శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
మీ బట్టలు మేం ఉతకం అని గ్రామంలోని రజకులు అంటే గ్రామంలోని మిగతా కులాల ప్రజలు వీరికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. - ఇది శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామంలో నడుస్తున్న వివాదం.
ఈ వివాదం తీవ్రమై మూడు రోజులుగా ఉద్రిక్తతకు దారి తీయడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
బాతువ వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం. రెవెన్యూ రికార్డుల ప్రకారం గ్రామ జనాభా దాదాపు నాలుగు వేలు. ఇందులో 40 కుటుంబాలకు పైగా అంటే దాదాపు 200 మంది రజకుల జనాభా. గ్రామంలో నివాసం ఉంటోంది మాత్రం వంద మందిలోపే. వీరు గ్రామంలో బట్టలు ఉతకడంతో పాటు శవ దహన కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
మిగతా వారిలో బీసీలు, ఎస్సీలతోపాటు ఇతర కులాలవారు ఉన్నారు.

‘బట్టలు ఉతికే వృత్తి మాకొద్దు’
ఇతర కులాలవారు తమకు పాలు, మందులు, బియ్యం అమ్మడం లేదంటూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద రజకులు అక్టోబరు 3న ఆందోళన చేశారు.
“గ్రామంలోని కట్లుబాట్లు, ఆచారం ప్రకారం రజకులకు ఏటా గ్రామస్థులు ఎవరి స్తోమత బట్టి వారు బియ్యం, ధనం ఇస్తుంటారు. అయితే ఇవి తమకు సరిపోవడం లేదని ఎక్కువ కావాలని రజకులు అడిగారు. అందుకు మేం అంగీకరించలేదు. దాంతో వారు బట్టలు ఉతకడం మానేశారు. దానికి బదులుగా మేం రజకులకు సహయ నిరాకరణ చేస్తున్నాం” అని బాతువ గ్రామస్థుడైన రాము బీబీసీతో చెప్పారు.
ఈ వివాదానికి మూలాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకొనేందుకు బాతువ గ్రామంలో బీబీసీ పర్యటించింది.
“మా పిల్లల చదువుల కోసం మేం బాతువ గ్రామం వదిలి విశాఖపట్నం, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాం. ఇంటిలో వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. వాళ్లు బట్టలు ఉతికే పరిస్థితుల్లో లేరు. అయినా మమ్మల్ని బట్టలు ఉతకాలని డిమాండ్ చేస్తున్నారు. మేం డబ్బులు ఎక్కువ అడిగామనేది అవాస్తవం. అసలు మేం ఈ వృత్తినే చేయమంటున్నాం” అని నాగలక్ష్మి బీబీసీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

‘గ్రామ బహిష్కరణ అంటూ నిందలు’
బట్టలు ఉతకాలా, వద్దా అనేది తమ ఇష్టమని రజకులు స్పష్టంగా చెబుతున్నారు.
“బట్టలు ఉతక్కపోవడం అనేది రజకుల ఇష్టం. ఉతకం అని అన్నందుకు గ్రామస్థులంతా కలిసి సహాయ నిరాకరణ చేస్తూ రజకులకు నిత్యావసర సరకులు కూడా ఇవ్వకపోవడం సరికాదు” అని రజక సంఘం నాయకులు అంటున్నారు.
“ఇక్కడ రజక వృత్తి చేసుకునే వాళ్ల పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ అయిపోవడం వలన కొందరు, వయసు పెద్దదవడం వలన బట్టలు ఉతకలేక మరికొందరు ఈ పనిని మానుకున్నారు. గ్రామంలో ఉన్నవి 40 రజక కుటుంబాలే. అందులో కొందరే ఈ వృత్తి చేస్తున్నారు. గ్రామంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం వలన వచ్చిన వివాదమే ఇది. అంతా కలిసి మెలిసి ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి అలా కనిపించడం లేదు” అని అఖిల భారత రైతు సంఘం చైర్మన్ పి. మోహనరావు బీబీసీతో అన్నారు.
“గ్రామ ఆచారాల ప్రకారం డబ్బులు ఇవ్వాలని అడగడం, వాటిపై మేం అంత ఇవ్వలేం అని అనడం, ఇలా వారికి మాకు మధ్య ఈ ఏడాది జనవరి నుంచి చిన్నపాటి చర్చలు నడుస్తున్నాయి. కానీ కొందరు మమ్మల్ని ఉద్దేశించినట్లుగా మీరు ఏం చేయలేరు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. మాకు కష్టం అనిపించింది. మాటలతో పోయే దానికి, రెచ్చగొట్టే విధంగా వీడియోలు పెట్టారు. మేం వారిని గ్రామ బహిష్కరణ చేశామంటూ నిందలు వేశారు” అని గ్రామవాసి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

‘సహాయ నిరాకరణ నిజం...అపరాధ రుసుం అబద్ధం’
“మా పిల్లలకు పాలు కావాలన్నా, మందులు కావాలన్నా అమ్మడం లేదు. పైగా గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. మేం ఏం చేయలేం. ‘మీకు అమ్మితే ఐదు వేలు కట్టాలి’ అని వ్యాపారస్థులు అంటున్నారు. మేం వృత్తి చేయమని అంటున్న మాట నిజమే. దానికి ఎవరితోనైనా చేయించుకోవాలి. అంతే కానీ సరకులు అమ్మబోమనడం సరైనది కాదు” అని విజయ అన్నారు.
“రజకులకు సరకులు అమ్మితే రూ. 5 వేలు అపరాధ రుసుం విధిస్తున్నారనే మాట అబద్ధం. గతంలో చెల్లించినట్లుగానే వారికి ఏడాదికి బియ్యం, డబ్బులు ఇస్తాం. అంతా ఐకమత్యంగా పోదామని మేం అంటున్నాం. మా బట్టలు ఉతకడం లేదు. అందుకే మేం మా వద్ద ఉన్న సరకులు వారికి ఇవ్వడం లేదు” అని కిరణా దుకాణం యాజమని కుసుమ బీబీసీతో చెప్పారు.
“బట్టలు ఉతకబోమని, శవ దహనాలు చేయబోమని రజకులు అంటున్నారు, వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం, అలాగే మేం వారికి ఏ పనుల్లో సహాయం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం, మా నిర్ణయాన్ని వారు గౌరవించాలి” అని బాతువ గ్రామానికి చెందిన ఆదినారాయణ అన్నారు.

గ్రామంలో దండోరా
రజకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 3వ తేదీ సాయంత్రం గ్రామంలో దండోరా వేశారు. రజకులు బట్టలు ఉతకడం లేదు కాబట్టి, వారికి ఎవరు సహాయం అందించవద్దంటూ దండోరా వేశారు. ఆ విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు, బీసీ రజక సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ ఈ. ఉషశ్రీ, పోలీసులు, రెవెన్యూ అధికారులు 4వ తేదీ ఉదయం గ్రామానికి చేరుకున్నారు.
తమకు నిత్యావసర సరకులు అమ్మబోమనడం సరికాదని రజకులు అంటున్నారు. దీనిపై కలెక్టరేట్ వద్ద రజకులు ఆందోళన చేయడం వల్ల గ్రామం పేరు చెడిపోయిందని, అందుకు రజకులు క్షమాపణ చెప్పాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామస్థులంతా గ్రామంలోని గుడి వద్దకు చేరుకున్నారు.
ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. రెవెన్యూ అధికారులు ఇరు పక్షాలతో చర్చలు జరిపారు.

‘చిన్న సమస్యే...పరిష్కరించాం’
బాతువ గ్రామంలో తలెత్తిన సమస్య చిన్న సమస్య అని జి. సిగడాం తహశీల్దార్ మనోహర్ చెప్పారు.
ఒక చిన్న సమస్యని గ్రామంలో ఒకరితో ఒకరికి పడక పెద్దదిగా మార్చేస్తున్నారని ఆయన బీబీసీతో అన్నారు.
రజకులు, ఇతర గ్రామస్థులతో కలిసి రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో 4వ తేదీ రాత్రి 9 గంటలకు చర్చలు జరిపారు. ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ నిర్ణయాల్ని తహాశీల్దార్ గ్రామంలోని అందరికి తెలియ చేశారు.

“ఇది 4 వేల మంది ఉండే గ్రామం. అంతా వేర్వేరు వృత్తుల్లో, ఉద్యోగాల్లో ఉన్నారు. ఒకరి మాటను ఒకరు గౌరవించుకోకపోవడం వలన వచ్చిన సమస్య. ఊర్లో భావోగ్వేగాలు పెరిగాయి. ప్రస్తుతం ఇరు పక్షాలతో కలిసి సామరస్యంగా చర్చలు జరిగాయి. ఇకపై రజకులు గ్రామస్థుల బట్టలు ఉతకరు. బయట నుంచి వాళ్లు బట్టలు ఉతికేందుకు ఎవరినైనా తెచ్చుకుంటే రజకులు అడ్డు చెప్పరు. అలాగే గ్రామస్థులు రజకులకు ఏ పని చెప్పరు. కానీ నిత్యవసర సరకులు, మందులు రజకులతో సహా అందరికి అమ్ముతారు. ఫలానా వాళ్లకు అమ్మం అనడానికి వీల్లేదు. ఈ నిర్ణయాల్ని గ్రామస్థులు అంతా గౌరవిస్తూ, ఒక అంగీకారానికి వచ్చారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది” అని తహాశీల్దార్ మనోహర్ చెప్పారు.
“చర్చలు జరిగాయి. ప్రధానంగా మా డిమాండ్ నిత్యవసర సరకులు ఇవ్వాలనే. అందుకు అధికారుల సమక్షంలో అంగీకారం కుదిరింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే అధికారులు ఫిర్యాదు చేయమన్నారు” అని బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఈ ఉషశ్రీ చెప్పారు.
“బట్టలు ఉతికేందుకు, ఇతర గ్రామ అవసరాలకు బయట నుంచి మేం మనుషులను తెచ్చుకుంటాం. అలాగే ఇతర పనులకు కూడా మేం గ్రామంలోని రజకులని పిలవం. దానికి వారు అంగీకరించారు. నిత్యవసర సరకులు అమ్మడంలో ఎటువంటి నిబంధనలు లేవు” అని గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ఆదినారాయణ చెప్పారు.
‘ఊరి సమస్య, సర్పంచ్ కు సంబంధం లేదు’
రజకులకు సహయం చేయవద్దంటూ ఊరిలో దండోరా వేశారంటే అది సర్పంచ్‌కు తెలియకుండా ఉంటుందా? అని రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉషశ్రీ ప్రశ్నించారు.
ఈ విషయంపై బాతువ గ్రామ సర్పంచ్ కళ్యాణి వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆమెకు మద్దతు పలుకుతున్న గ్రామస్థులు ఆమెకు ఈ విషయంలో సంబంధం లేదు, ఇది ఊరి సమస్య అని అన్నారు.
సరకులు అమ్మకపోవడం నేరం, రాజ్యంగ విరుద్ధం: లాయర్
ఈ వివాదంలో ఇరు వర్గాలు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిదేనని, కానీ రజకుల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారించడం సరికాదని విశాఖపట్నం జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధి, సీనియర్ లాయర్ పృథ్వీరాజ్ అన్నారు.
“నిత్యావసర సరకులు అమ్మకపోవడం నేరం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. మాకు ఈ పని నచ్చలేదు, చేయం అని చెప్పే హక్కు దేశంలోని ప్రతి ఒక్కరికి ఉంది. దానిని కాదని, బలవంతంగా ఆ పనే చేయాలని చెప్పడం మాత్రం నేరం. అలా చేస్తే రాజ్యంగంలోని 14. 19, 21 ఆర్టికల్స్ ద్వారా కల్పించిన జీవించే, మాట్లాడే, ఇష్టమైన వృత్తిని చేసుకునే హక్కుని కాలరాసినట్లే. చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించుకున్నంత వరకు బాగుంది. కానీ అది ఆచరణలో చూపించాలి. లేదంటే హైకోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించాలి” అని పృథ్వీరాజ్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత రాష్ట్ర సమితి: జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి.? ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ'ని దాటుకుని జాతీయ నాయకుడు కాగలరా?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ'ని దాటుకుని జాతీయ నాయకుడు కాగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













