హైదరాబాద్: ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడిని నడిరోడ్డుపై చంపిన యువతి అన్న

ఫొటో సోర్స్, UGC
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘నేను ఎంత బతిమాలినా మా అన్న, ఆయనతో వచ్చిన మరొకరు రాడ్డుతో, కత్తితో నాగరాజుపై దాడి చేస్తూనే ఉన్నారు. నా ముందే నా భర్తను చంపేశారు. ఎవ్వరూ నా భర్తను కాపాడలేకపోయారు. మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం’ అంటూ ఆశ్రీన్ తన భర్త నాగరాజుని రక్తపు మడుగులో చూస్తూ చెప్పిన మాటలివి.
ముస్లిం యువతి ఆశ్రీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న దళిత యువకుడు నాగరాజు హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు.
బుధవారం(మే 4) రాత్రి 9 గంటల సమయంలో సరూర్ నగర్ మునిసిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని పంజా అనిల్ కుమార్ గాయత్రి నగర్ కాలనీ రోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ హత్య జరిగింది.
అబ్బాయి బిల్లిపురం నాగరాజు మాల కులానికి చెందినవారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రీన్ సుల్తానా, నాగరాజు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారని, వారిద్దరూ ఒకే స్కూల్లో, కాలేజీలో చదువుకున్నారని వివరించారు.
ఆశ్రీన్ తండ్రి చాలా కాలం కిందటే చనిపోయారు. నాగరాజును ఆశ్రీన్ ప్రేమించడం ఆమె అన్న సయ్యద్ మొబీన్ అహ్మద్‌కు నచ్చలేదని పోలీసులు చెప్పారు. వారిద్దరినీ ఒకరికొకరు దూరంగా ఉండాలని ఆయన బెదిరించారని కూడా తెలిపారు.

ప్రాణ భయంతో విశాఖ వెళ్లారు, కానీ..
పోలీసుల కథనం ప్రకారం... వికారాబాద్ నివాసి నాగరాజు తర్వాత హైదరాబాద్‌కు వచ్చి మారుతి షోరూంలో మార్కెటింగ్ విభాగంలో పనికి చేరారు. సరూర్‌నగర్‌లోని బృందావన్ కాలనీలో ఉంటున్న నాగరాజు స్వస్థలం వికారాబాద్ జిల్లా స్టేషన్ మార్పళ్లి.
జనవరిలో వికారాబాద్ వెళ్లిన నాగరాజు ఆశ్రీన్ సుల్తానాను కలిశారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు . అయితే తన ఇంట్లో వారు దీనికి ఒప్పుకోరని అర్థం చేసుకున్న ఆశ్రీన్, నాగరాజుతో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇంట్లోవాళ్లకు తెలియకూడదన్న ఆలోచన తో ఫోన్‌ను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఇద్దరూ హైదరాబాద్ చేరుకొని, ఆర్య సమాజ్‌లో జనవరి 31న పెళ్లి చేసుకున్నారు.
మరోవైపు ఆశ్రీన్ కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 1న కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఆశ్రీన్, నాగరాజులను విచారించారు.
ఇద్దరూ మేజర్లు అని తెలుసుకొని రెండు కుటుంబాల వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. నాగరాజు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకారం తెలిపారు. అయితే ఇదంతా జరిగిన తరువాత కూడా ఆశ్రీన్‌కు, నాగరాజుకు ఆశ్రీన్ అన్న మొబీన్‌పై అనుమానంగానే ఉండేది.
దీనితో వారు ఇద్దరు కొన్ని రోజులు హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకొని విశాఖపట్నం వెళ్లారు. పరిస్థితులు సద్దుమణిగాయనుకొని కొన్నాళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు.

‘మలక్‌పేట దగ్గరే చంపేద్దామనుకున్నారు’
"మొబీన్ మే 4 న దాడికి మొదట ప్రయత్నించాడు. రద్దీగా ఉండడంతో మొబీన్, ఆయన బావ మొహమ్మద్ మసూద్ దాడి చేయలేక వాళ్లను ఫాలో అవుతూ వచ్చారు . సరూర్ నగర్‌లోని అనిల్ కుమార్ కాలనీ దగ్గర దాడికి పాల్పడ్డారు’’ అని సరూర్ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
తమను మొబీన్ వెంబడిస్తున్నారన్నది నాగరాజు, ఆశ్రీన్‌లకు తెలియదని పోలీసులు వెల్లడించారు.
ఘటన స్థలంలో నాగరాజు బైక్‌ను నిందితులు ఎలా ఆపారు, విచక్షణ రహితంగా ఆయనపై ఎలా దాడి చేశారో సీసీటీవీ వీడియోలో కూడా కనిపించింది. ఆశ్రీన్ తన అన్నను, బావను బతిమాలే దృశ్యాలున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆ వీడియో లో ఆమె హృదయవిదారకంగా విలపిస్తున్న దృశ్యాలు అందరిని కలచివేశాయి.
నాగరాజు తలపై మొబీన్ రాడ్‌తో దాడి చేస్తూ ఉండగా, మసూద్ అహ్మద్ కత్తితో నాగరాజుపై దాడి చేశాడు. దీంతో నాగరాజు అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు.
అటు వెళుతున్న వారు , రోడ్‌పై వాహనాలలో వెళుతున్న వారు అందరు గుమికూడారు. పోలీసులకి సమాచారం అందించారు . పోలీసులు వచ్చే సమయానికే నాగరాజు చనిపోయారు.
నాగరాజు హత్య వార్త తెలుసుకున్న ఆయన తల్లి తండ్రులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. తమ కొడుకును హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడాలని, తమకు న్యాయం జరగాలని కోరారు.
"నా కొడుకు ఇంటర్మీడియట్ వరకు చదివాడు. హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటున్నాడు. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇప్పుడు ఉన్న ఒక కొడుకుని చంపారు. ప్రేమ పెళ్లి గురించి నాకు తెలియదు. నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. పెళ్లి అయినా తరువాత ఆశ్రీన్...తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పింది. మా బంధువులు సరూర్ నగర్ లో ఉంటారు. పెళ్లి తరువాత నా కుమారుడు సరూర్ నగర్ లో కాపురం పెట్టాడు. నా కుమారుడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలి. పోలీసులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా" అని నాగరాజు తండ్రి అన్నారు.

ఫొటో సోర్స్, UGC
మతాంతర వివాహం వల్లే హత్య: బండి సంజయ్
వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఘటనా స్థలానికి చేరుకుని, నాగరాజు హత్యపై నిరసన తెలిపాయి. నాగరాజు హత్యపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆయన మృతదేహాన్ని ఉంచిన ఉస్మానియా ఆసుపత్రి దగ్గర కూడా నిరసన తెలిపాయి.
ఈ ఘటనకు మతాంతర వివాహమే కారణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నడి రోడ్డుపై ఒక దళిత యువకుడిని చంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట కూడా ఆందోళనలు జరిగాయి. బాధితురాలికి ప్రభుత్వం తరఫున తగిన నష్ట పరిహారం అందేలా, అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తామని అధికారులు, పోలీసులు చెప్పారు .

ఫొటో సోర్స్, UGC
మతం కోణం లేదు: పోలీసులు
ఈ హత్యలో మతం కోణం లేదని పోలీసులు చెబుతున్నారు . ఈ కేసులో దర్యాప్తు ఇంకా జరుగుతోందని, నిందితుల ఆలోచనలు ఏమిటనేది ఇప్పుడే చెప్పలేమని డీసీపీ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు.
ఆశ్రీన్ మానసికంగా చాలా కుంగి పోయారని, ఆమె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని పోలీసులు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: 111 జీవో రద్దు ఎవరి కోసం... ఫామ్‌హౌస్‌ల స్థానంలో ఆకాశహర్మ్యాలు వస్తాయా?
- ఇన్వర్టర్ను ఎలా ఎంచుకోవాలి... ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన 8 సూత్రాలు
- ప్రమోద్ మహాజన్ హత్య: ఎందుకు చేశారు? ఆ రోజు ఆయన ఇంట్లో అసలేం జరిగింది?
- డ్రోన్లు భారత వైద్య పరిశ్రమలో పెనుమార్పులు తెస్తాయా?
- CIA: అమెరికా గూఢచార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారతీయ అమెరికన్ నంద్ మూల్‌చందనీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











