లిథియం, నికెల్, కోబాల్ట్: ఈ సహజ సంపద ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిసిలియా బారియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
చమురు, గ్యాస్‌ల ఇప్పటి వరకు ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు ఎన్నో జరిగాయి. కానీ, రాబోయే కాలంలో కొన్ని లోహాల కోసం యుద్ధాలు జరగొచ్చు.
మార్చి 8, ఉదయం 5:42 గంటలకు నికెల్ ధర చాలా వేగంగా పెరగడం మొదలు పెట్టినప్పుడు లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో ఆందోళన నెలకొంది. 18 నిమిషాల వ్యవధిలో నికెల్ ధర టన్ను లక్ష డాలర్ల (సుమారు రూ.75లక్షల)కు చేరుకుంది. దీంతో మెటల్ ఆపరేషన్‌ను నిలిపేయాల్సి వచ్చింది.
ఈ రికార్డులు బద్దలు కావడానికి ముందు 24 గంటల్లో నికెల్ ధర 250శాతం పెరిగింది. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత మార్కెట్‌లో భారీ లోహ సంక్షోభం తలెత్తడం ఇదే తొలిసారి.
రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలే ఈ ధరల పెరుగుదలకు కారణమని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. నికెల్ వంటి లోహానికి ప్రపంచంలో ఎంత ప్రాముఖ్యత ఉందో దీన్నిబట్టి స్పష్టమైంది. తక్కువ కాలుష్యం గల ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లడానికి ఈ లోహం చాలా ముఖ్యం.
ప్రపంచ గ్యాస్, పెట్రోల్ సరఫరాలో రష్యాది ప్రధాన పాత్ర. అయితే, రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో చమురు, గ్యాస్‌లను ఆయుధాలుగా ప్రయోగించవచ్చని పశ్చిమ దేశాలు నిరూపించాయి.
యుక్రెయిన్‌పై దాడిని ఆపేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయితే, ఆంక్షలు ఉన్నప్పటికీ యూరప్ రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేయవలసి వస్తోంది.
''అమెరికా నిర్మిత క్లీన్ ఎనర్జీ మన జాతీయ భద్రతను రక్షించడంలో సహాయపడుతుంది'' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మార్చి 31న ప్రకటించారు.
''భవిష్యత్తును నిర్ణయించే అంశాలపై మనం చైనా సహా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి'' అని ఆయన అన్నారు.
ఎలక్ట్రికల్ బ్యాటరీల తయారీకి, పునరుత్పాదక ఇంధన నిల్వ కోసం ఉపయోగించే ఖనిజాల స్థానిక ఉత్పత్తి, ప్రాసెసింగ్‌లో సహాయం కోసం 'డిఫెన్స్ ప్రొడక్షన్ లా'ను అమలు చేస్తున్నట్లు జో బైడెన్ గతంలో ప్రకటించారు.
ఈ ఖనిజాలలో లిథియం, నికెల్, గ్రాఫైట్, మాంగనీస్, కోబాల్ట్ ఉన్నాయని వైట్‌హౌస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా ఇంధన ఆయుధం
ప్రతి దేశంలో వారి అవసరాలకు అనుగుణంగా వివిధ ఖనిజాలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. తద్వారా అవి ఎనర్జీ ట్రాన్స్‌ఫార్మేషన్ (శక్తి పరివర్తన) కాలంలో మార్కెట్ వాటాలో పోటీకి కారణమవుతాయి.
ప్రస్తుతం చమురు, గ్యాస్, బొగ్గు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న దేశాలు ఈ పోటీలో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు రష్యా ఆర్థిక శక్తి ప్రధానంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారు, మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు.
అయినప్పటికీ, భవిష్యత్తులో ఖనిజాల పోటీలో కూడా రష్యా ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే రష్యా ప్రపంచంలో రెండో అతిపెద్ద కోబాల్ట్, ప్లాటినం సరఫరాదారు, నికెల్ సరఫరాలో అది మూడో స్థానంలో ఉంది.
రష్యాలో కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ముఖ్యమైన ఖనిజాలు ఇతర దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
ప్రపంచంలో అత్యధిక కోబాల్ట్ వాటా రిపబ్లిక్ ఆఫ్ కాంగోది కాగా , నికెల్‌లో ఇండోనేషియా, లిథియంలో ఆస్ట్రేలియా, కాపర్‌లో చిలీ, రేర్ ఎర్త్స్‌లో చైనా ముందు వరుసలో ఉన్నాయి.
శక్తి పరివర్తనలో 17 ఖనిజాలను ముఖ్యమైనవిగా నిపుణులు భావిస్తారు. ఈ ఖనిజాలు ఉన్న దేశాలు వాటిని వెలికి తీసి ప్రాసెస్ చేసుకుంటే మరింత ప్రయోజనం పొందగలవు. ఈ 17 ఖనిజాలలో ముఖ్యమైనవి లిథియం, నికెల్, కోబాల్ట్, కాపర్, గ్రాఫైట్ మొదలైనవి ఉన్నట్లు అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఖనిజాల ఉత్పత్తిలో ఏ దేశం ముందుంది?
2040 నాటికి ఈ ఖనిజాలకు డిమాండ్ వేగంగా పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో నిపుణుడు టాయ్ యున్ కిమ్ చెప్పారు.
శక్తి పరివర్తనలో ఏ దేశాలు ఎక్కువగా ప్రయోజనం పొందుతాయన్నదానిపై దేశాలను టాయ్ యున్ కిమ్ రెండుగా విభజించారు. అందులో మొదటిది ఈ ఖనిజాలు సమృద్ధిగా ఉత్పత్తి చేసే దేశం, రెండోది వాటిని ప్రాసెస్ చేయడంలో ముందుండే దేశం.
ఖనిజాల లభ్యత, వాటి వెలికితీత విషయానికొస్తే చాలా దేశాలు ముందున్నప్పటికీ, ప్రాసెసింగ్‌లో మాత్రం చైనాదే ఆధిపత్యం.
20వ శతాబ్దపు చరిత్రలో చమురు ముఖ్యమైన పాత్ర పోషించగా, 21వ శతాబ్దపు చరిత్రలో శక్తి పరివర్తన ఖనిజాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని 'భవిష్యత్ ఖనిజాలు' అంటున్నారు నిపుణులు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగు ముఖ్య లోహాలు
ఎలక్ట్రిక్ బ్యాటరీలలో మెటల్ అవసరం అయినప్పటికీ, పారిశ్రామిక కార్యకలాపాల కోసం అనేక రకాల శక్తిని నిల్వ చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
''ఈ లోహాల సరఫరా డిమాండ్‌కు సరిపోకపోతే, వాటి ధరలు విపరీతంగా పెరుగుతాయి'' అని జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ రీసెర్చ్‌లో పరిశోధకుడు లుకాస్ బోయర్ చెప్పారు.
''ది మెటల్స్ ఆఫ్ ది ఎనర్జీ ట్రాన్సిషన్'' అనే పరిశోధనా పత్రాన్ని ఆండ్రియా పెస్కాటోరి, మార్టిన్ స్టర్మెర్‌లతో కలిసి ఆయన ప్రచురించారు.
లోహాలను వెలికి తీసే ప్రక్రియ చాలా ముఖ్యమని బోయర్ అన్నారు. వాస్తవానికి, మైనింగ్ ప్రాజెక్టులు ఈ లోహాలను వెలికి తీయడం ఇప్పటికే ప్రారంభించాయి. ఇవి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి దాదాపు ఒక దశాబ్దం (సగటున 16 సంవత్సరాలు) పడుతుంది.
అందువల్ల రానున్న రోజుల్లో ఈ లోహాల కొరత ఉండవచ్చని బోయర్ అన్నారు.
బోయర్ రీసెర్చ్ ప్రకారం, రేర్ ఎర్త్స్‌తోపాటు నాలుగు ముఖ్యమైన లోహాలు నికెల్, కోబాల్ట్, లిథియం, కాపర్‌ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో కొద్దిరోజుల పాటు ధర పెరిగి ఆ తర్వాత తగ్గే సాధారణ పెరుగుదల లాంటిది కాదు.
ఈ నాలుగు లోహాల ఉత్పత్తిదారులు రాబోయే 20 ఏళ్లపాటు చమురు రంగంతో సమానంగా ఆదాయాన్ని ఆర్జించగలరని బోయర్ పరిశోధన వెల్లడించింది.
''ఈ లోహాలు కొత్తరకం ఇంధనాలు కావచ్చు. కోబాల్ట్ ఉత్పత్తి చేసే కాంగోలో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా అతిపెద్ద ప్లేయర్‌గా మారింది'' అని బోయర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వెనకబడతామని పాశ్చాత్య దేశాల భయం
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే, వీటి అవసరాల్లో కొంత భాగాన్ని సరఫరా చేయగల దేశాలు కొన్ని ఉన్నాయి.
శక్తి పరివర్తనలో ఎక్కువగా ప్రయోజనం పొందే దేశం చైనాయేనని బ్లూమ్‌బర్గ్ ఎన్‌ఇఎఫ్ రీసెర్చ్ సెంటర్‌లో మెటల్స్ అండ్ మైనింగ్ హెడ్ క్వాసీ ఎంపొఫో అన్నారు.
''రష్యా మెటల్ ప్రొడక్షన్‌ను చైనా తన రిఫైనరీకి తీసుకురాగలిగి, ఇతర దేశాలకు విక్రయించగలిగితే, అప్పుడు ఈ శక్తి పరివర్తన ప్రక్రియలో చైనా విజేతగా మారవచ్చు'' అని ఎంపొఫో అన్నారు.
అయితే, ఈ విషయంలో ఇతర దేశాలు కూడా పోటీలో ఉన్నాయి. ఇండొనేషియా గత రెండు సంవత్సరాలుగా నికెల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోందని, రష్యా నుండి తగ్గిన దిగుమతులను భర్తీ చేయడానికి అది ఇంకా ఉత్పత్తిని పెంచుతుందని ఆయన అన్నారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో ఎక్కువగా ప్రభావితమైన లోహం నికెల్. రష్యా ప్రపంచ ఉత్పత్తిలో 9 శాతం వాటా కలిగింది. ఇక ప్లాటినం గ్రూప్ లోహాల కొరత ఉంటే, దక్షిణాఫ్రికా ప్రొడ్యూసర్లు ఆ లోటును భర్తీ చేయవచ్చు.
భవిష్యత్ లోహాలను నియంత్రించే పోరాటంలో, చైనాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు వేగంగా ముందడుగు వేయకుంటే..వెనుకబడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యుల కార్లు ఎందుకు? సీఎంకు ప్రత్యేక కార్లు ఉండవా?
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో ఎందుకు పోల్చారు? 'భారత రత్న' ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














