జీవో 111 ఏంటి? ఎలా వచ్చింది? రద్దు ఆలోచన వెనుకున్న కథేంటి? గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులు మరో హుస్సేన్ సాగర్‌లా మారనున్నాయా

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న వందేళ్ల నాటి రెండు పెద్ద చెరువులకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత కీలకమైన చర్య తీసుకోబోతున్నారు.
ఆ పెద్ద చెరువుల చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలను నియంత్రించే జీవో 111ను వెనక్కు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించారు.
దీంతో గండిపేటగా పిలిచే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల భవిష్యత్తు ఎలా మారబోతోంది? ఇక హైదరాబాదీలకు వాటి నీళ్లు అక్కర్లేదా?
ఎందుకీ రెండు చెరువులు?
జంట జలాశయాలుగా హైదరాబాదీలు పిలిచే ఈ రెండూ మానవ నిర్మితాలే.
1908 మూసీ వరదల తరువాత నిజాం రాజు అప్పటి ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి, మూసీ నదిపై సమగ్ర నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు.
అందులో భాగంగా ఈ జలాశయాలు నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తూనే, హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించే ఏర్పాటు చేశారు.
దాదాపు వందేళ్ల నుంచీ ఈ జలాశయాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చాయి.

అసలు జీవో 111 ఎలా వచ్చింది?
నిజానికి జీవో 111 ప్రభుత్వ సొంత ఆలోచన కాదు. దాని వెనుకో కథ ఉంది.
''పరిశ్రమల ఏర్పాటుపై సరైన నిబంధనలు లేని, అమలు కాని రోజుల్లో 1990ల మధ్యలో ఇది జరిగింది. సురానా ఇండస్ట్రీస్ అనే సంస్థ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) నుంచి కాస్ట్రాయిల్ కాంప్లెక్స్ అనే టెక్నాలజీని తీసుకుని దాని తయారీ పరిశ్రమను గండికోట దగ్గర ఏర్పాటు చేసింది. అక్కడ వారి సొంత స్థలం ఉండటంతో ఫ్యాక్టరీ కట్టారు.
కానీ అది రసాయన పరిశ్రమ కావడంతో హైదరాబాద్‌కు తాగునీరిచ్చే గండిపేట దగ్గర రసాయన పరిశ్రమ నిర్మించకూడదంటూ 'ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్' నుంచి ప్రొఫెసర్ ఎంవీ నాయుడు హైకోర్టుకు వెళ్లారు. కానీ హైకోర్టు తీర్పు పరిశ్రమకు అనుకూలంగా వచ్చింది. దీంతో వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు.
'ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్' వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. జంట జలాశయాల చుట్టూ నిర్మాణాలపై కఠిన ఆంక్షలు పెట్టాలని ఆదేశాలిచ్చింది. అప్పట్లో సీసీఎంబీ కూడా అక్కడ ఒక ల్యాబ్‌ను నిర్మించింది. కానీ తర్వాత దాన్ని అక్కడ నుంచి మార్చేసింది. ఇలా సుప్రీం తీర్పుకు అనుకూలంగా జీవో 111 వచ్చింది'' అంటూ దాని వెనుక ఉన్న చరిత్ర చెప్పారు పర్యావరణవేత్త బాబూ రావు.
ముందుగా 1994లో జీవో 192 తెచ్చారు. దాన్ని 1996లో సవరించి జీవో 111గా మార్చారు. దీని ప్రకారం ఆ చెరువుల పరిధిలోని లే అవుట్లలో 60 శాతం ఖాళీ స్థలం వదలాలి. గ్రామ కంఠం మినహా మిగిలిన చోట్లా భూమిలో 10 శాతమే నిర్మాణాలు ఉండాలి. చుట్టుపక్కల క్రిమి సంహారక మందుల వినియోగంపై పరిశీలన ఉండాలి. జీ+2 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేయకూడదు.. ఇలా ఆ జీవోలో చాలా నిబంధనలు ఉన్నాయి.
ఒకప్పుడు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలకు ఈ చెరువుల నీరు వెళ్లేది. కానీ కృష్ణా, గోదావరి నీరు అందుబాటులోకి వచ్చాక వీటి ప్రాధాన్యత కాస్త తగ్గింది. అయినప్పటికీ నీటి సరఫరా కొనసాగుతుంది. అలాగే వరద నీటి నిల్వ సామర్థ్యం కూడా ఉంది. ఇప్పటికీ ఈ చెరువులు పచ్చగా, కాలుష్యానికి దూరంగా ఉన్నాయి.

ఏ ప్రాంతాలపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి?
మొత్తం 7 మండలాల్లోని 83 గ్రామాల్లో భూముల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. శంషాబాద్ మండలంలోని 47 గ్రామాలు, మొయినాబాద్‌లోని 20 గ్రామాలు, చేవెళ్లలో ఆరు, శంకరపల్లిలో మూడు, రాజేంద్రనగర్‌లో మూడు, షాబాద్‌లో రెండు, కొత్తూరులో ఒక గ్రామంపై ఈ జీవో ప్రకారం ఆంక్షలు ఉన్నాయి.
భూముల ధరల సమస్య
హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు ఎంత పెరిగినా, ఈ జీవో అమల్లో ఉన్న గ్రామాల్లో మాత్రం భూముల ధరలు పెరగలేదు. ఈ జీవో కారణంగా అక్కడ భూములు కొనడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అంతేకాదు, కొన్నవారు కూడా జీవో గురించి తెలిసి అమ్మేసేవారు.
భూముల ధరల విషయంలో చాలా తేడా ఉండేది. దానికి తోడు గ్రామాల్లో నిర్మాణాల విషయంలో చాలా కఠినమైన నిబంధనలు అమల్లో ఉండేవి. అది కూడా స్థానికులకు నచ్చలేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన వారు జీవో వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడ్డారు. అంతేకాదు ఈ 83 గ్రామాల వారూ రెండుసార్లు ఆ జీవోకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు.

జీవో ఎత్తేస్తే ఏం నష్టం?
రియల్ ఎస్టేట్, భూములు చేతులు మారడం వంటి వాటిని పక్కన పెడితే పర్యావరణ పరంగా ఆ రెండు జలాశయాలు అత్యంత కీలకమైనవిగా చెబుతారు. మూసీ ప్రవాహం వరద నియంత్రణ పరంగా, తాగునీటి సరఫరా పరంగా, భూగర్భ జల కాలుష్యం పరంగా అనేక రకాలుగా వీటి పరిరక్షణ అత్యంత ముఖ్యం అనేది పర్యావరణవేత్తల మాట.
''కుండపోత వానలు, వరదల నుంచి కాపాడేవి ఇవే. వాటి చుట్టుపక్కల అక్రమ కట్టడాలను ఆపకుండా జీవోనే తీసేస్తే ఎలా?'' అని ప్రశ్నించారు పర్యావరణవేత్త లుబ్నా షరవత్.
''మల్లన్న సాగర్ నీరు సరిపోతాయని కేసీఆర్ అంటున్నారు. అసలు హైదరాబాద్‌కు ఎంత నీరు కావాలి? రానున్న దశాబ్దాల్లో నీటి లభ్యత ఎలా మారుతుంది? నది నీరు ఎలా వస్తుంది? దానికి ఏర్పాట్లేంటి? ఈ లెక్కల అధ్యయనం లేకుండా కేవలం మల్లన్న సాగర్‌ను చూపించి ఈ రెండు చెరువులను నాశనం చేస్తారా?'' అని బాబూరావు ప్రశ్నించారు.

ప్రభుత్వ వాదన ఏంటి?
ఈ జీవోను ఎత్తివేస్తామని కేసీఆర్ అన్నారు. 2016లో దీనిపై కమిటీ వేశారు. చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ జీవో ఎత్తేయాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు.
దీంతో పూర్తిగా జీవో ఎత్తేయకుండా మధ్యేమార్గంగా ఒక పరిష్కారం కనిపెట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మొత్తం నిర్మాణాలు అనుమతించకుండా గ్రీన్ జోన్ తరహా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ జీవో పరిధిలో దాదాపు 538 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఇది హైదరాబాద్ నగర విస్తీర్ణం కంటే కాస్త తక్కువ. ఈ జీవో తీసేస్తే దాదాపు లక్షా 32 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని ఒక అంచనా.
అంటే తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి కోసం సేకరించిన భూమి కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఈ భూమిలో ప్రభుత్వానికి చెందినదే 18 వేల ఎకరాలకు పైగా ఉంది. దీంతో హైదరాబాద్ విస్తరణ అవకాశం బాగా పెరుగుతుంది. దీన్ని జీవో సడలింపు వెనుక ఉన్న మరో కారణంగా చెబుతున్నారు.

ఎన్జీటీ జోక్యం
జీవో ఉన్నప్పటికీ వాస్తవానికి ఆ ప్రాంతంలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అనేక రాజకీయ వివాదాలూ వచ్చాయి. అటు గ్రామస్థులు, వ్యాపారుల పోరాటం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వరకు వెళ్లింది. ఈ జీవోను సమీక్షించడానికి ఎన్జీటీ మూడేళ్ల కింద నిర్ణయం తీసుకుంది.
జీవో విడుదల చేయడమే అశాస్త్రీయంగా జరిగిందని మరోవైపు స్థానికులు వాదిస్తున్నారు. చెరువులతో సంబంధం లేని దూరంగా ఉన్న ప్రాంతాలనూ జీవోలో కలిపారని, సరైన సర్వే జరగలేదనీ వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మిగిలిన హైదరాబాద్‌తో సమానమైన పట్టణీకరణ తమ ప్రాంతంలో లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎలాంటి పరిమితులు లేకుండా జీవోను ఎత్తేస్తే ఈ రెండు చెరువులూ మరో హుస్సేన్ సాగర్‌లా తయారవుతాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఆ జీవో వల్ల వ్యవసాయానికి సమస్య లేదు. కేవలం భూవ్యాపారం కోసమే ఈ జీవోను తొలిగిస్తున్నారని వారు వాదిస్తున్నారు.
''బహుశా ప్రభుత్వం జీవోను పూర్తిగా ఎత్తేయకుండా మధ్యేమార్గమైన ఉత్తర్వులు ఇస్తుంది అనుకుంటున్నాను. ఇది కోర్టు కేసులతో ముడిపడిన అంశం. అంత తేలిగ్గా తెగదు. ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఆదేశాలు ఉండొచ్చు'' అని బీబీసీతో పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్: భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టడం ద్వారా ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
- రష్యన్ బిలియనీర్లకు లండన్ ఎలా స్వర్గధామంగా మారింది, ఆస్తులు లాక్కుంటే ఓలిగార్క్‌లు ఏం చేస్తున్నారు?
- యుక్రెయిన్ యుద్ధం: మరియుపూల్ నగరం రష్యాకు ఎందుకంత కీలకం? 4 ముఖ్య కారణాలు ఇవే..
- బంగ్లాదేశ్ ఇస్కాన్ టెంపుల్: 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయంపై దాడి, అసలు కథ ఏంటి?
- ‘కశ్మీర్ ఫైల్స్ కాదు.. అభివృద్ధి ఫైల్స్ మీద చర్చ చేయాలి.. ఈడీ, బీడీ బెదిరింపులకు ఈడ ఎవడూ భయపడడు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














