‘ఈ భూమిపై అత్యంత అద్భుతమైన సంస్కృతి’ భారత్‌లో ఉన్నా.. అది భారతీయులందరికీ ఎందుకు తెలియట్లేదు?

ఫొటో సోర్స్, Los Angeles County Museum of Art.
- రచయిత, జోయా మతీన్
- హోదా, బీబీసీ న్యూస్
ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లి తంజావూరు పెయింటింగ్, మైసూరు గ్లాస్ కళాఖండం, కశ్మీర్ శాలువాలు, మధుబని చిత్రాలు లేదా ఆంధ్రకు చెందిన కలంకారీ చీరలు, తెలంగాణ చేర్యాల బొమ్మలు లాంటివి కొనేస్తూ ఉంటాం. కానీ, ఆ కళల వెనుక కూడా సంస్కృతితో సమ్మిళితమైన కథలు, చరిత్ర ఉన్నాయని మనకి తెలుసా?
ఈ కథల గురించి తెలుసుకోవాలని అనుకుంటే సామాన్యులు అర్ధం చేసుకునే రీతిలో కళలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందా?
చరిత్ర చదువుకున్న విద్యార్థులు, కళాకారులు మాత్రమే కాదు, వాటిని అభిమానించే కళారాధకులు, సంస్కృతి పట్ల ప్రేమ ఉన్న వారు కూడా వివిధ కళారూపాల గురించి తెలుసుకోవడం ఎలా?
25ఏళ్ల జాయ్ పాల్ కు చిత్రకళ అంటే ఇష్టం. చరిత్ర అంటే మరింత అభిమానం. ఆయనకు శిల్పాలు, కాయిన్ లు, విగ్రహాల పట్ల సహజమైన అభిలాష ఉంది.
అసాసిన్స్ క్రీడ్ అనే వీడియో గేమ్ లో చారిత్రక ఘట్టాల చుట్టూ తిరిగే కథనాల శైలి చూడటం వల్ల తెలియకుండానే కళల పట్ల ఇష్టం కలిగేందుకు దారి తీసిందేమోననే అనుమానం కూడా ఆయనకు ఉంది.
దిల్లీ ఆర్ట్ కాలేజీలో సీటు సంపాదించినప్పుడు ఆయనకు చాలా ఆశలుండేవి.
కానీ, ఆ కాలేజీలో సిలబస్ మాత్రం కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న కళల చరిత్రకు కొంత పరిచయాన్ని, సగం సగం వివరణలను జత చేసి ఏదో ఒక విధంగా విద్యార్థులను ఉత్తీర్ణులను చేసేందుకు చేపట్టిన సైనిక చర్యలా అనిపించింది.
పాఠ్య పుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు పేలవంగా ఉండటాన్ని చూసి ఆయన చాలా దిగులు చెందారు. "ఆ పుస్తకాల్లో రాతలు నా లాంటి చరిత్ర పిచ్చివాళ్లకు కూడా అర్ధం కాని రీతిలో కాలం చెల్లినట్లు, అర్ధం లేని సంక్లిష్టతతో కూడుకుని ఉన్నాయి" అని ఆయన చెప్పారు.
ప్రపంచంలోనే కొన్ని శతాబ్దాల పురాతనమైన, విభిన్న తరహా, శైలులకు చెందిన అత్యంత సంపన్న కళాత్మక చరిత్ర ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.
కానీ, కళల గురించి అధ్యయనం చేయకుండా వాటి గురించి తెలుసుకోవడం ఎవరికైనా కష్టమైన పనే. "చాలా ఆకర్షణీయంగా కనిపించే వస్తువును కూడా నిపుణులు కష్టమైన రీతిలో వర్ణిస్తారు. దీంతో, చరిత్ర అంటే విపరీతమైన ఆసక్తి ఉన్న వారికి కూడా నిరుత్సాహం ఆవరిస్తుంది" అని అన్నారు.
అయితే, ఇలాంటి పరిస్థితిని తొలగించేందుకు బెంగళూరులో ఉన్న ఒక మ్యూజియం ప్రయత్నిస్తోంది.
అసంఖ్యాక భారతీయ చిత్రాలు, ఫోటోలు, సంస్కృతులు, శిల్పకళ, నిర్మాణ కళ, వస్త్రాల గురించి తెలుసుకునేందుకు వీలుగా ఆర్ట్ కలెక్టర్ అభిషేక్ పొద్దర్ ది మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫొటోగ్రఫీ అనే ప్రైవేటు మ్యూజియంను ప్రారంభించారు. ఇది భారతీయ కళలకు ఎన్ సైక్లోపీడియాలా ఉంటుంది.

ఫొటో సోర్స్, The Hugh Huxley Collection
కొత్తగా రూపొందించిన మ్యాప్ అకాడెమీ వెబ్ సైటులో ప్రస్తుతానికి యువ విద్యార్థులు, చరిత్రకారులు, నిపుణులతో సమీక్ష చేసిన 2000 ఎంట్రీలు ఉన్నాయి.
ఇందులో 10000 సంవత్సరాల పురాతనమైన గుహల్లో చిత్రించిన చిత్రాల నుంచి గత దశాబ్ధంలో వినిపించిన ప్రముఖ సమకాలీన పేర్లు కూడా పొందుపరిచారు. ఇందులో ప్రధాన స్రవంతిలో గుర్తింపు దొరకని చాలా మంది కళాకారుల పేర్లను కూడా చేర్చారు.
"కళల చరిత్రను సులభంగా అర్ధం చేసుకునే విధంగా ఒకే వేదిక పై చేర్చడం మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఈ చరిత్రను భద్రపరిచిన విధానంలో ఉన్న లోటును భర్తీ చేసి దీనిని మరింత ప్రాంతీయంగా, లింగ వైవిధ్యతతో రూపొందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం" అని మ్యాప్ అకాడెమీ డైరెక్టర్ నథానియెల్ గాస్కెల్ చెప్పారు. .
"ఇలాంటి ఒక వేదికను సృష్టించేందుకు సమయం పడుతుంది. కానీ, ఇది చేసేందుకు మేం సిద్ధమయ్యాం" అని అన్నారు.

ఫొటో సోర్స్, The Metropolitan Museum of Art
"కళలు, సాంస్కృతిక సంపదను కలిపి యువతను ఈ మార్గంలోకి తీసుకొచ్చే విధానాన్ని చెప్పేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ" అని నిపుణులు అంటున్నారు.
"కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందని భారతీయ మ్యూజియంలు ఆధునిక కాలానికి తగినట్లు నిలబడేందుకు చాలా పోరాటం చేయాల్సి వస్తుంది" అని అంటున్నారు.
మ్యూజియంలకు వెళ్లే సందర్శకుల సంఖ్యను పెంచేందుకు నేడు చాలా మంది చదువుకున్న, నైపుణ్యం ఉన్న యువత అవసరం.
"కానీ, ప్రభుత్వం సీనియర్ కళాకారులు, లేదా కళా రంగంలో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తులను నిర్వాహకులుగా నియమిస్తోంది" అని జవహర్ లాల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, కళాకారుడు శుక్ల సావంత్ అన్నారు.
సంస్కృతి నిర్వహణ పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును బట్టి చూస్తే, మ్యాప్ లాంటి ప్రైవేటు ప్రాజెక్టులు కళల భవిష్యత్తుకు ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నాయని చరిత్రకారులు విలియం డార్లింపిల్ అంటారు.
"యూరప్ తో పోలిస్తే, భారతీయ కళల చరిత్ర చాలా వరకూ లిఖిత రూపంలో లేదు. మంచి యూనివర్సిటీ లైబ్రరీ అందుబాటులో లేని వారికి కళల గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడం అంత సులభంగా జరిగే పని కాదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, The Metropolitan Museum of Art
సంపన్న పోషకుల పై ఆధారపడకుండా డిజిటల్ ఎన్ సైక్లోపీడియా లాంటి ప్రత్యామ్న్యాయ మ్యూజియంలను ఏర్పాటు చేయడం ద్వారా బలమైన వారి మద్దతు దొరకని కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి.
"భారతీయ సంస్కృతికి తోడ్పడిన కళాకారులు చాలా మంది ఉన్నారు. కానీ, వారి చరిత్రలు కానీ, వారు చేసిన పనిని కానీ ఎవరూ గుర్తించలేదు, ఎక్కడా పొందుపరచలేదు. ఇలాంటి వారంతా పూర్తిగా అంతరించిపోయే దశలో ఉన్నారు" అని సావంత్ అన్నారు.

ఫొటో సోర్స్, Museum of Art and Photography
ఇలాంటి వారందరినీ తమ ప్రాజెక్టులో చేర్చి విభిన్నమైన, సమ్మిళితమైన కథలను చెప్పాలని మ్యాప్ అకాడెమీ భావిస్తోంది.
సాంస్కృతిక పీఠం పై స్థానం దక్కని, పేరు పొందని భారతీయ కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడినట్లు గాస్కెల్ చెప్పారు.
ఈ ప్రయత్నం ఆసక్తికరమైన, సమాచారంతో కూడిన ఫలితాన్నిచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల అతి చిన్న మొఘల్ కళాఖండాల్లో కనిపించే కళాత్మకత నుంచి, రాజస్థానీ చిత్రాల్లో కనిపించే వైభవం, మధ్య భారతదేశ రాష్ట్రానికి చెందిన పిథోరా కళలో దాగిన చైతన్యం గురించి నేర్చుకున్నాం.
యూరోపియన్ సహజత్వాన్ని భారతీయ శైలిలోకి సహజంగా మలచడంలో జైనుద్దీన్ తెలివితేటలు ప్రదర్శించారు.
భగవంతుడు, భక్తుడు మధ్య ఉండే విరుద్ధమైన ప్రపంచాలను ఊహించి చిత్రించిన 18వ శతాబ్ధపు చిత్రకారుడు నైన్ సుఖ్, స్వదేశీ భిల్ తెగకు చెందిన భురీ బాయ్ కాగితం పై వేసిన చిత్రాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Hervé Perdriolle


ఫొటో సోర్స్, Minneapolis Institute of Art
ఈ ఎన్ సైక్లోపీడియాలో భారతీయ వస్త్రాల గొప్పతనం తెలిపేందుకు కోసం కూడా కొంత స్థలాన్ని కేటాయించారు. ఇందులో అన్ని ప్రాంతాలకు చెందిన కళాకారులను చేర్చడం మాత్రమే కాకుండా, కళాత్మక ప్రపంచంలో చిత్రకళ, శిల్పకళకు మాత్రమే ఉన్న అగ్ర స్థానాన్ని కూడా కొంత వరకు తగ్గించాలనే ఉద్దేశంతో వస్త్ర కళా నైపుణ్యం గురించి కూడా చేర్చినట్లు చెప్పారు.
ఈ ప్రక్రియలో వారెన్నో ఆసక్తికరమైన కథలను తెలుసుకున్నారు. అలాంటి ఒక కథను ఆయన వీడియో కాల్ లో బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Alamy

ఫొటో సోర్స్, Museum of Art and Photography
"మీకు గొర్రె చెట్ల గురించి తెలుసా"?
"భారతదేశం నుంచి ఎగుమతి చేసే పత్తి గొర్రెలను పుట్టించే చెట్లపై పండుతుందనే యూరోపియన్ల అపోహకు సంబంధించింది" అని వివరించారు.
"ఈ అపోహను నిరూపించే విధంగా చిత్రాలతో కూడిన యూరోపియన్ రచనలు కూడా ఉన్నాయి. వీటిని చూసి ప్రజలు చాలా ఆకర్షితులయ్యేవారు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Wikimedia Commons
"కేవలం సంపన్న చక్రవర్తులు, పాలకులు మాత్రమే కళలను పోషించి, కొన్ని సంస్కృతులకు చెందిన కొంత మంది కళాకారులు మాత్రమే కళలను సృష్టించగలరనే అభిప్రాయం ఉంది. కానీ, ఈ దేశంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న గ్రామీణ కళలు, ప్రాంతీయ కళాకారులు ఉన్నారు" అని గాస్కెల్ అన్నారు.
భారతీయ వస్త్రాలకు అంతర్జాతీయ చరిత్ర ఉంది. భారతీయ వస్త్రాల్లో ఖరీదైన పట్టు వస్త్రాల నుంచి తేలికైన కాటన్, జాలువారే లినెన్, బ్లాక్ ప్రింట్లతో కూడిన దుస్తులు ఉంటాయి. భారతదేశంలో ఒక అద్భుతమైన వస్త్రాన్ని మలిచేందుకు నేతపని వారు కొన్ని వారాలు, నెలలు కూడా శ్రమిస్తారు.
ఇలాంటివన్నీ చరిత్రలో పొందుపరచాలని మ్యాప్ అకాడెమీ ఆశిస్తోంది.

ఫొటో సోర్స్, Museum of Art and Photography
"భారతీయ వస్త్రాల తీరును అధ్యయనం చేసే సంస్కృతి భారతదేశంలో ఉన్నప్పటికీ, ఇలా ప్రత్యేకంగా ఎన్ సైక్లోపీడియాలో వాటికి చోటివ్వడం ద్వారా ఇప్పటి వరకు ప్రజలకు పరిచయం లేని వాటి గురించి అర్ధం చేసుకునేందుకు సహాయపడుతుంది" అని లండన్ లోని వి &ఏ మ్యూజియంలో మాజీ సీనియర్ క్యూరేటర్ డాక్టర్ రోజ్ మేరీ క్రిల్ అన్నారు.
"కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ఉన్న వారెవరికైనా సమాచారాన్ని ఒకే చోట దొరికేలా చేయడమే దీనికున్న అతి పెద్ద ప్రయోజనం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Museum of Art and Photography
ప్రస్తుతానికి ఈ ఎన్ సైక్లోపీడియాలో చేర్చాల్సిన సమాచారం చాలా ఉందని, కళల చరిత్రకున్న గొప్పతనాన్ని, దానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండటానికి మధ్యలోనున్న లోటును భర్తీ చేసేవరకూ తమ బృందం కొన్నేళ్ల పాటు రాస్తూనే ఉంటారని అన్నారు.
ఈ ప్రాజెక్టుకు చాలా ప్రశంసలు లభిస్తున్నాయి.
"ఈ భూమిపై అత్యంత అద్భుతమైన, సౌందర్యవంతమైన సంస్కృతి ఉన్నప్పటికీ, గత కొన్నేళ్ల వరకు మెరుగైన మ్యూజియంలను ఏర్పాటు చేయడంలో భారతదేశం విఫలమయింది" అని డార్లింపిల్ అన్నారు.
"కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు మారుతోంది. ఈ మార్పులో భాగమే మ్యాప్" అని అన్నారు.
"ఒక విద్యా వనరుగా కూడా దీని విలువ చాలా ఎక్కువ" అని నిపుణులంటున్నారు.
"దేశంలో కళలను నేర్పించే సంస్థలున్నాయి. కానీ, వారందించే సమాచారాన్ని తరచి చూసి, అందులోంచి కావల్సిన విషయాన్ని వెలికి తీసి, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో దాగిన నైపుణ్యాన్ని గుర్తించి వారి చరిత్రను డాక్యుమెంట్ చేయాలి" అని సావంత్ అన్నారు.
"మ్యాప్ ఈ పనిని చేస్తోంది. ఇంత వరకు అందుబాటులో లేని వాటికి ఒక ఆరంభం కల్పిస్తోంది".
పాల్ లాంటి విద్యార్థులు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు.
"ఇది చాలా బాగుంది. ఇది కొత్తగా ఉంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పుట్టిన బిడ్డకు గుండెలో రంధ్రం ఉంటే ఎలా గుర్తించాలి? చికిత్స ఏమిటి
- ఒకే వ్యక్తికి మూడు వయసులు - కొరియాలో పుడితే అంతే
- హైదరాబాద్: ‘గుడికి వచ్చిన భక్తురాలిని రాడ్డుతో కొట్టి చంపిన పూజారి.. శవం వాసన రాకుండా అగరబత్తుల ధూపం వేశాడు’
- ఈ నిధి ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు
- శ్రీలంకలో ‘ఆర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో‘ మిగిలిన చిట్టచివరి జనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











