హాలీవుడ్‌ సెన్సేషన్‌ 'మెర్ల్ ఓబెరాన్': బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ భారతీయ తారను మనం మరిచిపోయామా?

మెర్ల్ ఓబెరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెర్ల్ ఓబెరాన్
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

బ్లాక్ అండ్ వైట్ యుగం నాటి హాలీవుడ్ తార మెర్ల్ ఓబెరాన్ గురించి ఆమె పుట్టిన భారతదేశంలో ఎవరికీ గుర్తు లేదు.

ఓబెరాన్ 1911లో బొంబాయి (ప్రస్తుత ముంబయి)లో పుట్టారు. ఆమె ఆంగ్లో ఇండియన్ కుటుంబానికి చెందినవారు.

ఉథెరింగ్ హైట్స్ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. హాలీవుడ్ స్వర్ణయుగంలో నిర్మించిన చలన చిత్రాల్లో నటించిన ఈ నటి వ్యక్తిగత జీవితాన్ని మాత్రం రహస్యంగానే ఉంచారు.

ఓబెరాన్ ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి దక్షిణ ఆసియా నటి అని అమెరికాకు చెందిన రచయత మయూఖ్ సేన్‌కు 2009లో మొదటిసారి తెలిసింది.

ఓబెరాన్ సినిమాలు చూసిన తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. దాంతో, ఆయన ఆమె గతం గురించి లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టారు.

"మనుషుల్ని వారి వారి ప్రత్యేక వ్యక్తిత్వాలతో ఆమోదించడానికి ఈ సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉండదు. అలాంటి విరుద్ధ భావాల సమాజంలో సొంత ఉనికి కొంతవరకు దాచి పెట్టి ఉంచడాన్ని అర్థం చేసుకోవచ్చు" అని ఆయన అన్నారు. సేన్ దక్షిణాసియా దృక్కోణం నుంచి ఓబెరాన్ కథను చెబుతూ ఆమె జీవిత కథ రాసే పనిలో ఉన్నారు.

ఆమె పుట్టినప్పుడు పెట్టిన పేరు ఎస్టెల్ మెర్ల్ ఓ బ్రీన్ థాంప్సన్. ఆమె తల్లి సింహళ - మావ్రి జాతికి చెందిన వారు. కాగా, తండ్రి బ్రిటిష్ జాతీయుడు.

1914లో ఓబెరాన్ తండ్రి మరణం తర్వాత ఆమె కుటుంబం కోల్‌కతాకు వెళ్లింది. ఆమె 1920లో కోల్‌కతా అమెచ్యూర్ థియేట్రికల్ సొసైటీలో నటనలో కెరీర్ మొదలుపెట్టారు.

1925లో ఆమె మూకీ సినిమా 'ది డార్క్ ఏంజెల్'‌లో నటించిన విల్మా బాంకీని చూసి సినిమాల్లో నటించాలనే స్ఫూర్తిని పొందారని సేన్ చెబుతారు.

ఒక ఆర్మీ కల్నల్ ఆమెను రెక్స్ ఇంగ్రామ్ అనే డైరెక్టర్‌కు పరిచయం చేయడంతో ఆమె 1928లో ఫ్రాన్స్ వెళ్లారు. ఆయన సినిమాల్లో ఆమెకు చిన్న చిన్న పాత్రలు ఇచ్చారు.

ఓబెరాన్ తల్లి షార్లెట్ సెల్బీ సహాయకురాలిగా ఆమె వెంట వెళ్లారు. ఆమె నల్లగా ఉండేవారు.

మెర్ల్ ఓబెరాన్ , లారెన్స్ ఒలీవియర్

ఫొటో సోర్స్, Archive Photos

ఫొటో క్యాప్షన్, మెర్ల్ ఓబెరాన్ , లారెన్స్ ఒలీవియర్

నిజానికి, సెల్బీ ఓబెరాన్‌కు తల్లి కాదని 2014లో విడుదల అయిన 'ది ట్రబుల్ విత్ మెర్ల్' అనే డాక్యుమెంటరీ ద్వారా తెలిసింది. ఆమె ఓబెరాన్ అమ్మమ్మ. షార్లెట్ కూతురు కాన్స్‌టన్ టీనేజీలో ఉండగానే ఓబెరాన్ కు జన్మనివ్వడంతో, ఆమె కొన్నేళ్లపాటు తల్లీ కూతుర్లిద్దరినీ అక్కచెల్లెల్లా పెంచారు.

సర్ అలెగ్జాండర్ కోర్డా దర్శకత్వం వహించిన 'ప్రైవేట్ లైఫ్ ఆఫ్ హెన్రీ VIII (1933)లో ఆమె నటించిన ఆనీ బోలీన్ పాత్రతో ఓబెరాన్ సినిమా కెరీర్ మలుపు తిరిగింది. ఆమె అలెగ్జాండర్ కోర్డాను పెళ్లి చేసుకున్నారు.

ఓబెరాన్ జాతీయత గురించి చెప్పేందుకు ప్రచారకర్తలు ఒక కొత్త నేపథ్య కథనాన్ని రూపొందించారు.

వీడియో క్యాప్షన్, విల్ స్మిత్: తన పెళ్లాంపై కుళ్లు జోకు వేసిన కమెడియన్‌‌ చెంప పగలగొట్టిన హాలీవుడ్ హీరో

"ఆమె టాస్మానియాలో పుట్టారనే కథనాన్ని సృష్టించారు. ఈ దేశం అమెరికాకు, యూరప్‌కు కూడా దూరంగా ఉండటంతో పాటు దాన్ని ఆస్ట్రేలియా దేశంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని 'ట్రబుల్ విత్ మెర్ల్' డైరెక్టర్ మేరీ డెలోస్కి తన డాక్యుమెంటరీ కోసం రాసిన నోట్స్‌లో పేర్కొన్నారు.

ఓబెరాన్‌ను ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించడం మొదలుపెట్టారు. ఆమె తండ్రి వేటకు వెళ్ళినప్పుడు జరిగిన ప్రమాదంలో మరణించడంతో ఆమె కుటుంబం భారతదేశానికి వలస వెళ్ళినట్లు కథను సృష్టించారని డెలోస్కి చెప్పారు.

టాస్మానియాలో ప్రజలు ఓబెరాన్ ను తమ దేశానికి చెందిన వ్యక్తిగా పరిగణించడం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా మీడియా తమ దేశానికి చెందిన వ్యక్తి అనే భావనతో గర్వంగా, ఆసక్తిగా ఆమెను బాగా అనుసరించేది. ఆమె కూడా టాస్మానియాను ఆమె జన్మస్థలంగా ప్రకటించారు. ఆమె కోల్‌కతా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

మెర్ల్ ఓబెరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెర్ల్ ఓబెరాన్

కానీ, కోల్‌కతా మాత్రం ఆమెను గుర్తు పెట్టుకుంది. "1920, 30లలో ఇంగ్లిష్ వ్యక్తులు రాసిన స్వీయ చరిత్రల్లో ఆమె ప్రస్తావన కనిపిస్తుంది" అని సునంద కే దత్త రే అనే విలేఖరి చెప్పారు.

"ఆమె ఈ నగరంలోనే పుట్టారు. ఇక్కడ ఆమె టెలీఫోన్ ఎక్స్ చేంజ్‌లో స్విచ్ బోర్డు ఆపరేటర్‌గా పని చేసేవారని, ఫర్పో రెస్టారెంట్‌లో నిర్వహించిన పోటీలో కూడా గెలిచారని చెబుతారు."

ఆమెకు హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రావడంతో ఓబెరాన్ అమెరికా వెళ్లిపోయారు. 1935లో 'ది డార్క్ ఏంజెల్' ‌లో ఆమె నటనకు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు.

కానీ, 1939లో ఆమె లారెన్స్ ఒలీవియర్‌తో ఉథెరింగ్ హైట్స్‌లో నటించిన నటనకు పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశాలు బలపడ్డాయి.

"ఆమెకు పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దాంతో, మరో భారతీయ మూలాలున్న నటి వివియన్ లే కంటే కూడా ఆమెకు ఎక్కువగా అవకాశాలు దొరికేవి" అని సేన్ చెప్పారు.

బ్రాంట్ రచనల్లో హీరోయిన్‌లో కనిపించే చికాకు, చంచల లక్షణాలను ఆమె నటనలో ఒడిసిపట్టుకున్నారు" అని న్యూ యార్క్ టైమ్స్ రివ్యూ పేర్కొంది.

1930ల చివరి నాటికి ఓబెరాన్ అగ్ర నటీమణుల జాబితాలోకి చేరిపోయారు" అని సేన్ చెప్పారు. ఆమె సంగీత దర్శకుడు కోల్ పోర్టర్, రచయత నోయెల్ కొవార్డ్ లాంటి వారి సన్నహిత వర్గాల్లోకి చేరిపోయారు.

మెర్ల్ ఓబెరాన్, అలెగ్జాండర్ కోర్డా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెర్ల్ ఓబెరాన్, అలెగ్జాండర్ కోర్డా

ఓబెరాన్ భాషలో దక్షిణ ఆసియా యాస పోగొట్టేందుకు కోర్డా, శామ్యూల్ గోల్డ్విన్ అనే నిర్మాత సహాయం చేసి సినిమా రంగంలో నిలదొక్కుకునేందుకు సహకరించారు.

కానీ, ఓబెరాన్ సినిమా స్క్రీన్ పై శ్వేత జాతీయురాలిలా కనిపించినప్పటికీ ఆమె దాచిపెట్టిన జన్మ రహస్యం ఆమెకు భారంగా మారింది.

"ఆమె మిశ్రమ జాతికి చెందిన వ్యక్తి అని వినిపించే మాటలను తగిన బదులు చెప్పాల్సిన అవసరం వచ్చేది. ఆమెలో ఉండే లేత నలుపు వర్ణాన్ని సినీ విలేఖరులు పసిగట్టేవారు" సేన్ చెప్పారు.

స్కిన్ వైటెనింగ్, బ్లీచింగ్ చికిత్సల వల్ల ఓబెరాన్ చర్మం నల్లబడిందని కొంత మంది వాదిస్తారు.

అయితే, 1937లో జరిగిన కారు ప్రమాదంలో ఓబెరాన్ కు గాయాలై, ఆమె ముఖంపై గీతలు పడ్డాయి. ఆ గీతలు కనిపించకుండా ఉండే టెక్నిక్‌ను లూసియన్ బలార్డ్ కనిపెట్టారు. ఓబెరాన్ 1937లో కోర్దాకు విడాకులిచ్చి 1945లో బలార్డ్ ను పెళ్లి చేసుకున్నారు.

"కెమెరా ముందు ఓబెరాన్ ముఖం కాంతిమంతంగా కనిపించేందుకు ఈ టెక్నిక్ ను వాడేవారు" అని సేన్ చెప్పారు.

ఆమె మేనల్లుడు మైకేల్ కోర్డా 1979లో చార్మ్డ్ లైవ్స్ కుటుంబ చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ప్రచురించారు.

ఆమె నిజమైన పేరును, స్వస్థలాన్ని బయటపెడితే కోర్టులో కేసు వేస్తానని బెదిరించడంతో ఆయన ఆమె వివరాలను బయటపెట్టలేదు.

మెర్ల్ ఓబెరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెర్ల్ ఓబెరాన్

"ఆమె పుట్టుక గురించిన నిజం చాలా వరకు బయటకు వచ్చినప్పటికీ కూడా ఆమె తన గతాన్ని చాలా వరకు రహస్యంగానే ఉంచేవారు" అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

"ఈ దాగుడుమూతల ఆట ఆడటం కష్టంగా మారింది. 1965లో ఓబెరాన్ బయటకు రావడం మానేశారు. ఆమె నేపథ్యం గురించి ఆస్ట్రేలియాలో జర్నలిస్టులు ఆసక్తి చూపించడంతో ఆమె ఆ దేశ పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు.

ఓబెరాన్ 1978లో టాస్మానియా వెళ్ళినప్పుడు తన ఉనికికి సంబంధించిన ప్రశ్నలు తలెత్తడంతో చాలా ఇబ్బందిపడ్డారు.

అయితే, ఆమె బహిరంగంగా ఎన్నడూ నిజాన్ని వెల్లడించలేదు. ఆమె 1979లో గుండెపోటుతో మరణించారు.

వీడియో క్యాప్షన్, మొహంజోదారో ప్రాంతంలో ఆర్కియాలజిస్టుల తవ్వకాలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి.

1983లో 'ప్రిన్సెస్ మెర్ల్: ది రొమాంటిక్ లైఫ్ ఆఫ్ మెర్ల్ ఓబెరాన్' అనే పుస్తకంలో ఆమె ఆంగ్లో ఇండియన్ వారసత్వం వెల్లడైంది. ఆమె బొంబాయిలో పుట్టినట్లు ఉన్న జన్మ ధ్రువీకరణ పత్రం, బాప్టిజం సర్టిఫికేట్, ఆమె బంధువుల దగ్గరున్న ఉత్తరాలు, ఫోటోలను ఈ పుస్తక రచయితలు సంపాదించారు.

తన లాంటి వారిని ఆమోదించే స్థితిలో లేని పరిశ్రమలో ఆమె పోరాడుతూ నిలదొక్కుకున్నారు. ఉత్తమ నటిగా రాణించారు. అయితే, ఒక దక్షిణాసియా మహిళగా ఆమె ఎదుర్కొన్న ఒత్తిళ్లను సేన్ తన పుస్తకం ద్వారా తెలియచేయాలని భావిస్తున్నారు.

"ఆ ఒత్తిళ్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఆమె వ్యక్తిత్వంపై తీర్పులు ఇవ్వడం కంటే కూడా హుందాగా ఆమెను అర్ధం చేసుకోవడం బాగుంటుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)