నరేంద్ర మోదీ మహిళా ఓటర్లను ఎలా ఆకర్షిస్తున్నారు? ఫెమినిస్ట్‌లు లేకపోయినా బీజేపీకి మహిళల ఓట్లు ఎందుకు పడుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
ప్రతీ పురుషుని విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు.
కానీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయం వెనుక కొన్ని లక్షల మంది మహళలున్నారని ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి - మార్చి నెలల్లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా బీజేపీకి ఓటు వేశారని రెండు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ జనాభా బ్రెజిల్ కంటే ఎక్కువ.
1962 నుంచి ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లను జెండర్ ఆధారంగా వర్గీకరించడం మొదలుపెట్టింది. జాతీయ స్థాయిలో మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఓటు వేస్తుండేవారు.
కానీ, 2019లో మొదటిసారి బీజేపీ పార్టీకి మహిళల ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి.
బీజేపీలో ఫెమినిస్ట్‌ల సంఖ్య చాలా తక్కువ. పార్టీ నాయకులు చాలా సార్లు మహిళల పట్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో జరిగిన అత్యాచార కేసుల పట్ల వ్యవహరించిన తీరు అంతర్జాతీయ మీడియా శీర్షికలకు కూడా చేరింది.
దేశంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు కూడా మహిళలే నేతృత్వం వహించారు.
కానీ, బీజేపీకి అధిక సంఖ్యలో మహిళలు ఓటు వేసినట్లు డేటా సూచిస్తోంది.
మహిళలు బీజేపీని ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
"మోదీ వల్లే మహిళలు బీజేపీకి ఓటు వేశారు" అని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)కు చెందిన సంజయ్ కుమార్ చెప్పారు.
"ఈ పార్టీ మహిళలను అకస్మాత్తుగా ఆకర్షించలేదు. ఇందులో మోదీ చాలా ప్రధాన పాత్ర పోషించారు" అని ఆయన అన్నారు.
ఈ అంశం గురించి 'ది న్యూ బీజేపీ' అనే పుస్తకాన్ని రచిస్తున్న రచయత, రాజకీయ విశ్లేషకులు నలిన్ మెహతా అధ్యయనం చేశారు.
1980లో పార్టీలో మహిళా విభాగం మొదలుపెట్టినప్పటి నుంచే మహిళల దగ్గరకు చేరడం ప్రారంభమయిందని అన్నారు.
"బీజేపీలో కొంత మంది శక్తివంతమైన, ముఖ్యమైన మహిళా నాయకులు కూడా ఉన్నారు. పార్టీ మహిళలకు సంబంధించిన అంశాల పై కొన్ని కీలకమైన హామీలు కూడా చేసింది. కానీ, కొన్ని దశాబ్దాల వరకు మహిళలు బీజేపీకి ఓటు వేయలేదు. ఈ పార్టీలో పితృస్వామ్యాన్ని సమర్ధించే పురుషులు ఉంటారని భావించేవారు. దీంతో, ఈ పార్టీ పట్ల మహిళలు ఆకర్షితులు కాలేదు" అని అన్నారు.
మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యేందుకు 2007లో ఎన్నికల్లో పోటీ చేయడం 2019లో జాతీయ స్థాయిలో భారీ మార్పు చోటు చేసుకోవడానికి దారి తీసిందని అన్నారు.
మహిళలకు ఎంతో మర్యాద ఇచ్చి మోదీ మాట్లాడటం అదే తొలిసారి అని మెహతా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల ర్యాలీల్లో ఆయనకున్న 56 అంగుళాల ఛాతీ గురించి మాట్లాడేవారు. హిందీ భాషా రాష్ట్రాల్లో పురుషుల బల ప్రదర్శన గురించి ఇలా మాట్లాడటం సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది.
"ఆయన తన శారీరక సౌష్టవం గురించి చెప్పిన ప్రతి సారీ ముఖ్యంగా మహిళల వైపు నుంచి ఒక సుదీర్ఘమైన శ్వాస వినిపిస్తుంది. చాలా సార్లు ఆయన నిర్వహించే ర్యాలీల్లో కూడా పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలుంటారు. 'నేను మీ సోదరుడిని. నేను మీ కుమారుడుని. నాకు ఓటు వేయండి. నేను మీ ప్రయోజనాల కోసం కష్టపడతాను' అని అంటూ ఉంటారు" అని మెహతా చెప్పారు.
కానీ, పురుషత్వానికి కూడా కొన్ని హద్దులుండటంతో ఆయనకున్న ఆల్ఫా పురుషుని (దేన్నైనా సరిచేయగలడు అనే) ప్రతిష్టను మహిళల కోసం ఉద్దేశించిన అభివృద్ధి పథకాలతో కలిపి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది ఆయనకు చాలా ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. 2007, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు దారి తీసింది.
ఆయన 2014లో సాధారణ ఎన్నికలు గెలిచే నాటికి ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో నిష్ణాతులయ్యారు.
ఆయన తొలిసారి ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అత్యాచారాలను ఖండించారు. కొడుకులను సక్రమంగా పెంచమని తల్లితండ్రులకు సలహా ఇచ్చారు.
2014 - 2019 మధ్యకాలంలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో, ప్రసంగాల్లో మహిళల సమస్యల గురించి మాట్లాడుతూ "మోదీ మార్పుకు కారకం అయ్యారు" అని మెహతా అంటారు. ఆయన మాట్లాడిన ఐదు ప్రధాన అంశాల్లో మహిళల ప్రస్తావన ఎక్కువసార్లు వచ్చింది.
కానీ, బీజేపీ ఆయన వ్యక్తిగత ఆకర్షణ మాత్రమే ఆధారపడకుండా, రాజకీయాల్లో కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వడం మొదలుపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
2019లో ఇతర పార్టీలేవీ ప్రాతినిధ్యం ఇవ్వలేని స్థాయిలో మహిళా అభ్యర్థులకు సీట్లను కేటాయించింది. క్యాబినెట్ లో గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేనంత మంది మహిళా మంత్రులను నియమించింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని సమూలంగా మార్పులు చేశారు. మహిళలకు ప్రత్యేక కోటాలు కల్పించి, గ్రామీణ, పేద వర్గాల వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించే విధంగా వివిధ సామాజిక వర్గాలకు చేరువయ్యారు.
బీజేపీకి మద్దతిచ్చే మహిళల్లో గ్రామీణ మహిళలు, దారిద్య్ర రేఖకు దిగువ ఉండే మహిళలు ఎక్కువగా ఉన్నారని మెహతా చెప్పారు.
వారిని లక్ష్యంగా చేసుకుని పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించింది.
2014-2019 మధ్యలో ప్రభుత్వం కేటాయించిన 17 లక్షల గృహాల్లో 68శాతానికి పైగా గృహాలను మహిళల పేరిట లేదా పురుషులతో కలిపి ఉమ్మడి ఆస్తిగా రిజిస్టర్ చేయించారు. పితృస్వామ్యం బలంగా నాటుకుపోయిన దేశంలో, మహిళలకు ఆస్తి హక్కు ఉండటం కూడా కష్టమైన విషయమే.
ప్రభుత్వం కొన్ని లక్షల టాయిలెట్లను నిర్మించింది. మహిళలు పెన్షన్‌లు, ఇతర సబ్సిడీలు నేరుగా తీసుకునేందుకు బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు సహాయపడింది.
"అమ్మాయిలను ఉయ్యాల నుంచి స్మశానం వరకు చూసుకునే సంక్షేమ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నాం అని మోదీ తరచూ చెబుతుండటం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఈ పథకాలన్నీ లోపభూయిష్టం కావు. కానీ, ఇవి కొంత వరకు మార్పుకు కారణమవుతున్నాయి" అని మెహతా అన్నారు.
"వీటన్నిటి వల్ల చాలా మంది మహిళా ఓటర్లు మిగిలిన పార్టీల కంటే ఈ పార్టీ ఉత్తమం అని భావిస్తున్నారు" అని అన్నారు.
"కానీ, వ్యక్తులను చూసుకుని ఒక వర్గం అందించే మద్దతు ఎక్కువ కాలం ఉండదు" అని అశోక యూనివర్సిటీలో మీడియా స్టడీస్ హెడ్ మాయా మీర్‌చందాని అన్నారు.
"మోదీ ఆకర్షణీయత మంత్రాన్ని వాడి మద్దతుదారుల సానుభూతిని కూడగట్టుకుంటూ ఉండి ఉంటారు. ఆయనను వారు సాధారణ జీవితం గడుపుతున్న ఒక సాదా సీదా వ్యక్తిగా చూస్తూ ఉండవచ్చు. ఆయన ఆడంబరంగా ఉండకపోవడంతో వారికి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ, ఆయనకు 71 సంవత్సరాలు. ఈ ఆకర్షణ వయసుతో పాటు మాసిపోతుంది" అని అన్నారు.
"ఆయన ఆకర్షణ శక్తి భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలన్నిటినీ రూపుమాపుతుందేమో చూడాలి" అని అన్నారు.
"దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పెట్రోల్ ధరలు, ద్రవ్యోల్బణం మధ్యలో మతపరమైన ఉనికి చుట్టూ చేస్తున్న రాజకీయాలు మాత్రమే ఆయన మద్దతుదారులను కట్టి ఉంచుతున్నాయి. కానీ మతపరమైన కలహాలు చేతులు దాటి, ఆర్ధిక వ్యవస్థను ఊబి లోంచి బయటకు లాగకపోతే, ఇంటిని నడిపించే మహిళలే ఆయనకు వ్యతిరేకంగా కూడా వెళ్లే అవకాశం ఉంది" అని ఆమె అన్నారు.
"ఇప్పటికయితే ఆ పరిస్థితి ఇంకా రాలేదు. కానీ, అదెప్పుడైనా రావచ్చు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హాలీవుడ్ సెన్సేషన్ 'మెర్ల్ ఓబెరాన్': బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ భారతీయ తారను మనం మరిచిపోయామా?
- హనుమాన్ జయంతి: దిల్లీ జహాంగీర్‌పురీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, పోలీసులకు గాయాలు... 14 మంది అరెస్ట్
- తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం
- గవర్నర్ విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ఏంటి?
- కందుకూరి వీరేశలింగం: చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాశారు, 40 వితంతు వివాహాలు జరిపించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















