‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’.. రూ.30 లక్షలకు అంటగట్టి డాక్టరుకు బురిడీ

ఫొటో సోర్స్, UTTAR PRADESH POLICE
సిరి సంపదలనిచ్చే అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని అమ్ముతామంటూ బేరం పెట్టి ఒక డాక్టర్‌ను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దీపంలో ఎన్నో మహత్తులున్నాయంటూ వారు ఆ డాక్టర్‌కు నమ్మబలికారు. ఆ దీపం ఇంట్లో ఇంట్లో ఉంటే సిరిసంపదలు, ఆయురారోగ్యాలు వస్తాయని నమ్మించారు.
మొదట ఈ దీపం ధర ఒక కోటి 50 లక్షల రూపాయలని డాక్టర్‌కు చెప్పారు. బేరమాడగా చివరకు సుమారు 30 లక్షల రూపాయాల ధరకు ఇచ్చేందుకు నిందితులు అంగీకరించారు.
ఈ మోసం వెనక ఓ మహిళ కూడా ఉందని, ఆమె పరారీలో ఉందని పోలీసులు చెబుతున్నారు.
తాను మోసపోయినట్లు మీరట్ పోలీస్‌స్టేషన్‌లో సదరు డాక్టర్ ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మోసం ఎలా మొదలైంది ?
నెల రోజులుగా ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను చికిత్స కోసం తన వద్దకు తీసుకువచ్చారని, ఆమెను వారి తల్లిగా భావించానని డాక్టర్ చెప్పారు.
“ క్రమంగా వారు నాకు బాబా మహత్తు గురించి చెప్పడం ప్రారంభించారు. ఆ బాబా గృహాన్ని తాము సందర్శించినట్లు వారు చెప్పారు. మీరు కూడా బాబాను కలవండి అంటూ నాకు చెప్పడం మొదలు పెట్టారు’’ అని ఆ డాక్టర్ పేర్కొన్నట్లు ఎన్డీటీవీ కథనం వెల్లడించింది.
వారు చెప్పినట్లే ఆ డాక్టర్ మాంత్రికుడైన బాబాను కలిశారు.
ఒకసారి బాబాను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు తనకు అల్లావుద్దీన్ ప్రత్యక్షమయ్యేలా చేస్తామని చెప్పారని, నిజానికి ఓ వ్యక్తికి అల్లావుద్దీన్ వేషం వేసి తనను మోసం చేశారని ఆ డాక్టర్ చెప్పినట్లు ఎన్డీటీవీ కథనం తెలిపింది.
ఆ దీపంలోని భూతం తమపై ప్రభావం చూపిస్తున్నట్లు కూడా వారు ఆ డాక్టర్‌కు చెప్పి, ఆయన్ను నమ్మించేందుకు ప్రయత్నించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మొదట రూ.కోటీ యాభై లక్షల ధర చెప్పిన నిందితులు చివరకు దాన్ని సుమారు రూ. 30లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
ఈ నిందితులు మరికొందరిని కూడా ఇదే తరహాలో మోసం చేయడానికి ప్రయత్నించారని మీరట్‌కు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ఎన్డీటీవీకి వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేయగా, ఓ మహిళ పరారీలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- వల్లభాయ్ పటేల్: నెహ్రూ కోసం సర్దార్కు గాంధీ అన్యాయం చేశారా?
- టర్కీ, గ్రీస్‌లో భూకంపం, సునామీ.. 22 మంది మృతి
- పదహారేళ్లు దాటినా రజస్వల కాకపోతే పెళ్లి చేయొచ్చా? డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి
- సీ ప్లేన్: మోదీ ప్రారంభించిన ఈ నీటిపై విమానాలు ఏమిటి? స్పైస్‌జెట్ వీటిని ఎక్కడెక్కడ నడుపుతోంది
- వీళ్లు ‘దెయ్యం’తో సెల్ఫీకి ప్రయత్నించారు
- ‘దెయ్యం’ భయంతో మగాళ్లు మాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








