కొవ్వాడ: "రేపు అణు విద్యుత్ కేంద్రం వస్తే మీ ఊరే ఎగిరిపోతుంది... ఇంకా రోడ్లెందుకు, స్కూళ్లెందుకు?"

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"మీ గ్రామం భవిష్యత్తులో మాయమైపోతుంది. అలాంటి గ్రామానికి రోడ్లు, కాలువలు వేయడం ఎందుకు దండగ. ఇదే మాట గత ఐదేళ్లుగా అధికారుల నోట వింటున్నాం. కానీ, మా గ్రామం మాయమైపోలేదు. ఊరు అభివృధ్ది జరగలేదు"- ఇది కొవ్వాడ మత్స్యలేశం గ్రామస్థుల ఆవేదన
కొవ్వాడ మత్స్యలేశం (కొవ్వాడ) ఒక మత్స్యకార గ్రామం. ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఉంది. దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతోంది.
"మా ఊరిలో కరెంట్ కంపెనీ వస్తుందని చెప్పారు. అందరు భూములు, ఇల్లు ప్రభుత్వానికి అప్పగించేస్తే...అందుకు డబ్బులు ఇచ్చి, మరొక చోట ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. కొందరం ఒప్పుకున్నాం, మరికొందరం ఒప్పుకోలేదు. అలా కాలం గడుస్తున్న కొద్దీ మెల్లగా అందర్ని ఒప్పించారు. మీ అందర్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లి మరోచోట పెడతామని చెప్పారు. చెప్పి ఆరేడేళ్లు అవుతోంది. కానీ ఇప్పటి దాక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోవడమే కానీ...అసలేం జరుగుతోందో మాకు తెలియడం లేదు. వాళ్లు అన్నట్లుగానే మా గ్రామం ఎప్పుడు మాయమవుతుందా అని అడిగితే సమాధానం చెప్పడం లేదు. మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు" అని 52 ఏళ్ల కొవ్వాడ వాసి రాము బీబీసీ ఎదుట వాపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరు రియాక్టర్లతో అణు విద్యుత్ కేంద్రం
కొవ్వాడలో దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అణు విద్యుత్ ప్రాజెక్టును కొవ్వాడ, దాని పరిసర గ్రామాల్లో నిర్మించేందుకు భూ సేకరణ చేయాలని నిర్ణయించారు. ఇక్కడే ఆరు రియాక్టర్లతో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకోసం ప్రాథమికంగా తీర ప్రాంతంలో 2400 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొవ్వాడ, కోటపాలెం, రామచంద్రపురం, గూడెం, టెక్కలి, గ్రామాలను ఖాళీ చేయించేందుకు నిర్ణయించారు.
ఇక్కడే అణు విద్యుత్ కేంద్రం రియాక్టర్లు, ఉద్యోగుల కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. ఇదంతా 2012 నుంచి జరిగి, 2017 నాటికి ఈ గ్రామాలను ఖాళీ చేయించి, పునరావాస కాలనీలకు తరలించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

ఆ తేదీ దాటి ఐదేళ్లయినా...
అణు విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన భూ సేకరణ జరిగి, నిర్వాసితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఇచ్చి... వారిని పునరావాస కాలనీలకు తరలించేందుకు కటాఫ్ తేదీ 2017 ఏప్రిల్ 30 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీ దాటిపోయి ఐదేళ్లు కావస్తోంది. అయినా ఎక్కడ గ్రామాలు అక్కడే ఉన్నాయి.
"మమ్మల్ని పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు. అసలు ప్రాజెక్టు పనులే ప్రారంభం కాలేదు. పైగా మాకు ఇస్తామన్న ప్యాకేజీలు సైతం ఇంకా అందరికి అందలేదు. మొత్తం రూ.18 లక్షలు ఇస్తామన్నారు. అలాగే కటాఫ్ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు సైతం ప్యాకేజీ వర్తింపజేస్తామన్నారు. ఆ తేదీకి 18 ఏళ్లు దాటిన వాళ్లకి ప్యాకేజీ ఇవ్వలేదు. పైగా అనుకున్న తేదీకి తరలించకపోవడంతో...గ్రామంలో చాలా మందికి 18 ఏళ్లు వచ్చాయి. వీరికి ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించడమో, లేదా మా గ్రామాల్ని అభివృద్ధి చేయడమో చేయాలి" అని పెద కొవ్వాడ నివాసి మంగరాజు బీబీసీతో చెప్పారు.

"అణు విద్యుత్ ప్లాంట్ సాకుతో అభివృద్ధి చేయడం లేదు"
అణు విద్యుత్ ప్లాంట్ పరిధిలో సుమారు 8 వేల మంది గ్రామస్థులు ఉన్నారు. వీరందరూ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు సరిపోకపోయినా, కట్టుకునేందుకు డబ్బులున్నా, మరొక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు.
"ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది. గోడలు బీటలు వారాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కన్నాలు పడి, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. గ్రామంలోని రోడ్ల పరిస్థితి అయితే దారుణం. ఇక విద్యుత్, కాలువలు లాంటి మౌలిక సదుపాయాలు వైపు ఏ అధికారి చూడటం లేదు. కారణమడిగితే రేపో మాపో మాయమైపోయే గ్రామం, దీనికి సౌకర్యాలేందుకు, డబ్బులు వృథా అని అంటున్నారు. అలాగని తరలించడమూ లేదు" అని మత్స్యకార నాయకుడు బి. రాంబాబు బీబీసీతో చెప్పారు.
"అభివృద్ధి పనులైతే లేవు. కటాఫ్ డేట్ నుంచి అధికారులకు మా గ్రామాలంటే చిన్నచూపు అయిపోయింది. ఆ తేదీ నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. పునరావాస ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన డబ్బులు ఖర్చవుతున్నాయి. కాలనీలు ఇంకా ఇవ్వలేదు. పోనీ ఇల్లు సరిపోవడం లేదు, మరో గదో, చిన్న ఇల్లో కట్టుకుందామంటే...అది వృథా అయిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ప్రభుత్వం పునరావాస కాలనీలు, ప్యాకేజీల అంశాన్ని క్లియర్ చేసి తరలించకపోతే...ఆందోళన చేస్తాం" అని రాంబాబు అన్నారు.

భూసార పరీక్షలు అడ్డుకున్నందుకు అరెస్టులు
నిర్వాసితుల్లో కొందరికి ఇంకా ప్యాకేజీ డబ్బులు అందలేదు. వాటిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరు. పైగా ఊర్లో రెండేళ్లుగా పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేశారని అణు విద్యుత్ కేంద్రం నిర్వాసితుల్లో ఒకరైన అప్పన్న చెప్పారు.
"ప్లాంట్ కు సంబంధించిన పనుల్లో భాగంగా నిర్వాసిత గ్రామాల్లో ఎక్కడో ఒకచోట రోజూ భూసార పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్నిసార్లు వాటిని అడ్డుకుంటే మాపై కేసులు పెట్టారు. మాకు ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా మా మీదే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ... మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించనైనా, తరలించాలి. లేదంటే మా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటాం" అని అప్పన్న తెలిపారు.

"అణు విద్యుత్ ప్లాంట్ వద్దే వద్దు"
కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ వద్దంటూ వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్రను నాశనం చేసే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
"అమెరికా ఆర్థిక సహాయంతో కొవ్వాడలో కేంద్రం తలపెట్టిన అణు విద్యుత్ ప్లాంట్ ఉత్తరాంధ్రలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ అణు విద్యుత్‌ను వదలి...ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తుంటే, భారత దేశంలో మాత్రం అణు విద్యుత్ ప్లాంట్లను ఎందుకు ప్రొత్సహిస్తున్నారు? ప్రమాదకరమైన వీటిని వెంటనే రద్దు చేయాలి. లేనిపక్షంలో అన్ని పార్టీలు, సంఘాలతో ఉద్యమిస్తాం" అని సీపీఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు బీబీసీతో చెప్పారు.
బొగ్గు, గ్యాస్, జలవిద్యుత్, పవన్ విద్యుత్ తర్వాత దేశంలో విద్యుత్ ఉత్పత్తికి వాడే ఐదో పెద్ద వనరు అణు విద్యుత్. ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. దాని సామర్థ్యం రెండు వేల మెగావాట్లు.
కొవ్వాడలో రూ.61 వేల కోట్ల అంచనా వ్యయంతో ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.
దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్ ప్రాజెక్టు ఇదే
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అమెరికా రియాక్టర్‌ల నిర్మాణ సంస్థ వెస్టింగ్ హౌస్ కంపెనీల మధ్య కొవ్వాడలో ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. బొగ్గు, గ్యాస్, జలవిద్యుత్, పవన్ విద్యుత్ తర్వాత దేశంలో విద్యుత్ ఉత్పత్తికి వాడే ఐదో పెద్ద వనరు అణు విద్యుత్.
ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. దాని సామర్థ్యం రెండు వేల మెగావాట్లు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం సామర్థ్యం (ఒక్కొక్కటి 1208 MW చొప్పున్న 6 రియాక్టర్లు) 7,248 మెగావాట్లు.
ఇది పూర్తయితే దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రమవుతుంది. ఇది దేశంలోని 22 ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో 6.780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ. (ఈ సమాచారం పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు సహాయమంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా 31.03.22 తేదీన తెలిపినది)

శరవేగంగా పనులు జరగాలి: ప్రత్యేక అధికారి
కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చాలా వరకు పూర్తయినట్లు శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్, అణు విద్యుత్ కేంద్రం ప్రత్యేక అధికారి ఎం.విజయ సునీత బీబీసీతో చెప్పారు. కోర్టు కేసులు, పునరావాస ప్యాకేజీల క్లియరెన్స్ ఆలస్యం కారణాంగా కొంత భూ సేకరణ మిగిలి ఉందని, న్యూక్లియర్ ప్లాంట్ కు అవసరమైన 2060 ఎకరాల భూమిలో 1480 ఎకరాలు ఇప్పటికే సేకరించామని తెలిపారు.
"కొవ్వాడలో మౌలిక సదుసాయాలపై కూడా దృష్టి పెట్టాం. ప్లాంట్ పనుల ప్రారంభంలో ఆలస్యం జరగడంతో అది గ్రామంలోని మౌలిక సదుపాయల కల్పన పై ప్రభావం చూపింది. ప్లాంట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అంతలోపు...తాత్కలిక మౌలిక సదుపాయలను కల్పిస్తాం. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిర్వాసితులను ఎచ్చర్ల వద్ద ధర్మావరంలో నిర్మించే నిర్వాసిత కాలనీలకు తరలిస్తాం" అని విజయ సునీత చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రతిపక్షానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలో సైన్యం ఎటు వైపు?
- దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?
- రష్యా యుద్ధ ఖైదీలను యుక్రెయిన్ సైనికులు మోకాళ్లపై షూట్ చేశారా... వైరల్ వీడియో నిజమెంత? :BBC Reality Check
- యుక్రెయిన్: ఖార్కియెవ్ బంకర్లో భారతీయ విద్యార్థులు... ఒకవైపు బాంబుల భయం, మరో వైపు ఆకలి బాధ
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'మాకూ ఇరాన్, ఉత్తరకొరియా పరిస్థితి వస్తుందేమో'.. రష్యన్లలో ఆందోళన
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













