హైదరాబాద్‌లో మరో దారుణం: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని నడి బజారులో నరికి చంపేశారు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లో మరో యువకుడి హత్య కలకలం రేపింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అత్యంత రద్దీగా ఉండే బేగంబజార్ ప్రాంతంలో జనం తిరుగుతోన్న సమయంలోనే ఒక యువకుడిని ఇరవైసార్లు పొడిచి చంపారు.
రాజస్థానీ మూలాలున్న మార్వాడీ మాలి క్షత్రియ వర్గానికి చెందిన నీరజ్ కుమార్ పన్వర్, మధ్యప్రదేశ్ మూలాలున్న గౌలి యాదవ కులానికి చెందిన సంజనలు ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఆర్యసమాజ్‌లో జరిగింది. వీరికి నెలల వయసున్న బాబు ఉన్నాడు.
అబ్బాయిపై కోపం పెంచుకున్న సంజన కుటుంబ సభ్యులు ఈ హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక అంచనా.

ఫొటో సోర్స్, UGC
నీరజ్ కుమార్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. నీరజ్, సంజనలు పెళ్లి చేసుకున్నపుడు.. నీరజ్ తనకు ప్రాణ హాని ఉందని అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో హత్య జరిగింది. నీరజ్ రోడ్డు దాటుతుండగా ముందుగా గ్రానైట్ రాయితో మోదారు. తరువాత కొబ్బరి బొండాల కత్తితో పొడిచారు. అతని హత్యకు చాలాకాలం నుంచి ప్రణాళిక వేస్తూ, కొంతకాలంగా అతని రాకపోకలు గమనిస్తూ ఉన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఘటన సమాచారం అందుకున్న షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ హత్య బేగంబజార్‌లో కలకలం రేపింది. స్థానిక వ్యాపారులు అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. శనివారం బేగంబజార్ బంద్‌కి పిలుపునిచ్చారు.
ఘటనపై బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనలో ఇప్పటి వరకూ పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి:
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం,10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారించాలి - విచారణ కమిషన్ సిఫారసు
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









