చైనా యాప్‌లు: అలీబాబా యాప్‌లు సహా మరో 43 యాప్‌లపై భారత ప్రభుత్వం వేటు- Newsreel

చైనా యాప్‌లు

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో తాజాగా 43 యాప్‌లు బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఐటీ యాక్ట్ 69A కింద బ్లాక్ చేస్తున్నామని తెలిపింది.

భారత దేశ సమగ్రత, సౌర్వభౌమాధికారానికి, భారత రక్షణకు విరుద్ధంగా ఈ యాప్స్ కార్యకాలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తాము ఈ చర్యలు తీసుకున్నామని ఐటీ శాఖ ఆదేశాలలో చెప్పింది.

భారత సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్, భారత హోంశాఖ నుంచి అందిన సమగ్ర నివేదికల ఆధారంగా భారత యూజర్లకు ఈ యాప్స్ యాక్సెస్ బ్లాక్ చేయాలని ఐటీ శాఖ భావించంది.

భారత ప్రభుత్వం ఇంతకు ముందు ఇదే చట్టం కింద 2020 జూన్ 29న 59 మొబైల్ యాప్స్, సెప్టంబర్ 2న మరో 118 యాప్స్ యాక్సెస్ బ్లాక్ చేసింది.

ప్రజల ప్రయోజనాలు, దేశ సౌర్వభౌమాధికారం, సమగ్రతను కాపాడ్డానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికోసం అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని ప్రభుత్వం చెప్పింది.

దేశంలో తాజాగా బ్లాక్ చేసిన యాప్స్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా డేటింగ్ యాప్‌లు ఉన్నాయి. వాటితోపాటూ చైనాకు ఈ-కామర్స్ సంస్థ అలీబాబాకు చెందిన యాప్‌లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది.

line

తేజస్ ఎక్స్‌ప్రెస్: దేశంలో తొలి ప్రైవేట్ రైళ్లు నిరవధికంగా రద్దు

తేజస్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC

భారత్‌లో తొలి కార్పొరేట్ రైలు సేవలుగా మొదలైన తేజస్ ఎక్స్‌ప్రెస్‌లకు బ్రేకులు పడ్డాయి.

దిల్లీ-లఖ్‌నవూ, ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య నడుస్తున్న ఈ రైళ్లను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు వీటిని నిర్వహిస్తున్న ఐఆర్‌సీటీసీ సంస్థ ప్రకటించింది. ఈ రైలు సేవలను తిరిగి ఎప్పుడు మొదలుపెట్టేది మళ్లీ ప్రకటిస్తామని పేర్కొంది.

కరోనా సంక్షోభం కారణంగా ప్రయాణికులు పెద్దగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ చెప్పారు.

రైళ్ల ఆక్యుపెన్సీ దిల్లీ-లఖ్‌నవూ మార్గంలో 25 శాతం, ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 35 శాతం మించడం లేదని ఆయన బీబీసీకి తెలిపారు.

2019 అక్టోబర్‌లో దిల్లీ-లఖ్‌నవూ మధ్య తొలి తేజస్ రైలు మొదలైంది. రెండో రైలును ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.

తేజస్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC

అయితే, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లోకి రాకముందే, మార్చి 19న ఈ రైళ్ల సేవలు రద్దయ్యాయి. దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ 17నే ఇవి మళ్లీ మొదలయ్యాయి.

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఐఆర్‌సీటీసీ చేసిన ఒక ప్రయోగం.

భారతీయ రైల్వేస్ నుంచి వీటిని ఐఆర్‌సీటీసీ లీజుకు తీసుకుని నడుపుతోంది. ఐఆర్‌సీటీసీ అధికారులు వీటిని ప్రైవేటుకు బదులు కార్పొరేట్ రైళ్లు అంటారు. విమానాల్లో లాగానే ఈ రైళ్లలో కూడా హోస్టెస్‌లను నియమించారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలో మరో 50 ప్రధాన మార్గాల్లో ఇలాంటి రైళ్లను తీసుకురావాలని ప్రణాళికలు వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)