గుజరాత్‌ ఎన్నికలు: 'ప్రతిపక్షం బలహీనంగా' ఉన్న స్థితిలో ఎన్నికలను బీజేపీ ముందుకు జరుపనుందా?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుజరాత్‌లో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగుస్తుంది. కిందటిసారి డిసెంబర్ 18న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ లెక్కన ఈ ఏడాది ఎన్నికలకు ఇంకా ఏడు నెలల పైనే సమయం ఉంది.

ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తుంటే, ఈసారి నిర్ణీత సమయానికి ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. గత దశాబ్దంన్నర కాలంలో కాంగ్రెస్ సాధించిన అత్యధిక సీట్ల సంఖ్య ఇదే. అందువల్ల ఈసారి బీజేపీ మరింత కష్టపడక తప్పదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ గుజరాత్ వెళుతుండడం, ఆ రాష్ట్రంలో అధిక జనాభాగల ఆదివాసీ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ బీజేపీ పథకాలు ప్రారంభించడం చూస్తుంటే ఈ సారి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే విధంగా, జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్ సహా పలువురు బీజేపీ అగ్రనేతల రాష్ట్ర పర్యటనలు కూడా ఎన్నికలు ముందుకు జరగవచ్చనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు ముందుకు జరిగాయి. మొదటిసారి 1975లో, తరువాత 1998లో, చివరిగా 2002లో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగాయి.

2002 ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. గోద్రా ఘటన తరువాత, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తన పదవీకాలం ముగియడానికి ఎనిమిది నెలల ముందే రాజీనామా చేశారు. ఫలితంగా, 2003 ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలు 2002 డిసెంబర్‌లో జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు లాభపడింది. మొత్తం 127 స్థానాల్లో గెలుపొందింది.

ప్రస్తుతం బీజేపీలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ప్రతి రోజూ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ కూడా అన్ని జిల్లాలో సభలు నిర్వహిస్తోంది.

గుజరాత్‌లో అడుగు పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా కసరత్తు చేస్తోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల రెండుసార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు. కార్యకర్తలను పార్టీతో అనుసంధానించేందుకు, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అయితే, ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు కనిపించట్లేదు. 2017 ఎన్నికల మాదిరి కాంగ్రెస్ బలంగా కనిపించట్లేదు. కాంగ్రెస్ నేతలంతా పార్టీ గురించి కాకుండా తమ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. గత కొన్నేళ్లలో కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీ, ఆప్‌లలో చేరారు.

వీడియో క్యాప్షన్, ఈ ఆస్పత్రిలో ఒక్క రూపాయికే వైద్యం.. మూడు రూపాయలకే మందులు

బీజేపీ సన్నాహాలు ఎలా ఉన్నాయి?

ఇటీవల మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మూడు రోజులు గడిపారు. మరి కొన్నిరోజుల తరువాత మళ్లీ రాష్ట్రంలో పర్యటిస్తారని భావిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ తమ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఇందుకోసం ఆయన 'ప్రతిరోజు ప్రతి జిల్లా' కార్యక్రమాన్ని ప్రకటించారు.

మోదీ ఇటీవల రాష్ట్రంలో అనేక కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే, ఆదివాసీల జిల్లాల్లో పర్యటిస్తూ వారిని కూడా తమ పార్టీలో కలుపుకునే ప్రయత్నాలు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో విజయం తరువాత తమ పార్టీ కార్యకర్తల ఉత్సాహం పెరిగిందని, దాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఒక బీజేపీ నేత బీబీసీకి చెప్పారు. తన పేరు బయటపెట్టవద్దని ఆయన కోరారు.

అయితే, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మీడియాకు తెలిపారు. ప్రత్యర్థులకు కోలుకునే అవకాశం ఇవ్వకూడదన్నదే ఆయన ప్రకటనకు అర్థమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈమధ్య మోదీ గుజరాత్‌లో పర్యటించినప్పుడు పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Reuters

కాంగ్రెస్ పరిస్థితేంటి?

కాంగ్రెస్ ఈసారి బలంగా లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈమధ్య కాలంలో రాష్ట్రంలో పార్టీ అగ్రనేతల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ వదిలి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారానికి అనువైన అంశాలు కూడా కాంగ్రెస్ ముందు లేవు. 2017లో పాటీదార్ల ఆందోళనల వల్ల కాంగ్రెస్ బాగా లాభపడింది.

మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపించాయి. ఆయన పార్టీలో చేరిన తరువాత గుజరాత్ ఎన్నికల వ్యూహం ఖరారు చేస్తారని కూడా చెప్పారు.

అయితే, ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరడం లేదన్న విషయం మంగళవారం తేటతెల్లం కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన పెరిగింది.

అలాగే, పాటీదార్ల నేత నరేష్ పటేల్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. దిల్లీలో ఉన్న పార్టీ హైకమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన చేరడం ఆలస్యమవుతోందని మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమీ బాగా లేదని, దీని నుంచి లాభం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌కు చెందిన ఒక సీనియర్ నేత బీబీసీతో చెప్పారు. ఆయన తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు.

కాంగ్రెస్ దయనీయ పరిస్థితి, ఆప్ రాక బీజేపీని తొందరపెడుతున్నాయని, ఎన్నికలు ముందుగా నిర్వహించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ మరో నాయకుడు అర్జున్ మోద్వాడియా బీబీసీతో మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయడంలో బిజీగా ఉందని, దీని కోసం ప్రతి జిల్లాలో సభలు నిర్వహిస్తోందని చెప్పారు. 2017 కంటే ఈసారి తమ పార్టీ మరింత మెరుగ్గా పని చేస్తుందని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఎందుకు?

'ఆప్' గాలి వీస్తోంది

ప్రస్తుతం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత ఏడాది జరిగిన గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఈ స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తమ పార్టీని సంఘటితం చేసేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. మొత్తం 182 స్థానాలకు తగిన అభ్యర్థుల కోసం వెతుకుతోంది.

ఇప్పటికే 148 స్థానాల్లో తమ పార్టీని బలోపేతం చేశామని, మిగిలిన స్థానాలపై దృష్టి సారిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి మనోజ్ సోర్తియా బీబీసీకి తెలిపారు.

"మేమంతా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో మా ఉనికిని చాటుతాం" అని ఆయన అన్నారు.

ఇటీవల ప్రభుత్వ గుమాస్తాల నియామక పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో ఆప్ తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించింది. దీనితో పాటు, రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించేందుకు ఉద్యమాన్ని ప్రారంభించింది.

"ఈ ఉద్యమాల వలన ప్రజలకు చేరువయ్యే అవకాశం కలుగుతుంది. ఆప్‌కి ఓట్లు సంపాదించే వీలు కలుగుతుంది" అని సోర్తియా అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు?

గుజరాత్‌లో ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందు జరుగుతాయా లేదా అనే అంశంపై బీబీసీ పలువురు రాజకీయ విశ్లేషకులతో మాట్లాడింది.

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం లేదని కొందరు భావిస్తుండగా, ప్రతిపక్షం బలహీనంగా ఉన్న పరిస్థితులను పూర్తిగా వినియోగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మరికొందరు అంటున్నారు.

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ మాజీ ప్రొఫెసర్ ఘన్‌శ్యామ్ షా చాలాకాలంగా గుజరాత్ రాజకీయాలను పరిశీలిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని అనుకోవడం పొరపాటని ఘన్‌శ్యామ్ షా అభిప్రాయపడ్దారు. ద్రవ్యోల్బణం, నీటి కొరత సమస్యల మధ్య ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలనుకోవడం బీజేపీకి ఖర్చుతో కూడిన వ్యవహారమని అన్నారు.

సాగునీరు అందక రైతులు ఆగ్రహంతో ఉన్నారని ఘనశ్యామ్ షా అన్నారు. నీటి సమస్యల కారణంగా గతంలో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన సంఘటనలను మరచిపోకూడదన్నారు.

అయితే, రాజకీయ విశ్లేషకుడు సార్థక్ బాగ్చీ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.

"ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందున బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో బలపడకూడదని కూడా కోరుకుంటుంది. నవంబర్‌లో ఎన్నికలు జరిగితే ఆప్ చేతిలో కనీసం ఆరు నెలల సమయం ఉంటుంది. ఈలోపు ఆ పార్టీ బీజేపీకి ముప్పుగా మారుతుంది" అని ఆయన అన్నారు.

కాగా, గుజరాత్‌లో బీజేపీకి ఏమీ ఢోకా లేదని, ఇప్పుడు, ఆరు నెలల తరువాత కూడా బీజేపీ మంచి స్థితిలోనే ఉంటుందని ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు హేమంత్ షా అభిప్రాయపడ్డారు.

"బీజేపీకి తొందరపడాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎనిమిది నెలల ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదు" అని ఆయన అన్నారు.

ఎన్నికల సంఘం ఎలాంటి సన్నాహాలు చేస్తోంది?

గుజరాత్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. అయినప్పటికీ, ఇంకా చాలా పనులు బాకీ ఉన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవల్ ఆఫీసర్లు అంటే బీఎల్ఓల నియామకంలో బిజీగా ఉన్నామని, ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కమిషనర్ డీఎన్ ర్యాంక్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆదివాసీ మహిళ ఆయుర్వేద హెయిర్ ఆయిల్.. అమెరికాకు ఎగుమతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)