అరుణ్ లాల్: 66 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్న 38 ఏళ్ల ఈమె ఎవరు?

బుల్ బుల్ సాహా, అరుణ్ లాల్

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఫొటో క్యాప్షన్, బుల్ బుల్ సాహా, అరుణ్ లాల్
    • రచయిత, ప్రభాకర్ మణి తివారి
    • హోదా, బీబీసీ కోసం...

మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ జట్టు కోచ్ అరుణ్ లాల్ 66 ఏళ్ల వయసులో తన వైవాహిక జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. మొదటి భార్య రీనా చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నందున, ఆమె అనుమతితో మే 2న తన స్నేహితురాలు బుల్ బుల్ సాహా (38)తో కలిసి ఏడు అడుగులు వేయబోతున్నారు.

బుల్ బుల్ సాహా కుటుంబం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆమె చాలా కాలంగా స్థానిక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి కార్డులు ఇప్పటికే బంధుమిత్రులకు వెళ్లిపోయాయి.

పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లకు ఆహ్వానం అందింది. కోల్‌కతాలోని ధర్మతాలా ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ పెళ్లి జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కూడా ఆహ్వానం అందింది.

బెంగాల్ రంజీ జట్టు కోచ్ అరుణ్ లాల్ భారత్ తరఫున 16 టెస్టులు, 13 వన్డేలు ఆడారు.

స్నేహితులు, సన్నిహితులు ఆయన్ను లాల్జీ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆయన గతంలో రీనా అనే మహిళను వివాహం చేసుకున్నారు. అయితే, తర్వాత వారు విడిపోయారు. కానీ, వేరుపడ్డా కూడా సహజీవనం చేస్తున్నారు.

రీనా చాలాకాలంగా అనారోగ్యంతో ఉన్నారు.

కాబోయే భార్య బుల్ బుల్ సాహాతో తనకున్న అనుబంధాన్ని అరుణ్ లాల్ ఎప్పుడూ దాచుకోలేదు. వీరిద్దరి విషయం బెంగాల్ క్రికెట్ జట్టుతో అనుబంధం ఉన్న చాలామందికి తెలుసు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ హలీం ఎందుకు ఇంత ఫేమస్
బుల్ బుల్ సాహా వయసు 38 ఏళ్లు, అరుణ్ లాల్ వయసు 66 సంవత్సరాలు

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఫొటో క్యాప్షన్, బుల్ బుల్ సాహా వయసు 38 ఏళ్లు, అరుణ్ లాల్ వయసు 66 సంవత్సరాలు

పెళ్లి నిర్ణయం

బెంగాల్ టీమ్‌తో చాలాకాలంగా అనుబంధం ఉన్న ఒక ఆటగాడు వీరిద్దరి మధ్య బంధాన్ని వివరించారు. అయితే, ఆయన తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

''లాల్ జీ తరచుగా బుల్ బుల్ తో తనకున్న అనుబంధాన్ని వివరించేవారు. ఆయన ఎప్పుడూ ఆమెతో స్నేహాన్ని దాచుకోలేదు. నెల కిందట వారిద్దరి నిశ్చితార్ధం జరిగింది. మొదటి భార్య అంగీకారంతో ఇద్దరూ తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని అనుకున్నారు. వివాహం తర్వాత రిసెప్షన్ కూడా అదే హోటల్‌లో జరుగుతుంది'' అని వివరించారు.

బుల్‌బుల్ తరచూ రీనాను కూడా కలుస్తుంటారని, ఆమెకు సహాయంగా ఉండేందుకే బుల్ బుల్ సాహను పెళ్లి చేసుకోవాలని అరుణ్ లాల్‌ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కోల్‌కతాలోని సీల్దా సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బుల్‌బుల్ గత ఆరేళ్లుగా టీచర్‌గా పని చేస్తున్నారు. విలేఖరులు సమావేశంలో ఆమె స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, అరుణ్ లాల్, తన కుటుంబాల మధ్య చాలా సాన్నిహిత్యం ఉందని ఆమె తెలిపారు.

బుల్ బుల్ సాహా టీచర్ గా పని చేస్తున్నారు

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఫొటో క్యాప్షన్, బుల్ బుల్ సాహా టీచర్ గా పని చేస్తున్నారు

మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు?

''అరుణ్ నాకు ముందే తెలుసు. అయితే తొలిసారిగా ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో మొదటిసారి కలుసుకున్నాం'' అన్నారు బుల్ బుల్. అయితే, బుల్ బుల్ సాహాతో వివాహం గురించి మాట్లాడటానికి అరుణ్ లాల్ నిరాకరించారు. విలేఖరులు అడిగి ప్రశ్నలకు ఇది ప్రైవేట్ విషయమంటూ దాటవేశారు.

మూడేళ్ల కిందట బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా బుల్‌బుల్‌ తో కలిసి అరుణ్ లాల్‌ తొలిసారి బహిరంగంగా కనిపించారు.

వివాహం తర్వాత, అరుణ్ లాల్, రీనా, బుల్‌బుల్ ఒకే ఇంట్లో నివసించబోతున్నారు.

ఇటీవలే దవడ క్యాన్సర్ నుంచి కోలుకున్న అరుణ్ లాల్, గతంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. బెంగాల్ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. బెంగాల్ జట్టు 13 సంవత్సరాల తర్వాత 2020 సంవత్సరంలో రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది.

అరుణ్ లాల్ బెంగాల్ రంజీ జట్టు కోచ్

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఫొటో క్యాప్షన్, అరుణ్ లాల్ బెంగాల్ రంజీ జట్టు కోచ్

అరుణ్ లాల్ కెరీర్

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 46.94 సగటుతో 10,421 పరుగులు చేసిన అరుణ్ లాల్ టెస్ట్ కెరీర్ ఎంతో కాలం కొనసాగలేదు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న అరుణ్ లాల్, భారత జట్టులోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్‌లో అంతగా ప్రతిభ చూపలేదు.

1982, 1989 మధ్య ఆడిన 16 టెస్ట్ మ్యాచ్‌లలో 26 సగటుతో 729 పరుగులు చేశారు. వెస్టిండీస్‌పై అత్యధికంగా 93 పరుగులు చేశారు.

వన్డేల్లో ఆయన అత్యధిక స్కోరు 51. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 30 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

1982లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అరుణ్ లాల్ కెరీర్ ప్రారంభించారు. ఆ మ్యాచ్‌లో సునీల్ గావస్కర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

వీడియో క్యాప్షన్, లేటు వయసులో గర్భం దాలిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)