అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Facebook/MNS Adhikrut

ఫొటో క్యాప్షన్, హిందుత్వ రాజకీయాలను నమ్ముకుంటున్నారు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే

ఇప్పుడు భారతదేశంలో మైకుల చుట్టూ మళ్లీ రాజకీయ వివాదాలు అలుముకుంటున్నాయి. మసీదుల్లో మైకులను నిషేధించాలంటూ మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో ఇటీవల డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకు తగినట్లుగానే ప్రభుత్వాలు కూడా ప్రార్థనా మందిరాల్లో మైకుల వాడకంపై కొన్ని రకాల ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.

ప్రార్థనా మందిరాల్లో మైకులు వాడటంపై వివాదం ఈనాటిది కాదు. కొద్ది సంవత్సరాలుగా అప్పుడప్పుడు మైకులను బ్యాన్ చేయాలంటూ ఎవరో ఒకరు డిమాండ్ చేయడమో లేదా కోర్టులకు వెళ్లడమో జరుగుతూ ఉన్నదే. హిందువుల పండగలు, ఉత్సవాల్లో డీజేలు, మైకుల మీద ఆంక్షలు విధించిన ప్రతిసారీ మసీదుల్లో మైకుల గురించి ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల కొద్ది రోజులుగా మసీదుల్లో మైకుల వాడకం మీద వివాదం మరింతగా ముదురుతోంది. మహారాష్ట్రతో ఈ ట్రెండ్ మొదలైంది.

బాల్ ఠాక్రే ఎప్పుడూ సింహాసనం లాంటి కుర్చీపై కూర్చునేవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాల్ ఠాక్రే

హిందుత్వమే పునాదిగా...

శిథిలమవుతున్న తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకునేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఇప్పుడు హిందుత్వాన్ని నమ్ముకున్నారు. మసీదుల్లో మైకుల అంశాన్ని అందుకు వేదికగా మార్చుకున్నారు. 1980లలో హిందుత్వ రాజకీయాలను నమ్ముకున్న తన పెదనాన్న బాల్ ఠాక్రేను నేడు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు రాజ్ ఠాక్రే. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎంఎన్‌ఎస్‌కు ఒక్క సీటు మాత్రమే ఉంది.

మైకుల్లో అజాన్ వచ్చే సమయంలో మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప్లే చేయాలంటూ తన అనచరులకు, హిందువులకు రాజ్‌ ఠాక్రే పిలుపునిచ్చారు. మతాలు పుట్టినప్పుడు మైకులున్నాయా? ఇతర దేశాల్లో మీరు మైకులను చూశారా? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మసీదుల్లో మైకుల అంశం మీద తన సోదరుని శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని రాజ్ ఠాక్రే ఢీ కొడుతున్నారు.

రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలతో బాలాసాహెబ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలతో బాలాసాహెబ్ ఠాక్రే

హిందుత్వ రాజకీయాల్లో శూన్యత

మహారాష్ట్రలో హిందుత్వ రాజకీయాలకు శివసేన ప్రతీకగా ఉండేది. 2019లో కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)‌లతో కలిసి శివసేన 'లౌకిక' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. నాటి నుంచి అక్కడ హిందుత్వ రాజకీయాల్లో శూన్యత కనిపిస్తోంది. దీన్ని అవకాశంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రాజ్ ఠాక్రే.

శివసేన ఖాళీ చేసిన స్థానాన్ని తాను భర్తీ చేసి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన భావిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో శివసేన బీజేపీతో జట్టుకట్టింది. అదే సమయంలో శరద్ పవార్‌కు దగ్గరగా ఉంటూ వచ్చారు రాజ్ ఠాక్రే. కానీ ఎన్నికల తరువాత బీజేపీ, శివసేనలు విడిపోయాయి. రాజ్ ఠాక్రేను వదిలేసి శివసేన, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు శరద్ పవార్. దాంతో బీజేపీకి దగ్గర కావడానికి రాజ్ ఠాకరే ప్రయత్నిస్తున్నారు. అందుకే హిందుత్వాన్ని తన అజెండాగా పెట్టుకుంటున్నారు. అలాగే మహారాష్ట్రలో ముంబయితో పాటు ఇతర నగరాల్లో మున్సిపల్ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం మసీదుల్లో మైకుల అంశాన్ని ఆయన ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు.

ఇన్నాళ్లు కరుడుగట్టిన మరాఠీ వాదిగా ఉంటూ వచ్చారు రాజ్ ఠాక్రే. మహారాష్ట్రలో పనులు చేసుకోవడానికి వచ్చిన హిందీ రాష్ట్రాల ప్రజల మీద మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఆ పంథాను వీడి హిందూ ముస్లిం రాజకీయాలను అనుసరిస్తున్నారు.

మసీదు వద్ద ఏర్పాటు చేసిన మైకులు

ఫొటో సోర్స్, Getty Images

మసీదుల్లో మైకుల మీద చట్టాలు ఏం చెబుతున్నాయి?

మసీదుల్లో మైకులు వాడటమనేది ఇస్లాంలో అతి ముఖ్యమైన సంప్రదాయం కాదని గతంలో అలహాబాద్ హై కోర్టు వ్యాఖ్యానించింది. మైకుల్లో అజాన్ ప్రసారం చేయడం మీద ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో 2020లో కొందరు అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు. 'అజాన్ అనేది ఇస్లాంలో ఉండే ఒక సంప్రదాయం. కానీ మైకుల్లో అజాన్ ప్రసారం చేయడమనేది ముఖ్యమైన మత సంప్రదాయం కాదు. కాబట్టి మసీదుల్లో మైకులు లేకుండానే అజాన్ పఠించ వచ్చు.' అని నాడు కోర్టు వ్యాఖ్యానించింది. ధ్వని కాలుష్య నిబంధనల ప్రకారం అనుమతులు లేని వారు మైకుల్లో అజాన్ పఠించకూడదని కోర్టు తెలిపింది. అనేక సందర్భాల్లో ఆయా కోర్టులు ప్రార్థనా మందిరాలు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం లేకుండా చూడాలంటూ ప్రభుత్వాలను ఆదేశించాయి.

ధ్వని కాలుష్యం

ఫొటో సోర్స్, AFP

నిబంధనలు ఇలా...

  • ధ్వని కాలుష్య నియంత్రణ నిబంధనలు-2000 ప్రకారం మైకులు, లౌడ్ స్పీకర్లు, ఇతర పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్‌ను అనుమతి లేనిదే వాడకూడదు. ఇందుకు అధికారుల నుంచి కచ్చితంగా రాతపూర్వక అనుమతి ఉండాలి.
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మైకులు, మ్యూజిక్ సాధనాలు, సౌండ్ యాంఫిల్‌ఫైర్స్ వంటి వాటిని వాడకూడదు. కాకపోతే ఆడిటోరియం, కమ్యూనిటీ హాల్స్ వంటి క్లోజ్డ్ ప్రిమిసెస్‌లో వాటిని ఉపయోగించవచ్చు. లేదా పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలోనూ వాడొచ్చు.
  • రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, రాష్ట్రాల అవతర దినోత్సవాలు, పండగలు, సాంసృతిక ప్రదర్శనలు, మతపరమైన కార్యక్రమాల సమయంలో కొన్ని పరిమితుల మధ్య రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మైకులు వాడేందుకు అధికారులు అనుమతులు ఇవ్వొచ్చు. అయితే ఏడాదిలో 15 రోజులు మాత్రమే ఇందుకు అనుమతించాలి.
  • నివాస ప్రాంతాల్లో పగలు ధ్వని తీవ్రత 55 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. రాత్రి పూట 45 డెసిబెల్స్ మించరాదు. ఇక్కడ పగలు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. రాత్రి అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు.
  • మైకులు ఉన్న ప్రాంతంలో ధ్వని తీవ్రత ఆ ప్రాంతంలో అనుమతించి ప్రమాణాలకు అదనంగా 10 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
వీడియో క్యాప్షన్, ఆ కొండల వెనక అన్నీ ఖురాన్లే

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)