హైదరాబాద్: డ్రగ్స్ కేసుల్లో ఇప్పటివరకు ఎవరినైనా శిక్షించారా, ఈ నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి?

డ్రగ్స్ కేసులు
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ పబ్‌లో ఏప్రిల్ 3న డ్రగ్స్ పట్టుబడిన తర్వాత తెలంగాణలో డ్రగ్స్ వివాదం మరోసారి చర్చలోకి వచ్చింది.

ఇటీవల ఒక యువకుడు ఎన్నో రకాల డ్రగ్స్ ఒకే సమయంలో తీసుకోవడం వల్ల చనిపోయారని ఆ యువకుడికి వైద్యం చేసిన డాక్టర్ వెల్లడించారు.

ఆ ఘటన మర్చిపోకముందే పుడ్డింగ్ పబ్‌లో డ్రగ్స్ దొరకడం, ఆ సమయంలో కొంత మంది సెలబ్రిటీలు అక్కడ ఉండటంతో అందరి దృష్టీ దాని మీదకు మళ్ళింది.

హైదరాబాద్‌లో డ్రగ్స్ అంత తేలికగా ఎలా దొరుకుతున్నాయి? ఈ మత్తు పదార్ధాలకు ఎలా బానిసలు అవుతున్నారు? అసలేం జరుగుతోంది? వీటి సరఫరాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? డ్రగ్స్ కేసులు ఏమవుతున్నాయి? అనే కీలక ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.

ముఖ్యంగా, కేసుల పురోగతి ఏమిటనే దానిపై చాలా మందిలో ఆసక్తి ఉంది. కొద్ది రోజులపాటు పోలీసుల హడావిడి ఉంటుందని, ఆ తర్వాత కేసులు మరుగున పడిపోతుంటాయనే విమర్శలూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పాత కేసుల సంగతేంటి? ఇలాంటి కేసుల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే అంశాలను ఇప్పుడు చూద్దాం.

డ్రగ్స్

డ్రగ్స్ వాడే వారికి, అమ్మేవారికి ఎలాంటి శిక్షలు ఉన్నాయి?

డ్రగ్స్ తీసుకొనేవారి కంటే అమ్మేవారికి కఠిన శిక్షలు ఉంటాయి. డ్రగ్స్ తీసుకునే వారు మత్తుకు బానిస అవుతున్నారు కాబట్టి వారిని బాధితులుగా పరిగణిస్తూ, వారిపట్ల అంత కఠినంగా వ్యవహరించకూడదని చట్టాలు చెబుతున్నాయి .

1985లో వచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ చట్టం ప్రకారం తక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్న వారికి ఏడాది జైలు శిక్ష లేదా రూ. 10,000 జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించవచ్చు.

'మధ్యస్థ (ఇంటర్మీడియట్) మోతాదు' తీసుకున్న వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండు వేయవచ్చు.

అలాకాకుండా, కమర్షియల్ అంటే ఎక్కువ మోతాదు తీసుకున్న వారికి కనీసం 10 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. అలాగే లక్ష నుంచి గరిష్ఠంగా రెండు లక్షల వరకు జరిమానా వేయవచ్చు.

ఆయా మాదక ద్రవ్యాలు, వాటి మధ్యస్థ, కమర్షియల్ మోతాదు లెక్కలు ఎలా ఉంటాయో ఈ పట్టికలో చూడండి.

డ్రగ్స్

ఇప్పటిదాకా నమోదైన కేసులు ఎన్ని?

డ్రగ్స్ కేసుల గణాంకాల గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే చాలా మంది పోలీసు అధికారులు స్పందించలేదు. తెలంగాణ పోలీసుల వెబ్‌సైట్‌లో కూడా ఈ డేటా సమగ్రంగా లేదు.

2021 నాటి లెక్కలు వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు.

2020వ సంవత్సరంలో నార్కోటిక్స్ విభాగం మొత్తం 785 కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ పోలీసు వెబ్‌సైట్ చెబుతోంది. పోలీసులకు చిక్కిన వారిలో ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, గంజాయి, హెరాయిన్, కొకైన్, హషిష్ ఆయిల్ వంటివి నిందితుల వద్ద లభించాయి. ఇప్పటికి 613 కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

2017, 2020, 2021లలో హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఏడాది కూడా అడపాదడపా దొరుకుతూనే ఉన్నాయి. అయితే, సెలబ్రిటీలు లేదా వారి కుటుంబ సభ్యులకు డ్రగ్స్ వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తే మాత్రం ఒక్కసారిగా ఈ వార్తలు వెలుగులోకి వస్తాయి.

డ్రగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే 2017లో కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు బయటకి వచ్చాయి. వీరిలో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, శ్యామ్ కే నాయుడులను ఈడీ అనేక సార్లు విచారణకు కూడా పిలిచింది. ఈ విచారణ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే, విచారణ జరగడంలో చాలా ఆలస్యమైంది, సరైన ఆధారాలు ఇప్పటికీ సేకరించలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

2017లో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటపడిన తరువాత, కొన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని అప్పటి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని అప్పట్లో ఆ కేసుల్ని సున్నితంగా హ్యాండిల్ చేశారు.

అయితే, 2017 నాటి టాలీవుడ్ సెలెబ్రిటీల విషయంలో పోలీసులు, విచారణ అధికారులు ఆలస్యం చేస్తున్నారని, కనీసం చార్జిషీట్ దాఖలు చేయడం కూడా పూర్తి కాలేదని న్యాయవాది రచన రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఆ కేసు మొదటి దశలోనే ఉంది అని బీబీసీకి చెప్పారు.

వీడియో క్యాప్షన్, లిక్విడ్ గంజాయి తీసుకుంటే ఇలా అయిపోతారు

ఈ కేసుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతోంది?

"బంజారాహిల్స్ పుడ్డింగ్ పబ్‌లో జరిగిన పార్టీలో 148 మంది పేర్లు, వివరాలు తీసుకొని పోలీసులు వారిని ఇంటికి పంపించారు. వారి రక్త నమూనాలను సేకరించడం లేదా ఇతర పరీక్షలు జరపలేదు. రక్త నమూనాల ద్వారా డ్రగ్స్ తీసుకున్నవారిని గుర్తించవచ్చు కదా... అయినా పోలీసులు ఆ పని ఎందుకు చేయలేదు? అసలు టాస్క్ ఫోర్స్ ఎందుకు రైడ్ చేసింది? అక్కడ ఉన్న స్థానిక పోలీసులే తొలుత ఆ పని చేయాలి కదా? " అంటూ రచన రెడ్డి పోలీసుల పని తీరును ప్రశ్నించారు.

ఆరోపణల్ని రుజువు చేయడానికి కావాల్సిన ఆధారాలను సేకరించడంలో విచారణ అధికారుల అలసత్వం ఎప్పటికప్పుడు బయటపడుతోంది అని నిపుణులు అంటున్నారు.

''అసలు డ్రగ్స్ తీసుకున్నవారిని తేలిగ్గా గుర్తించవచ్చు. పార్టీలు జరుగుతున్నప్పుడే సోదాలు చేస్తున్నారు కాబట్టి, రక్త నమూనా తీసుకుంటే వెంటనే తేలిపోతుంది. ప్రభుత్వం, విచారణ అధికారుల అలసత్వం వల్ల ఈ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకును చూపిస్తూ ఈ కేసుల్ని వాయిదా వేస్తూ వస్తారు. ఆధారాలు కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో కూడా ఇలాగే ఆలస్యం జరుగుతోంది'' అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాజీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్ కృష్ణ గోఖలే బీబీసీతో అన్నారు.

దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలపై స్పందించేందుకు తెలంగాణ పోలీసు అధికారులు ఇష్టపడలేదు.

వినియోగదారులకు చేరకముందే డ్రగ్స్‌ను అడ్డుకోవాలి

మాదక ద్రవ్యాలు అనేవి డిమాండ్ అండ్ సప్లయి మీద ఆధారపడి ఉంటాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి అన్నారు.

''దీనికి ప్రధాన కారణం తల్లితండ్రులు, వారి పిల్లలకు అవసరానికి మించి పాకెట్ మనీ ఇవ్వడం. తరచూ పార్టీలకు ఎక్కడికి, ఎవరితో వెళుతున్నారో తెలుసుకోకపోవడం. పబ్‌లో పార్టీలు సరే, పబ్ టైం దాటిన తరువాత కూడా జరిగే పార్టీల గురించి తల్లిదండ్రులు ఎందుకు ఆరా తీయరు? డ్రగ్స్‌కు ఉన్న డిమాండ్ ఆధారంగా మార్కెట్‌లోకి ఎలా అయిన తీసుకురావాలన్న ప్రయత్నాలు ఊపు అందుకుంటాయి. సమాజంలో దీని పట్ల మార్పు రావడం ఎంతో అవసరం. సెలెబ్రిటీల పేర్లు వచ్చినప్పుడు ఈ అంశం గురించి మాట్లాడటం సరికాదు. పుడ్డింగ్ పబ్‌లో 148 మంది ఉండగా కేవలం నాలుగైదు పేర్లు మాత్రమే ప్రచారంలో ఉంటాయి'' అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ''ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతామని చెబుతున్నారు. దాన్ని సమర్థిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. ఒక కచ్చితమైన మెకానిజం ఉండాలి. శిక్షలు త్వరగా పడేలా అధికారులు, ప్రభుతం చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం సెలెబ్రిటీలకు సంబంధించిన విషయం కాదు. యువత భవిష్యత్తు విషయం'' అని న్యాయ నిపుణులు మాడభూషి శ్రీధర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)