ప్రమోద్ మహాజన్‌ను సొంత తమ్ముడే ఎందుకు హత్య చేశాడు?

ప్రమోద్ మహాజన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రమోద్ మహాజన్
    • రచయిత, మయాంక్ భగవత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముంబయిలోని హిందూజా ఆస్పత్రిలో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ మే 3, 2006న తుది శ్వాస విడిచారు. అయితే, ఆయన హత్య విషయంలో ఒక ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.

ప్రవీణ్ మహాజన్ ప్రమోద్ మహాజన్‌ను ఎందుకు చంపారు? అన్నదే ఆ ప్రశ్న.

ప్రవీణ్ మహాజన్ నాసిక్ జైలులో తన సోదరుడి హత్యకు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న సమయంలో "మై ఆల్బమ్" (మాఝా ఆల్బమ్) అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం తుపాను సృష్టించింది. ప్రవీణ్ మహాజన్ రాసిన పుస్తకంలోని కొంత భాగం వార్తాపత్రికల్లో ప్రచురితమైంది. '' ఇదంతా ఎవరు, ఎందుకు చేశారో ప్రజలకు ఎప్పటికీ తెలియదు" అని పుస్తకంలో పేర్కొన్నారు.

ప్రమోద్ మహాజన్

ఫొటో సోర్స్, AFP

ఆ రోజు ఏం జరిగింది?

అది 22 ఏప్రిల్ 2006. శనివారం, సమయం-ఉదయం 7.30

బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ ముంబైలోని వర్లీ ప్రాంతంలోని తన 'పూర్ణ' రెసిడెన్సీలో వార్తాపత్రిక చదువుతున్నారు. టీ కప్పు ఆయన ముందు ఉంది. టీవీలో వార్తలు నడుస్తున్నాయి.

ఆ రోజు మహాజన్‌ను పెద్ద నాయకులు, కార్యకర్తలు ఎవరూ సందర్శించలేదు. మహాజన్ తెల్లని కుర్తా ధరించి ఉన్నారు. ఎప్పటిలాగే తన రోజువారీ పనుల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారాయన.

అంతలో డోర్ బెల్ మోగింది. ఆయన తమ్ముడు ప్రవీణ్ మహాజన్ వచ్చారు. ఆ రోజు ఆయన జీన్స్, టీ షర్ట్ వేసుకుని ఉన్నారు. ప్రవీణ్ మహాజన్ ప్రమోద్ మహాజన్ ఇంటికి అరుదుగా వస్తుంటారు. ఆయన రాకను ప్రమోద్ మహాజన్ ఊహించి ఉండకపోవచ్చు.

'' ఏం పని మీద వచ్చావు'' అని ప్రమోద్ మహాజన్ సోదరుడు ప్రవీణ్ ను అడిగారు. దీనికి ఆయన ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఆయన కంప్లయింట్లలో మొదటిది, తనను కలవడానికి టైమ్ ఇవ్వడం లేదు. రెండోది, వ్యాపారంలో సహాయం చేయడం లేదు.

అన్నదమ్ములు ఇద్దరి మధ్య కాసేపు చర్చలు నడిచాయి. ఉదయం 7.40 సమయంలో హఠాత్తుగా ప్రవీణ్ మహాజన్ తనతో తెచ్చుకున్న 32 బోర్ పిస్టల్‌తో ప్రమోద్ మహాజన్‌ పై పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరిపారు. మహాజన్ ఛాతీ కింద మూడు బుల్లెట్లు దిగాయి.

ముంబై పోలీసులు విలేఖరులకు అందించిన సమాచారం ప్రకారం, "ప్రవీణ్ మహాజన్ నాలుగో బుల్లెట్ కాల్చడానికి ప్రయత్నించారు. కానీ అతని పిస్టల్ జామ్ అయ్యింది. దీంతో ఆయన మళ్లీ కాల్చలేకపోయారు. ఆ సమయంలో ఆయన పిస్టల్‌లో తొమ్మిది బుల్లెట్లు ఉన్నాయి''

ప్రవీణ్ మహాజన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రవీణ్ మహాజన్

'పూర్ణ' రెసిడెన్సీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడ పని చేస్తున్నవారు పరుగులు పెట్టారు. ప్రమోద్ మహాజన్ భార్య రేఖా మహాజన్ సహాయం కోసం గోపీనాథ్ ముండే ఇంటికి పరిగెత్తారు. ముండే అదే భవనంలో 12వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. విషయం తెలియగానే ముండే మహాజన్ ఇంటికి హడావుడిగా వచ్చారు.

ఆ రోజు ఏం జరిగిందో ప్రమోద్ మహాజన్ భార్య రేఖా మహాజన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ‘‘నేను బెడ్ రూమ్‌లో ఉండగా తుపాకీ కాల్పులు వినిపించాయి. బయటకు వచ్చినప్పుడు, ప్రవీణ్ మహాజన్ తన పిస్టల్‌తో ప్రమోద్ మహాజన్‌ను కాల్చడం చూశాను" అని చెప్పారామె.

వీడియో క్యాప్షన్, బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఎందుకు?

"నేను పెద్దగా అరిచాను. ప్రవీణ్ ఏం చేస్తున్నావ్ అన్నాను. ఆయన్ను నెట్టేయడానికి ప్రయత్నించాను. కానీ నన్ను దూరంగా నెట్టారు. ''నా మాట వినలేదు. ఇప్పుడు అనుభవించు'' అని ప్రవీణ్ అన్నారు'' అని రేఖ కోర్టుకు చెప్పారు.

ప్రమోద్ మహాజన్‌పై కాల్పులు జరిపిన తర్వాత ప్రవీణ్ మహాజన్ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చారు. ఎవరితోనూ మాట్లాడకుండా 15 అంతస్తుల మెట్లు దిగారు. తన వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచి, క్యాబ్‌లో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిపోయారు.

ప్రవీణ్ మహాజన్

ఫొటో సోర్స్, Huw Evans picture agency

ఫొటో క్యాప్షన్, సోదరుడిని చంపిన కేసులో ప్రవీణ్ మహాజన్ ను కోర్టు దోషిగా గుర్తించింది

నమ్మలేకపోయిన పోలీసులు

అప్పుడు సమయం ఉదయం 8.30 గంటలు అవుతోంది. నైట్ షిఫ్ట్‌లో ఉన్న వర్లి పోలీస్ స్టేషన్ అధికారులు డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరబోతున్నారు. ప్రవీణ్ మహాజన్ ప్రశాంతంగా చేతిలో పిస్టల్‌తో పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లారు. అక్కడ లొంగిపోయారు.

''ప్రమోద్ మహాజన్‌ని కాల్చిచంపాను'' అని మరాఠీలో అధికారులకు చెప్పారు.

ప్రవీణ్ మహాజన్ అప్పటికి తెలిసిన వ్యక్తి కాకపోవడంతో డ్యూటీలో ఉన్న పోలీసులు మొదట నమ్మలేదు. తర్వాత ప్రవీణ్ మహాజన్‌ను అరెస్టు చేశారు.

ప్రమోద్ మహాజన్ తీవ్రంగా గాయపడి ఉన్నారు. గోపీనాథ్ ముండే అదే భవనంలో నివాసం ఉంటున్న డాక్టర్ విజయ్ బాంగ్‌కు ఫోన్ చేశారు. "నేను వారి ఇంటికి చేరుకున్నప్పుడు మహాజన్ కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయనకు రక్తపోటు చాలా తక్కువగా ఉంది'' అని డాక్టర్ బాంగ్ 'ఇండియా టుడే'తో చెప్పారు.

ప్రమోద్ మహాజన్

ఫొటో సోర్స్, Getty Images

గోపీనాథ్ ముండే, రేఖా మహాజన్‌లు ప్రమోద్ మహాజన్‌ను హిందూజా ఆసుపత్రిలో చేర్చారు. ప్రమోద్ మహాజన్ ప్రజాప్రతినిధి కావడంతో వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు.

''ఆసుపత్రికి తరలించే సమయంలో ప్రమోద్ మహాజన్‌ స్పృహలో ఉన్నారు. నేనేం తప్పు చేశానని ప్రవీణ్ నన్ను కాల్చారు అని ముండేని అడిగారు'' అని రేఖా మహాజన్ కోర్టుకు తెలిపారు.

ప్రవీణ్ మహాజన్ నేరాన్ని అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. వర్లి పోలీస్ స్టేషన్ కంటోన్మెంట్ జోన్‌గా మారింది. చాలా మంది రిపోర్టర్లు, టీవీ ఛానెళ్ల లైవ్ వ్యాన్‌లు నిమిషాలలో అక్కడికి చేరుకున్నాయి.

అరెస్టు అనంతరం ప్రవీణ్ మహాజన్‌ను ముంబైలోని భోయివాడ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పోలీసులు ప్రవీణ్‌ మహాజన్‌ పై సెషన్స్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

గోపీనాథ్ ముండే, ప్రమోద్ కుమారుడు రాహుల్ మహాజన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోపీనాథ్ ముండే, ప్రమోద్ కుమారుడు రాహుల్ మహాజన్

శిక్ష ఖరారు...కానీ..

ప్రమోద్ మహాజన్ హత్య కేసులో ప్రవీణ్ మహాజన్‌ దోషి అని ముంబై సెషన్ కోర్టు 2007లో ప్రకటించి, జీవిత ఖైదు విధించింది. ప్రమోద్ మహాజన్ కేసులో సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు.

"ప్రవీణ్ మహాజన్ అప్పుడు అలా ఎందుకు చేశారో ఎవరికీ తెలియదు" అని ఆయన బీబీసీతో అన్నారు. 14 రోజుల సెలవుపై జైలు నుంచి బయటకు వచ్చిన ప్రవీణ్ మహాజన్‌ ను కొన్ని మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించాయి.

''ప్రమోద్‌ని నేను చంపలేదు. ఇది వాస్తవం. మీరు నమ్మగలరా? నేను దాని గురించి ఆలోచించడం లేదు. ఈ సంఘటన పదే పదే నా కళ్లలో మెదులుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ, నేను దాని గురించి ఆలోచించడం లేదు'' అని డీఎన్‌ఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ అన్నారు.

"కొన్ని విషయాలు మన ఊహకు అందవు. ఈ సంఘటన 15 నిమిషాల వ్యవధిలో జరిగింది. నాకు చాలా విషయాలు గుర్తున్నాయి. 2006, ఏప్రిల్ 22 నాటివి మాత్రమే కాదు. నాకు అన్నీ గుర్తున్నాయి'' అని ప్రవీణ్ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, నరమేధం అంటే ఏంటి?

ప్రవీణ్ మహాజన్, ప్రమోద్ మహాజన్ మధ్య ఆ రోజు అసలు ఏం జరిగింది ? కాల్పులు జరపడానికి 15 రోజుల ముందు ప్రవీణ్ మహాజన్ ప్రమోద్ మహాజన్‌కి ఏం మెసేజ్ చేశారు? అన్నది సస్పెన్స్ గా మారింది.

"ఇప్పుడు అక్కడ బిచ్చమెత్తుకోవడం లేదు, యుద్ధం మాత్రమే ఉంది. జీవితంలో విజయమో, మరణమో ఏదో ఒకటి ఉంటుంది'' ఇది మెసేజ్ సారాంశం.

ఈ మెసేజ్‌ను దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కోర్టు సాక్ష్యంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)