చైనాలో ఖురాన్ యాప్‌ను యాపిల్ ఎందుకు తొలగించింది?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఖురాన్ యాప్‌లలో ఒకదాన్ని యాపిల్ సంస్థ చైనాలో తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. చైనా అధికారుల అభ్యర్థన మేరకు ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఖురాన్ మజీద్ యాప్ యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. దాదాపు 1.5 లక్షల మంది దానిపై వారి అభిప్రాయాలని కామెంట్ల రూపంలో పంచుకున్నారు. ఈ యాప్‌ను లక్షలాది ముస్లింలు ఉపయోగిస్తున్నారు.
అయితే, చట్టవిరుద్ధమైన రెలిజియస్ కంటెంట్ ఆ యాప్‌లో ఉందన్న కారణంతో తొలగించినట్లుగా తెలుస్తోంది.
దీనిపై స్పష్టత కోసం బీబీసీ చైనా ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఖురాన్ మజీద్ యాప్‌ను తొలగించిన విషయాన్ని తొలుత యాపిల్ సెన్సార్‌షిప్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ యాప్ స్టోర్‌లోని యాప్‌లను ఈ వెబ్ సైట్ పర్యవేక్షిస్తుంటుంది.
ఈ యాప్ తయారుచేసిన పీడీఎమ్ఎస్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మా యాప్ ఖురాన్ మజీద్ చైనీస్ యాప్ స్టోర్ నుంచి తొలగించినట్ల యాపిల్ తెలిపింది. చైనా అధికారులకు మరిన్ని పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉన్న కంటెంట్ అందులో ఉండడంతో యాప్‌ను తొలగించారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
"ఈ సమస్యను పరిష్కరించడానికి మేం చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్, సంబంధిత చైనా అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాం" అని అందులో తెలిపారు.
కాగా ఈ యాప్‌కి చైనాలో పది లక్షల మంది వినియోగదారులు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఇస్లాం మతాన్ని అధికారికంగా గుర్తించింది.
జిన్ జియాంగ్‌లోని వీగర్ ముస్లింలకు వ్యతిరేకంగా చైనా మానవ హక్కుల ఉల్లంఘనలకు, మారణహోమానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
జిన్‌జియాంగ్‌లో వీగర్ ఇమామ్‌లను చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ పేర్కొంది.
యాప్ తొలగింపుపై స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది. కానీ తమ మానవ హక్కుల పాలసీని బీబీసీతో ప్రస్తావించింది. "మేం స్థానిక చట్టాలను పాటించాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు సంక్లిష్ట విషయాల్లో మనం ప్రభుత్వాలతో విభేదించవచ్చు"
అయితే, చైనాలో ఈ యాప్ ఎలాంటి నియమాలను ఉల్లంఘించిందో స్పష్టంగా తెలియదు. తమ యాప్‌ను "ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ముస్లింలు విశ్వసించారు" అని ఖురాన్ మజీద్ పేర్కొంది.
గత నెలలో యాపిల్, గూగుల్ రెండూ జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావాల్నీ రూపొందించిన వ్యూహాత్మక ఓటింగ్ యాప్‌ను తొలగించాయి.
యాప్‌ని తొలగించడానికి నిరాకరిస్తే రెండు కంపెనీలకు జరిమానా విధిస్తామని రష్యన్ అధికారులు బెదిరించారు. ఈ యాప్ అధికార పార్టీ నాయకులను, అధికారం నుంచి దింపేయొచ్చని వినియోగదారులకు తెలియజేసింది.
యాపిల్ అతి పెద్ద మార్కెట్లలో చైనా ఒకటి. అంతేకాదు, యాపిల్ డివైస్‌ల తయారీ కూడా ఎక్కువగా చైనాలోనే జరుగుతోంది.
యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ అమెరికా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ చైనా గురించి మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, QuranMajeed
అంతకుముందు, ప్రపంచంలోని ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించినందుకు 2017లో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని టిమ్ కుక్ తీవ్రంగా విమర్శించారు.
ఏదేమైనా, చైనా ప్రభుత్వ సెన్సార్‌షిప్‌కి ఆయన కట్టుబడి ఉన్నారని, మైనారిటీలతో చైనా వ్యవహరిస్తున్న తీరును బహిరంగంగా విమర్శించడం లేదని ఆరోపణలు వచ్చాయి.
న్యూయార్క్ టైమ్స్ ఈ సంవత్సరం ప్రారంభంలో పేర్కొన్న ప్రకారం, చైనా ప్రభుత్వ పరిమితులు దాటిన యాప్స్‌ను యాపిల్ తొలగిస్తుంది. టియాన్మన్ స్క్వేర్, చైనీస్ ఆధ్యాత్మిక ఉద్యమం ఫలున్ గాంగ్, దలైలామా, టిబెట్, తైవాన్‌కు స్వతంత్రం వంటి అంశాలను యాప్స్ చర్చించలేవు.
"ప్రస్తుతం యాపిల్ చైనా సెన్సార్‌షిప్ బ్యూరోగా మారుతోంది. వారు సరైన పని చేయాలి. ఆపై చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందననైనా ఎదుర్కొవాలి" అని యాపిల్ సెన్సార్‌షిప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బెంజమిన్ ఇస్మాయిల్ అన్నారు.
మరో మతపరమైన యాప్.. ఆలివ్ ట్రీ బైబిల్ యాప్ కూడా ఈ వారం చైనాలో తొలగించారు. తమ యాప్‌ను తీసివేసినట్లు ఆ కంపెనీ బీబీసీకి తెలిపింది.
"చైనాలో పుస్తకం లేదా మ్యాగజైన్ కంటెంట్‌తో ఒక యాప్‌ను తయారు చేయాలంటే దానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ యాప్ స్టోర్ సమీక్ష ప్రక్రియలో ఆలివ్ ట్రీ బైబిల్ సాఫ్ట్‌వేర్‌కి సమాచారం అందింది" అని ఒక ప్రతినిధి చెప్పారు.
"మాకు అనుమతి లేనందున, మేం మా బైబిల్ యాప్‌ను చైనా యాప్ స్టోర్ నుంచి తీసివేశాం"
అమెజాన్‌కు చెందిన ఆడిబుల్ ఆడియోబుక్, పాడ్‌కాస్ట్ సర్వీస్ యాప్‌ను గత నెల చైనాలో యాపిల్ స్టోర్ నుంచి తొలగించినట్లు శుక్రవారం మ్యాక్ అబ్జర్వర్ వెబ్ సైట్ పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ గురువారం తన సోషల్ నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్‌ను చైనాలో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. చైనా నిబంధలనలకు కట్టుబడి ఉండటం కఠిన సవాలుగా మారిందని కంపెనీ తెలిపింది.
కొంతమంది జర్నలిస్టుల ప్రొఫైల్‌లను బ్లాక్ చేసినందుకు లింక్డ్ ఇన్ వ్యవహార శైలిపై ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాత చైనాలో లింక్డ్ ఇన్‌ని మూసేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- చైనా, భూటాన్ ఒప్పందంతో భారత్‌కు టెన్షన్ తప్పదా... 'చికెన్స్ నెక్' మీద డ్రాగన్ కన్ను పడిందా?
- హెరాయిన్ కేసు: మూడు దేశాలపై అదానీ కీలక నిర్ణయం.. మండిపడుతున్న ఇరాన్
- 175 ఏళ్ల కిందట అనెస్థీషియా ఎలా పుట్టింది? పూర్వకాలంలో మత్తు మందు లేకుండా ఆపరేషన్లు ఎలా చేసేవాళ్లు? తొలినాళ్లలో వాడిన 4 మత్తు మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్
- మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. అనారోగ్యంతో మరణించారని ప్రకటించిన పార్టీ
- అఫ్గానిస్తాన్: షియాల మసీదులో బాంబుపేలుడు... 16 మంది మృతి
- కేజీ బేసిన్లో గ్యాస్ ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదు
- ‘వ్యాక్సీన్ వేసుకోను అన్నందుకు నా ఉద్యోగం తీసేశారు’
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- ఎంఎస్ ధోనీ: ‘జట్టులో ఉండే ముగ్గురు, నలుగురు ఆటగాళ్లలో నేను ఉండాలని అనుకోవడం లేదు’
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











