కుమ్రం భీము: ఈ ఆదివాసీల దేవుడ్ని నిజాం పోలీసులు నేరుగా ఎదుర్కోలేక వెనక నుంచి వెళ్లి చంపారు

- రచయిత, శుభం ప్రవీణ్, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
''నేను ఆసిఫాబాదు దగ్గర చదువుకుంటూ ఉండగా... గోండులలో హక్కుల కోసం, అధికారాల కోసం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడాలన్న ప్రేరణ కలిగించిన కుమురం భీము, నిజాం సిపాయిలతో యుద్ధం చేస్తూ వీరమరణం చెందినాడు. శవాలను, క్షతగాత్రులను మా స్కూలు ముందరి జిల్లా సివిల్ హాస్పిటల్ ప్రాంగణంలోనే పడుకోబెట్టినారు గదా! ఫైరింగ్ ఆర్డరిచ్చిన మా జిల్లా కలెక్టరుతో రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్న పొడుగాటి తెల్లగడ్డం గల అబ్దుల్ సత్తార్ సాహెబ్ రెండు చేతుల పైకెత్తి 'యా అల్లా! ఈ వయస్సులో ఇంతటి పాపకార్యం చేయవలసివచ్చె గదా' అని వాపోయినాడట. ఇదంతా మా గురువులు చెప్పినారు'' అని కుమ్రం భీము మరణం గురించి తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ తన ఆత్మకథ 'యాది' పుస్తకంలో రాశారు.
ఆవేళ ఆశ్వయుజ పౌర్ణమి. 1940వ సంవత్సరం. ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలోని జోడెన్ ఘాట్ గ్రామం. కుమ్రం భీమ్ నాయకత్వంలోని ఆదివాసీ బృందాలకూ, నిజాం పోలీసులకూ మధ్య ఏడు నెలల పోరాటం అకస్మాత్తుగా ముగిసిపోయిన రోజది. ఆదివాసీలకు అండగా నిలిచిన కుమ్రం భీము ఆరోజే కన్నుమూశారు.
చరిత్రకారులు భీము ఇంటిపేరును కొమురం, కుమరం, కొమ్రం, భీమ్, భీం, భీము ఇలా రాస్తూ వచ్చారు. అయితే 'కుమ్రం భీము'యే సరైనదని పలువురు ఆదివాసీలు బీబీసీకి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా ఆ పేరును ఇలాగే రాస్తోంది.

ఇంతకు ఎవరీ కుమ్రం భీము?
కాలం, 1900వ సంవత్సరం దాటి కొత్త శతాబ్దిలోకి అడుగుపెట్టింది. నిజాం రాజ్యంలో ఆధునిక బ్రిటిష్ తరహా పరిపాలనా, నిజాం తరహా అణిచివేత కలగలిసి సాగుతోంది. ఎన్నో కొత్త కొత్త చట్టాలు, నిబంధనలు వస్తోన్న కాలం. సరికొత్త వ్యాపార అవకాశాలు అప్పుడే విస్తరిస్తున్నాయి.
శతాబ్దాలుగా అడవి చుట్టూ వ్యవసాయం చేస్తోన్న ఆదివాసీలకు 18-19 శతాబ్దాల నుంచి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. అడవి సంరక్షణ కోసం చేసిన చట్టాలు వారి పొట్టకొడుతున్నాయి. భూమి యాజమాని చూపించే పట్టాలు, కాగితాలు తెలియని ఆదివాసీల దగ్గరకు ఎవరెవరో ఏవేవో కాగితాలు తెచ్చి ఆ భూమి తమదేనని, ఖాళీ చేయమని అంటున్నారు. పంట లాక్కుంటున్నారు.
వడ్డీ వ్యాపారుల బెడద ప్రారంభం అయింది. అడవి నుంచి కట్టెలు కూడా తేలేని పరిస్థితి. ఆదివాసీ గూడేలు, అక్కడి కుటుంబాలు.. ఏదో రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పట్టించుకునేవాడు లేడు. ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదు.
ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక ఆదివాసీ గోండు కుటుంబాల్లో కుమ్రం భీమ్ కుటుంబం కూడా ఉంది. కుమ్రం భీము 1901 అక్టోబరు 22న పుట్టారు. గోండు తెగలోని కుమ్రం చిన్నూ ఆయన తండ్రి.
భీముకు సుమారు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక ఘటన జరిగింది. అది 1915-16 ప్రాంతంలో జరిగి ఉంటుందని చరిత్ర కారుల అంచనా. ''సంకెపల్లిలోని వ్యాపారులు, అటవీ అధికారుల వల్ల ఆయన కుటుంబం బాధలు పడింది.
భీము తండ్రి చనిపోయాక వారు సుర్దాపూర్‌లో స్థిరపడ్డారు. అక్కడ పంట పండించారు. అది చేతికి వచ్చే సరికి ఒక ముస్లిం పట్టాదారు ఆ భూమి తనదంటూ వచ్చాడు. ఆ గొడవలో సిద్ధిక్ అనే అతణ్ణి తలపై కొట్టారు భీమ్. దీంతో పోలీసులు ఆ గ్రామంపై దాడి చేశారు. కుమ్రం భీము పారిపోయి చంద్రపూర్ మీదుగా అస్సాం చేరుకుని అక్కడ టీ తోటల్లో పనిచేశారు.
అక్కడే కుమ్రం భీము చదవడం రాయడం నేర్చుకున్నాడు. దేశ రాజకీయాలు, దేశంలో జరుగుతోన్న తిరుగుబాట్ల గురించి తెలుసుకున్నారు'' అంటూ తమ పుస్తకం 'కొమురం భీము'లో రాశారు అల్లం రాజయ్య, సాహులు.

''అల్లూరి సీతారామరాజు గురించి కుమ్రం భీమ్ విన్నాడనీ, మన్నెం తిరుగుబాటు గురించి తరచూ తమకు చెప్పేవాడనీ'' భీమ్ అనుచురుడు కుమ్రం సూరు తమతో చెప్పినట్టుగా ఆ పుస్తకంలో రాశారు అల్లం రాజయ్య.
అస్సాంలోని టీ తోటల్లో పనిచేసేప్పుడే అక్కడి తిరుగుబాటులో కూడా భీము పాల్గొన్నారు. దీంతో అక్కడ నిర్బంధిస్తే తప్పించుకుని తిరిగి ఆసిఫాబాద్ దగ్గర కాకన్ ఘాట్ చేరి అక్కడ లచ్చు పటేల్ దగ్గర పనిలో చేరారు. ఆ తరువాత సోమ్ బాయిని వివాహం చేసుకున్నారు.
అదే సమయంలో ప్రభుత్వం వల్ల అనేక చోట్ల భూమిని కోల్పోయి వ్యాపారులు, భూస్వాముల వల్ల దెబ్బతిన్న భీము చిన్నాన్నలు... ఆసిఫాబాద్ జిల్లా బాబెఝరి కేంద్రంగా 12 గ్రామాల్లో ఇతర ఆదివాసీలతో కలసి పోడు కోసం అడవి నరికి సాగులోకి తెచ్చారు. దీంతో పోలీసులు ఆ గ్రామాల్లో విధ్వంసం సృష్టించారు. ఆ పన్నెండు గ్రామాలకూ ప్రభుత్వంతో వ్యవహారం నడిపే వ్యక్తిగా భీమును తెరపైకి తెచ్చారు.
జోడెన్ ఘాట్ కేంద్రంగా ఆ పన్నెండు గ్రామాలు కార్యక్షేత్రంగా పోరాటం మొదలైంది. ఆదివాసీల మీద జరుగుతున్న దాడులకు ప్రతిగా భీము, స్థానికులను ఏకం చేశారు. పాటలతో తన నినాదాలను ప్రచారం చేశారు. స్థానిక గోండుల నుంచి ఆయుధాలు, ఆహారపరమైన మద్దతు ఆయనకు లభించింది. ప్రతీ గోండు గ్రామం నుంచీ జోడెన్ ఘాట్‌కు ధాన్యాలు తెప్పించారు. ఈ వ్యవహారాలన్నీ అత్యంత రహస్యంగా జరిగాయి.
అదే సమయంలో నిజాం రాజును కలవాల్సిందిగా ఆయనకు కొందరు సూచించారు. ''జనకపురం సాలె పంతులు అనే వ్యక్తి సలహాతో నిజాం రాజుకు సమస్య చెప్పుకుందామని మరో ఇద్దరితో కలసి భీము హైదరాబాద్‌కు వెళ్లారు. కానీ ఆయనకు రాజ దర్శనం దొరకదు. అవమానంతో వెనక్కు వచ్చి ఇక చేసేది లేక అటవీ అధికారులపై తిరగబడతారు. ఒక రకంగా గోండు, కోలామ్ తెగలకూ ప్రభుత్వానికీ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.''

రోజు రోజుకూ అధికారులతో సమస్య పెరిగిపోవడం, పండిన పంట చేతికి అందకపోవడం, అడవిపై హక్కులు దక్కకపోవడంతో విసిగిపోయిన కుమ్రం... సొంతంగా ఆ పన్నెండు గ్రామాలను ఏకం చేసి పోరాటాలు ప్రారంభించారు. కొన్ని తగాదాలు స్థానికంగా పరిష్కారం కాగా పెద్ద సమస్యలు అలాగే మిగిలిపోయాయి. ముఖ్యంగా అడవి, అడవిపై హక్కు, అడవి దగ్గర భూమి, ఆ భూమిపై హక్కు, ఏటిలోని నీటిపై హక్కు ఇవన్నీ ఆదివాసీలకే ఉండాలి. వేరే వారి పెత్తనం ఉండకూడదు అనేదే కుమ్రం భీము ఉద్దేశం.
ప్రఖ్యాత జల్- జమీన్- జంగల్ నినాదం ఇచ్చాడు. జల్ అంటే నీళ్లు, జమీన్ అంటే భూమి, జంగల్ అంటే అడవి. ఈ మూడింటిపై ఆదివాసీల హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. మావా నాటే-మావా రాజ్ అంటే 'మా ప్రాంతంలో మా ప్రభుత్వం' అన్న నినాదం ఇచ్చారు. గతంలో తాము రాజులం అని తమది గోండ్వానా రాజ్యం అని గుర్తు చేశారు.

''పరిస్థితి దిగజారుతోందని గమనించిన నిజాం ప్రభుత్వం, అప్పటి సబ్ కలెక్టర్‌ను జోడెన్ ఘాట్‌కు చర్చలకు పంపించింది. ఆ పన్నెండు గ్రామాలకూ పట్టాలు ఇవ్వడం, అప్పులు మాఫీ చేయడం వంటి హామీలు కూడా ఇచ్చారు. కానీ ఆ పన్నెండు గ్రామాలకూ సొంత రాజ్యాధికారం ఇవ్వాలని భీము డిమాండ్ చేశారు. దానికి సబ్ కలెక్టర్ ఒప్పుకోలేదు'' అంటూ వివరించారు అల్లం రాజయ్య.
కుమ్రం భీముకు ఆయుధాలు ఎలా అందాయి అన్నదానిపై రకరకాల వాదనలున్నాయి. తాంతియా తోపే వంటి ప్రథమ స్వతంత్ర్య సమరయోధులు దక్షిణ భారత గోండులకు ఆయుధాల్లో శిక్షణ ఇచ్చి తమతో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో నడిపించారన్న వాదన ఒకటి ఉంది. ఆ క్రమంలోనే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ గోండులకు తుపాకీలు అందాయన్నది ఒక వాదన.
ఇక ఇనుముతో కూడిన ఆయుధాలు తయారు చేయడంలో వారు సంప్రదాయంగా సిద్ధహస్తులని చెబుతారు రాజయ్య. ''కుమ్రం భీమ్ వద్ద గొంగడి దళాలు ఉండేవి. ఇవి పోరాటంపై పాటల రూపంలో ఊరూరా ప్రచారం నిర్వహించేవి. అదే సందర్భంలో వివిధ గూడేల మధ్య సమాచార మార్పిడి, అడవి బయట ప్రాంతాలకు సమాచారం చేరవేత లాంటి వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి'' అన్నారాయన.

చర్చలు విఫలం కావడంతో ఆ పోరాటం అణిచివేయడానికి నిజాం ప్రభుత్వం, ప్రత్యేక పోలీసు బలగాలను అక్కడికి పంపిచింది. దాదాపు ఏడు నెలల పాటూ అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవైపు నిజాం సేనలు, మరోవైపు భీము ఆధ్వర్యంలో ఆదివాసీల మధ్య పోరాటం జరిగింది. చివరగా 1940 సెప్టెంబరు 1వ తేదీన భీమును కాల్చి చంపారు.
ఆరోజు జోడెన్ ఘాట్ గ్రామంలో ఎవరూ ఊహించని విధంగా సుమారు 300 పైగా నిజాం పోలీసులు భారీ మందుగుండుతో వచ్చారు. కుర్దు పటేల్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో కుమ్రం భీమ్ అనుచరులు ఉంటోన్న కొండపైకి వెనుకవైపు నుంచి వెళ్లారు. అక్కడే భీముతో పాటు మొత్తం 15 మందిని కాల్చి చంపి, మిగిలిన వారిని అరెస్టు చేశారు. ఆ రోజుతో భీము పోరాటం ముగిసింది.
భీము మరణానికి కారణం అయిన కుర్దు పటేల్ అనే వ్యక్తిని 1946లో తెలంగాణ సాయుధ పోరాట దళాలు కాల్చి చంపాయి.
ఆ కాల్పుల్లో కుమ్రం భీము పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు. ఆదివాసీల్లో ఒకే పేరు, ఇంటి పేరు ఉన్న వారు ఎక్కువ మంది ఉండటం దీనికి కారణం.

భీము మృతితో కదిలిన నిజాం ప్రభుత్వం
కుమ్రం భీము పోరాటం తరువాత నిజాం ప్రభుత్వంలో కాస్త కదలిక వచ్చింది. ఆదివాసీల కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని రాజు ఆదేశించారు. అప్పటి నిజాం రెవెన్యూ మంత్రి సర్ విల్ ఫ్రెడ్ గ్రీగ్ సన్ కొన్ని సంస్కరణలను ప్రతిపాదించారు. భీమ్ చనిపోయిన ఏడాదికి ఆంత్రోపాలజిస్ట్ హేమండార్ఫ్ ఈ ప్రాంతానికి వచ్చారు.
గోండు సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి తనవంతు సూచనలు చేశారు. నాగోబా జాతరలో దర్బారు నిర్వహించి ఆదివాసీల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం అందులోనిదే. ఆ దర్బారు ఇప్పటికీ జరుగుతోంది.
యోధుడు కాదు దేవుడు!
భీము మిగతా ప్రపంచం దృష్టిలో పోరాట యోధుడు కావచ్చు. కానీ గోండుల దృష్టిలో దేవుడే! ఇప్పటికీ అసిఫాబాద్ గోండులు కుమ్రం భీమ్ గురించి పాటలు పాడుకుంటారు. ప్రతీ ఏటా ఆశ్వయుజ పౌర్ణమి నాడు భీమ్‌ను స్మరించుకుంటారు. పూజిస్తారు. ''కుమ్రం భీముకు మంత్ర శక్తి ఉంది. ఆయన్ను రాళ్లు, బుల్లెట్లు ఏమీ చేయవు'' అని గోండుల్లో విపరీతమైన ప్రచారం ఉండేదంటే అర్థం చేసుకోవచ్చు, వారు ఆయన్ను ఎంత ఆరాధనాపూర్వకంగా చూస్తారో..

"భీము వర్ధంతి కార్యక్రమాలను ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ మేం చిన్నప్పుడు 21 కిలోమీటర్లు నడిచి వెళ్లి భీమ్ వర్ధంతి చేసేవాళ్లం. నా చిన్నప్పుడు కుమ్రం భీమ్ పోరాటం గురించి మా తాతలు చెబుతుండేవారు. అలా నాకు 1972 నుంచీ భీము తెలుసు'' అని ఝరి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మారావు బీబీసీతో చెప్పారు.
''మా గ్రామాల్లో మా రాజ్యమే ఉండాలని భీము పోరాడారు. 'ఆయనకు తుపాకీ గుండు తగలదు. బండలు తగలవు. నీటిలో మునగడు' అలా ఉండగలిగే శక్తి ఆయనకు ఉందని అందరూ నమ్మేవారు. వాస్తవానికి ఆయన ఆదివాసీల ఇబ్బందులు తగ్గించారు. తమకు సాయంగా వచ్చిన వారిని, తమను కాపాడిన వారిని దేవుడిగా చూస్తాం. అలా ప్రారంభం అయిందే ఈ నమ్మకం'' అని సిడాం అర్జు అనే వ్యక్తి బీబీసీతో అన్నారు.
''మామూలుగా అయితే ఆయనకు బుల్లెట్ తగలదు. కాబట్టి ఆయనను చంపలేం అనే ఉద్దేశంతో తుపాకీకి ముట్టు బట్ట పెట్టి (స్త్రీల బహిష్టు సమయంలో వాడే బట్ట) పేలుస్తారు. అప్పుడు బుల్లెట్ తగులుతుంది'' అని ఒక కథనం స్థానికంగా ప్రచారంలో ఉంది. అర్జు ఈ కథనాన్ని బీబీసీకి చెప్పారు. భీమ్‌కు దైవ శక్తి ఉంది అని స్థానికులు నమ్ముతారనడానికి ఇదొక సాక్ష్యం.

ఆలస్యంగా వెలుగులోకి
కుమ్రం భీము గురించి మొట్టమొదటగా తెలుగు వారికి విస్తృతంగా పరిచయం చేసిన ఘనత ఆదిలాబాద్‌కి చెందిన సామల సదాశివకు చెందుతుంది. తెలుగు, మరాఠీ, ఉర్దూ, సంస్కృత సాహిత్యాల్లో దిట్ట అయిన సదాశివ 1981లో ఏడో తరగతి తెలుగు వాచకం రాశారు. అందులో కుమ్రం భీము గురించిన పాఠం రాశారు.
అంతకుముందు వెన్నలకంటి రాఘవయ్య 1971 లో రాసిన గిరిజన పోరాటాలు (ఆదిమ్ జాతిసేవర్ సంఘ్, నెల్లూరు) అనే పుస్తకంలో 1178-1971 మధ్య జరిగిన పోరాటాల్లో భాగంగా భీము పోరాటాన్ని ప్రస్తావించారనీ కొందరు చెబుతారు. అల్లాణి శ్రీధర్, కుమ్రం భీమ్‌పై ఒక సినిమా కూడా తీశారు.
సాహు, అల్లం రాజయ్యలు సంయుక్తంగా కొమురం భీమ్ పేరుతో ఒక చారిత్రక నవల రాశారు. ఆ పుస్తకం కోసం వారు విస్తృత పరిశోధన చేశారు. ఇప్పటి వరకు కుమ్రం భీము గురించి జరిగిన పరిశోధనల్లో ఇదే అతి ముఖ్యమైనది.
ఇప్పుడు చాలా మందికి కుమ్రం భీము అసలు చరిత్ర, ఆయన ప్రధాన అనుచరుడు కుమ్రం సూరు ద్వారానే తెలిసింది. జోడెన్ ఘాట్ ఘటనలో భీమ్ చనిపోయాక సూరును నాలుగేళ్లు జైల్లో ఉంచారు. నిజానికి కుమ్రం భీము పోరాట చరిత్ర సమగ్రంగా అందుబాటులో లేదు. 1940 సెప్టెంబరు ఒకటికి ఈ ఉద్యమం అణిచివేశారు. భీమ్ పుస్తక రచయిత అల్లం రాజయ్య, భీమ్ ప్రధాన అనుచరుడు సూరును వ్యక్తిగతంగా కలిశారు.

నిజానికి కుమ్రం భీము మరణించి ఇంకా వందేళ్లు కూడా కాలేదు. సాధారణంగా అప్పటి రికార్డులన్నీ పదిలంగా ఉంటాయి. కానీ కుమ్రం భీముకు సంబంధించిన నివేదికల్లో మాత్రం సమాచారం స్పష్టంగా లేదు. ''అప్పటి పోలీసు రికార్డులు, ప్రభుత్వ నివేదికలు అన్నీ అసంపూర్తిగా, పక్షపాతంతో ఉన్నాయి. అవేవీ కుమ్రం భీము ఉద్యమాన్ని తెలిపేలా లేవు. దీంతో ఆ నివేదికలు, గోండు సాహిత్యం, పాటలు, కుమ్రం సూరు చెప్పిన విషయాలు అన్నీ క్రోడీకరించి మేం ఆయనపై నవల రాశాం'' అన్నారు
అల్లం రాజయ్య. అప్పట్లో వరంగల్ ప్రాంత సుబేదార్ నిజాం ప్రభుత్వానికి పంపిన నివేదికలు, స్థానిక పోలీసులు పెట్టిన కేసులు, ఇతర ప్రభుత్వ నివేదికలు, కుమ్రం భీముతో తరచూ మాట్లాడిన స్థానిక పోలీసు అధికారి అబ్దుల్ సత్తార్ రాసిన నివేదికల ద్వారా కొంత సమాచారం దొరుకుతున్నట్టు రాజయ్య చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసిఫాబాద్ దగ్గర నిర్మించిన 'అడ' సాగునీటి ప్రాజెక్టుకు కుమ్రం భీము పేరు పెట్టారు. తరువాత తెలంగాణ ఏర్పడ్డాక ఆసిఫాబాద్ జిల్లాకు ఆయన పేరు పెట్టారు.
దాదాపు 80 ఏళ్ళ క్రితం జరిగినా పోరాట నినాదాలు మాత్రం ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. తదనంతర కాలంలో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కూడా దాదాపు ఇవే నినాదాలు నడిపించాయి. నీళ్లు, నిధులు, నియామకాలు.. అంతకుమించి మా ఆత్మగౌరవం, మా స్వయంపాలన (మావా నాటే, మావా రాజ్).
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














