కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాలు వేరు. పాలిటిక్స్‌లో వర్గపోరు అసాధారణ విషయమేమీ కాకపోయినప్పటికీ, నెల్లూరు జిల్లా వర్గపోరు మాత్రం కాస్త ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఎంతలా అంటే వర్గపోరు అంటేనే నెల్లూరు గుర్తుకు వచ్చేంతలా!
పాలక పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని చోట్లా ఈ వర్గపోరు ఉంటుంది. కొన్నిసార్లు బహిరంగంగా, ఎక్కువ సార్లు అంతర్గతంగా ఆధిపత్యం కోసం నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. పెత్తనం కోసం నాయకులు చేసే ప్రయత్నాలతో నెల్లూరు రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి.
అధికారంలో ఉన్న పార్టీలో అది మరింత బాహాటంగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి, ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన అనిల్ కుమార్ యాదవ్ కేంద్రంగా నెల్లూరు వర్గపోరు మరోసారి చర్చలోకి వచ్చింది.

ఫొటో సోర్స్, UGC
ఆరు దశాబ్దాలుగా అంతే
నెల్లూరు రాజకీయాల్లో వర్గపోరు ఇప్పటిది కాదు. దీనికి సుమారు ఆరేడు దశబ్దాల చరిత్ర ఉంది. నెల్లూరు నాయకులు చాలా మంది రాష్ట్రమంతా ప్రభావం చూపారు. నెల్లూరులో పట్టు సాధించి, ఇతర ప్రాంతాల మీద ప్రభావం చూపిన నాయకులున్నారు.
అదే సమయంలో నెల్లూరు నుంచి వలస వెళ్లి ఆయా ప్రాంతాల్లో పాగా వేసిన నాయకులూ ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి మొదలుకుని, చరిత్ర తిరగేస్తే అనేక మంది నెల్లూరు రాజకీయ నాయకులు రాష్ట్రంలో అనేక చోట్ల చక్రం తిప్పారు.
వైసీపీలోనే కాకుండా టీడీపీలో, ఇంతకుముందు కాంగ్రెస్, బీజేపీల్లో నెల్లూరు నాయకులు కీలక స్థానాలకు ఎదిగారు. అందులో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి నాయకులు కూడా ఉన్నారు.
వెంకయ్య నాయుడు, మరికొందరు నాయకులను మినహాయిస్తే ఉన్నత స్థానాలకు ఎదిగిన నెల్లూరు నేతల్లో అత్యధికులు రెడ్లు.
నెల్లూరు జిల్లాలో అన్నీ జనరల్ స్థానాలుగా ఉన్న దశలో మొత్తం రెడ్డి సామాజిక వర్గానికే దక్కిన చరిత్రా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కడప తర్వాత రెడ్లకు అత్యధిక స్థాయిలో ప్రాతినిధ్యం లభించింది నెల్లూరు జిల్లాలోనే.
ఇక్కడి నుంచి ఇద్దరు నాయకులు- బెజవాడ గోపాల రెడ్డి(ఆంధ్ర రాష్ట్రం), నేదురుమల్లి జనార్దన్ రెడ్డి(ఆంధ్రప్రదేశ్) ముఖ్యమంత్రి పీఠమెక్కారు.

ఫొటో సోర్స్, UGC
ఏసీ సుబ్బారెడ్డి నుంచి మొదలుకుని...
నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1950ల నుంచి రాజకీయంగా ఈ కుటుంబం క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. మూడు తరాలుగా ఆనం కుటుంబీకులు వివిధ పార్టీల్లో నాయకులు అయ్యారు. ఆనం చెంచు సుబ్బారెడ్డి(ఏసీ సుబ్బారెడ్డి) రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదిగారు.
కర్నూలు జిల్లాకు చెందిన, దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యను నెల్లూరు రాజకీయ వర్గపోరు మూలంగా ఏసీ సుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఏసీ సుబ్బారెడ్డి రాజీనామాకు రాష్ట్ర స్థాయి కారణాలతోపాటు జిల్లాలో ఆయన వ్యతిరేక వర్గానికి దామోదరం సంజీవయ్య తోడ్పాటు అందిస్తున్నారనే భావన కూడా మూలమని చెబుతారు. 1960ల తొలినాళ్లలోనే నెల్లూరు రాజకీయాల్లో వర్గపోరు ఉందని ఈ పరిణామం సూచిస్తుంది.
ఆనం కుటుంబీకులు ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా పార్టీలు మారినప్పటికీ రాజకీయంగా కీలకంగానే వ్యవహరిస్తూ వచ్చారు. నెల్లూరు, రావూరు, ఆత్మకూరు లాంటి నియోజవర్గాల్లో ఆనం కుటుంబం ప్రభావం చూపేది.
ఏసీ సుబ్బారెడ్డి తర్వాత సంజీవరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు మంత్రులుగా రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగారు. ఆనం వివేకానందరెడ్డి కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో నెల్లూరు రాజకీయాల్లో పైచేయి కోసం ప్రయత్నాలు సాగించారు. ఆ క్రమంలోనే ఇతర నేతలతో నిత్యం తగాదాలు తప్పలేదు.
కొంత కాలం నేదురుమల్లి కుటుంబంతో, ఆ తర్వాత నల్లపురెడ్డి కుటుంబంతో ఆనం కుటుంబానికి వైరం ఉండేది. వారి వర్గపోరు రాష్ట్రస్థాయిలోనూ కనిపించేది.

ఫొటో సోర్స్, UGC
నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి సమయంలో...
శీనయ్యగా పిలుచుకునే నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి 70లలో పంచాయతీ సమితి అధ్యక్షుడి స్థానం నుంచి గూడురు ఎమ్మెల్యేగా, తదుపరి అంజయ్య కేబినెట్‌లో మంత్రిగా ఎదిగారు. జిల్లాలో మాత్రం ఆయనకు పలువురు నాయకుల నుంచి అసమ్మతి తప్పలేదు.
టీడీపీ ఆవిర్భావంతో ఎన్టీఆర్ చెంతకు చేరారు. టీడీపీలో కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోవడానికి రాష్ట్రస్థాయి పరిణామాలకు తోడు జిల్లాలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఆయన వ్యతిరేకులను ప్రోత్సహించడం కారణమని చెబుతారు.
శీనయ్య సమితి పేరుతో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన ఆయన, చివరకు కాంగ్రెస్‌లో చేరారు. వరుసగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల నుంచి ఆయన విజయాలు సాధించారు.
జిల్లాలో మాత్రం ఆనం, నేదురుమల్లి వర్గాలతో నిత్యం పోటీ పడాల్సి వచ్చింది. ఆ రెండు కుటుంబాలకు వ్యతిరేకంగా సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో సత్తా చాటేందుకు శీనయ్య యత్నించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ చెన్నారెడ్డి మంత్రివర్గం నుంచి శీనయ్య రాజీనామా చేసినప్పుడు కూడా వర్గపోరు తెరపైకి వచ్చింది. ఆయన రాజీనామాకు నెల్లూరులో ఆధిపత్య పోరు కూడా ఒక కారణమనే చర్చ జరిగింది.

ఫొటో సోర్స్, UGC
నేదురుమల్లి కాలంలో..
శీనయ్య తర్వాత ఆయన వారసుడిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత టీడీపీ, ఆ తర్వాత వైసీపీలో ఆయన కోవూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ రాజకీయంగా తండ్రి స్థాయిలో పట్టు సాధించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పొచ్చు.
శీనయ్యతో పోటీపడిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కి నెల్లూరు జిల్లాలో తన పట్టు చాటుకున్నారు. కానీ స్వల్పకాలంలోనే ఆయన సీఎం పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అంతేగాకుండా నెల్లూరు జిల్లా వర్గ రాజకీయాలతో 1994లో సొంత నియోజకవర్గం వెంకటగిరిలో ఓడిపోయారు.
తదనంతర పరిణామాల్లో జనార్దన్ రెడ్డి భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి తెర మీదకు వచ్చారు. ఆమె రెండు దఫాలు వెంకటగిరి నుంచి గెలిచి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా చేశారు. జిల్లా రాజకీయాల్లో మాత్రం నేదురుమల్లి కుటుంబానికి పట్టు చిక్కలేదు.
చివరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, UGC
ఆనం బ్రదర్స్ హవా
నల్లపరెడ్డి, నేదురుమల్లి కుటుంబాల ప్రాతినిధ్యం లేదా ఉనికి కొనసాగుతున్నప్పటికీ, దాదాపు దశాబ్దకాలం పాటు ఆనం బ్రదర్స్ హవా సాగించారు. ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు.
ఆనం వ్యతిరేకులు అప్పుడప్పుడూ గొంతు విప్పినా వారి హవాకు దాదాపు అడ్డంకి లేకుండా చూసుకున్నారు. అయితే అదే సమయంలో- ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి నేతలు, ఆనం సోదరుల మధ్య ఆధిపత్య పోరు కనిపించేది.
ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే ఆనం సోదరులపై విమర్శలు చేస్తుంటారు. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రను కూడా ఆనం బ్రదర్స్ అడ్డుకున్నారని కోటంరెడ్డి పలు సందర్భాల్లో మీడియా ముందు ఆరోపించారు.
జల్ తుఫాన్ సమయంలో నెల్లూరులో జగన్ బహిరంగ సభ జరగకుండా ఆటంకాలు సృష్టించినా తాము అధిగమించామని ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు.
వైసీపీ ఆవిర్భావం, రాష్ట్ర విభజన వంటి పరిణామాలతో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. అంతకుముందు నియోజకవర్గాల పునర్విభజన కూడా వీటిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఆనం కుటుంబం హవా తగ్గింది. స్వయంగా ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరులో ఓటమి పాలయ్యారు.
2019 ఎన్నికల నాటికి ఆయన వైసీపీ శిబిరాన్ని ఆశ్రయించి ఎమ్మెల్యేగా గెలిచినా, పూర్వ వైభవం మాత్రం దక్కలేదు.
అదే సమయంలో నెల్లూరు వైసీపీలో కొత్త నాయకత్వం తెరమీదకు వచ్చింది. వారిలో కాకాణి గోవర్దన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ స్థాయి నుంచి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తద్వారా కీలక నేతగా మారారు.
మొన్నటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రిగానూ అవకాశం దక్కించుకొన్న కాకాణి, జిల్లా రాజకీయాల్లో మరింత పట్టు సాధించాలని చూస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, మరికొందరు నాయకులు కాకాణికి అండగా నిలుస్తుండడం తాజా పరిణామం.
ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాకాణి అభినందన సభలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ- "గడిచిన మూడేళ్లలో జిల్లాలో అభివృద్ధి ఆశించినట్టుగా జరగలేదు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులతో కాకాణి ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దాలి. జిల్లాను అభివృద్ధి బాటలో నడపాలి. అంతా గాడిలో పెట్టి సరి చేయాలి" అన్నారు.
ఇలా తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై ఆయన పరోక్ష విమర్శలు కూడా చేశారు.
అదే సమయంలో నెల్లూరు రూరల్, అర్బన్ స్థానాల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఐక్యంగా సాగుతున్నారు. అందులోనూ ఆనం కుటుంబానికి వారివురు వ్యతిరేకులుగా చాలా కాలంగా కనిపిస్తున్నారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అనిల్ అభ్యర్థిత్వాన్ని ఆనం బ్రదర్స్ వ్యతిరేకించినా ఆయన టికెట్ తెచ్చుకొన్నారు. ఆ ఎన్నికల్లో తన ఓటమికి వారు కారకులని అనిల్ గతంలో విమర్శలు చేశారు.
ఇక నెల్లూరు రూరల్ స్థానంలో ఆనం సోదరులకు వ్యతిరేకంగా పోటీ చేసిన అనుభవం కోటంరెడ్డిది. దాంతో ఆనం హవాకు అడ్డుకట్ట వేసే క్రమంలో అనిల్, కోటంరెడ్డి ఒక్కటయినట్టుగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, UGC
సమన్వయం చేసే వారేరీ?
మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్నంత కాలం జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన హూందాగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
నెల్లూరు రాజకీయాల్లో టీడీపీ, కాంగ్రెస్ ప్రాతినిధ్యం బాగా ఉన్నప్పుడు గ్రూపిజం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు వైసీపీ కాలంలోనూ బహిరంగంగా ఆధిపత్య పోరు సాగుతోందని సీనియర్ జర్నలిస్ట్ ఎం. రామచంద్రమోహన్ వ్యాఖ్యానించారు.
"మొదట జిల్లా నుంచి గౌతమ్ రెడ్డి, అనిల్ ఇద్దరూ మంత్రులుగా ఉన్నప్పటికీ అనిల్‌తో చాలా మంది రెడ్లకు సఖ్యత లేదు. అనిల్ తీరు కూడా అందుకు కారణం. కానీ అదే సమయంలో గౌతమ్ రెడ్డి ద్వారా వారంతా తమ పనులు చక్కబెట్టుకునే వారు. అనిల్‌కు మాత్రం చాలా మంది దూరమయ్యారు. ఇప్పుడు అనిల్ స్థానంలో కాకాణి రావడంతో ఇంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వారంతా కొత్త మంత్రి చుట్టూ చేరారు. పోటాపోటీగా సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడం అనిల్, కాకాణి మధ్య దూరాన్ని పెంచుతోంది. నెల్లూరు రాజకీయాల్లో టీడీపీ, కాంగ్రెస్ కాలంలో గ్రూపిజం ఎక్కువగా ఉండేది. వైసీపీ కాలంలోనూ ఈసారి బహిరంగంగా ఆధిపత్యపోరు సాగుతోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
జిల్లా రాజకీయాల్లో పెద్దరికంతో సమన్వయం చేసే నాయకత్వం కరువైందని రామచంద్రమోహన్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది యువ నాయకత్వం ఉండడంతో దూకుడు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
నెల్లూరు వర్గపోరు కొత్త రూపు దాల్చిందని, అందులో ఒక బీసీ నాయకుడు కేంద్ర బిందువుగా మారడం ఆసక్తికరమనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.
"నెల్లూరులో వర్గపోరు చాలా కాలంగా చూస్తున్నాం. కానీ తొలిసారిగా బీసీ కులం నుంచి అనిల్ యాదవ్ కేంద్రంగా ఆధిపత్య పోరు సాగడం గమనార్హం. గతంలో టీడీపీలో బీదా మస్తాన్ రావు, ఆయన సోదరుడు రవిచంద్ర లాంటి నేతలు కీలక నాయకులుగా వ్యవహరించారు. కానీ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని సవాల్ చేసే స్థాయికి వారు చేరలేదు. ఇప్పుడు అలా కాదు. మంత్రి పదవి విషయంలో కాకాణి కన్నా అనిల్ సీనియర్" అని రాజకీయ పరిశీలకుడు ఐనం ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
ఏప్రిల్ మొదట వారంలో జరిగిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత కందుకూరు అసెంబ్లీ సీటు నెల్లూరు జిల్లా పరిధిలోకి రావడం, గూడూరు(ఎస్సీ రిజర్వుడు), వెంకటగిరి లాంటి స్థానాలు కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాలోకి పోవడం కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, CMO Andhra Pradesh/twitter
ఇద్దరినీ పిలిపించిన జగన్
కాకాణి, అనిల్ వర్గాల మధ్య వివాదంపై వైసీపీ అధిష్ఠానం స్పందించింది. వారిద్దరినీ జగన్ ఏప్రిల్ 20న అమరావతికి పిలిపించి, మాట్లాడారు. జగన్‌తో సమావేశం తర్వాత కాకాణి మీడియాతో మాట్లాడుతూ- గతంలో ఎలా పనిచేశారో, అలాగే ఇప్పుడు పనిచేసుకోవాలని సీఎం చెప్పారని తెలిపారు.
అనిల్‌కూ, తనకూ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని కాకాణి చెప్పారు. తాను జిల్లాకు మంత్రినని, అనిల్ మాజీ మంత్రి అని వ్యాఖ్యానించారు.
టీడీపీలోనూ..
తెలుగుదేశం పార్టీలో వర్గపోరు అదే స్థాయిలో ఉండేది. ఎన్టీఆర్ కాలంలో శీనయ్య, ఆయన వ్యతిరేకులకు పొసగలేదు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఆయనతో ఇతరులకు విభేదాలుండేవి.
తదుపరి చంద్రబాబు సన్నిహితుడిగా జిల్లా టీడీపీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పట్టు లభించింది. ఆయనకు వ్యతిరేకంగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి నేతలుండేవారు. చివరకు ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరడానికి ఈ వర్గపోరు ఓ కారణంగా అంతా చెబుతారు. సోమిరెడ్డితో ఇతర సీనియర్ నేతలకు విబేధాలుండేవి. ఆదాల ప్రభాకర్ రెడ్డి సహా పలువురు నేతలు సోమిరెడ్డి వైఖరితో విబేధించి టీడీపీకి దూరమయినట్టు ప్రచారం కూడా జరిగింది.
ఇతర రాజకీయ పార్టీల్లో కూడా ఏదో స్థాయిలో ఇలాంటి అంతర్గత విబేధాలు పలుమార్లు బయటపడిన సందర్భాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో ఎందుకు పోల్చారు? 'భారత రత్న' ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ఇంద్రవెల్లి ఘటనకు 41ఏళ్లు: ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథ ఇదీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














