ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో ఎందుకు పోల్చారు? 'భారత రత్న' ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
ఇళయరాజా, ఒక పుస్తకానికి రాసిన ముందుమాట వివాదం రోజురోజుకీ రాజకీయ రూపం దాల్చుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీని, బాబాసాహెబ్ అంబేడ్కర్‌తో పోల్చుతూ ఈ దిగ్గజ సంగీత దర్శకుడు రాసిన ముందుమాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇందులో నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ ఆయనను అంబేడ్కర్‌తో పోల్చారు. దీంతో ద్రవిడ, దళిత సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మరోవైపు జాతీయ, రాష్ట్రీయ బీజేపీ నేతలు మాత్రం ఇళయరాజాకు మద్దతుగా నిలిచారు.
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ఇళయరాజా స్వయంగా ఒక దళితుడు. చాలాసార్లు ఈ గుర్తింపుకు ఆయన దూరంగా ఉన్నారు. ఆయన తండ్రి ఒక కమ్యూనిస్టు ప్లాట్‌ఫార్మ్ సింగర్.

ఇళయరాజా ఏం రాశారు?
బ్లూక్రాఫ్ట్ పబ్లికేషన్స్ ప్రచురించిన ఇంగ్లిష్ పుస్తకం 'అంబేడ్కర్ అండ్ మోదీ- రిఫార్మర్స్ ఐడియాస్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్'కు ఇళయరాజా రెండు పేజీల ముందుమాట రాశారు. దీంతోనే తాజా వివాదం మొదలైంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
అంబేడ్కర్, మోదీలను పోల్చుతూ వారిపై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తూ ఈ ముందుమాట సాగుతుంది. మొదటగా అంబేడ్కర్‌ను పొగుడుతూ ముందుమాట ప్రారంభం అవుతుంది.
''భారత రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు కల్పించడం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన గొప్ప కృషి గురించి మనందరికీ తెలుసు. అంబేడ్కర్ అరుదైన నాయకుడు. ఆయన జీవించి ఉన్నప్పుడే చరిత్ర సృష్టించారు. మరణించి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ప్రజలు ఇంకా ఆయనను విస్తృతంగా అనుసరిస్తున్నారు, ఆయన గురించి చదువుతున్నారు'' అని ముందుమాటలో పేర్కొన్నారు.
మోదీ మాటల ద్వారా అంబేడ్కర్‌కు చెందిన కొన్ని ప్రత్యేక ఘనతల గురించి తెలుసుకున్నట్లు ఇళయరాజా చెప్పారు.
''కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ, భారతదేశ నదీ జలాల విధాన రూపశిల్పి డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ అని వ్యాఖ్యనించడం వార్తల్లో చదివాను. నీరు, సాగుకు సంబంధించిన కొన్ని కీలక సంస్థల ఏర్పాటులో అంబేడ్కర్ పాత్ర గురించి తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను. 2016లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సందర్భంగా మోదీ ప్రసంగం ద్వారా ఈ విషయాలను తెలుసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది'' అని ఆయన రాసుకొచ్చారు.
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఓబీసీ కమిషన్‌తో పాటు అనేక చట్టాలు, రాజ్యాంగపర రక్షణలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చట్టపరమైన రక్షణను పటిష్టం చేశారని అభిప్రాయపడ్డారు.
ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావడం పట్ల మోదీని పొగిడారు. ఆయన తలపెట్టిన 'బేటీ బచావో, బేటీ పడావో' ఉద్యమం, మహిళల కనీస వివాహ వయస్సును పెంచాలని తీసుకున్న నిర్ణయం వంటివి అంబేడ్కర్ గర్వించే అంశాలు అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, KATHIR
సామాజిక, రాజకీయ స్పందనలు ఎలా ఉన్నాయి?
ఈ వ్యాఖ్యలు తమిళనాడులో వివాదానికి కారణమయ్యాయి. బీజేపీ, ఇతర మిత్రపక్షాలు ఆయనకు మద్దతు ఇస్తుండగా... ద్రవిడియన్, దళిత వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
తమిళనాడులో ఎస్సీ, ఎస్టీ ప్రజల హక్కుల కోసం పనిచేసే 'ఎవిడెన్స్' అనే ఎన్జీవోకు చెందిన కథిర్ ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. ''మోదీ, తన అభిమాన నాయకుడు అని ఇళయరాజా చెప్పి ఉంటే అసలు ఈ వివాదమే వచ్చి ఉండేది కాదు. కుల అణిచివేత, వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా అంబేడ్కర్ తన జీవితకాలం పోరాడారు. ఇలాంటి విషయాల్లో వ్యతిరేక వైఖరి ఉన్న ఒక పార్టీ నాయకుడిని అంబేడ్కర్‌తో ఇళయరాజా పోలుస్తున్నారు. ఇది ఎంతవరకు సరైనది?'' అని ఆయన ప్రశ్నించారు.
''కేవలం ఆయన సంగీతాన్ని వినండి అని ప్రజలు చెబుతుంటారు. నేను కూడా అదే చెబుతున్నా. ఆయనను సంగీతంతోనే ఆగిపోమనండి. రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడగలరు. కానీ, అవి సమర్థనీయంగా లేకపోతే ఇలాగే విమర్శలు వస్తాయి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మద్దతుగా బీజేపీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇళయరాజాకు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఏప్రిల్18న ఒక సందేశాన్ని విడుదల చేశారు. ''భారతదేశంలోని అత్యున్నత సంగీత విద్వాంసుల్లో ఒకర్ని... మాటలతో అవమానపరచడం, దుమ్మెత్తిపోయడం, కించపరచడంలో రాష్ట్రంలోని అధికార పక్షానికి చెందిన కొందరు ఎక్కడా తగ్గలేదు. ఒక రాజకీయ పార్టీకి, దాని మిత్రపక్షాలకు నచ్చని అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు ఆయనపై ఈ మాటల దాడి జరిగింది'' అని నడ్డా వ్యాఖ్యానించారు.
ఇళయరాజాకు 'భారత రత్న' అవార్డుకు ఇవ్వాలంటూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తే గౌరవంగా ఉంటుందని అన్నారు.
ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా పోస్ట్
ఇళయారాజా కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా ప్రముఖ తమిళ సినీ సంగీత దర్శకుడు. ఆయన నలుపు రంగు టీషర్టు ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేశారు. దీనికి 'డార్క్ ద్రవిడియన్, ప్రౌడ్ తమిళన్' అనే వ్యాఖ్యను జోడించారు.
నలుపు రంగును సాధారణంగా ద్రవిడ ఉద్యమానికి చిహ్నంగా చూస్తారు. తన తండ్రి రాజకీయ వైఖరికి కౌంటర్‌గా యువన్ చేసిన పోస్టును భావిస్తున్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ఇళయరాజా స్పందన
ఈ వివాదంపై స్పందిస్తూ ఇళయరాజా, తన సోదరుడు గంగై అమరన్‌తో... ''నా ప్రకటనలను రాజకీయం చేయాలని అనుకోవట్లేదు. నేను మోదీకి ఓటు వేయమని చెప్పను, ఆయనకు ఓటు వేయొద్దని కూడా చెప్పను'' అని అన్నట్లుగా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సహనం లేని మ్యాస్ట్రో
మనసును కదిలించే సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు పేరు ఉన్నట్లే ఆవేశపూరితుడిగానూ ఆయనకు గుర్తింపు ఉంది.
విలేఖరుల సమావేశాల్లో, స్టేజీ షోలలో ఆయన సహనం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
లైవ్ షోలలో తను స్వరపరిచిన పాటల్ని పాడొద్దంటూ గాయకులపై, తన పాటలు ప్రసారం చేయకూడదంటూ రేడియో స్టేషన్లపై ఆయన నిషేధం విధించడం వివాదాస్పదం అయింది. రాయల్టీ చెల్లించకుండా పాటల్ని ఉపయోగించుకోవడంతో ఆయన ఇలా చేశారు.
అయినప్పటికీ, భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన సంగీతాన్ని అందించిన దిగ్గజ సంగీత దర్శకుడిగా తమిళ ప్రజలు ఆయనను అభిమానిస్తారు.
1976లో అన్నాకిలి అనే సినిమాతో ఇళయరాజా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఇప్పటివరకు 1400పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. 'చీనీకమ్', 'పా' వంటి హిందీ సినిమాలకు కూడా ఆయన పాటలు కంపోజ్ చేశారు.
ఆయనకు పద్మ భూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి.
ఇవి కూడా చదవండి:
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ఇంద్రవెల్లి ఘటనకు 41ఏళ్లు: ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథ ఇదీ
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- లీటర్ పెట్రోల్ రూ.373, డీజిల్ 329.. ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసుల కాల్పులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












