అల్లు అర్జున్: గంగోత్రి నుంచి పుష్ప దాకా... తగ్గేదేల్యా

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, Facebook/Mythri Movie Makers

    • రచయిత, రవి తుంగల
    • హోదా, బీబీసీ కోసం

అల్లు అర్జున్ ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు నటుడు ఆయనే.

సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

2023 ఆగస్టు 24 గురువారం దిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కార్యక్రమంలో ఈ మేరకు తెలిపారు.

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, Facebook/Allu Arjun

ఫొటో క్యాప్షన్, అల్లు అర్జున్

అల్లు అర్జున్ నటునిగా 2022లో 20ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా అందించిన కథనం ఇది.

‘‘ఈ రోజుతో నేను సినిమా ఇండస్ట్రీలో 20ఏళ్లు పూర్తి చేసుకున్నాను.

నాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు అమితంగా లభించాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన అందరికీ నేను రుణపడి ఉంటాను.

అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను.

అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, Allu Arjun/facebook

ఫొటో క్యాప్షన్, గమనిక: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం

పుష్ప సినిమాకు ముందు- ఆ తరువాత... అల్లు అర్జున్ సినీ ప్రయాణం గురించి మాట్లాడుకొనేటప్పుడు ఇది తప్పనిసరిగా వినిపిస్తున్న మాట. దేశవ్యాప్తంగా ఉండే ప్రేక్షకులు ఇంతగా మాట్లాడుకొనే స్థాయికి అల్లు అర్జున్ ఎలా చేరుకొన్నారు ? కథానాయకుడిగా తన తొలి చిత్రమైన 'గంగోత్రి' నుంచి మొన్నటి 'పుష్ప' వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది?

20 ఏళ్ల కెరీర్, 22 సినిమాలు, 19 విజయాలు, 14 మంది వేర్వేరు దర్శకులతో సినిమాలు.. అల్లు అర్జున్ సినీ జీవితంలో ఇవి ఆసక్తికరమైన నంబర్లు మాత్రమే కాదు. 'గంగోత్రి' నుంచి నేటి ‘పుష్ప’ వరకు ఆయన నటనలో వచ్చిన మార్పునూ ఇవి సూచిస్తాయి.

కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ముద్దుగా 'బన్నీ' అని పిలుచుకునే అల్లు అర్జున్, 2022 ఏప్రిల్ 8న 41వ ఏట అడుగు పెట్టారు.

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అతి కొద్ది మంది తెలుగు నటుల్లో అల్లు అర్జున్ ఒకరు. ఆయన పుష్పరాజ్ పాత్రతో తెలుగుతోపాటు హిందీలోనూ విజయాన్ని అందుకున్నారు.

గంగోత్రి మూవీ పోస్టర్

ఫొటో సోర్స్, IMDB

నాటి సింహాద్రికి, నేటి పుష్పరాజ్‌కు తేడా అదే

సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ మొదటి సినిమా 'గంగోత్రి' 2003 మార్చిలో వచ్చింది. తండ్రి అల్లు అరవింద్, మామయ్య మెగాస్టార్ చిరంజీవి అండదండలు ఆ సినిమా సమయానికి అల్లు అర్జున్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

అయితే ఆ తర్వాత ఆయన ఎదుగుదలలో స్వయంకృషే కీలకంగా నిలిచింది.

'గంగోత్రి'లో సింహాద్రి పాత్రలో అమాయకంగా కన్పించిన కుర్రాడికి, 'పుష్ప'లో కరడుగట్టిన స్మగ్లర్‌లా కన్పించిన నటుడికి ఎంతో తేడా ఉంది. నటుడిగా తనను తాను మెరుగుపరచుకొనేందుకు, నిరూపించుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ అల్లు అర్జున్ వదులుకోలేదని చెప్పవచ్చు.

2003 మార్చిలో గంగోత్రి విడుదలయ్యే నాటికి అల్లు అర్జున్‌కు 21 ఏళ్లు నిండలేదు. ఆ వయసులో కొత్త నటులకు సాధారణంగా ఉండే బెరుకు, అమాయకత్వం ఆయనలో కనిపిస్తాయి.

మొదటి సినిమాలో ఆయన నటన పై విమర్శలు చాలానే వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏడాది వచ్చిన ఆర్య సినిమాలో నటనతో, నాడు విమర్శించిన వారిని కూడా ఆయన మెప్పించారు. అందులో పరిణితి, సరదాతనం కలబోతగా ఉండే పాత్రలో అల్లు అర్జున్ కనిపించారు.

అల్లు అర్జున్ పోషించిన పాత్రల్లో అత్యధికం ప్రేక్షకులకు చేరువైనవే. ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి లాంటి సినిమాల్లో చాలా సరదాగా ఉండే పాత్రల్లో ప్రేక్షకులను నవ్విస్తే, పరుగు, వేదం, వరుడు లాంటి సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ గుండె బరువెక్కేలా చేశారు.

వీడియో క్యాప్షన్, ఉత్తరాదిని ఊపేస్తున్న తెలుగు సినిమా

సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాల్లో పోషించిన పాత్రలతో చాలా మందికి ఒక కుటుంబ సభ్యుడిలా కనిపించారు.

'రేసుగుర్రం'లో లక్కీ పాత్రలో భరించలేని అల్లరి చేసిన అల్లు అర్జున్, సరైనోడు, నా పేరు సూర్య సినిమాల్లో అంతే సీరియస్‌గా కన్పించారు. పాత్ర ఏదైనా అందులో తన మార్క్ నటన కోసం అల్లు అర్జున్ ప్రయత్నిస్తారు.

అదే సమయంలో, విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం, అపజయం పలకరించినప్పుడు కుంగిపోవడం కనిపించవు. 'నా పేరు సూర్య' పరాజయాన్ని ఆయన హుందాగా ఒప్పుకొంటారు.

అల్లు అర్జున్ సినీ జీవితంపై విమర్శలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే 2016లో హైదరాబాద్‌లో ఒక సినీ కార్యక్రమంలో జరిగిన ఘటన ఆయనకు విమర్శలు తెచ్చి పెట్టింది.

ప్రముఖ నటుడు, చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ గురించి ఏదైనా చెప్పాలని ఆ కార్యక్రమంలో అభిమానులు ఒత్తిడి చేసినప్పుడు- "చెప్పను బ్రదర్‌" అని అల్లు అర్జున్ అసహనంగా స్పందించడం చర్చనీయమైంది.

దర్శకుడు సుకుమార్ తో

ఫొటో సోర్స్, Allu Arjun/facebook

సిగ్నేచర్ స్టెప్స్

అల్లు అర్జున్ అనగానే అత్యధికులకు మొదట గుర్తుకు వచ్చేది డ్యాన్సే.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ చూడ్డానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ అది ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ స్టెప్‌ను అనుకరిస్తూ లెక్కలేనన్ని వీడియోలు చేశారు.

ఆయన తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తారో చెప్పే మరో ఉదాహరణ ఇది. 'అల వైకుంఠపురములో…' సినిమాలో బుట్టబొమ్మ పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ మూమెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్‌గా మారాయి.

డ్యాన్సుపై ఆయన అదనపు శ్రద్ధ పెట్టి సాధన చేస్తారు. దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు చూసినివారికి అనిపిస్తుంటుంది.

అల్లు అర్జున్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. ఆయన రూమ్లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయని, ఒకటి మైకేల్ జాక్సన్‌ది, మరొకటి చిరంజీవిదని, వాళ్లిద్దర్ని చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మైకేల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు.

అల్లు అర్జున్ మైకేల్ జాక్సన్‌ను టీవీల్లో చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంటే, మామయ్య చిరంజీవిని మాత్రం చిన్నప్పటి నుంచి దగ్గర్నుంచి చూస్తూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. చాలా వేదికలపై చిరంజీవి ముందేడ్యాన్స్ చేసి మెప్పించారు.

'శంకర్‌దాదా జిందాబాద్' సినిమాలో కూడా చిరంజీవి పక్కన ఒక చిన్న డ్యాన్స్ బిట్లోనూ అల్లు అర్జున్ కనిపిస్తారు.

పవన్ కల్యాణ్ తో

ఫొటో సోర్స్, Allu Arjun/facebook

మేనరిజమ్స్

మేనరిజమ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తాయి. ఒక చిన్న మేనరిజమ్‌తో కొన్ని సినిమాలు ఊహించనంత పాపులర్ అవుతుంటాయి. ఆయా మేనరిజమ్స్ దర్శకుడు లేదా మరొకరు సృష్టించినవే అయినా, వాటిని ప్రేక్షకుల ముందుకు విజయవంతంగా తీసుకెళ్లడం అల్లు అర్జున్‌కు వెన్నతో పెట్టిన విద్య.

పుష్ప సినిమాలో "తగ్గేదేల్యా" డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనం చూశాం, విన్నాం.

రేసు గుర్రం సినిమాలో "ద్యావుడా" అనే ఎక్స్‌ప్రెషన్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో "చాలా బాగోదు" అనే ఎక్స్‌ప్రెషన్ తెలుగువారి నోళ్లలో ఇప్పటికీ నానుతుంటాయి.

తండ్రి అల్లు అరవింద్ తో

ఫొటో సోర్స్, Allu Arjun/facebook

కేరళలో బ్రహ్మరథం

ఇతర భాషల ప్రేక్షకులకు దగ్గరైన అతి కొద్ది మంది తెలుగు నటుల్లో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉంటారు. బన్నీకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ఆ తర్వాత అంత క్రేజ్ మలయాళం ప్రేక్షకుల్లో ఉంది. అక్కడ పెద్ద నటులతో సమానంగా బన్నీ సినిమా విడుదల అవుతుంది.

కేరళలో ఆయన సినిమా విడుదల సమయంలో హడావుడి మామూలుగా ఉండదు. ఆయన కేరళలో అడుగుపెడితే ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. ఆయన అక్కడ తన సినిమాలు విడుదల చేయడమే కాకుండా, ప్రమోషన్ కార్యక్రమాలకూ వెళ్తారు.

2018 వరదల సమయంలోనూ కేరళ ప్రజల కోసం అల్లు అర్జున్ తన వంతు ఆర్థిక సాయం కూడా అందించారు.

మలయాళ నటులతో కలిసి పనిచేయడానికి అల్లు అర్జున్ ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. 'పుష్ప' చివరి దశలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో కనిపించే ఫహాద్ ఫాజిల్ మలయాళంలో చాలా పేరున్న నటుడు. అయితే ఆయన ఎంపికకు మార్కెట్ లాంటి అంశాలు కూడా కారణం కావచ్చు.

మెగాస్టార్ చిరంజీవితో

ఫొటో సోర్స్, Allu Arjun/facebook

హిందీ బెల్ట్‌లో సత్తా చాటారు

పుష్ప షూటింగ్ సమయంలోగానీ, విడుదలయ్యాకగానీ ఈ సినిమా హిందీ మార్కెట్లో ఘనవిజయం సాధిస్తుందనే అంచనాలు ఎక్కడా కనపడలేదు.

అయితే అప్పటికే తెలుగు డబ్బింగ్ సినిమాలతో హిందీ మార్కెట్‌లోని ప్రేక్షకులకూ అల్లు అర్జున్ చేరువై ఉండటం, పుష్పలో ఆయన నటన ఊహకందని విజయాన్ని కట్టబెట్టాయి.

గతంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం, సరైనోడు హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ తెచ్చుకొన్నాయి. ఆయన సినిమాలకు హిందీ డిజిటల్ మార్కెట్‌లో కూడా డిమాండ్ ఏర్పడింది.

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, AlluArjun/Twitter

ప్రయోగాలు.. కష్టపడేతత్వం

ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. కథ, కథనం నచ్చితే పాత్ర పరిధి, నిడివి తక్కువైనా చేసేందుకు వెనుకాడరు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కథకు చాలా ముఖ్యం. కానీ అతిథి పాత్ర. అయినా అల్లు అర్జున్ చేశారు.

క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో వచ్చిన 'వేదం' సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి, విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు.

ప్రయోగం ఫలించని సందర్భమూ లేకపోలేదు. 'నా పేరు సూర్య' వైఫల్యమే దీనికి ఉదాహరణ.

ఇద్దరమ్మాయిలతో షూటింగ్ స్పాట్ లో

ఫొటో సోర్స్, @alluarjun/TWITTER

సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, ఇతర దర్శకులు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు. 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు.

ఈ అంకితభావమే ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమల్లో టాప్ నటుల్లో ఒకరిని చేసింది.

కూతురుతో ...

ఫొటో సోర్స్, Allu Arjun/facebook

ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియన్ల మంది ఫాలోయర్లు

సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు అల్లు అర్జున్. అక్కడ తన సినిమాల అప్‌డేట్స్ అభిమానులతో పంచుకుంటుంటారు. షూటింగ్ లొకేషన్లో ఉండే ఫొటోలు షేర్ చేస్తుంటారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 20.3 మిలియన్ల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతమంది ఫాలోయర్స్ ఉన్న తెలుగు నటుడు, తెలుగు వ్యక్తి ఆయనే.

ఫేస్‌బుక్‌లో 21 మిలియన్ల మంది, ట్విటర్‌లో 7.5 మిలియన్ల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారు.

సినిమాలే కాకుండా వ్యాపార రంగంలోనూ అల్లు అర్జున్ అడుగుపెట్టారు. బఫెలో వింగ్స్ పేరుతో హైదరాబాద్‌లో ఆయన ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు.

భార్యా పిల్లలతో

ఫొటో సోర్స్, @alluarjun/TWITTER

ఫ్యామిలీ మ్యాన్

సినిమాలు, షూటింగ్లు లేకపోతే అల్లు అర్జున్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా మారిపోతారు. కొడుకు, కూతురితో కలిసి కేరింతలు కొడతారు. అవన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. చిన్న చిన్న టూర్లకు వెళ్తుంటారు. షూటింగ్ మధ్యలో ఏ మాత్రం విరామం దొరికినా ఆ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తారు.

అల్లు అర్జున్ తర్వాతి చిత్రమైన పుష్ప సీక్వెల్ 'పుష్ప: ద రూల్' ప్రస్తుతం సెట్స్‌పై ఉంది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)