ఫాక్లాండ్ దీవులు: అర్జెంటీనా, బ్రిటన్‌ల మధ్య వివాదంపై బీజేపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫాక్లాండ్స్ లేదా మావినాస్ దీవులు అట్లాంటిక్ మహాసముద్రంలో నైరుతి వైపు ఉన్నాయి. బ్రిటన్ ప్రజలు వీటిని ఫాక్లాండ్ దీవులు అని పిలుస్తారు. అర్జెంటీనా ప్రజలు మావినాస్ ద్వీపం అంటారు.
ఈ దీవులు ఇప్పటికీ బ్రిటన్ నియంత్రణలో ఉన్నాయి. వీటి సార్వభౌమాధికారంపై బ్రిటన్, అర్జెంటీనాల మధ్య వివాదం నెలకొని ఉంది. ఇప్పుడు ఈ వివాదంలో బీజేపీ కూడా చేరింది.
మావినాస్ వివాదాన్ని పరిష్కరించేందుకు బ్రిటన్‌తో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ అర్జెంటీనా ప్రభుత్వం ఆదివారం భారతదేశంలో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచార కమిషన్‌ను అర్జెంటీనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం ఫాక్లాండ్ వివాదంపై బ్రిటన్‌తో చర్చలు ప్రారంభించడమే దీని ఉద్దేశం.
అర్జెంటీనా ఇప్పుడు ఈ ప్రచారాన్ని భారత్‌లో ప్రారంభించడానికి రెండు నేపథ్యాలు చెప్పుకోవచ్చు. అంతకు రెండు రోజుల క్రితమే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ముగించుకోవడం, ఫాక్లాండ్స్‌పై బ్రిటన్, అర్జెంటీనాల మధ్య 1982లో జరిగిన యుద్ధానికి 40వ వార్షికోత్సవం కావడం.
ఇటీవల, రైసినా డైలాగ్‌కు హాజరయ్యేందుకు అర్జెంటీనా విదేశాంగ మంత్రి శాంటియాగో కెఫియెరో భారత్ వచ్చారు. అప్పుడే ఫాక్లాండ్స్ ప్రచారాన్ని భారతదేశంలో ప్రారంభించారు.

ఫొటో సోర్స్, @DRSJAISHANKAR
బీజేపీ ఎందుకు కంగారుపడుతోంది?
అర్జెంటీనా ప్రచార కార్యక్రమ ప్రారంభోత్సవంలో బీజేపీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ, మాజీ కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు పాల్గొనాల్సి ఉంది. కానీ, బోరిస్ జాన్సన్ రాక తరువాత ఈ ప్రచారం విషయంలో బీజేపీ ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం.
అర్జెంటీనా ప్రచార కమిషన్‌లో మాజీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ, కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ శశి థరూర్, సుప్రసిద్ధ శాంతిదూత తారా గాంధీ భట్టాచార్జీ కూడా సభ్యులు.
షాజియా ఇల్మీ ఈ వేడుకకు వెళ్లారుగానీ ప్రచారాన్ని ప్రారంభించక ముందే అక్కడి నుంచి బయలుదేరిపోయారు. అయితే, ప్రారంభోత్సవానికి తాను హాజరు కాలేకపోతున్నట్టు షాజియా ఇల్మీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మొదట, ఈ ప్రచారంలో పాల్గొనట్లేదంటూ సురేశ్ ప్రభు ఒక ట్వీట్ చేశారు.
ఆయన 'ది హిందూ' వార్తాపత్రిక నివేదికను ఉటంకిస్తూ, "ప్రస్తుతం నేను అమెరికా పర్యటనలో ఉన్నాను. అక్కడ పలు యూనివర్సిటీల్లో ప్రసంగించబోతున్నాను. కాబట్టి ఈ నివేదికలో పేర్కొన్నట్లుగా ఈ వేడుకలో నేను భాగం కాదు" అంటూ ట్వీట్ చేశారు.
సురేశ్ ప్రభు ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ షాజియా ఇల్మీ, "గుడ్ లక్ సురేష్ భాయ్! నేను కూడా ఈ వేడుకకు హాజరు కాలేకపోతున్నాను. హేవ్ ఎ గ్రేట్ ట్రిప్" అని రాశారు.
షాజియా ఇల్మీ ఎందుకు తప్పించుకుంటున్నారు?
షాజియా ఇల్మీ ట్వీట్ తరువాత ఈ అంశంపై బీబీసీ ఆమెతో మాట్లాడింది.
'మీరు ఆ వేడుకకు వెళ్లినట్టు రిపోర్టులు వచ్చాయి. మీరేమో వెళ్లలేదని ట్వీట్ చేశారు. ఎందుకు? ' అని అడిగింది.
దానికి జవాబుగా, "అవును వెళ్లాను కానీ, లాంచ్‌కు ముందే వచ్చేశాను" అని ఆమె చెప్పారు.
బోరిస్ జాన్సన్ భారత పర్యటన తరువాత అర్జెంటీనా ప్రచారానికి బీజేపీ దూరం అవుతోందా లేక దీని పట్ల అసౌకర్యంగా ఉందా? అని బీబీసీ ప్రశ్నించింది.
"భారత్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. సురేశ్ ప్రభు అమెరికాలో ఉండడం వలన దీనికి హాజరు కాలేదు" అని ఆమె చెప్పారు.
అయితే, ప్రచారం ప్రారంభించకముందే ఆమె అక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోయారు?
ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. కానీ, భారత్ వైఖరిలో మార్పు లేదని మరోసారి నొక్కి చెప్పారు.
"అర్జెంటీనా విదేశాంగ మంత్రిని, మా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కలిశారు. భారత వైఖరిని ఆయన స్పష్టం చేశారు. బోరిస్ జాన్సన్ రాక తరువాత భారత్ వైఖరి మారలేదు" అని ఆమె అన్నారు.
బీజేపీ నేతలు ఈ ప్రచార ప్రారంభోత్సవానికి వెళ్లకపోతే ఇందులో సభ్యులుగా ఎందుకు చేరినట్టు? వలసరాజ్య పాలన విషయంలో భారతదేశం అభిప్రాయం మార్చుకుంటోందా? బోరిస్ జాన్సన్ పర్యటన తరువాత ఈ ప్రచారం విషయంలో బీజేపీ ఒత్తిడికి గురవుతోందా?

ఫొటో సోర్స్, Getty Images
భారత్ వైఖరి
ఈ అంశంపై భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబ్బల్ బీబీసీతో మాట్లాడారు.
"కమిషన్‌లో సభ్యత్వం వలన ఎలాంటి సమస్య లేదు. బ్రిటీష్ ఎంపీలు, నేతలు కూడా ఇలాంటి ఎన్నో కమిషన్లలో సభ్యులుగా ఉంటారు. దాని వలన ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పూ రాదు. ఫాక్లాండ్స్ విషయంలో భారత్ న్యూట్రల్‌గా ఉండడమే మేలని నా అభిప్రాయం. బ్రిటన్‌కు గానీ, అర్జెంటీనాకు గానీ మద్దతు ఇవ్వకూడదు" అని ఆయన అన్నారు.
వలసవాదం విషయంలో ప్రతి దేశం తమ ఆసక్తి బట్టి గొంతు విప్పుతుంది. భారత్ కూడా అదే చేస్తోందని కన్వాల్ సిబ్బల్ అన్నారు.
ఫాక్లాండ్స్‌పై ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంలో అర్జెంటీనా విదేశాంగ మంత్రి కెఫియెరో మాట్లాడుతూ, సంప్రదాయకంగా భారత్, బ్రిటన్‌తో వివాదాల పరిష్కారానికే మద్దతు ఇస్తుందని అన్నారు.
భారత్, అర్జెంటీనాలు వలసవాద వ్యతిరేక వారసత్వం, విలువలను పంచుకుంటున్నాయని అన్నారు.
ప్రారంభోత్సవ వేడుకలో శశి థరూర్ ప్రసంగిస్తూ, "ఫాక్‌లాండ్స్‌పై బ్రిటన్, అర్జెంటీనాల మధ్య వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించడానికే భారత్ మొగ్గు చూపుతుంది. వలసవాదాన్ని అంతం చేయడంలో భారతదేశం మార్గదర్శకంగా నిలిచింది. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారతదేశం మద్దతు ఇస్తుంది" అని అన్నారు.
1982 యుద్ధానికి సంబంధించిన పత్రాలను బహిరంగపరచాలని కెఫియెరో బ్రిటన్‌కు, అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. యుద్ధ సమయంలో దక్షిణ అట్లాంటిక్‌లో బ్రిటన్ పెద్దఎత్తున అణ్వాయుధాలను పోగుచేసిందని అన్నారు. 21వ శతాబ్దంలో వలసవాదానికి తావు లేదని కెఫియెరో నొక్కిచెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఫాక్లాండ్స్ ఎవరికి చెందుతాయి?
ఫాక్లాండ్స్ నియంత్రణపై 1982లో బ్రిటన్, అర్జెంటీనాల మధ్య యుద్ధం జరిగింది.
1800లలో స్పానిష్ సామ్రాజ్యంలో భాగమైనందున ఈ ద్వీపంపై తమకు హక్కులు ఉన్నాయని అర్జెంటీనా అంటుంది. లాటిన్ అమెరికా ప్రధాన భూభాగానికి దగ్గరగా ఉందన్న కారణం కూడా చూపిస్తోంది. అయితే, ఈ వాదనలను బ్రిటన్ తోసిపుచ్చింది.
ఈ దీవులు చాలాకాలంగా తమ పరిపాలనలోనే ఉన్నాయని, అక్కడి పౌరులు బ్రిటిష్ వారిగానే ఉండాలని బ్రిటన్ వాదిస్తోంది.
ఈ ద్వీపంలో గాలి బలంగా వీస్తుంది. చెట్లు దాదాపు ఉండవనే చెప్పుకోవాలి. వీటిల్లో తూర్పు, పశ్చిమ ఫాక్లాండ్‌లు ముఖ్యమైన దీవులు. ఇవి కాకుండా, వందల కొద్దీ చిన్న చిన్న దీవులు ఉన్నాయి.
ఫాక్లాండ్స్ దీవులకు స్వయంప్రతిపత్తి ఉందిగానీ, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ బ్రిటన్ నియంత్రణలో ఉన్నాయి. ఇక్కడ పార్టీ రాజకీయాలు లేవు.
2009 జనవరి 1 నుంచి ఫాక్లాండ్స్‌లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా కార్యనిర్వాహక మండలికి మరిన్ని అధికారాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫాక్లాండ్స్ గురించి...
1690 - తొలిసారిగా ఒక బ్రిటిష్ కెప్టెన్ ఇక్కడికి చేరుకున్నారు.
1764 - ఫ్రెంచ్ నావిగేటర్లు తూర్పు ఫాక్లాండ్స్‌లో తొలిసారిగా స్థావరాన్ని ఏర్పాటుచేశారు.
1765 - బ్రిటన్, పశ్చిమ ఫాక్లాండ్ దీవులను నెలకొల్పింది. 1770లో స్పానిష్ సైన్యం ఇక్కడి నుంచి వైదొలిగింది కానీ, 1771లో తిరిగి వచ్చింది. 1774లో మళ్లీ వెనుదిరిగింది.
1820 - స్వతంత్ర అర్జెంటీనా, ఫాక్లాండ్స్‌పై సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది.
1831 - అమెరికా యుద్ధనౌకలు అర్జెంటీనా స్థావరాలను నాశనం చేశాయి. మూడు అమెరికా నౌకలను అర్జెంటీనా స్వాధీనం చేసుకున్నందుకు ప్రతిస్పందనగా అమెరికా ఈ దాడి చేసింది.
1833 - బ్రిటిష్ దళాలు మిగిలిన అర్జెంటీనా అధికారులను తొలగించి, తమ గవర్నర్‌ను నియమించాయి. అప్పటి నుంచి అర్జెంటీనా బ్రిటన్ ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉంది.
1965 - బ్రిటన్, అర్జెంటీనాల మధ్య వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకు దిశలో చర్చలు జరపాలని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది.
1982 - అర్జెంటీనా దాడి చేసింది. యుద్ధం ప్రారంభమైంది.
1990 - అర్జెంటీనా, బ్రిటన్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.
2013 - ఫాక్లాండ్ పౌరులు బ్రిటిష్ పాలనకు అనుకూలంగా ఓటు వేశారు.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలో బతకాలంటే ఆహారం ఎక్కడినుంచి వస్తుంది? చెట్లు మొలుస్తాయా? మాంసం తయారు చేయొచ్చా?
- కూమా జైలు: స్వలింగ సంపర్కులకు మాత్రమే
- డాట్సన్ కార్లు 'గుడ్ బై' చెబుతున్నాయి... ఎంతో చరిత్ర ఉన్న ఈ బ్రాండ్ ఎందుకు కనుమరుగవుతోంది?
- అక్కడ దెయ్యాన్ని పావురంలో పెట్టి బయటకు వెళ్లగొడతారట
- ఆపరేషన్ మిన్స్మీట్: రెండవ ప్రపంచ యుద్ధంలో అడాల్ఫ్ హిట్లర్‌ను ఒక అనాధ శవం ఎలా మోసం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











