గణపతి: లొంగుబాటుకు సిద్దంగా మావోయిస్టు పార్టీ నాయకుడు - ప్రెస్‌రివ్యూ

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

మావోయిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే ప్రభుత్వంతో ఆయన అనుచరులు చర్చలు జరుపుతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది.

ప్రభుత్వానికి, గణపతి అనుచరులకు మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని పేర్కొంది.

ఈ కథనం ప్రకారం గణపతి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ పార్టీ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు.

ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహంలాంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్న గణపతిని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఈ స్థితిలో ఆయన లొంగిపోయి ఆసుపత్రిలో చేరక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గణపతి లొంగుబాటుకు తెలంగాణ పోలీసులు చొరవ తీసుకోవడం, ఇటు కేసీఆర్‌ ప్రభుత్వం, అటు మోదీ సర్కారు కూడా సుముఖంగా ఉండటంతో ఆయన త్వరలోనే లొంగిపోయే అవకాశాలున్నట్లు ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం

నాపై అత్యాచారం చేసింది 36మందే.. 139 మంది కాదు

తనను 139మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తనపై 36 మందే అత్యాచారం చేశారని తెలిపినట్లు ఈనాడు రాసింది.

రాజా శ్రీకర్‌ రెడ్డి అనే వ్యక్తి తనతో బలవంతంగా 139మంది పేర్లతో కేసు పెట్టించారని, లేకపోతే చంపుతానని బెదిరించారని బాధితురాలు చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆమె, రాజాశ్రీకర్‌ రెడ్డి తనను కొట్టి బెదిరించారని , తాను చెప్పిన వారి మీద కేసు పెట్టకపోతే తనవారిని చంపుతానని హెచ్చరించారని ఆమె వెల్లడించారు.

రాజాశ్రీకర్‌ రెడ్డి తనకు ముందు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారని, అనేకమంది అమ్మాయిలను మోసం చేశారని, ఆయన చంపినట్లుగా చెబుతున్న వారి మృతదేహాలను చూపి బెదిరించేవారని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని బాధితురాలు డిమాండ్‌ చేశారు.

రాజాశ్రీకర్‌ రెడ్డి ఇలా పలువురిపై కేసులు పెట్టించి వారిని బ్లాక్‌మెయిల్ చేయాలని చూశారని, శ్రీకర్‌రెడ్డితోపాటు మీసాల సుమన్‌ను అరెస్టు చేయాలని , దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మార్పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేసినట్లు ఈనాడు పేర్కొంది.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

జనవరి 1 నుంచి ఏపీలో భూసర్వే

2023నాటికి రాష్ట్రమంతా భూసర్వే నిర్వహించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, వచ్చే జనవరి 1 నుంచి ఈ సర్వే మొదలవుతుందని సాక్షిపత్రిక వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో కూడా ఈ సర్వే జరుగుతుందని, వివాదాలున్న చోట ప్రభుత్వం మొబైల్‌ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించినట్లు ఈ కథనం వెల్లడించింది.

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు చేస్తారని, గ్రామసభల ద్వారా ఈ సర్వేలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొంది. సర్వే కోసం డ్రోన్‌లను కూడా వినియోగించనున్నట్లు సాక్షి పేర్కొంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్జానంతో జరిగే ఈ సర్వేలో రోవర్లు, డ్రోన్ల ద్వారా వచ్చే సమాచారం నేరుగా కంప్యూటర్లలోకి వెళుతుందని, దీనిని మార్చడం సాధ్యం కాదని ఈ కథనం వెల్లడించింది.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

హాల్‌ టికెట్‌ బయటకు తెస్తే అనర్హతే

కరోనా నేపథ్యంలో నేటి నుంచి జరిగే జేఈఈ మెయిన్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించి జాతీయ విద్యామండలి కొత్తగా కొన్ని నిబంధనలు పెట్టినట్లు ఈనాడు పత్రిక పేర్కొంది.

పరీక్ష రాసిన విద్యార్ధులు పరీక్ష హాలులో వారికి ఇచ్చిన చిత్తు కాగితంతోపాటు హాల్‌ టికెట్‌ను చెత్తబుట్టలో వేసి వెళ్లిపోవాలని, అలా చేయని వారిని అనర్హులుగా గుర్తిస్తామని జాతీయ విద్యామండలి తన నిబంధనల్లో పేర్కొంది.

ఈ హాల్‌ టికెట్‌ను ఎవరూ ముట్టుకోకుండా ఈ నిబంధనల పెట్టినట్లు పేర్కొంది. హాల్‌ టికెట్‌ కావాలనుకున్న వారు ఆన్‌లైన్‌లో మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి రోజుకు రెండు విడతలుగా జేఈఈ ఆన్‌లైన్‌ పరీక్ష జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)