ఫ్రాన్స్: అధ్యక్షుడిగా మరోసారి మేక్రాన్... ముస్లింలపై ఈ విజయం ప్రభావం ఎలా ఉండబోతోంది?

ఎమ్మాన్యుయేల్ మేక్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థి మరీన్ లీ పెన్‌ మీద విజయం సాధించడంతో మేక్రాన్ మరో అయిదేళ్ల పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

కాగా, ఈ ఎన్నికల్లో లీ పెన్, రైట్ వింగ్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించారు.

మేక్రాన్‌కు 58.55 శాతం ఓట్లను రాగా, లీ పెన్‌కు 41.45 శాతం ఓట్లు వచ్చాయి. ఊహించినదాని కన్నా ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

మధ్యే మార్గాన్ని అనుసరించే లీడర్‌గా మేక్రాన్‌ను పరిగణిస్తారు. ఈ విజయం తరువాత మేక్రాన్ ఐఫిల్ టవర్ వద్ద ప్రసంగిస్తూ "అందరికీ ప్రాముఖ్యం ఇస్తాం" అని అన్నారు.

ఎన్నికల్లో పరాజయం తర్వాత లీ పెన్ మాట్లాడుతూ, తన ఓట్ల శాతమే తన విజయానికి ప్రతీక అని అన్నారు. తమ కీర్తి ఉన్నత స్థాయిలో ఉందని లీ పెన్, మద్దతుదారులతో అన్నారు.

మేక్రాన్ తన ప్రసంగంలో, "ఈరోజు నాకు ఓటు వేసిన వారిలో చాలామంది నా అభిప్రాయాలతో ఏకీభవించరని నాకు తెలుసు. కానీ వారికి రైట్ వింగ్ అధికారంలోకి రావడం కూడా ఇష్టం లేదు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని అన్నారు.

రైట్ వింగ్ పార్టీకి ఓటు వేసినవాళ్ల "కోపానికి, అసమ్మతికి" సమర్థవంతంగా ప్రతిస్పందిస్తామని మేక్రాన్ అన్నారు. ఇందులో తన బాధ్యత కూడా ఉందని ఆయన అన్నారు. "దయతో, గౌరవప్రదంగా" ప్రవర్తించాలని తన మద్దతుదారులకు సూచించారు.

ఈ ఎన్నికలలో 72 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 1969 నుంచి చూస్తే ఇది అత్యల్ప సంఖ్య. అంటే, దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు ఓటు వేయలేదు. ఇలా చూస్తే ఓటు వేయని పట్టణ జనాభా సుమారు 30 లక్షలు ఉంటుంది.

'ఫిఫ్త్ రిపబ్లిక్'గా పిలిచే ఫ్రాన్స్ ప్రస్తుత గణతంత్ర పాలక విధానంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడే రెండోసారి ఎన్నిక కావడం ఇదే ప్రథమం.

లీ పెన్

ఫొటో సోర్స్, Getty Images

'విద్వేషాన్ని వ్యాప్తి చేసే విదేశీయులను దేశం నుంచి తరిమికొట్టాలి'

ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ అధికారంలో ఉన్నప్పుడు ఇస్లాంకు వ్యతిరేకంగా ఎన్నో ప్రకటనలు చేసినప్పటికీ, ఆయన ప్రత్యర్థి లీ పెన్ అంతకన్నా నాలుగాకులు ఎక్కువే తిన్నారు.

యూరప్ నుంచి ఫ్రాన్స్ బయటకు వచ్చేయాలని రైట్ వింగ్ పార్టీ నేషనల్ ఫ్రంట్ నాయకురాలు మరీన్ లీ పెన్ కోరుకుంటున్నారు. అలాగే, వలసదారులు, ముస్లింల పట్ల ఆమెకు తీవ్రమైన అభిప్రాయాలు ఉన్నాయి.

ఈసారి తమ పార్టీని ప్రజల్లోకి మరింత విస్తరించడానికి కొన్ని కఠిన సిద్ధాంతాలను దూరం పెట్టే ప్రయత్నం చేశారామె.

తమ నినాదం 'ఫ్రాన్స్ ఫస్ట్' కింద ఇస్లామిక్ ఛాందసవాదం, ప్రపంచీకరణ, యూరోపియన్ యూనియన్ నుంచి ఫ్రాన్స్‌కు విముక్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేయాలని లీ పెన్ పిలుపునిచ్చారు. 2015 పారిస్ దాడులకు చాలా సంవత్సరాల ముందు నుంచే వలసవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం గురించి విస్తృతంగా మాట్లాడుతూ వచ్చారు.

పారిస్ దాడులు తరువాత, లీ పెన్ మాట్లాడుతూ "విద్వేషాలను వ్యాపింపజేసే వలసవాదులను దేశం నుంచి తరిమికొట్టాలి" అని అన్నారు.

మతోన్మాద ఆలోచనలు ఉన్న ముస్లింలకు ద్వంద్వ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. అయితే, రైట్ వింగ్ పార్టీలు ఇలా మాట్లాడడం కొత్తేం కాదు.

మహ్మద్ ప్రవక్త వివాదాస్పద కార్టూన్లపై ఫ్రాన్స్‌లో ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.

అంతే కాకుండా, పారిస్ దాడులు జరిగినప్పటి నుంచి స్థానిక ముస్లింలపై దూకుడు చర్యలు, నేరాలు పెరిగాయి.

ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్‌ గీయడాన్ని పాపంగా భావిస్తారు. కానీ, ఫ్రాన్స్‌లో అది లౌకికవాదం గుర్తింపులో భాగం. అది భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడం కిందకు వస్తుందని భావిస్తారు.

ఫ్రాన్స్‌

ఫొటో సోర్స్, AFP

ఫ్రాన్స్‌లో ముస్లింల భవిష్యత్తు ఏమిటి?

2020లో ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మహమ్మద్‌ ప్రవక్తపై గీసిన కార్టూను విషయంలో వివాదం చెలరేగింది. మహమ్మద్‌ ప్రవక్త కార్టూన్లను చూపించిన ఓ ఫ్రెంచ్‌ ఉపాధ్యాయుడిని హత్య చేశారు. ఈ ఘటన తరువాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ చేసిన కామెంట్లు ఇస్లామిక్‌ దేశాలకు ఆగ్రహం తెప్పించాయి.

మహమ్మద్‌ ప్రవక్త వివాదాస్పద కార్టూన్‌ల ప్రదర్శనను మేక్రాన్‌ సమర్ధించారు. ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతింటాయని భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోలేమని ఆయన అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఫ్రాన్స్‌ సమగ్రతను దెబ్బతీయడమేనని మేక్రాన్‌ వ్యాఖ్యానించారు. మేక్రాన్ వ్యాఖ్యలను ప్రపంచంలో పలు దేశాలు ప్రశంసించాయి.

"ఇస్లాం తీవ్రవాదులు మన భవిష్యత్తును కబ్జా చేయాలని చూస్తున్నారు" అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం "సంక్షోభ మతం"గా మారిందని అన్నారు.

ముస్లిం తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, మతాన్ని, దేశాన్ని వేరుచేసే 1905 చట్టాన్ని తమ ప్రభుత్వం బలోపేతం చేస్తుందని అన్నారు. దేశంలోని లౌకిక విలువలను పరిరక్షిస్తానని మేక్రాన్ హామీ ఇచ్చారు.

2020 నవంబర్‌లో ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫ్రెంచ్ ముస్లిం నాయకులతో చర్చలు జరుపుతూ, ఇస్లాం తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన 'ప్రజాస్వామ్య విలువల' చార్టర్‌కు అంగీకారం తెలుపమని కోరారు.

ఈ నేపథ్యంలో మేక్రాన్ ప్రకటన తరువాత ఫ్రెంచ్ ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారం ముస్లిం దేశాలలో ఊపందుకుంది.

ఫ్రాన్స్‌లో ముస్లింలపై ద్వేషం, నేరాలు ఇప్పుడు తగ్గుతాయా లేదా రైట్ వింగ్ పార్టీ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సంపాదించగలిగినందున తిరిగి బలం పుంజుకుంటుందా అనేది చూడాలి. యూరప్‌లో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఏకైక దేశం ఫ్రాన్స్.

వీడియో క్యాప్షన్, మియన్మార్: బాంబులు తయారు చేసి సైన్యంపై దాడి చేస్తున్న మహిళలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)