తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం

ప్రాణహిత
    • రచయిత, శుభం ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ జీవరేఖగా ప్రాణహిత నదిని భావిస్తారు. ఇక్కడి తాగు, సాగు నీరుకు ప్రధాన వనరుల్లో ప్రాణహిత ఒకటి. దక్షిణ గంగగా పిలిచే గోదావరికి ప్రధాన ఉపనది ప్రాణహిత. గోదావరిలో ప్రవహించే నీటిలో మూడో వంతు నీరు ప్రాణహిత నుండి వచ్చి చేరుతుంది. తనతో పాటు మోసుకొచ్చే నీటితో గోదావరికి నిండు రూపం ఇచ్చి అఖండ గోదావరిగా మారుస్తుంది.

మిలియన్ల సంవత్సరాల చరిత్ర ఈ నదీ తీరం మట్టిపొరల్లో నిక్షిప్తమై ఉంది. తెలుగు నేలపై రాక్షస బల్లుల (డైనోసార్) జాడ దొరికిన ప్రాంతం ఇది. విలక్షణమైన జీవ వైవిధ్యానికి పుట్టిల్లు ప్రాణహిత తీరం. అటు భారత పురాణేతిహాసాల్లోనూ ఈ నది ప్రస్తావన ఉంది. 'ప్రణీత' నదిగా స్కాంద పురాణంలోని 'కాళేశ్వర ఖండం'లో ప్రధానంగా ఈ నది ప్రస్తావన కనిపిస్తుంది. బ్రహ్మండ, లింగ పురాణాల్లోనూ ఈ నదీ వర్ణన కనిపిస్తుంది.

పేరుకు ఉపనదే అయినా భారత దేశంలోని ప్రధానమైన నదుల సరసన ఇది నిలిచింది. సంవత్సరం పొడవునా నిరంతరం పారే జీవనది ఇది. భారత్‌లో పుష్కరాలు నిర్వహించే 12 నదుల్లో ప్రాణహిత ఒకటి. ప్రాణహితకు ప్రస్తుతం ఇది పుష్కరాల ఏడాది. 2022 ఏప్రిల్ 13 నుండి నది ప్రవహించే మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

ప్రాణహిత

ఎక్కడ పుట్టింది?

తెలంగాణలోని కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లా కౌఠాల మండలం 'తుమ్మిడిహెట్టి' ప్రాణహిత పుట్టిల్లు. వేన్ గంగా, వార్దా నదులు సంగమించి ప్రాణహితగా మారి ముందుకు సాగుతాయి. సుమారు 113 కిలోమీటర్లు ప్రయాణించి ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి (ఒకప్పుడు కరీంనగర్) జిల్లా కాళేశ్వరం సమీపంలో గోదావరి నదిలో కలిస్తుంది.

''ప్రాణహిత పేరులోనే అంతా అర్థం అవుతుంది. ఈ నది ప్రాణులకు హితం (మంచి) చేసేది. అందుకే ప్రాణహిత అయింది. లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జీవకోటి ఈ నదీ నీటి ద్వారా జీవనం కొనసాగిస్తోంది. ఈ నదీ తీరంలోని వేమనపల్లిలో తవ్వకాల్లో బయటపడ్డ రాక్షసబల్లుల ఆనావాళ్లే దీనికి సాక్షం'' అని కాళేశ్వరం నివాసి మాడుగుల భాస్కర శర్మ బీబీసీతో చెప్పారు.

ప్రాణహిత పుట్టుక అనేక ప్రవాహాల కలయిక. వీటిలో అతి ప్రధానమైనవి వార్ధా, వేన్ గంగా, పేన్ గంగా, పెద్దవాగులు. దండకారణ్యంలో భాగమైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుండి ఈ నది మూల ప్రవాహాలు ఉన్నాయి. సాత్పుర, అజంత శ్రేణుల గుండా వీటి ప్రయాణం సాగుతుంది.

ప్రాణహిత ప్రవాహం తుమ్మిడిహెట్టి వద్ద మొదలై ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దులను తాకుతూ సాగుతుంది.

సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం (INDIA-WRIS) లెక్కల ప్రకారం గోదావరి నదిలో ప్రవహించే నీటిలో ప్రాణహిత నది 34.87 శాతం వాటా కలిగి ఉంది. గోదావరి రివర్ బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా విస్తీర్ణం 3,12,812 చదరపు కిలోమీటర్లు కాగా అందులో ప్రాణహిత క్యాచ్మెంట్ ఏరియా లక్షా పది వేల చదరపు కిలోమీటర్లు.

ప్రాణహిత పరివాహక ప్రాంతంలో సాధారణ వర్షపాతం సగటు 900-1200 మిల్లీమీటర్లు. జూన్-అక్టోబర్ మధ్య ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది.

డైనోసార్ శిలాజం

ఫొటో సోర్స్, twitter/Nagaraj Balasubramanian @AdhesionLab

ఫొటో క్యాప్షన్, ప్రాణహిత తీరంలో బయటపడిన డైనోసార్ శిలాజాన్ని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు

సుజల స్రవంతి నుండి కాళేశ్వరం ఎత్తిపోతల వరకు

ప్రాణహితలోని అపార జలరాశులను వొడిసి పట్టి సాగు, తాగు, జల విద్యుత్ అవసరాలకు ఉపయోగించాలన్న ఆలోచన నిజాం పాలకుల నాటి నుండీ ఉంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా 'తలాయి' గ్రామ సమీపంలో నిజాం హయాంలో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు.

ఆ తర్వాత 'జలయజ్ఞం' కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టిలో శంకుస్థాపన చేసి ప్రాణహిత సుజల స్రవంతిగా నామకరణం చేసారు. ఆ తర్వాత డాక్టర్. బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత సుజల స్రవంతిగా పేరు మార్చారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్యాకేజ్‌ల కింద విడగొట్టి కొన్ని జిల్లాల్లో పనులు కూడా చేపట్టారు.

ఆ తర్వాతి క్రమంలో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌లో భాగంగా ప్రాజెక్ట్ ప్రధాన నిర్మాణం 'మేడిగడ్డ'కు మారింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో మహారాష్ట్రలో భూములు ముంపుకు గురవుతుండటంతో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుని నష్టపరిహారం ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే మూడు ప్రధాన బ్యారేజ్‌ల సమాహారంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసారు. ప్రాజెక్ట్ పేరును కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా మార్చారు.

ప్రాణహిత

జీవవైవిధ్యానికి కేంద్రం

ప్రాణహిత నదీ తీరం అరుదైన మూలికలు, జంతు, వృక్షజాతులకు నిలయం. లక్షల సంవత్సరాల జీవవైవిధ్యానికి నెలవు. జురాసిక్ యుగంలో రాక్షస బల్లులకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. దానికి సాక్ష్యంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో జరిపిన తవ్వకాల్లో 160 మిలియన్ సంవత్సరాల పూర్వకాలానికి చెందిన రాక్షస బల్లి శిలాజాలు ఇక్కడ లభ్యమయ్యాయి.

వీటిని 'కోటాసారస్ యామనపల్లెన్సీస్' పేరుతో హైదరాబాద్ లోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పటికీ తెలంగాణలోని కోటపల్లి, వేమనపల్లి, నీల్వాయి, బొప్పారం, మహారాష్ట్ర లోని సిరోంచా ప్రాంతంలో వృక్ష, జంతు శిలాజాలు లభ్యమవుతున్నాయి.

ఇక్కడ దొరికిన శిలాజాల్లో నత్త గుల్లలు, చేపలు, తాబేళ్లతో పాటు వివిధ వృక్ష శిలాజాలు ఉన్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని 'వడదం'లో మహారాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో 'వుడ్ ఫాజిల్ పార్క్' ఏర్పాటు చేసారు.

''ఇక్కడి చుట్టుపక్కల అడవుల్లో కురిసే ప్రతి నీటిబొట్టు ప్రాణహితలో చేరడంతో జంతుజాలానికి సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండి వర్థిల్లాయి. ఎత్తుగా పెరిగే వృక్షాలకు ఈ ప్రాంతం నెలవు. వృక్షశిలాజాలు అరుదుగా ఇక్కడ లభ్యమవుతాయి'' అని శాతవాహన యూనివర్సిటీ బాటనీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఇ.నర్సింహమూర్తి బీబీసీతో చెప్పారు.

అనేక మందుమొక్కలకు ప్రాణహిత ప్రాంతం నెలవుగా ఉంది. ఈ ప్రాంతంలోని నాయక్ పోడ్ ఆదివాసీ సమూహాల్లోని ఆయుర్వేద విజ్ఞానం, వారు వాడే మందుమొక్కలపై అధ్యయనాలు జరిగాయి.

''నాయక్ పోడ్‌లు మందుమొక్కల ఉపయోగంలో పరిజ్ఞానం కలిగిన వారు. రకరాకల వ్యాధులకు ఉపయోగించే ఆయుర్వేద మొక్కలను ప్రాణహిత నదీ పరిసర ప్రాంతాల నుండి వారు సేకరిస్తారు. వారి సంప్రదాయ వైద్య విధానం, అందులో వాడే మొక్కలపై అధ్యయనం చేసి అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించాం'' అని ప్రొఫెసర్ ఇ. నర్సింహమూర్తి తెలిపారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ జీవరేఖగా ప్రాణహిత నదిని భావిస్తారు.

ఫాజిల్ టూరిజం

ఈ ప్రాంతంలో లభించిన వృక్ష శిలాజాలపై లక్నోలోని 'బీర్బల్ సాహ్నీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్సెస్'లో విస్తృత పరిశోధనలు నిర్వహిస్తోంది. ప్రాణహిత తీర ప్రాంతంలో ఎత్తుగా పెరిగే 'నారవేప చెట్టు' కలప ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ చెట్టు కలపను దేవాలయాల్లో ధ్వజస్తంభాల కోసం వాడతారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఇక్కడి నుండి ధ్వజస్తంభాల కోసం కలప తీసుకెళ్తారు.

గోదావరి బేసిన్‌లో భాగంగా ఉన్న ప్రాణహిత తీరంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి.

ప్రాణహిత తీరంలో ప్రాణహిత రక్షిత అభయారణ్యం, కవ్వాల్ టైగర్ జోన్‌లు ఉన్నాయి. తెలంగాణ టూరిజం శాఖ పోర్టల్‌లో అందించిన వివరాల ప్రకారం 136 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ప్రాణహిత అభయారాణ్యం పులులు, ఎలుగుబంట్లు, కృష్ణ జింకలు, అడవి కుక్కలు, వివిధ రకాల పక్షిజాతులకు నెలవుగా ఉంది.

జీవ, పర్యావరణ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్న ప్రాణహిత తీరం మహారాష్ట్ర అటవీ ప్రాంతం గుండా తెలంగాణ వైపు పులులు, అంతరించిపోయే దశకు చేరిన పొడుగు ముక్కు రాబందులకు కారిడార్‌గా ఉంది. ఇక్కడ పర్యాటక రంగ అభివృద్ధికి తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. అడ్వెంచర్ టూరిజంలో భాగంగా 'ఫాజిల్ టూరిజం' థీమ్‌తో పర్యాటక రంగ ప్రోత్సాహానికి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

''ఈ ప్రాంతం లక్షల సంవత్సరాల నుండి గొప్ప వృక్ష సంపదకు నిలయంగా ఉంది. ఇక్కడ చాలా జీవవైవిధ్యం కనిపిస్తుంది. లక్షల ఏళ్ల కిందటి జంతువుల శిలాజాలు లభ్యమవుతున్నాయి. మహారాష్ట్ర మాదిరే ఆసిఫాబాద్ జిల్లాలో డైనోసార్ ఫాజిల్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి శాతారాం తెలిపారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు వేగంగా అంతరించిపోతోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)