రామకృష్ణ: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. అనారోగ్యంతో మరణించారని ప్రకటించిన పార్టీ

మావోయిస్టు నేతలు

ఫొటో సోర్స్, PRAKASH SINGH/gettyimages

ఫొటో క్యాప్షన్, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(మధ్యలో ఉన్న వ్యక్తి)
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆర్కేగా ప్రపంచానికి తెలిసిన అక్కిరాజు హరగోపాల్ మరణించినట్లు ఆ పార్టీ ప్రకటించింది.

అనారోగ్యంతో బాధపడుతున్న 63 ఏళ్ల రామకృష్ణ అక్టోబరు 14 ఉదయం 6 గంటలకు మరణించారని మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

''హరగోపాల్‌కు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిలై, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారు.

పార్టీ ఆయనకు మంచి వైద్యం అందించినప్పటికీ దక్కించుకోలేకపోయింది. విప్లవ శ్రేణుల మధ్య ఆయనకు అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించాం'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గురువారం నుంచే మీడియాలో కథనాలు

కాగా గురువారం(అక్టోబర్ 14) నుంచే ఆయన మృతిపై మీడియలో కథనాలు వచ్చాయి. అయితే, పోలీసులు కానీ, మావోయిస్ట్ పార్టీ కానీ గురువారం దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు ఆర్కే కుటుంబ సభ్యులు కూడా తాము ఈ సమాచారాన్ని నమ్మడం లేదనే శుక్రవారం ఉదయం వరకు చెప్పారు.

‘మావోయిస్టు పార్టీ చెబితేనే మేం నమ్ముతాం’’ అని ఆర్కే సోదరులు అక్కిరాజు రాధేశ్యామ్, అక్కిరాజు సుబ్బారావు బీబీసీతో చెప్పారు.

తన భర్త మరణంపై మావోయిస్టుల నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని ఆయన భార్య శిరీష మీడియాతో చెప్పారు.

తాజాగా మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ప్రకటించడంతో బంధుమిత్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

రామకృష్ణ

ఫొటో సోర్స్, PRAKASH SINGH/gettyimages

ఫొటో క్యాప్షన్, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ

''హరగోపాల్ 1958లో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి స్కూల్ టీచర్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న రామకృష్ణ తండ్రితో పాటు కొంతకాలం టీచర్‌గా పనిచేశారు.

1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం 1980లో గుంటూరు జిల్లా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు.

1982 నుంచి పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా వచ్చారు.

1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

అనంతరం దక్షిణ తెలంగాణలో ఉద్యమానికి నాయకత్వం వహించారు.

2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడంతో పాటు 2001లో జరిగిన పీపుల్స్‌వార్ 9వ కాంగ్రెస్‌లో కేంద్ర కమిటీ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు'' అని మావోయిస్ట్ పార్టీ తన ప్రకటనలో తెలిపింది.

అలిపిరి దాడిలో ధ్వంసమైన చంద్రబాబు వాహనం

ఫొటో సోర్స్, Getty Images

‘అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసులో..’

నక్సల్ ఉద్యమంలో అత్యంత కీలక నేతగా ఎదిగిన ఆయన పలుమార్లు పోలీసుల ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడిలో ఆయన నిందితుడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో పాల్గొన్న బృందంలో రామకృష్ణ కూడా ఉన్నారు.

మావోయిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా చాలాకాలం పనిచేసిన రామకృష్ణ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆంధ్ర-ఒడిశా బోర్డర్ ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఆయనపై కేసులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో మావోయిస్టులు జరిపిన దాడుల వెనుక సూత్రధారిగా ఆయన పేరు పోలీస్ రికార్డులలో ఉంది.

అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ

‘ప్రభుత్వంతో శాంతి చర్చలకు నాయకత్వం వహించారు’

''2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిన శాంతి చర్చలలో పాల్గొన్న మావోయిస్ట్ ప్రతినిధి బృందానికి రామకృష్ణ నాయకత్వం వహించారు.

ప్రభుత్వం ముందు ప్రజల డిమాండ్లను ఉంచి తన ప్రతినిధుల బృందంతో పాటు చర్చల్లో సమర్థంగా వ్యవహరించారు.

ఈ చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ దృక్పథాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేశారు.

ప్రభుత్వం చర్చల నుంచి వైదొలగి తీవ్ర నిర్బంధం ప్రయోగించి రామకృష్ణను హత్య చేయడానికి ప్రయత్నాలు చేయడం ప్రారంభించగానే కేంద్ర కమిటీ ఆయన్ను ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌కు బదిలీ చేసి అక్కడి బాధ్యతలు అప్పగించింది. 2014 వరకు రామకృష్ణ ఏఓబీ కార్యదర్శిగా పనిచేశారు.

ఆ తరువాత నుంచి ఏఓబీని కేంద్ర కమిటీ నుంచి మార్గదర్శనం చేసే బాధ్యతలు చేపట్టారు.

2018లో కేంద్ర కమిటీ ఆయన్ను పొలిట్ బ్యూరోలో నియమించింది.

ప్రస్తుతం ఏఓబీలో ప్రభుత్వం కొనసాగిస్తున్న అత్యంత నిర్బంధకాండలో పార్టీని, క్యాడర్‌ను రక్షించే పనిని నిర్వహిస్తున్న ఆయన, ఆ క్రమంలోనే అనారోగ్యం పాలై మరణించారు'' అని మావోయిస్ట్ పార్టీ తన ప్రకటనలో వెల్లడించింది.

విప్లవోద్యమంలో ఉండగానే రామకృష్ణకు శిరీషతో వివాహమైందని.. వారికి ఒక మగ పిల్లవాడు మున్నా(పృథ్వి) జన్మించాడని.. మున్నా కూడా తండ్రి బాటలోనే నడిచి విప్లవోద్యమంలో సాగాడని, 2018లో జరిగిన ఎన్‌కౌంటర్లో రామగూడలో ప్రాణాలు కోల్పోయాడని మావోయిస్టు పార్టీ తెలిపింది.

‘చనిపోయారంటూ ఎన్నోసార్లు వదంతులు’

గతంలో ఎన్నోసార్లు ఆర్కే చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. బలిమెల ఎన్‌కౌంటర్ సమయంలో ఆర్కేకి బుల్లెట్ గాయమైంది.

ఆర్కేపై పదుల సంఖ్యలో కేసులు, లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయి. తాజాగా 2021లో కూడా ఎన్ఐఎ ఆర్కేపై ఒక కేసులో చార్జిషీటు వేసింది.

పార్టీ ముఖ్య నేతలు మరణించిన తరువాత ప్రస్తుతం రామకృష్ణే అత్యంత కీలకంగా ఉన్నారు.

రామకృష్ణకు పార్టీలో ఆర్కే, సాకేత్ అనే పేర్లు కూడా ఉన్నాయి.

వ్యూహ రచనలో దిట్టగా మావోయిస్ట్ పార్టీలో రామకృష్ణకు పేరుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)