స్వీడన్‌: ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతుల కాల్చివేతకు ప్లాన్: హింసాత్మక అల్లర్లు, 40 మంది అరెస్టు

నోర్కోపింగ్‌లో ఆదివారం అల్లర్లు జరిగాయి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, నోర్కోపింగ్‌లో ఆదివారం అల్లర్లు జరిగాయి

ఖురాన్ ప్రతులను తగలబెట్టడానికి ఒక సంప్రదాయ సమూహం చేసిన ప్రణాళికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వీడన్‌లో ప్రజలు అల్లర్లకు దిగారు. వీరిని అదుపు చేసే క్రమంలో పోలీసులకు, ప్రజలకు మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దీంతో 40 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అల్లరిమూకపై పోలీసు అధికారులు హెచ్చరిక కాల్పులు జరపడంతో ఆదివారం, నోర్కోపింగ్‌లో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

డెన్మార్మ్-స్వీడన్ రాజకీయవేత్త రస్మస్ పలుదాన్ నిర్వహించిన వరుస ర్యాలీల కారణంగా ఈ హింస చెలరేగింది.

ఇస్లాం పవిత్ర గ్రంథానికి చెందిన ఒక కాపీని తాను తగులబెట్టానని, మరోసారి కూడా అలా చేయాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.

ముస్లింలు, ఖురాన్‌ను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఖురాన్‌ను ఎవరైనా అగౌరవపరిచినా, లేదా కావాలని నష్టం కలిగించినా తీవ్రంగా పరిగణిస్తారు.

ఈ చర్యను సౌదీ అరేబియా ఖండించింది. ''పవిత్ర ఖురాన్ పట్ల స్వీడన్‌లోని కొంతమంది తీవ్రవాదుల ఉద్దేశపూర్వక దుశ్చర్య ఇది. రెచ్చగొట్టడం, ముస్లింలకు వ్యతిరేకంగా పురికొల్పేందుకే ఇలా చేశారు'' అని సౌదీ అరేబియా వ్యాఖ్యానించింది.

అంతకుముందు ఇరాన్, ఇరాక్ దేశాలు తమ నిరసనలను తెలియజేయాలని స్వీడన్ రాయబారులను ఆదేశించాయి.

మాల్మో నగరంలో శనివారం నిరసనకారుల గుంపును పోలీసులు చెదరగొట్టారు

ఫొటో సోర్స్, EPA/SWEDEN OUT

ఫొటో క్యాప్షన్, మాల్మో నగరంలో శనివారం నిరసనకారుల గుంపును పోలీసులు చెదరగొట్టారు

ఆదివారం ఘర్షణల అనంతరం స్వీడన్ దేశ పోలీసు చీఫ్ ఆండెర్స్ థ్రోన్‌బర్గ్ మాట్లాడారు. నోర్కోపింగ్‌లో ఈ తరహా హింసాత్మక ఘర్షణలను గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. స్టాక్‌హోమ్‌కు నైరుతి దిశగా 160 కి.మీ దూరంలో నోర్కోపింగ్ ఉంటుంది.

శుక్రవారం మరో రెండు నగరాల్లో కూడా అల్లర్లు జరిగాయి. శనివారం మాల్మో నగరం ఈ గొడవలకు వేదిక అయింది.

ఈ హింసలో 26 మంది పోలీసు అధికారులు, 14 మంది నిరసనకారులు గాయపడ్డారని సోమవారం పోలీసులు తెలిపారు. 20కి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు.

''దాదాపు 200 మంది వ్యక్తులు ఈ హింసలో పాల్గొన్నారు. నేరస్థుల ముఠాలకు చెందిన నెట్‌వర్క్‌లు ఈ హింస వెనుక ఉన్నట్లు భావిస్తున్నాం. ఇందులోని కొంతమంది వ్యక్తుల గురించి స్వీడన్ భద్రతా సర్వీస్- 'సపో'కు తెలుసు'' అని వారు వెల్లడించారు.

నోర్కోపింగ్‌లో ర్యాలీ నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా రస్మస్ పలుదాన్ ప్రకటించిన తర్వాత ఆదివారం నాటి హింస జరిగింది. అయితే, ఆయన ఎప్పుడూ నగరంలో కనిపించలేదు.

''ర్యాలీని రద్దు చేస్తున్నాం. ఎందుకంటే స్వీడిష్ అధికారులు తమను తాము కాపాడుకోలేరు, నన్ను కూడా రక్షించే సమర్థత లేనివారు'' అని రస్మస్ తెలిపినట్లు ఆయన గ్రూపు 'యాంటీ-ఇమ్మిగ్రెంట్ స్ట్రామ్ కర్స్ పార్టీ' ఒక ప్రకటనను పోస్ట్ చేసింది.

వీడియో క్యాప్షన్, ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?

జోంకోపింగ్‌లో రస్మస్ గురువారం కనిపించారు. చేతిలో ఖురాన్ పట్టుకొని ఆయన మాట్లాడుతుండగా... స్థానిక చర్చిలోని ఫాదర్ నిరసన వ్యక్తం చేస్తూ గంటలు మోగించారు. దీంతో ఆయన మాటలు ఎవరికి వినిపించలేదు.

స్వీడన్‌లో ఇంతకుముందు కూడా, ఖురాన్‌ను కాల్చివేయాలనే 'స్ట్రామ్ కర్స్ పార్టీ' ప్రణాళికలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. 2020లో మాల్మోలో జరిగిన ఘర్షణల్లో నిరసనకారులు కార్లకు నిప్పు అంటించారు. దుకాణాలకు నష్టం కలిగించారు.

2019లో జరిగిన డెన్మార్క్ ఎన్నికల్లో రస్మస్, స్ట్రామ్ కర్స్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎన్నికల్లో 1.8 శాతం ఓట్లను సాధించిన ఆ పార్టీ, ఒక్క సీటును గెలవలేకపోయింది.

జాత్యాహంకారం సహా ఇతర నేరాలకు గానూ 2020లో ఆయన డెన్మార్క్‌లో ఒక నెల జైలు శిక్ష అనుభవించారు.

సెప్టెంబర్‌లో జరుగనున్న స్వీడన్ ఎన్నికల్లో నిలబడాలని ఆయన అనుకుంటున్నారు. కానీ, ఆయనకు తగినంత మద్దతు లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)