అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన శారూ... ప్రేమతో నీ రాజా'

సవితా అంబేడ్కర్, బి.ఆర్.అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE

ఫొటో క్యాప్షన్, సవిత, అంబేడ్కర్‌
    • రచయిత, నామ్‌దేవ్ కట్కర్
    • హోదా, బీబీసీ మరాఠీ

డాక్టర్ ఎస్. రావు ముంబైలోని వైల్ పార్లే ప్రాంతంలో నివసించేవారు. డాక్టర్ అంబేడ్కర్‌కు సన్నిహిత మిత్రుడు. అంబేడ్కర్ ముంబై వెళ్లిన ప్రతిసారీ డాక్టర్ రావును కలుస్తుండేవారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో అంబేడ్కర్ కార్మిక మంత్రిగా ఉన్నపుడు కూడా తన ముంబై పర్యటనల్లో డాక్టర్ రావు నివాసంలో కాలం గడిపేవారు.

డాక్టర్ రావు కూతుళ్ళకు ఒక స్నేహితురాలు శారదా కబీర్. ఆమే ఆ తర్వాత సవిత అంబేడ్కర్ అయ్యారు. నిజానికి కబీర్ కుటుంబం, రావు కుటుంబం మధ్య స్నేహ సంబంధాలు ఉండేవి. అలా ఇరు కుటుంబాల మధ్య చాలా తరచుగా రాకపోకలు సాగుతుండేవి.

తొలి పరిచయం

అంబేడ్కర్, శారదా కబీర్‌లు తొలిసారి డాక్టర్ రావు నివాసంలో ఒకరికొకరు తారసపడ్డారు.

శారదా కబీర్ 1912 జనవరి 27న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా రాజాపూర్ పట్టణంలో ఓ సారస్వత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి కృష్ణారావు వినాయక్‌రావు కబీర్, తల్లి జానకీబాయి కబీర్‌లకు శారద సహా ఎనిమిది మంది పిల్లలు.

శారద మొదటిసారి 1947లో అంబేడ్కర్‌ను కలిసినపుడు.. ఆయన కార్మిక మంత్రిగానే ఆమెకు తెలుసు.

1947 తొలినాళ్లలో ఒక రోజు అంబేడ్కర్ దిల్లీ నుంచి ముంబైలో దిగారు. ఎప్పటి లాగానే పార్లే లోని డాక్టర్ రావు నివాసానికి వెళ్లారు. అక్కడికి శారదా కబీర్ కూడా వచ్చారు. డాక్టర్ రావు ఆమెను అంబేడ్కర్ పరిచయం చేశారు. ''ఈమె నా కూతుళ్ళ స్నేహితురాలు. చాలా తెలివైనది. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్. డాక్టర్ మాల్వాంకర్‌కు సహాయంగా పనిచేస్తోంది'' అని చెప్పారు.

అంబేడ్కర్ ఇలా తన రెండో భార్య శారదా కబీర్‌ను తొలిసారి కలిశారు. పెళ్లి తర్వాత ఆమె సవితా అంబేడ్కర్ అయ్యారు. అంబేడ్కర్‌వాదులకు ఆమె మాయీసాహెబ్. కానీ అంబేడ్కర్‌కు మాత్రం ఆమె ప్రియమైన 'షారు'. అంబేడ్కర్ మొదటి భార్య రమాబాయి 1935లో చనిపోయారు. ఆ తర్వాత పద్నాలుగేళ్లకు ఆయన సవితను రెండో పెళ్లి చేసుకున్నారు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, సవితా అంబేడ్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, సవితా అంబేడ్కర్

'మెరిసే కళ్లు, తీక్షణమైన చూపు, ప్రకాశించే మేధస్సు'

అంబేడ్కర్‌తో తన తొలి పరిచయం గురించి మాయీసాహిబ్ తన ఆత్మకథ 'డాక్టర్ అంబేడ్కరాంచ్య సాహావాసాత్' (డాక్టర్ అంబేడ్కర్‌తో నా జీవితం)లో వర్ణించారు. ''డాక్టర్ అంబేడ్కర్ వ్యక్తిత్వం మనోజ్ఞంగా ఉంటుంది. విశాలమైన నుదురు, మెరిసే కళ్లు, తీక్షణమైన చూపు, ఆధునికమైన, చక్కని దుస్తులు, ప్రకాశవంతమైన మేధస్సుతో ఆయన అసాధారణ ఉనికి ఒక్కసారిగా అనుభూతిలోకి వస్తుంది'' అని ఆమె రాశారు.

డాక్టర్ అంబేడ్కర్‌ను 'జర్మన్ ప్రిన్స్' అని విదేశీయులు ఎందుకు పిలుస్తారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆయన మనోజ్ఞమైన వ్యక్తిత్వం, అసాధారణమైన మేధా సామర్థ్యం చూపే ప్రభావం ఎవరికైనా తెలిసిపోతుంది'' అని పేర్కొన్నారు.

ఈ కాలంలో అంబేడ్కర్ తరచుగా అస్వస్థతకు గురవుతుండేవారు. అయినప్పటికీ అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండేది. భారతదేశం స్వతంత్ర దేశమయ్యాక పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో అంబేడ్కర్ న్యాయమంత్రి అయ్యారు.

1947 ఆగస్టు 29న ఆయన రాజ్యాంగ రచనా సంఘానికి చైర్‌పర్సన్‌గా కూడా నియమితులయ్యారు. ఆయన రచన, సామాజిక కృషి ఏక కాలంలో సాగుతుండేవి. ఆ సమయంలో మాయీసాహెబ్ ముంబైలోని గిర్గాంలో హగ్స్ రోడ్డలో ఉన్న డాక్టర్ మల్వాంకర్ క్లినిక్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తుండేవారు. ఒక రోజు డాక్టర్ అంబేడ్కర్ అకస్మాత్తుగా డాక్టర్ మల్వాంకర్ క్లినిక్‌కు వచ్చారు.

మాయీసాహెబ్ అంబేడ్కర్ ఆత్మకథ

ఫొటో సోర్స్, MAISAHEB AMBEDKAR BIOGRAPHY

ఫొటో క్యాప్షన్, మాయీసాహెబ్ అంబేడ్కర్ ఆత్మకథ

అక్కడ ఆయనను చూసి మాయీసాహెబ్ ఆశ్చర్యపోయారు. డాక్టర్ మల్వాంకర్‌ను సంప్రదించాల్సిందిగా అంబేడ్కర్‌కు డాక్టర్ రావు సిఫారసు చేశారని ఆ తర్వాత ఆమెకు తెలిసింది. డాక్టర్ రావు భార్యకు మూర్ఛ సమస్యను డాక్టర్ మల్వాంకర్ నయం చేయటం వల్ల అంబేడ్కర్‌కు ఆయనను సిఫారసు చేశారు.

అంబేడ్కర్‌ ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేసిన డాక్టర్ మల్వాంకర్.. మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బ్లడ్ ప్రెషర్), తిమ్మిర్లు (న్యూరిటిస్), కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్), వంటి సమస్యలతో ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతిన్నదని గుర్తించారు. అంబేడ్కర్ నిద్ర మీద ఆర్థరైటిస్ తీవ్ర ప్రభావం చూపింది.

''సమాజంలో అణగారిన వర్గాల వారికి సమానత్వం, న్యాయం కోసం గళమెత్తుతున్న అంబేడ్కర్ ఎప్పుడూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు'' అని మాయీసాహెబ్ రాశారు.

డాక్టర్ మల్వాంకర్ సిఫారసు చేసిన మందులు వాడటం మొదలుపెట్టాక అంబేడ్కర్‌కు కొంత ఉపశమనం లభించినట్లయింది. దీంతో ఆయన దిల్లీలో ఉన్నప్పుడు కూడా టెలిఫోన్ ద్వారా తరచుగా డాక్టర్ మల్వాంకర్‌ను సంప్రదిస్తుండేవారు. ముంబై వెళ్లినప్పుడల్లా డాక్టర్ మల్వాంకర్ క్లినిక్‌ను క్రమం తప్పుకుండా సందర్శించేవారు. అలా అంబేడ్కర్, మాయీసాహెబ్‌లు ఒకరి గురించి మరొకరు తెలుసుకోగలిగారు.

బౌద్ధమతం స్వీకరిస్తున్న అంబేడ్కర్, సవితా అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE

ఫొటో క్యాప్షన్, 1956 అక్టోబర్ 4న డాక్టర్ అంబేడ్కర్, సవితా అంబేడ్కర‌్‌లు బౌద్ధమతం స్వీకరించారు

మాయీసాహెబ్‌కు ప్రపోజ్ చేసిన బాబాసాహెబ్...

1947 డిసెంబర్‌లో ఒక రోజు అంబేడ్కర్ ముంబై వచ్చినపుడు డాక్టర్ మల్వాంకర్ క్లినిక్‌ను సందర్శించారు. డాక్టర్ చెకప్ పూర్తయిన తర్వాత ఆయన దాదర్‌లోని తన నివాసం రాజగృహకు వెళ్లాల్సి ఉంది. మాయీసాహెబ్ కూడా దాదర్‌లోని పోర్చుగీస్ చర్చి ఎదురుగా నివసించేవారు. ఆమెను దారిలో ఆమె ఇంటి దగ్గర దింపుతానని అంబేడ్కర్ చెప్పారు.

అదే రోజు మాయీసాహెబ్‌తో.. ''నాతో పాటు ఒక సహచరిని తీసుకురావాలని నా జనం, నా సహచరులు నాకు చెప్తూ ఉంటారు. కానీ నాకు నచ్చే, నాతో పొసగే మహిళ దొరకటం కష్టం. నా జనం కోసం నేను చాలా కాలం బతకాలి. కాబట్టి నన్ను చూసుకునే మనిషి ఒకరు నాకు అవసరం. నాకు సరైన జోడీ కోసం నా అన్వేషణను నీతో మొదలు పెట్టాలని అనుకుంటున్నా'' అని చెప్పారు అంబేడ్కర్.

మాయీసాహిబ్ తొలుత ఆశ్చర్యపోయారు. ఆమె తేరుకుని జవాబు చెప్పలేకపోయారు. కాస్త సమయం తీసుకుని ఏ నిర్ణయమైనా తీసుకోమని ఆమెకు చెప్పిన అంబేడ్కర్ దిల్లీ తిరిగివెళ్లారు.

1948 జనవరి 25వ తేదీన మాయీసాహెబ్‌కు అంబేడ్కర్ నుంచి ఒక లేఖ వచ్చింది. ''నేను ఒక జీవిత భాగస్వామి కోసం నా అన్వేషణను నీతో మొదలుపెడుతున్నా. ఈ ప్రతిపాదన నీకు అంగీకారమైతేనే సుమా. దీని గురించి ఆలోచించదలచుకుంటే నాకు తెలియజేయి'' అని అందులో ఉంది. అదే లేఖలో.. తమ ఇద్దరి మధ్య ఉన్న వయో బేధాన్ని, దెబ్బతిన్న తన శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. తన ప్రతిపాదనను ఆమె తిరస్కరించినా తను చింతించనని ఆయన చెప్పారు.

మాయీసాహెబ్ అంబేడ్కర్, కార్యకర్తలు

ఫొటో సోర్స్, VIJAY SURWADE

ఫొటో క్యాప్షన్, మాయీసాహెబ్ అంబేడ్కర్, కార్యకర్తలు (1950-51)

మాయీసాహెబ్ గాబరాపడ్డారు. ఆమె డాక్టర్ మల్వాంకర్‌ను సంప్రదించారు. ''అంబేడ్కర్ పట్టుపట్టలేదు. కాబట్టి నువ్వు ఆలోచించటానికి అవసరమైనంత సమయం తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు'' అని ఆయన చెప్పారు.

అప్పుడు ఆమె అంబేడ్కర్ ప్రతిపాదన గురించి తన అన్నకు చెప్పారు. ''అంటే నువ్వు ఇండియాకి మిసెస్ లా మినిస్టర్ అవుతావు. తిరస్కరించవద్దు. ముందడుగు వెయ్యి'' అని ఆయన చెప్పారు.

ఇది మాయీసాహెబ్‌కు కొంత ధీమానివ్వటంతో అంబేడ్కర్ లేఖకు ఆమె సానుకూలంగా జవాబిచ్చారు.

1948 జనవరి చివర్లో అంబేడ్కర్‌కు ఆమె లేఖ అందింది. అదే వారంలో అంబేడ్కర్ ఓ బంగారు నెక్లెస్‌ను మాయీ సాహెబ్‌కు పంపించారు. దానికి ఒక యాంకర్ డిజైన్ ఉంది.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్ దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత... అంతేనా?

శారు - రాజా

1948 ఫిబ్రవరి 20వ తేదీన మాయీసాహెబ్‌కు అంబేడ్కర్ రాసిన లేఖ ''ప్రియాతిప్రియమైన శారూ...'' అంటూ మొదలై.. ''అమితమైన ప్రేమతో, రాజా'' అని ముగుస్తుంది.

అంబేడ్కర్ సాధారణంగా తన లేఖలను భీమ్‌రావ్ అంబేడ్కర్ అని కానీ బి.ఆర్.అంబేడ్కర్ అని కానీ సంతకంతో ముగిస్తారు. మాయీసాహెబ్‌కు రాసిన లేఖలు మాత్రం 'నీ రాజా' అంటూ ముగుస్తాయి.

''ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో నా విద్యార్థులు నన్ను రాజా అని పిలిచేవాళ్లు. నువ్వు కూడా నన్ను అలాగే పిలుస్తున్నావు.. అదెలా? నీకు అదే ఇష్టమైతే నన్ను రాజా అనే పిలవొచ్చు'' అని అంబేడ్కర్ రాశారు.

సవితా అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE

ఫొటో క్యాప్షన్, సవితా అంబేడ్కర్

పుట్టిన రోజు మర్నాడే పెళ్లి

మాయీసాహెబ్, బాబాసాహెబ్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత.. ఆయన ఈ వార్తను తన సన్నిహితులైన కమలాకాంత్ చిత్రే, డాక్టర్ మల్వాంకర్, దౌలత్ జాదవ్, భావ్‌రావ్ గైక్వాడ్, ఫ్రీ ప్రెస్ జర్నల్‌కు చెందిన డాక్టర్ ఎం.కె.బి. నాయిర్‌లకు చెప్పారు.

తొలుత.. ముంబైలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా గానీ చివరికి దిల్లీలో పెళ్లి జరిగింది.

బాబాసాహెబ్, మాయీసాహెబ్‌లు 1948 ఏప్రిల్ 15న దిల్లీలో పెళ్లి చేసుకున్నారు. ఆ కాలంలో అంబేడ్కర్ '1 హార్డింగ్ అవెన్యూ'లోని ప్రభుత్వ బంగళాలో నివసించేవారు.

రాష్ట్రపతి భవన్‌లో మాయీసాహెబ్ అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE

ఫొటో క్యాప్షన్, అంబేడ్కర్‌కు మరణానంతరం ప్రకటించిన భారత రత్న అవార్డును స్వీకరించిన తర్వాత నాటి రష్ట్రపతితో సంభాషిస్తున్న మాయీసాహెబ్ అంబేడ్కర్

అప్పటికి ఉపఖండ రక్తసిక్త విభజనతో, ఆపైనా మహాత్మాగాంధీ హత్యతో దేశం గందరగోళ పరిస్థితుల్లో ఉంది. కాబట్టి పెళ్లి కార్యక్రమం సాదాసీదాగా ఉండాలని, అధిక ప్రచారం ఉండరాదని అంబేడ్కర్ కోరుకున్నారు.

అలా వారు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. కేవలం కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ నిర్వహించారు. పూర్వపు భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్ ప్రత్యేక ప్రతినిధి కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

అంబేడ్కర్, సవితా అంబేడ్కర్‌లు సర్దార్ పటేల్‌ను ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పటేల్ అప్పుడు గుండెజబ్బుతో బాధపడుతున్నారు. మంచం మీద కదలలేని పరిస్థితుల్లోనే ఆయన ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.

పెళ్లి రోజుగా ఏప్రిల్ 15వ తేదీనే ఎందుకు ఎంపిక చేసుకున్నారనేది సవితా అంబేడ్కర్ తన ఆత్మకథలో రాశారు.

''ఏప్రిల్ 14 డాక్టర్ అంబేడ్కర్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఆయన శ్రేయోభిలాషులు చాలా మంది ఆయన ఇంటి దగ్గర గుమిగూడారు. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీకి బదులు ఏప్రిల్ 15వ తేదీన పెళ్లి చేసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం'' అని వివరించారు.

సవితా అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE

ఫొటో క్యాప్షన్, సవితా అంబేడ్కర్

'నా తర్వాత షారు పరిస్థితి ఏమిటి?’

ఆ పెళ్లి జరిగేటప్పటికి అంబేడ్కర్ వయసు 57 సంవత్సరాలు. వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అప్పటికి సవితా అంబేడ్కర్ వయసు 36 ఏళ్లు.

అంబేడ్కర్ 1948 ఫిబ్రవరి 21న రాసిన లేఖలో సవితా అంబేడ్కర్‌కు తన ఆందోళన తెలిపారు. ''రాజా తన మరణం తర్వాత షారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆందోళనపడుతున్నాడు. రాజా ప్రజాసేవకు అంకితమైనందున ఎలాంటి ఆర్థిక ఏర్పాట్లూ చేయలేదు. శారూకి చెందిన రాజా తన వృత్తి ద్వారా సంపాదించుకునే కాస్తంత జీవనభృతి మినహా ఏమీ చేయలేకపోయాడు. రాజా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటే ఏ సమస్యా ఉండదు. కానీ, ఆయన ఆరోగ్యంగా లేడు. కాబట్టి తన తర్వాత శారూ పరిస్థితి ఏమిటని అతడు ఆందోళన చెందుతున్నాడు. దీని గురించి ఎప్పుడు ఆలోచించినా దిగులుచెందుతున్నాడు. బుధ్ద భగవానుడు దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తాడని శారూకి చెందిన రాజా నమ్ముతున్నాడు'' అని ఆయన రాశారు.

డాక్టర్ అంబేడ్కర్, సవితా అంబేడ్కర్‌ల దాంపత్య జీవితం కేవలం తొమ్మిదేళ్లే కొనసాగింది. అంబేడ్కర్ 1956 డిసెంబర్ 6న తుదిశ్వాస విడిచారు. అంబేడ్కర్ పోరాటాల్లో కూడా సవితా అంబేడ్కర్ ఆయన సహచరిగా కొనసాగారు. అంబేడ్కర్ మరణానంతరం ఆమె అనేక రంగాల్లో పోరాటాలు కొనసాగించారు. అది 'పరీక్షా కాలం' అని ఆమె అభివర్ణించారు.

అంబేడ్కర్ మరణానికి కారణాలపై కొందరు అనుమానాలు లేవనెత్తారు. అంబేడ్కర్ మరణానికి సవితా అంబేడ్కర్ బాధ్యురాలనేలా వారు మాట్లాడారు.

సన్నిహిత సహచరుడు విజయ్ సూర్వాడేతో మాయీసాహెబ్ అంబేడ్కర్

ఫొటో సోర్స్, VIJAY SURWADE

ఫొటో క్యాప్షన్, సన్నిహిత సహచరుడు విజయ్ సూర్వాడేతో మాయీసాహెబ్ అంబేడ్కర్

ఈ కాలం గురించి మాయీసాహెబ్ తన ఆత్మకథలో రాశారు. ''డాక్టర్ అంబేడ్కర్ అస్తమయం తర్వాత నేను చూసిన కష్ట కాలం గురించి ఆలోచించినపుడు.. ఏ మహిళ అయినా ఇలాంటి బాధలు అనుభవిస్తుండటం అంబేడ్కర్ గనక చూసివుంటే ఆయన తప్పకుండా సహాయ హస్తం అందించి ఉండేవారని నాకు అనిపిస్తుంది. ఆమె హక్కుల కోసం ఆయన పోరాడి ఉండేవారు. ఆమె కుటుంబానికి బలంగా మద్దతిచ్చివుండేవారు'' అని ఆమె పేర్కొన్నారు.

అంబేడ్కర్‌తో కలిసి జీవించిన ఆ కొద్ది కాలంలో.. మాయీసాహెబ్ తన సమయాన్నంతటినీ అంబేడ్కర్ ఆరోగ్యాన్ని చూసుకోవటానికి, ఆయన పనిలో సాయం చేయటానికి వెచ్చించారు. ఆమె 2003లో చనిపోయే వరకూ అంబేడ్కర్ ఆశయాలను బలంగా ముందుకు తీసుకెళ్లటానికి కృషి చేస్తూనే ఉన్నారు.

''ఈ ఆరిపోతున్న దీపాన్ని మళ్లీ విజయవంతంగా వెలిగేలా చేశారంటే దానికి కారణం నా భార్య, డాక్టర్ మల్వాంకర్‌ల వైద్య నైపుణ్యమే. వారికి నేను ఎంతో కృతజ్ఞుడిని. నా పనిని పూర్తి చేయటానికి వారు మాత్రమే సాయం చేశారు'' అని అంబేడ్కర్ ఓ సందర్భంలో చెప్పారు.

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జీవితంలో సవితా అంబేడ్కర్ పోషించిన ముఖ్యమైన పాత్రను ఈ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి.

(ఆధారం: డాక్టర్ అంబేడ్కారాంచ్య సహవాసత్ - డాక్టర్ సవితా భీమ్‌రావ్ అంబేడ్కర్, డాక్టర్ మాయీసాహెబ్ అంబేడ్కరాంచ్య సహవాసత్ - వైశాలి భలేరావ్)

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)