడే, మనల్ని క్యాన్సర్ నుంచి కాపాడే లక్షణాలు కూడా ఉంటాయా?

పసుపు గురించి తెలిపే వందలాది ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి. అజీర్తి, గుండెల్లో మంట, డయాబెటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి వ్యాధులపై పసుపు ఔషధంగా ఎలా పనిచేస్తుందో ఇప్పటికే వాటిలో వివరించారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధిపై కూడా పసుపు పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

పసుపుపై వేలాది అధ్యయనాలు జరిగాయి. ఇందులో ఉండే ఒక సమ్మేళనం కారణంగానే పసుపుకు ఔషధ లక్షణాలు కలుగుతాయని భావిస్తుంటారు. ఆ సమ్మేళనం పేరు ‘కర్క్యుమిన్’.

ఎలుకల్లో అనేక రకాల క్యాన్సర్లు పెరగకుండా అడ్డుకోవడంలో కర్క్యుమిన్ విజయవంతం అయిందని ఎలుకలపై చేసిన ప్రయోగంలో రుజువైంది.

కానీ పసుపులో కర్క్యుమిన్ కేవలం 2-3 శాతమే ఉంటుంది. మనం ఆహారంలో భాగంగా పసుపు తీసుకున్నప్పుడు, దీనిలో ఉండే కర్క్యుమిన్ మొత్తాన్నీ మన శరీరం గ్రహించదు.

మనం తినే ఆహారంలో పసుపు ఎంత పరిమాణంలో ఉండాలో కేవలం కొన్ని అధ్యయనాలు మాత్రమే తెలిపాయి.

తక్కువ పరిమాణంలో రోజూ పసుపు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుందా? లేదా వ్యాధులకు దూరంగా ఉండటానికి మనం పసుపు సప్లిమెంట్లను లేదా కర్క్యుమిన్ సప్లిమెంట్లను తీసుకోవాలా?

మైఖెల్ మోజిలీ, బీబీసీ 2
ఫొటో క్యాప్షన్, మైఖెల్ మోజిలీ, బీబీసీ 2

ప్రయోగం ఎలా చేశారు?

ఈ విషయాలు తెలుసుకునేందుకు ఆరోగ్యంపై పసుపు ప్రభావం గురించి బ్రిటన్‌లో నిర్వహిస్తున్న పరిశోధనను పరిశీలించాం.

న్యూకాజిల్ యూనివర్సిటీతో కలిసి మేం పరిశోధన ప్రారంభించాం. ఇందులో 100 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వీరిని మూడు గ్రూపులుగా విభజించారు.

మొదటి గ్రూపుకు ప్రతీరోజు ఆహారంలో ఒక టీస్పూన్ పసుపు ఇచ్చారు. రెండో గ్రూపుకు అంతే మోతాదులో పసుపును సప్లిమెంట్ రూపంలో అందించారు. మూడో గ్రూపుకు పసుపు అని చెప్పి మరో పదార్థాన్ని తినిపించారు.

తర్వాత వారి రక్త నమూనాలపై మూడు రకాల పరీక్షలు చేశారు. మొదటి పరీక్షలో, పసుపు తిన్నవారి రక్తకణాలు మంటను ఎలా నిరోధించాయి? వారి రోగ నిరోధక వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉందో విశ్లేషించారు.

‘ఆక్సిడేటివ్ స్ట్రెస్ టెస్ట్’గా పిలిచే ఈ పరీక్షను న్యూకాజిల్ యూనివర్సిటీలోని పీబీ బయోసైన్స్ అభివృద్ధి చేసింది.

రెండో రౌండ్ పరీక్షలో తెల్ల రక్త కణాలను లెక్కించారు. డీఎన్‌ఏ పరీక్ష కోసం వాటి ఫలితాలు అవసరం. వీటి విశ్లేషణలో పరిశోధనలో పాల్గొన్న వ్యక్తుల రోగ నిరోధక వ్యవస్థ స్థితికి సంబంధించిన సంకేతాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

మూడో పరీక్షను లండన్ యూనివర్సిటీ కాలేజ్ అభివృద్ధి చేసింది. ఇందులో డీఎన్‌ఏ మిథైలేషన్‌ను కనుగొన్నారు. పసుపులో ఉండే యాంటీ క్యాన్సర్ లక్షణాలను కనుగొనేందుకు ఈ పరీక్షను నిర్వహించారు.

పసుపు

‘ఆక్సిడేటివ్ స్ట్రెస్ టెస్ట్’ను న్యూకాసిల్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. దీని ప్రకారం, పరిశోధనలో పాల్గొన్న మూడు గ్రూపుల్లోని వాలంటీర్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ స్థాయిలు సమానంగా ఉన్నాయి.

మన రోగనిరోధక వ్యవస్థపై వాతావరణ మార్పు కూడా ప్రభావం చూపుతుంది. వడదెబ్బ కారణంగా ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’ పెరుగుతుంది. ఆరు వారాల్లో ఈ మూడు గ్రూపుల్లోని వాలంటీర్లలో అలాంటి మార్పు కనిపించింది.

తెల్ల రక్త కణాల లెక్కింపు ద్వారా మూడు గ్రూపుల్లోని వాలంటీర్ల రోగనిరోధక కణాల సంఖ్య తగ్గినట్లు తేలింది. అన్ని గ్రూపుల్లోనూ ఇది సమానంగా తగ్గింది.

పసుపును సప్లిమెంట్‌గా తీసుకునేవారితో పాటు, పసుపు అని చెప్పి వేరే పదార్థం తీసుకున్న వారి డీఎన్ఏ మిథైలేషన్‌లో పెద్దగా తేడా ఏమీ లేదు. కానీ ఆహారంలో పసుపును తీసుకునే వారి మిథైలేషన్‌లో చాలా తేడా కనిపించింది.

యూసీఎల్‌కు చెందిన పరిశోధకులు ఒక జన్యువులో గణనీయమైన మార్పుల్ని గమనించారు. ఈ జన్యువు ఆందోళన, ఆస్థమా, ఎగ్జిమా, క్యాన్సర్ కారకాలతో ముడిపడి ఉంది. ఈ జన్యువు పనితీరులో మార్పు కనిపించింది.

పసుపు

ఫొటో సోర్స్, Science Photo Library

ఫలితాలు ఏంటి?

పసుపు పాజిటివ్ ప్రభావం చూపుతోందా లేదా నెగిటివ్ ప్రభావం చూపుతోందా ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. అయితే, పసుపు వల్ల వస్తున్న జన్యుపరమైన మార్పులతో మేలే జరగొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నాయి.

అయితే, ఒక విషయం గురించి మనం చెప్పుకోవాలి. పరిశోధనలో పాల్గొన్నవారి రక్తంలోని కర్క్యుమిన్ స్థాయిలను పరిశోధకులు పరిశీలించలేదు.

ఆహారంలో భాగంగా పసుపు తీసుకున్నవారు తమ ఆహారంలో చేసుకున్న మార్పులు కూడా మిథైలేషన్‌కు దారితీయొచ్చు. ఈ ప్రభావం కేవలం పుసుపు వల్లే వచ్చుండకపోవచ్చు కూడా.

వీడియో క్యాప్షన్, లిక్విడ్ డైట్‌తో బరువు తగ్గడం సాధ్యమేనా?

పసుపుకు, పసుపు సప్లిమెంట్లకు మధ్య తేడా ఏమిటి?

మనం ఆహారంలో తీసుకునే పసుపు స్థాయిలను బట్టి మన శరీరం గ్రహించే కర్క్యుమిన్ స్థాయిలను అంచనా వేయొచ్చు.

కర్క్యుమిన్ ఒక లిపాప్‌హాలిక్. అంటే ఇది కొవ్వుల్లో నిల్వ ఉంటుంది. వంటల్లో నూనె ఉపయోగించినప్పుడు, పసుపు దానితో కలుస్తుంది. దీన్ని మన శరీరం తేలిగ్గా గ్రహించగలదు.

మిరియాలు కూడా పసుపుతో తేలిగ్గానే కలిసిపోగలవు. మిరియాల్లో పైపెరిన్‌గా పిలిచే సమ్మేళనాలు పసుపుతో తేలిగ్గా కలుస్తాయి. దీంతో మన శరీరం గ్రహించే కర్క్యుమిన్ స్థాయిలు పెరుగుతాయి.

అంటే పసుపును నూనెలు లేదా మిరియాలతో కలిపి తీసుకుంటే, మన శరీరం మెరుగ్గా గ్రహించగలదు.

మన జన్యువులపై పసుపు ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా క్యాన్సర్‌పై పసుపు మెరుగ్గా పనిచేస్తుందని చెప్పేందుకు మరింత లోతైన అధ్యయనం అవసరమని కొన్ని పరిశోధనల్లో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్ళను కాపాడుకోవడం ఎలా?

ఆరోగ్యానికి మంచిదేనా?

క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎలా వస్తున్నాయో తొలి దశల్లో గుర్తించడం కాస్త కష్టమే. వీటిని తొలి దశల్లోనే గుర్తిస్తే, వ్యాధి ముదరకుండా అడ్డుకోవచ్చు.

పసుపు తక్కు మోతాదులో నిరంతరంగా తీసుకుంటే మన శరీరానికి మేలు జరుగుతుందని పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి.

అంటే ఆహారంలో భాగంగా పసుపును తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)