షాన్ కానరీ: 'జేమ్స్‌బాండ్' నటుడు మృతి - Newsreel

ఫొటో సోర్స్, PA Media
విఖ్యాత హాలీవుడ్ నటుడు, జేమ్స్‌బాండ్ హీరో సర్ షాన్ కానరీ(90) మృతిచెందారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్న కానరీ నిద్రలోనే మరణించారని వారు వెల్లడించారు.
ఏడు జేమ్స్‌బాండ్ సినిమాలలో నటించిన షాన్ కానరీ 1988లో విడుదలైన 'ది అన్‌టచబుల్స్' సినిమాకుగాను ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
'ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్', 'హైలాండర్', 'ఇండియానా జోన్స్', 'లాస్ట్ క్రూసేడ్', 'ది రాక్'లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1962 నుంచి జేమ్స్‌బాండ్ పాత్రలో నటిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వదేశంలో నివాళులు
సీన్ కానరీ మరణం తీరని లోటని, ఆయనకు దేశమంతా నివాళులర్పిస్తోందని స్కాట్‌లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలాస్ స్టర్జియాన్ అన్నారు. స్కాట్‌లాండ్ స్వాతంత్ర్యం కోసం ఆయన తపనపడేవారని స్టర్జియాన్ అన్నారు.
స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బరోలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సీన్ కానరీ, స్వయంకృషితో ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ప్రపంచ ప్రఖ్యాత నటులలో ఒకరుగా మారారు. జేమ్స్‌బాండ్ పాత్రలతోపాటు ఇంకా అనేక పాత్రలను ఆయన పోషించారు.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY VIA GETTY
టర్కీలో భూకంపం... 22 మంది మృతి
టర్కీలోని ఏజియన్ తీర ప్రాంతంలోనూ, గ్రీస్‌లోని సామోస్ దీవిలోనూ భారీ భూకంపం సంభవించింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయని.. భూకంప కేంద్రం టర్కీలోని ఇజ్మిర్ ప్రావిన్స్‌లో ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
టర్కీ అధికార వర్గాలు మాత్రం 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు చెబుతున్నాయి. ఇజ్మిర్ నగరంలో ఇప్పటివరకు 20 మంది మరణించారని, 786 మంది గాయపడ్డారని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గ్రీస్‌కు చెందిన సామోస్ దీవిలో ఇద్దరు మరణించారు.
భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ రావడంతో గ్రీస్‌లోనూ, ఇజ్మిర్‌లో కూడా నీరు పోటెత్తింది.
ఇజ్మిర్ నగరంలో మరిన్ని భవనాలు కూలిపోయే అవకాశం ఉండడంతో రాత్రికి రాతే అధికారులు సుమారు 2,000 మందికి పునరావాస కేంద్రాలను ఏరాటు చేసారు.
కూలిపోయిన భవనాల శిథిలాల కిందనుంచీ 70 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
భూమికి అడుగున 10 కిమీ లోతులో భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రకంపనలు ఏథెన్స్, ఇస్తాబుల్ వరకూ వ్యాపించాయని తెలిపింది. అయితే, టర్కీ ప్రభుత్వం మాత్రం భూమికి 16 కిమీ లోతులో ప్రకంపనలు వచ్చాయని అంటోంది.
టర్కీ, గ్రీస్‌లు రెండూ భూకంప ముప్పు ఉన్న ప్రాంతాలే. ఈ దేశాల్లో తరచూ భూకంపాలు వస్తుంటాయి.
టర్కీలోని మూడో అతి పెద్ద పట్టణమైన ఇజ్మిర్ నగరంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. కనీసం 20 భవనాలు కూలిపోయాయి.
ఒక బహుళ అంతస్తుల భవనం కూలిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
కూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయినవారి కోసం స్థానికులు వెతుకుతున్న వీడియోలూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
భూకంపం కారణంగా సముద్ర మట్టం పెరిగి నగరంలోకి వరద వచ్చినట్లు స్థానిక మీడియా చెబుతోంది. చేపలుపట్టేవారు కొందరు గల్లంతైనట్లూ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇప్పటివరకూ 20 మంది గల్లంతు అయ్యారని, అందులో ఒకరు నీళ్లల్లో మునిగిపోయినట్లు టర్కీ ఎమెర్జెన్సీ ఏజెన్సీ తెలిపింది.
ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారికోసం ప్రభుత్వం అన్ని రకాల సహాయ కార్యక్రమాలు చేపడుతుందని టర్కీ అధ్యక్షులు రిసిప్ తయ్యిప్ ఎర్దోవాన్ ప్రకటించారు.
భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ రావడంతో గ్రీస్‌లో సామోస్ దీవిలోకి నీరు పోటెత్తింది. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. గ్రీస్‌కి చెందిన మరో దీవి క్రెట్‌లోనూ భూకంప ప్రభావం కనిపించింది.

ఫొటో సోర్స్, Reuters

1999లో 17 వేల మంది మృతి
ఈ ఏడాది జనవరిలో టర్కీలోని ఎలాజిగ్ ప్రావిన్స్‌లో భూకంపం రావడంతో 30 మంది చనిపోయారు.
గత ఏడాది జులైలో గ్రీస్ రాజథాని ఏథెన్స్‌లో భూకంపం వచ్చింది.
1999లో టర్కీలోని ఇజ్మిత్ నగరంలో భూకంపం వల్ల 17 వేల మంది చనిపోయారు.
టర్కీ, గ్రీస్‌లు రెండూ భూకంప ముప్పు ఉన్న ప్రాంతాలే. ఈ దేశాల్లో తరచూ భూకంపాలు వస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా టు యూరప్.. పడవ మునిగి 140 మంది వలసదారుల జలసమాధి
యూరప్ చేరుకోవటానికి బయలుదేరిన వలసదారుల బోటు సెనెగల్ తీరంలో సముద్రంలో మునిగిపోయి 140 మంది జలసమాధి అయ్యారని ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది.
శనివారం నాడు ఈ దుర్ఘటన జరిగిందని.. ఆ సమయంలో బోటులో దాదాపు 200 మంది ప్రయాణిస్తున్నారని తెలిపింది.
బోటు ఎంబోర్ పట్టణం నుంచి బయలుదేరిందని.. అయితే కొద్దిసేపటికే నప్పంటుకుని నీటిలో మునిగిపోయిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) వివరించింది.
ఈ ఏడాది జరిగిన అత్యంత ఘోర సముద్ర ప్రమాదం ఇదేనని పేర్కొంది. ఈ ప్రమాదం నుంచి సుమారు 60 మందిని కాపాడారు.
స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల గుండా యూరప్ భూభాగం చేరుకోవటానికి ఈ వలసదారులు ప్రయత్నించిన్నట్లు భావిస్తున్నారు.
పశ్చిమ ఆఫ్రికా నుంచి యూరప్ చేరుకోవటానికి ఈ సముద్ర మార్గం అనువుగా ఉంటుందని 2018 నుంచి ప్రాచుర్యం పొందింది.
''ఎలాగైనా యూరప్ చేరుకోవాలనే యువత తపనను అవకాశంగా తీసుకునే ట్రాఫికింగ్, స్మగ్లింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేయటానికి ప్రభుత్వాలు, భాగస్వాములు, అంతర్జాతీయ సమాజం సమైక్యంగా పనిచేయాలని మేం కోరుతున్నాం'' అని సెనెగల్‌లోని ఐఎంఓ ప్రతినిధి బాకరీ డాంబియా చెప్పారు.
స్పెయిన్ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది కానరీ దీవులకు 11,000 మంది వలదారులు వచ్చారు. గత ఏడాది ఇదే కాలంలో 2,557 మంది వలసదారులు వచ్చారు.
అంతకుముందు 2006లో ఏకంగా 35,000 మంది వలసదారులు ఈ దీవులకు చేరుకున్నారని ఐరాస తెలిపింది.
ఈ ఏడాది ఈ మార్గంలో ఇప్పటివరకూ 414 మంది వలసదారులు సముద్ర ప్రమాదాల్లో చనిపోయారని ఐఎంఓ తెలిపింది. 2019లో ఈ మార్గంలో 210 మంది చనిపోయారు.
స్కార్లెట్ జాన్సన్: కమెడియన్ కొలిన్ జోస్ట్‌ను వివాహమాడిన హాలీవుడ్ నటి

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్.. తన ఫియాన్సీ కొలిన్ జోస్ట్‌ను వివాహం చేసుకున్నారు.
ఈ వారాంతంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగిందని అమెరికాకు చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మీల్స్ ఆన్ వీల్స్ ప్రకటించింది.
ఈ వివాహ కార్యక్రమానికి వధూవరుల కుటుంబాల సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారని.. కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు పాటించారని ఆ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది.
వృద్ధులకు సేవలందించే తమ సంస్థ.. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయపడటంలో స్కార్లెట్, జోస్ట్ మద్దతునందించారని ఆ సంస్థ తెలిపింది.
''ఈ కష్ట సమయంలో ఇబ్బందుల్లో పడే వయోవృద్ధులకు సాయహస్తం అందించటం వారి వివాహక కోరిక'' అని తెలిపింది. అభిమానులు తమ సంస్థకు విరాళాలు ఇవ్వాలని కోరింది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
స్కార్లెట్ వివాహ వార్తను ఆమె ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.
ఈ జంట న్యూయార్క్‌లోని పాలిసాడెస్‌లో పెళ్లి చేసుకున్నారని ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ టీఎంజడ్ పేర్కొంది.
సాటర్‌డే నైట్ లైవ్ షోలో కమెడియన్, రైటర్ అయిన కొలిన్ జోస్ట్, స్కార్లెట్ గత మూడేళ్లుగా డేట్ చేస్తున్నారు. ఆ షోలో స్కార్లెట్ 2017లో అతిథిగా పాల్గొన్న తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
తాము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు వీరిద్దరూ 2019 మే నెలలో ప్రకటించారు.
ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణుల్లో స్కార్లెట్ ఒకరు. ప్రధానంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల్లో బ్లాక్ విడో పాత్ర పోషించారు.
కరోనావైరస్: పారిస్ నుంచి పల్లె సీమకు రాత్రికి రాత్రి భారీ వలసలు

ఫొటో సోర్స్, EPA
ఫ్రాన్స్‌లో దేశవ్యాప్తంగా కొత్తగా లాక్‌డౌన్ ప్రకటించారు. అది అమలులోకి రావటానికి ముందు రాజధాని నగరం పారిస్ నుంచి భారీ స్థాయిలో ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రయాణమయ్యారు.
గురువారం సాయంత్రం పారిస్ పరిసరాల్లో ట్రాఫిక్ రికార్డు స్థాయికి పెరిగిపోయింది. మొత్తంగా చూస్తే 700 కిలోమీటర్ల నిడివి మేర ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయని స్థానిక మీడియా చెప్పింది.
పారిస్ నగరవాసులు చాలా మంది లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించటం కోసం నగరం విడిచి వెళ్లారని పేర్కొంది.
కరోనావైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవటానికి ఫ్రాన్స్ మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అత్యవసర పనులు, వైద్య కారణాలు మినహా ప్రజలు ఇళ్లలోనే ఉండాలనే ఆంక్షలు శుక్రవారం అర్థరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చాయి.
''కరోనావైరస్ సెకండ్ వేవ్.. దేశాన్ని ముంచెత్తే ప్రమాదం ఉంది'' అని దేశాధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లో కోవిడ్ర19 వల్ల రోజు వారీ మరణాల సంఖ్య ఏప్రిల్ తర్వాత ఇప్పుడు మళ్లీ గరిష్ట సంఖ్యకు పెరిగాయి. గురువారం నాడు దేశంలో 47,637 కరోనా కేసులు, 250 మరణాలు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్కు మందు కనిపెట్టడంలో దారి చూపుతున్న 14 ఏళ్ల తెలుగమ్మాయి
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది కర్ణాటకా.. తమిళనాడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








