iPhone: యాపిల్ సిరీస్ కొత్త ఫోన్‌ల ప్రత్యేకతలు, ధరలు

ఐఫోన్ 13

ఫొటో సోర్స్, Apple

    • రచయిత, క్రిస్టీనా క్రెడెల్, డేవిడ్ మలోయ్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్లు

సరికొత్త ఐఫోన్ 13 సిరీస్‌ను టెక్ దిగ్గజం యాపిల్ ఆవిష్కరించింది. దీనిలో వీడియోలకు ‘‘పోట్రెయిట్ మోడ్‌’’లో సరికొత్త ఫీల్డ్ ఎఫెక్ట్‌లతో హంగులు అద్దొచ్చు.

వీడియో ఫ్రేమ్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఫోకస్ వారిపైకి మళ్లించడం దీని ప్రత్యేకత. ఈ ఎఫెక్ట్‌ను ‘‘పుల్ ఫోకస్’’గా చెబుతున్నారు.

వీడియోను షూట్ చేసిన తర్వాత, ఈ ఎఫెక్ట్‌ ఉపయోగించగలిగే ఏకైక స్మార్ట్‌ఫోన్ తమదేనని యాపిల్ అధినేత టిమ్ కుక్ తెలిపారు.

కొత్త సిరీస్‌లోని చాలా ఫీచర్లు ఇదివరకటి సిరీస్‌లలోని ఫీచర్లను ఆధునికీకరించి తీసుకొచ్చినవేనని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా వెలుగుచూసిన ఐఫోన్ మెసేజ్‌ల భద్రతాపరమైన లోపాల గురించి ఈ కార్యక్రమంలో ఎవరూ మాట్లాడలేదు. ఈ లోపంతో ఐఫోన్ యూజర్ల మెసేజ్‌లపై ఇతరులు నిఘా పెట్టే అవకాశముందని వార్తలు వచ్చాయి.

మోసపూరిత లింక్‌లు, ఫైళ్లపై క్లిక్ చేయకపోయినా ఐఫోన్ మెసేజ్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమిచ్చే తాజా లోపాన్ని సరిచేసేందుకు సరికొత్త సెక్యూరిటీ ప్యాచ్‌ను గత సోమవారం యాపిల్ విడుదల చేసింది.

ఐఫోన్ 13

ఫొటో సోర్స్, Apple

సరికొత్త ఫీచర్లు..

మెరుపు వేగంతో పనిచేసే ఏ15చిప్, మరింత ప్రకాశవంతమైన డిస్ప్లే, 2.5 గంటలు అదనంగా పనిచేసే బ్యాటరీ లైఫ్‌తో సరికొత్త సిరీస్‌ను యాపిల్ ఆవిష్కరించింది. పింక్, బ్లూతోపాటు మిడ్‌నైట్ స్టార్‌లైట్, రెడ్ రంగుల్లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీనిలో స్టోరేజీ కెపాసిటీ గరిష్ఠంగా 500 జీబీ వరకు ఉంది. కనిష్ఠం విషయానికి వస్తే.. ఇది 128 జీబీలు. ఇదివరకటి మోడల్స్‌లో కనిష్ఠ స్టోరేజీ 64 జీబీలు.

మరోవైపు గ్రీన్‌ టెక్నాలజీకి కొత్త సిరీస్‌లో ప్రాధాన్యం ఇచ్చినట్లు యాపిల్ తెలిపింది. ఆంటెన్నా లైన్లు, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను రీసైకిల్ చేసి ఈ ఫోన్లలో ఉపయోగించినట్లు పేర్కొంది.

సరికొత్త సిరీస్‌కు మారేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటున్నారని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ వెడ్‌బుష్ ఒక సర్వే విడుదల చేసిన నేపథ్యంలో తాజా సిరీస్‌ను యాపిల్ ఆవిష్కరించింది. గత 3.5ఏళ్లలో 25 కోట్ల మంది ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోలేదని వెడ్‌బుష్ సంస్థ అంచనా వేసింది.

చాలామంది గత సిరీస్‌లోని ఫీచర్లనే ఇప్పటివరకు చూడలేదని పీపీ ఫోర్‌సైట్ సంస్థకు చెందిన టెక్ విశ్లేషకుడు పాలో పెస్కాటోర్ అన్నారు.

‘‘చాలా మంది ఈ అప్‌గ్రేడ్‌లను సరికొత్త ఫీచర్లుగా చూడొచ్చు. అయితే, ఇప్పటికీ లక్షల మంది వినియోగదారులు ఇంకా 5కి మారలేదు’’అని ఆయన అన్నారు.

యాపిల్

ఫొటో సోర్స్, Apple

గత ఏడాది ఆవిష్కరించిన ఎఫోన్ 12 సిరీస్‌తోపాటు తాజాగా తీసుకొచ్చిన 13 సిరీస్‌లోనూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 5జీ హ్యాండ్‌సెట్లలో యాపిల్ వాటా 25.9 శాతం వరకు ఉంది’’అని టెక్ సంస్థ ఐడీసీ తెలిపింది.

‘‘సరికొత్త మోడల్స్‌తో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 5జీ టెక్నాలజీలో యాపిల్ ఆధిపత్యం కూడా పెరుగుతుంది’’అని ఐడీసీ పరిశోధకురాలు మార్టా పింటో అన్నారు.

ప్రస్తుతం ఐఫోన్ 13 మినీ, 13, ప్రో, ప్రో మ్యాక్స్ సిరీస్‌లను ఐఫోన్ ఆవిష్కరించింది.

ఐఫోన్ 13 ప్రో, ప్రో మ్యాక్స్‌లలో మూడేసి కెమెరాలు ఉన్నాయి. దీన్ని అత్యాధునిక కెమెరాల వ్యవస్థగా ఐఫోన్ అభివర్ణించింది.

ఈ ప్రీమియమ్ మోడల్స్‌లో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, ప్రో మోషన్ ఉన్నాయి. వీటి సాయంతో స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. యానిమేషన్లు, గేమ్‌ప్లేలనూ స్క్రిన్ మరింత మెరుగ్గా చూపెడుతుంది.

ఐఫోన్ 13 మినీ ధర 679 పౌండ్లు (రూ.68,988) నుంచి మొదలవుతోంది. ఐఫోన్ 13 ధర 779 పౌండ్లు (రూ.79,149), 13 ప్రో ధర 949 పౌండ్లు (రూ.96,421), 13 ప్రో మ్యాక్స్ 1049 పౌండ్లు (రూ.1,06,582) నుంచి మొదలు అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)