యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’

ఫొటో సోర్స్, FAMILY PICTURE
- రచయిత, హూగో బజేగా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది మార్చి 17వ తేదీ, ఉదయం 11 గంటల సమయం. యూరీ నెచిపొరెంకో, అతని తండ్రి రుస్లాన్ లు సైకిల్ మీద బుచా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వైపు వెళుతున్నారు. అక్కడ ప్రజలకు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
బుచా నగరంలో విద్యుత్, గ్యాస్, తాగునీరు సౌకర్యాలన్నీ నిలిచి పోయాయి. నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. కీయెవ్ నగరాన్ని ఆక్రమించే క్రమంలో రష్యా స్వాధీనం చేసుకున్న తొలి నగరం బుచా.
యూరీ, వాళ్ల నాన్న కలిసి సహాయ కేంద్రం నుంచి కొన్ని మెడిసిన్స్, ఆహారం తీసుకురావడానికి బయలుదేరారు. రష్యా సైనికులు తమను ఆపినట్లు యూరీ వెల్లడించారు. తారాసివస్కా స్ట్రీట్‌లో రష్యా సైనికులు తమను ఆపగానే, తామిద్దరం చేతులు పైకెత్తి నిలబడినట్లు యూరీ చెప్పారు.
పధ్నాలుగేళ్ల యూరి తన తల్లి అల్ల సమక్షంలో ఫోన్లో బీబీసీతో మాట్లాడారు. ఆనాటి ఘటనను బీబీసీకి వివరించారు.
''మా దగ్గర ఆయుధాలు లేవని చెప్పాం. మావల్ల ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెప్పాం. నాన్న నావైపు చూస్తున్నారు. అప్పుడే వాళ్లు ఆయన్ను కాల్చారు. మా నాన్న గుండెల మీద రెండుసార్లు కాల్పులు జరిపారు. ఆయన అలాగే కింద పడిపోయారు'' అని యూరీ వెల్లడించారు.
అదే సమయంలో తనను కూడా చేతులపై కాల్చారని, తానూ కిందపడిపోయానని యూరీ చెప్పారు. ''నేను నా పొట్ట నేలమీద ఆన్చి పడి ఉన్నాను. నా చుట్టూ ఏం జరుగుతోందో కనిపించడం లేదు. వాళ్లు నా తల మీద కాల్పులు జరిపారు. కానీ, అది క్యాప్ లోపలి నుంచి దూసుకు పోయింది'' అని యూరీ వివరించారు.
ఒక సైనికుడు తన తండ్రి తల మీద మళ్లీ కాల్చాడని, కానీ అప్పటికే ఆయన చనిపోయారని యూరీ చెప్పారు.
''నా చేతులకు మీద నుంచి రక్తం కారుతోంది. ఆ గాయంతో నేను అలాగే కింద పడి ఉన్నాను'' అని యూరీ గుర్తు చేసుకున్నారు. సైనికుడు అక్కడి నుంచి ట్యాంక్ వెనక్కి వెళ్లగానే తాను అక్కడి నుంచి పారిపోయి వచ్చానని యూరీ వెల్లడించారు.

ఫొటో సోర్స్, FAMILY PICTURE
యూరీ చెప్పిన వివరాలను బీబీసీ స్వయంగా ధృవీకరించలేదు. అయితే, బుచా సిటీని స్వాధీనం చేసుకునే క్రమంలో అక్కడ రష్యా సైన్యం సాగించిన అరాచాకాలకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది.
బుచా సిటీలో అనేక శవాలు వీధుల్లో పడి ఉన్న దృశ్యాలు, అందులో ఎక్కువమంది శరీరంపై గాయాలు కనిపించాయి. చాలామందికి శిక్ష విధించి, కాల్చి చంపినట్లుగా దేహాలు పడి ఉన్నాయి. కొందరి చేతులు కాళ్లు కట్టేసి ఉన్నాయి.
యూరీ, అతని తండ్రి రుస్లాన్‌ను కాల్చిన ప్రదేశానికి ఈ ప్రాంతం సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
తన కొడుకు సంఘటనా స్థలం నుంచి తప్పించుకుని ఇంటికి రాగానే, తాను ఆ ప్రదేశానికి వెళ్లేందుకు ప్రయత్నించానని యూరీ తల్లి అల్ల వెల్లడించారు. రుస్లాన్ గాయపడి ఉంటాడని, అతనికి వైద్య సహాయం అవసరం ఉంటుందని అనుకున్నాని ఆమె బీబీసీతో అన్నారు.
''అక్కడికి వెళితే నిన్ను కూడా చంపేస్తారని నా కొడుకు అడ్డుకున్నాడు. నేను వీధిలో వెళుతుంటే పొరుగువారు నన్ను ఆపారు. రష్యన్లు ఎవరినీ వదలరు, నువ్వు అక్కడికి వెళ్లవద్దని హెచ్చరించారు'' అని అల్ల తెలిపారు.
మరుసటి రోజు ఉదయం అల్ల తన తల్లిని తీసుకుని తెలుపు రంగు స్కార్ఫ్‌లు ధరించి సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆమె తల్లి రష్యన్ సైనికులతో మాట్లాడి డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకున్నారు. రుస్లాన్ మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు.

తన భర్తదిగా చెబుతున్న ఒక ఫొటోను అల్ల బీబీసీ కి షేర్ చేశారు. ఆ శరీరం మీద తుపాకీ గుళ్ల గాయాలు గుండె మీదా, దాని కింది భాగంలో కనిపించాయి.
రుస్లాన్ లాయర్ గా పని చేస్తున్నారని, తమ కమ్యూనిటీలో అందరితో కలుపుగోలుగా ఉండేవారని ఆయన భార్య అల్ల చెప్పారు. ''యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయన ఊరికే కూర్చోలేదు. వలంటీర్ గా మారి ప్రజలకు సహాయం చేశారు'' అని ఆమె వెల్లడించారు.
తన తండ్రిని చంపిన వ్యక్తులు కచ్చితంగా రష్యన్‌లేనని యూరీ అన్నారు. ''వారి యూనిఫామ్ మీద రష్యా అని రాసి ఉంది'' అని యూరీ అన్నారు.
''మేం రష్యా సైన్యానికి ఏమాత్రం ప్రమాదం కాదు. మేం సామాన్య పౌరులం. ఇది నిరూపించడానికి మేం తెలుపు రంగు స్కార్ఫ్‌లు కట్టుకోవాల్సి వచ్చేది'' అని యూరి అన్నారు.
(అదనపు సమాచారం:స్విత్లానా లిబెట్ )
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక, చైనా మధ్య పెరుగుతున్న దూరం భారత్‌కు కలిసొస్తుందా
- హైదరాబాద్ డ్రగ్స్ కేసులు: ఇప్పటివరకు ఎవరినైనా శిక్షించారా, డ్రగ్స్ తీసుకున్న వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి?
- 'వరకట్నంతో అందంగా లేని అమ్మాయిలకు కూడా అందమైన అబ్బాయిలతో పెళ్ళి చేయొచ్చు...' ఇదీ బీఎస్సీ విద్యార్థులకు చెప్పే పాఠం
- పాకిస్తాన్ ముస్లిం మత బోధకుడు డాక్టర్ ఇస్రార్ ప్రసంగాల వల్లే యూదులను నిర్బంధించారా... యూట్యూబ్ ఆయన చానెల్‌ను ఎందుకు తొలగించింది?
- ‘ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.759.. గుర్రపు బగ్గీలే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్.. మాంసం తినడం లగ్జరీ’
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- ‘ఇక్కడ కోర్సు చేస్తే ఏదో ఒక ఉపాధి దొరకడం ఖాయం.. పెద్దగా చదువుకోని గ్రామీణ యువతకు ఇది మంచి అవకాశం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










